| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| శా. |
ఓరీ! కుంజరపాల! మా దెసకు నీ యుద్యన్మదేభేంద్రముం బ్రేరేఁపం బనిలేదు; త్రిప్పు; మరలం బ్రేరేఁచినన్ నిన్ను గం భీరోగ్రాశనితుల్యముష్టిహతులన్ భేదించి నేఁ డంతకుం జేరం బుత్తు మహత్తరద్విపముతో సిద్ధంబు యుద్ధంబునన్. |
1315 |
| వ. | అని పలికి. | 1316 |
| ఉ. |
మించిన కొప్పుఁ జక్కనిడి మేలనఁ బచ్చని చీర కాసె బం ధించి లలాటకుంతలతతిన్ మరలించుచు సంగరక్రియా చుంచుతఁ బేర్చి బాలకుఁడు చూచుజనంబులు దన్ను ‘బాపురే’? యంచు నుతింప డగ్గఱియె హస్తజితాగము గంధనాగమున్. |
1317 |
| క. |
అంజక బాలకుఁ డనియును, గొంజక దయమాలి రాజకుంజర! యంతం గుంజరమును డీ కొలిపెను, గుంజరపాలకుఁడు గోపకుంజరుమీఁదన్. |
1318 |
| వ. | మఱియు న య్యనేకపం బనేకపపాలకప్రేరితం బయి, మహావాతసంఘాతసముద్ధూతంబగు విలయకాలకీలికేళిని బిట్టు మిట్టిపడి, మృత్యుదేవత యెత్తునం, గాలుపోలిక, శమనునిగమనిక, నెదిరి మదసలిలపరిమళలుబ్ధపరిభ్రమద్భ్రమరగాయకఝంకృతు లహంకృతి సంపాదింపం, గులకుంభినీధర గుహాకుంభగుంభనంబుగ ఘీంకరించి, రోషభీషణశేషభోగిభోగభయంకరంబగు కరంబున శౌరిం జీరి, చీరికిం గొనక, పట్టిన నట్టిట్టు గెంటి, విధుంతుదవదనగహ్వరంబువలన విడివడి యుఱుకు తరణికరణి దర్పించి కుప్పించి, పాదమధ్యంబునకు నసాధ్యుండై దూఁటి మాటుపడినం గ్రోధబంధురంబై సింధురంబు మహార్ణవమధ్యమంథాయమానమంథరమహీధరంబుకైవడి జిఱజిఱం దిరిగి, కానక భయానకంబై గాలివెరవునం గని పొంగి చెంగటం బ్రళయదండిదండప్రశస్తంబగు హస్తంబు వంచి వంచించి చుట్టిపట్టి పడవేయం గమకించినం జలింపక తెంపున హరి కరిపిఱింది కుఱికి మహారాహువాలవల్లికాకర్షణోదీర్ణుం డగు సుపర్ణు తెఱంగున నెగిరి శుండాలంబు వాలంబు లీలం గేల నొడిసిపట్టి జళిపించి పంచవింశతి బాణాసనప్రమాణదూరంబు బీరంబునం ద్రిప్పివైవ, న వ్వారణంబు దుర్నివారణంబై రణంబున కోహటింపక సవ్యాపసవ్యపరిక్రమణంబుల నవక్రంబై కవిసిన, నపసవ్యసవ్యక్రమంబులఁ దప్పించి, రొప్పి కుప్పించి యెదుర్కొనినఁ గర్కశుం డయి, మేచకాచలతుంగ శృంగనిభంబగు కుంభికుంభంబు చక్కటివ్రక్కలై చెక్కలెగయ దురంతకల్పాంతజీమూతప్రభూతనిర్ఘాతనిష్ఠురంబగు ముష్టి సారించి యూఁచి పొడిచినం దద్వికీర్ణపూర్ణ రక్తసిక్తమౌక్తికంబులు వసుంధరకు సంధ్యారాగరక్తతారకాచ్ఛన్నం బగు మిన్ను చెన్నలవరింప నిలువరింపక మ్రొగ్గి మోఁకరిలి, మ్రొగ్గక దిగ్గన న గ్గజంబు లేచి, చూచి, త్రోచి, నడచి, సంహారసమయసముద్రసంఘాత సంభూతసముత్తుంగభంగసంఘట్టితం బగు కులాచలంబుక్రియఁ గ్రమ్మఱ న మ్మహాభుజుని భుజాదండంబులవలన ఘట్టితంబై, కట్టలుక ముట్టి నెట్టి, డీకొని ముమ్మరంబుగం గొమ్ములం జిమ్మిన, న మ్మేటి చేసూటి మెఱసి హస్తాహస్తి సంగరంబునఁ గరం బొప్పి దప్పిం బడక నొప్పించిన, నకుంఠితకాలకంఠ కఠోరభల్లభగ్నంబగు పురంబు పగిది, జలధిం జటులఝంఝానిలవికలంబగు కలంబుకైవడి న మ్మదకలంబు బలంబు దక్కిచిక్కి స్రుక్కువడి లోభికరంబునుంబోలె దానసలిలధారావిరహితంబై, విరహి తలంపునుం బోలె నిరంతరచిత్తజాతవిగ్రహంబై, గ్రహణకాలంబునుం బోలెఁ బరాధీనఖరకరంబై, ఖరకరోదయం బునుం బోలె, భిన్నపుష్కరంబై, పుష్కరవైరివిలసనంబునుం బోలె నభాసితపద్మకంబై యున్న సమయంబున. | 1319 |
| శా. |
కాలం ద్రొక్కి సలీలుఁడై నగవుతోఁ గంఠీరవేంద్రాకృతిం గేలన్ భీషణదంతముల్ వెఱికి సంక్షీణంబుగా మొత్తి గో పాలగ్రామణి వీరమౌళిమణియై ప్రాణంబులం బాపె నా శైలేంద్రాభముఁ బ్రాణలోభము నుదంచత్సారగంధేభమున్. |
1320 |
| వ. | మఱియు దంతిదంతతాడనంబుల దంతావళపాలకులం గాలుప్రోలి కనిపి తత్ప్రదేశంబు వాసి. | 1321 |
| మ. |
కరిదంతంబులు మూఁపులందు మెఱయన్ ఘర్మాంబువుల్ మోములన్ నెఱయం గోపకులంత నంత మలయన్ నిత్యాహవస్థేము లా హరిరాముల్ సనుదెంచి కాంచిరి మహోగ్రాడంబరాపూరితా మర మర్త్యాది జనాంతరంగము లసన్మల్లావనీరంగమున్. |
1322 |
| సీ. |
మహితరౌద్రంబున మల్లుర కశనియై నరుల కద్భుతముగ నాథుఁ డగుచు శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై నిజమృత్యువై కంసునికి భయముగ మూఢులు బీభత్సమును బొంద వికటుఁడై తండ్రికి దయరాఁగఁ దనయుఁ డగుచు ఖలులకు విరసంబుగా దండియై గోపకులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు |
|
| ఆ. |
బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై, శాంత మొనర యోగిజనుల కెల్లఁ బరమతత్త్వ మగుచు భాసిల్లె బలునితో, మాధవుండు రంగమధ్యమందు. |
1323 |
| వ. | అప్పుడు. | 1324 |
| క. |
చచ్చిన కుంభీంద్రంబును, వచ్చిన బలమాధవులను వరుసం గని తా నొచ్చిన చిత్తముతోడుతఁ, జెచ్చెరఁ గడు వెఱచె భోజసింహుం డధిపా! |
1325 |
| ఉ. |
ధీరుల వస్త్రమాల్యమణిదీప్తవిభూషణధారులన్ మహా కారుల సర్వలోకశుభకారుల మానవమానినీమనో హారుల రంగభూతలవిహారుల గోపకుమారులన్ మహా వీరులఁ జూచి చూచి తనివిం దుదిముట్టక లోకు లందఱున్. |
1326 |
| ఉ. |
సన్నుతరామకృష్ణముఖచంద్రమయూఖసుధారసంబులం గన్నులఁ ద్రావుచందమునఁ గాంచుచు జిహ్వల నంటి చూచు లీ ల న్నుతి సేయుచుం గరములం బరిరంభము సేయుభంగి న త్యున్నతిఁ జూపుచుం దగిలి యొండొరుతోడ రహస్యభాషలన్. |
1327 |
| క. |
వసుదేవునివాసంబున, వసుధన్ రక్షింప వీరు వైష్ణవతేజో ల్లసనమునఁ బుట్టినారఁట, పసిబిడ్డ లనంగఁ జనదు పరదేవతలన్. |
1328 |
| సీ. |
చంపెఁ రక్కసిఁ బట్టి; చక్రవాకునిఁ గూల్చెఁ బడద్రొబ్బె మద్దుల; బకునిఁ జీరె; నఘదైత్యుఁ బొరిగొనె; నడరి వత్సకుఁ ద్రుంచె; గిరి యెత్తి దేవేంద్రుఁ గ్రిందు పఱిచెఁ గాళియు మర్దించె గహనానలముఁ ద్రావెఁ; గేశి నంతకుపురిక్రేవ కనిచె; మయుపుత్రుఁ బరిమార్చె; మఱియును దానవభటుల మర్దించి గోపకులఁ గాచె; |
|
| తే. |
గోపకాంతలమనముల కోర్కి దీర్చె, నీ సరోరుహలోచమం డీ శుభాంగుఁ డీ మహామహుఁ డీ దిగ్గజేంద్రనిభుఁడు, మనుజమాత్రుండె తలపోయ మాధవుండు? |
1329 |