| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అని పలుకుచుఁ బౌరజనులు సూచుచుండ రామకృష్ణులకుఁ జాణూరుం డిట్లనియె. | 1330 |
| మ. |
వనమార్గంబున గోపబాలకులతో వత్సంబులన్ మేపుచుం బెనఁగన్ మిక్కిలి నేర్చినా రనుచు నీ పృథ్వీజనుల్ సెప్ప మా మనుజేంద్రుం డిట మిమ్ముఁ జీరఁ బనిచెన్ మల్లాహవక్రీడకుం; జనదే కొంతపరాక్రమింప మనకున్ సభ్యుల్ విలోకింపఁగన్. |
1331 |
| మ. |
జవసత్త్వంబులు మేలె? సాము గలదే? సత్రాణమే మేను? భూ ప్రవరుం బోసన మి మ్మనంగ వలెనే? పాళీ లభీష్టంబులే? పవివో? కాక కృతాంత దండకమవో? ఫాలాక్షు నేత్రాగ్నివో? నవనీతంబుల ముద్దగాదు; మెసఁగన్ నా ముష్టి గోపార్భకా! |
1332 |
| క. |
జనములు నేర్చిన విద్యలు, జననాథునికొఱకుఁ గాదె? జననాథుఁడు నీ జనములు మెచ్చఁగ యుద్ధం, బున మనముం గొంత ప్రొద్దు పుత్తమె? కృష్ణా! |
1333 |
| వ. | అనిన విని హరి యిట్లనియె. | 1334 |
| ఉ. |
సాములు లేవు; పిన్నలము; సత్త్వము గల్దన రాదు; మల్ల సం గ్రామవిశారదుల్ గులిశకర్కశదేహులు మీరు, మీకడ న్నేము చరించు టెట్లు? ధరణీపతివేడ్కలు సేయువారముం గాము; వినోదముల్ సలుపఁ గాదన వచ్చునె యొక్కమాటికిన్. |
1335 |
| క. |
నీతోడుత నేఁ బెనఁగెదఁ, బ్రీతిన్ ముష్టికునితోడఁ బెనఁగెడి బలుఁ డు గ్రాతతమల్లాహవమున, భూతలనాథునికి మెచ్చుఁ బుట్టింతు సభన్. |
1336 |
| వ. | అనిన విని చాణూరుం డిట్లనియె. | 1337 |
| శా. |
నాతోఁ బోరఁగ నెంతవాఁడ? విసిరో నా పాటియే నీవు? వి ఖ్యాతుండం; గులజుండ; సద్గుణుఁడ సత్కర్మస్వభావుండ, నీ కేతాదృగ్విభవంబు లెల్లఁ గలవే? యీ వీటఁ బోరాడుటల్ వ్రేతల్ సూడఁగఁ గుప్పిగంతు లిడుటే? వీక్షింపు గోపార్భకా! |
1338 |
| శా. |
స్థాణున్ మెచ్చఁడు; బ్రహ్మఁ గైకొనఁడు; విష్వక్సేను నవ్వున్; జగ త్ప్రాణున్ రమ్మనఁ డీడుగాఁ డని; మహాబాహాబలప్రౌఢి న క్షీణుం; డాజికి నెల్లి నేఁ డనఁడు; వైచిత్రిన్ వినోదించు ని చ్చాణూరుం డొక గోపబాలు ననికిన్ శక్తుండు గాకుండునే? |
1339 |
| క. |
ప్రల్లద మేటికి గోపక!, బల్లిదుఁడను; లోకమందుఁ బ్రఖ్యాతుఁడ; నా చల్లడముక్రింద దూఱని, మల్లురు లే రెందు ధరణిమండలమందున్. |
1340 |
| సీ. |
చలమున ననుడాసి జలరాశిఁ జొరరాదు నిగిడి గోత్రముదండ నిలువ రాదు కేడించి కుంభిని క్రిందికిఁ బోరాదు; మనుజసింహుఁడ నని మలయ రాదు; చేరినఁ బడవైతుఁ జెయిసాఁపఁగా రాదు; బెరసి నాముందటఁ బెరుఁగ రాదు భూనాథహింసకుఁ బోరాదు నను మీఱి; శోధింతుఁ గానలఁ జొరఁగ రాదు |
|
| ఆ. |
ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగా రాదు, ధరఁ బ్రబుద్ధుఁడ నని తలఁప రాదు కల్కితనము చూపి గర్వింపఁగా రాదు, తరము గాదు; కృష్ణ! తలఁగు తలఁగు. |
1341 |
| వ. | అదిగాక నీవు శ్రీహరి నంటేని. | 1342 |
| సీ. |
మహిమతో నుండంగ మథురాపురము గాని పొలుపార వైకుంఠపురము గాదు గర్వంబుతో నుండఁ గంసునిసభ గాని, సంసారరహితుల సభయుఁ గాదు ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని నారదువీణాస్వనంబు గాదు చదురు లాడఁగ మల్లజననిగ్రహము గాని, రమతోడి ప్రణయవిగ్రహము గాదు |
|
| తే. |
వెలసి తిరుగంగ వేదాంతవీథి గాదు, మొఱఁగిపో మునిమనములమూల గాదు సాఁగి నడవంగ భక్తులజాడ గాదు, శౌరి! నా మ్రోల నీ వెందుఁ జనియె దింక? |
1343 |
| వ. | అని పలికి. | 1344 |
| సీ. |
రోషాగ్నిధూమప్రరోహంబు కైవడి శిరమున సన్నపుశిఖ వెలుంగ నాశామదేభేంద్రహస్తసన్నిభములై బాహుదండంబులు భయదములుగ లయసమయాంతకోల్లసితదంష్ట్రలభంగిఁ జాఁగిన కోఱమీసములు మెఱయ నల్లని తెగ గల నడగొండ చాడ్పున నాభీలనీలదేహంబు మెఱయఁ |
|
| ఆ. |
జరణహతుల ధరణి సంచలింపఁగ నభో, మండలంబు నిండ మల్లసఱచి శౌరిదెసకు నడచెఁ జాణూరమల్లుండు, పౌరలోకహృదయభల్లుఁ డగుచు. |
1345 |
| వ. | ఇట్లగ్గలంబగు నగ్గలిక డగ్గఱిన మల్లునిం గని మెల్లన మొల్లంబగు బీరంబు వెల్లిగొన, వల్లవవల్లభుం డుల్లసిల్లి బాహునాదంబున రోదోంతరాళంబు పూరించి మించి కవిసె; ని ట్లిద్దఱు నుద్దవిడి నున్నత విషమంబులగు ఠాణ లిడి, కరి కరియును, హరి హరియును, గిరి గిరియునుం దాఁకు వీఁకం దలపడి, యితరేతరహేతిహింసితంబులగు దవానలంబుల తెఱంగునఁ బరస్పరదీర్ఘనిర్ఘాతఘట్టితంబులగు మహాభ్రంబుల విభ్రమంబున. నన్యోన్యతుంగతరంగతాడితంబులగు కల్పాంతకాలసముద్రంబుల రౌద్రంబున నొండొరుల ముష్టిఘట్టనంబుల ఘట్టితశరీరులై దద్దరిలక డగ్గఱి, గ్రద్దన న య్యిద్దఱుం దిరుగునెడ హరి సొచ్చి పేర్చి యార్చి జెట్టిం బట్టి పడం దిగిచి పాదంబుల జాడించి సముల్లాసంబున నెసకంబునకు వచ్చిన మెచ్చి, నొచ్చి య చ్చపలుండు మీఱి మోర సారించి, తెరలక, పొరలం ద్రొబ్బిన న బ్బలానుజుం డుబ్బి, గొబ్బున మేను వర్ధిల్ల నర్ధాంగకంబున నుండి జానువుల నొత్తుచు, నురవడిం గరవడంబున నున్న నా దుర్నయుండును ‘బాల! మేలు మే’ లని లీలం గాలు సొర నిచ్చి, త్రోచినం జూచి యేచి ఖేచరు లగ్గించి యుగ్గడింప న గ్గోపకుమారుండు పాటవంబున రాటవంబునకుం జని వెన్నెక్కి నిక్కిన నక్కంసభటుండు మదజలరేఖాబంధురంబగు గంధసింధురంబుచందంబునఁ బదంబును బదంబునం, గరంబును గరంబునన్ గ్రహించి, సహించి, వహించి నైపుణంబున లోపలం దిరిగి యట్టిట్టు దట్టించిన దిట్టతనంబునం దిటవు దప్పక య ప్పద్మలోచనుండు కేడించి, యేచి సమతలంబున వైచి ప్రచండంబగు వాని పిచండంబు వాగించి కాలం గాలు గీలించి డొక్కరంబు గొనిన న య్యభ్యాసిసభ్యులు సన్నుతింపం గ్రమ్మఱించి జడ్డనం గా లడ్డగించి, రక్షించుకొనిన నా రక్షోవైరి వానికటిచేలంబు వట్టి యెత్తి యొత్తి నడుమ రాగె యిడి, సందువెట్టి నవ్విన నవ్విరోధికాలు కాలిలో నిడి వేధించి నిరోధించిన నిరోధంబుఁ బాసి తిరిగి వసుదేవుపట్టి పట్టిసంబుగొని దట్టించిన నుబ్బరిక చేసి చాణూరుండు హరికరంబు వట్టి హుమ్మని నెమ్మొగంబునం గా లిడి మీఁదైనం గేళిబాలకుండు కాలిం గాల నివారించి మీఁదై నెగడి యుండనీక దుర్వారబలంబున విదలించి లేచి గృహీత పరిపంథిచరణుండై విపక్షునివక్షంబు వజ్రివజ్ర సన్నిభంబగు పిడికిటం బొడిచిన వాఁడు వాఁడి చెడక విజృంభించి యంభోరాశి మధ్యంబునం దిరుగు శైలంబుపోలిక నేల జిఱ జిఱం దిరిగి తన్నిన వెన్నుండు కుప్పించి యుప్పరం బెగసి మీఁద నుఱికిన నతండు కృష్ణపాద సంధిపరిక్షిప్తపాదుండై యెగసి లేచి సముద్ధతుం డయ్యె నయ్యెడ. | 1346 |
| క. |
బలభద్రుఁడు ముష్టికుఁడును, బలములు మెఱయంగఁ జేసి బాహాబాహిం బ్రలయాగ్నుల క్రియఁ బోరిరి, వెలయఁగ బహువిధములైన విన్నాణములన్. |
1347 |
| వ. | ఇ వ్విధంబున. | 1348 |
| క. |
వల్లవులు పెనఁగి రున్నత, గల్లులతో భిన్న దిగిభకరవల్లులతో మల్లులతో రిపుమానస, భల్లులతో భీతగోపవల్లులతోడన్. |
1349 |
| వ. | ఆ సమయంబునఁ బౌరకాంతలు మూఁకలు గట్టి వెచ్చనూర్చుచు ముచ్చటలకుం జొచ్చి తమలో నిట్లనిరి. | 1350 |
| ఉ. |
మంచికొమారులం గుసుమమంజుశరీరులఁ దెచ్చి చెల్లరే! యంచితవజ్రసారులు మహాద్రికఠోరులు నైన మల్లురం గ్రించులఁ బెట్టి రాజు పెనఁగించుచుఁ జూచుచు నున్నవాఁడు; మే లించుక లేదు; మాను మనఁ; డిట్టి దురాత్ముని మున్ను వింటిమే? |
1351 |
| క. |
చూచెదరు గాని సభికులు, నీ చిన్నకుమారకులకు నీ మల్లురకున్ ఓ చెల్ల! యీడు గాదని, సూచింపరు పతికిఁ దమకు శోకము గాదే? |
1352 |
| సీ. |
వేణునాళముల మై వెలసిన మాధవుం డధరామృతము లిచ్చి యాదరించుఁ బింఛదామములమై పెరిఁగిన వెన్నుండు మస్తకంబునఁ దాల్చి మైత్రి నెఱపుఁ బీతాంబరములమై బెరసిన గోవిందుఁ డంసభాగమునఁ బాయక ధరించు వైజయంతికలమై వ్రాలినఁ గమలాక్షుఁ డతికుతూహలమున నఱుతఁ దాల్చుఁ; |
|
| తే. |
దనరు బృందావనంబునఁ దరులమైనఁ, గృష్ణుఁ డానందమునఁ జేరి క్రీడ సల్పు నెట్టి నోముల నయిన ము న్నిట్టివిధము, లేల కామైతి మోయమ్మ! యింక నెట్లు? |
1353 |
| ఉ. |
పాపపు బ్రహ్మ! గోపికల పల్లెలలోన సృజింపరాదె ము న్నీపురిలోపలన్ మనల నేల సృజించె? నటైన నిచ్చలున్ జేపడుఁ గాదె యీ సుభగుఁ జెందెడి భాగ్యము సంతతంబు నీ గోపకుమారుఁ బొంద మును గోపకుమారిక లేమి నోఁచిరో! |
1354 |
| క. |
గోపాలకృష్ణుతోడను, గోపాలనవేళలందుఁ గూడి తిరుగు నా గోపాలు రెంత ధన్యులొ, గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే? |
1355 |
| క. |
శ్రమజలకణసిక్తంబై, కమలదళేక్షునివదనకమలము మెఱసెన్ హిమజలకణసిక్తంబై, కమనీయం బగుచు నున్న కమలము భంగిన్. |
1356 |
| ఆ. |
సభకుఁ బోవ రాదు; సభవారి దోషంబు, నెఱిఁగి యూరకున్న నెఱుఁగకున్న నెఱిఁగి యుండియైన నిట్టట్టు వలికినఁ, బ్రాజ్ఞుఁడైనఁ బొందుఁ బాపచయము. |
1357 |
| వ. | అని పెక్కండ్రు పెక్కు విధంబులం బలుకుచుండఁ దద్బాహుయుద్ధంబున. | 1358 |
| క. |
ధృతి సెడి లోఁబడె మల్లుం, డతులితభవజలధితరికి హతరిపుపురికిన్ జితకరికిన్ ధృతగిరికిం, దతహరిరవభరితశిఖరిదరికిన్ హరికిన్. |
1359 |
| క. |
హరికిని లోఁబడి బెగడక, హరియురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్ హరి కుసుమమాలికాహత, కరిభంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై. |
1360 |
| క. |
శౌరి నెఱిఁ జొచ్చి కరములు, క్రూరగతిన్ బట్టి త్రిప్పి కుంభిని వైచెన్ శూరుం గలహగభీరున్, వీరుం జాణూరు ఘోరు వితతాకారున్. |
1361 |
| క. |
శోణితము నోర నొలుకఁగ, జాణూరుం డట్లు కృష్ణసంభ్రామణ సం క్షీణుండై క్షోణిం బడి, ప్రాణంబులు విడిచెఁ గంసుప్రాణము గలఁగన్. |
1362 |
| క. |
బలభద్రుండును లోకులు, బలభద్రుం డనఁగఁ బెనఁగి పటుబాహుగతిన్ బలభేది మెచ్చఁ ద్రిప్పెను, బలవన్ముష్టికునిఁ గంసుబలములు బెగడన్. |
1363 |
| ఆ. |
త్రిప్పి నేల వైవ దిగ్గన రక్తంబు, వదనగహ్వరమున వఱదవాఱ ముష్టికుండు ఘోరముష్టి సత్త్వము సెడి, కూలె గాలిఁ దరువు గూలినట్లు. |
1364 |
| వ. | మఱియును. | 1365 |
| క. |
పాటవమున బలుపిడికిట, సూటిం బడఁబొడిచె బలుఁడు శోషిత ఘన బా హాటోపనృపతికీటుం, గూటున్ వాచాటు నధికఘోరలలాటున్. |
1366 |
| వ. | అంత న ద్దనుజాంతకుండు చరణప్రహరణంబుల భిన్నమస్తకులం జేసి వానిచెలులం గూట తోసల శలుల నంతకాంతికంబున కనిచిన. | 1367 |
| క. |
వల్లవబాలకు లని మన, మల్లవరులు పెనఁగి నేఁడు మడిసిరి వీరల్ బల్లిదులు; తలఁడు తలఁడని, చెల్లాచెదరైరి పాఱి చిక్కిన మల్లుల్. |
1368 |
| ఉ. |
మల్లురఁ జంపి గోపకసమాజములో మృగరాజురేఖ శో భిల్లఁగఁ బాదపద్మములఁ బెల్లుగ నందెలు మ్రోయ వచ్చు నా వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదు ల ల్లల్లన సంస్తుతించిరి ప్రియంబుగఁ గంసుఁడు దక్క నందఱున్. |
1369 |