పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ కృష్ణుఁడు కంసుని వధించుట
వ. అంత సభాజనంబుల కలకలంబు నివారించి మంత్రులం జూచి కంసుం డిట్లనియె. 1370
ఉ. వల్లవబాలురన్‌ నగరివాకిటికిన్‌ వెడలంగ ద్రొబ్బుఁ; డీ
గొల్లల ముట్టికోల్‌ గొనుఁడు; క్రూరుని నందునిఁ గట్టుఁ; డుర్వికిం
దెల్లము గాఁగ నేఁడు వసుదేవునిఁ జంపుఁడు; తండ్రి గాఁడు వీఁ
డెల్లవిధంబులం బరుల కిష్టుఁడు కావకుఁ డుగ్రసేనునిన్‌.
1371
వ. అని పలుకు సమయంబున. 1372
శా. జంఘాలత్వముతో నగోపరిచరత్సారంగహింసేచ్ఛ ను
ల్లంఘింపన్‌ గమకించు సింహముక్రియన్‌ లక్షించి పౌరప్రజా
సంఘాతంబులు తల్లడిల్ల హరి కంసప్రాణహింసార్థియై
లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్‌.
1373
క. తమగమున కెగురు యదు స, త్తమగణ్యునిఁ జూచి ఖడ్గధరుఁడై యెదిరెం
దమగమివారలు వీరో, త్తమగణవిభుఁ డనఁగ గంసధరణీపతియున్‌.
1374
శా. పక్షీంద్రుం డురగంబుఁ బట్టు విధ మొప్పన్‌ గేశబంధంబు లో
క క్షోభంబుగఁ బట్టి మౌళిమణు లా కల్పాంతవేళాపత
న్నక్షత్రంబులభంగి రాల రణసన్నాహంబు డిందించి రం
గ క్షోణిం బడఁ ద్రోచెఁ గృష్ణుఁడు వెసన్‌ గంసున్‌ నృపోత్తంసునిన్‌.
1375
శా. మంచాగ్రంబుననుండి రంగధరణీమధ్యంబునం గూలి యే
సంచారంబును లేక చిక్కి జను లాశ్చర్యంబునుం బొందఁగాఁ
బంచత్వంబును బొందియున్న విమతున్‌ బద్మాక్షుఁ డీడ్చెన్‌ వడిన్‌
పంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్‌ బాహాబలోల్లాసియై.
1376
క. రోషప్రమోదనిద్రా, భాషాశనపానగతులఁ బాయక చక్రిన్‌
దోషగతిఁ జూచి యైన వి, శేషగతిన్‌ గంసుఁ డతనిఁ జెందె నరేంద్రా!
1377
వ. అ సమయంబున. 1378
క. గోపాలుఁ డొక్కఁ డద్దిర!, భూపాలకుఁ జంపె వీనిఁ బొడువుం డేత
ద్రూపాలస్యము లేలని, తాపాలఘురోషు లగుచు దర్పోద్ధతులై.
1379
శా. న్యగ్రోధుండును గహ్వుఁడున్‌ మొదలుగా నానాయుధానీక సా
మగ్రిన్‌ గంసునిసోదరుల్‌ గవియుడున్‌ మాద్యద్గజేంద్రాభుఁడై
యుగ్రుండై పరిఘాయుధోల్లసితుఁడై యొండొండ చెండాడి కా
లాగ్రక్షోణికిఁ బంచె రాముఁడు గరీయస్స్థేముఁడై వారలన్‌.
1380
వ. అ య్యవసరంబున. 1381
క. చేతులఁ దాళము లొత్తుచు, జేతోమోదంబుతోడ సిగముడి వీడన్‌
బాతర లాడుచు మింటను, గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్‌.
1382
క. వారిజభవరుద్రాదులు, భూరికుసుమవృష్టి గురిసి పొగడిరి కృష్ణున్‌
భేరులు మ్రోసెను నిర్జర, నారులు దివి నాడి రధిక నటనముల నృపా!
1383
వ. అంతం గంసాదుల కాంతలు భర్తృమరణదుఃఖాక్రాంతలై కరంబుల శిరంబులు మోఁదుకొనుచు నశ్రుధారాపరిషిక్తవదనలై సదనంబులు వెలువడి వచ్చి వీరశయ్యానిద్రితు లయిన విభులం గౌఁగిలించుకొని సుస్వరంబుల విలపించిరి. అందుఁ గంసభార్య లిట్లనిరి. 1384
సీ. గోపాలసింహంబు కోపించి వెల్వడి నిను గజేంద్రునిభంగి నేఁడు గూల్చె
యాదవేంద్రానిల మాభీలజవముల నిను మహీజముమాడ్కి నేల వ్రాల్చె
వాసుదేవాంభోధివారి యుద్వేలమై నిను దీవికైవడి నేఁడు ముంచె
దేవకీసుతవజ్రి దేవత లలరంగ నినుఁ గొండక్రియ నేఁడు నిహతుఁ జేసె
 
తే. హా మనోనాథ! హా వీర! హా మహాత్మ!, హా మహారాజ! నీ విట్లు హతుఁడ వయిన
మనుచు నున్నార మక్కట! మమ్ముఁబోలు, కఠినహృదయలు జగతిపైఁ గలరె యెందు?
1385
క. భూతముల కెగ్గుసేసిన, భూతంబులు నీకు నెగ్గుఁ బుట్టించె వృథా
భూత మగు మనికి యెల్లను, భూతద్రోహికిని శుభముఁ బొంద దధీశా!
1386
క. గోపాలకృష్ణుతోడను, భూపాలక! మున్ను దొడరి పొలసినవారిన్‌
నీ పాల బుధులు సెప్పరె, కోపాలస్యములు విడిచి కొలువం దగదే.
1387
వ. అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుం డయిన హరి కంసాదులకుఁ బరలోక సంస్కారంబులు సేయం బనిచి దేవకీవసుదేవుల బంధనంబు విడిపించి, బలభద్రసహితుం డయి, వారలకుఁ బ్రణామంబులు సేసిన. 1388
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )