పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ కృష్ణుఁడు దేవకీ వసుదేవుల చెఱ మాన్పి యుగ్రసేనునికి పట్టము కట్టుట
మ. కని లోకేశులుగాని వీరు కొడుకుల్‌ గారంచుఁ జిత్తంబులన్‌
జనయిత్రీజనకుల్‌ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా
జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి
ట్లనియెన్‌ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై.
1389
సీ. మమ్ముఁ గంటిరి గాని మా బాల్యపౌగండకైశోరవయసులఁ గదిసి మీర
లెత్తుచు దింపుచు నెలమి మన్నింపుచు నుండు సౌభాగ్యంబు లొంద రైతి;
రాకాంక్ష గలిగియు న్నది దైవయోగంబు తల్లిదండ్రులయొద్దఁ దనయు లుండి
యే యవసరమున నెబ్భంగి లాలితు లగుచు వర్ధిల్లుదు రట్టి మహిమ
 
తే. మాకు నిన్నాళ్ళు లేదయ్యె మఱియు వినుఁడు, నిఖిలపురుషార్థహేతువై నెగడుచున్న
మేని కెవ్వార లాఢ్యులు మీర కారె, యా ఋణముఁ దీర్ప నూఱేండ్ల కైనఁ జనదు.
1390
క. చెల్లుబడి గలిగి యెవ్వఁడు, తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్‌
సెల్లింపఁ డట్టి కష్టుఁడు, ప్రల్లదుఁ డా మీఁద నాత్మపలలాశి యగున్‌.
1391
క. జననీజనకుల వృద్ధులఁ, దనయుల గురువిప్రసాధుదారాదుల నే
జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక, వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్‌.
1392
వ. అదియునుం గాక. 1393
శా. కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా
వారింపంగ సమర్థతల్‌ గలిగియున్‌ వారింపఁగా రాక ని
ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్‌
సారాతిక్షములార! మమ్ముఁ గొఱఁతల్‌ సైరించి రక్షింపరే!
1394
వ. అని యిట్లు మాయామనుష్యుం డయిన హరి పలికిన పలుకులకు మోహితులై, వారల నంకపీఠంబుల నిడుకొని, కౌఁగిలించుకొని, కన్నీటం దడుపుచుఁ బ్రేమపాశబద్ధులయి, దేవకీవసుదేవు లూరకుండిరి. అంత వాసుదేవుండు మాతామహుం డయిన యుగ్రసేనునిఁ జూచి. 1395
చ. అనఘ! యయాతిశాపమున యాదవవీరులకున్‌ నరేశ్వరా
సనమున నుండరాదు; నృపసత్తమ! రాజవు గమ్ము భూమికిన్‌;
నినుఁ గొలువంగ నిర్జరులు నీ కరివెట్టుదు రన్యరాజులం
బనిగొను టెంత! రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్కతోన్‌.
1396
వ. అని పలికి. 1397
క. మన్నించి రాజుఁ జేసెను, వెన్నుఁడు సత్యావధాను విశ్రుతదానున్‌
సన్నుతమానున్‌ గదన, చ్ఛిన్నాహితసేను నుగ్రసేనున్‌ దీనున్‌.
1398
వ. తదనంతరంబ తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించు చున్న యదు వృష్ణి భోజ మధు దశార్హ కుకురాంధక ప్రముఖులగు సకల జ్ఞాతిసంబంధులను రావించి, చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారి వారి నివాసంబుల నుండ నియోగించె; ని వ్విధంబున. 1399
క. మధుసూదనసత్కరుణా, మధురాలోకనవిముక్తమానసభయులై
మధురవచనములఁ దారును, మథురానగరంబు ప్రజలు మనిరి నరేంద్రా!
1400
వ. అంత నొక్కనాఁడు సంకర్షణసహితుండై నందునిం జీరి గోవిందుం డిట్లనియె. 1401
శా. తండ్రిం జూడము తల్లిఁ జూడము యశోదాదేవియున్‌ నీవు మా
తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం దొల్లి యే
తండ్రుల్‌ బిడ్డల నిట్లు వెంచిరి? భవత్సౌజన్యభావంబులన్‌
దండ్రీ! యింతటివార మైతిమి గదా! తత్తద్వయోలీలలన్‌.
1402
ఉ. ఇక్కడ నున్న బాంధవుల కెల్లను సౌఖ్యము సేసి వత్తు మే
మక్కడికిన్‌; మదీయులకు నందఱకున్‌ వినిపింపు మయ్య నే
మెక్కడనున్న మాకు మది నెన్నఁడు బాయవు మీ వ్రజంబులో
మక్కువతోడ మీరు కృప మా కొనరించు క్రియావిశేషముల్‌.
1403
వ. అని పలికి వస్త్రభూషణాదు లొసంగి సాదరంబుగం గౌఁగిలించుకొని గోవిందుం డనిచిన నందుండు ప్రణయవిహ్వలుండై బాష్పజలపూరితలోచనుం డగుచు వల్లవులుం దానును వ్రేపల్లెకుం జనియె; నంత. 1404
క. గర్గాదిభూసురోత్తమ, వర్గముచే నుపనయనము వసుదేవుఁడు స
న్మార్గంబునఁ జేయించెను, నిర్గర్వచరిత్రులకును నిజపుత్త్రులకున్‌.
1405
క. ద్విజరాజ వంశవర్యులు, ద్విజరాజ ముఖాంబుజోపదిష్ట వ్రతులై
ద్విజరాజత్వము నొందిరి, ద్విజరాజాదికజనంబు దీవింపంగన్‌.
1406
వ. ఉపనయనానంతరంబున వసుదేవుండు బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గోహిరణ్యాది దానంబు లొసంగి తొల్లి రామకృష్ణుల జన్మసమయంబులందు నిజమనోదత్తలైన గోవుల నుచ్చరించి యిచ్చి కామితార్థంబుల నర్థులకుం బెట్టె; నిట్లు బ్రహ్మచారులై. 1407
శా. ఉర్విన్‌ మానవు లెవ్వరైన గురువాక్యోద్యుక్తులై కాని త
త్పూర్వారంభము సేయఁ బోల దనుచున్‌ బోధించు చందంబునన్‌
సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియుం
గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్‌ రాముఁడున్‌.
1408
వ. చని మహావైభవరాశియైన కాశిం జేరి తత్తీరంబున నవంతీపుర నివాసియు, సకలవిద్యా విలాసియు నైన సాందీపని యను బుధవర్యుం గని యథోచితంబుగ దర్శించి, శుద్ధభావవర్తనంబుల భక్తిసేయుచుండ, వారలవలన సంతుష్టుండై. 1409
శా. వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ
న్వాదివ్యాహృతధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్క వి
ద్యా దక్షత్వము రాజనీతియును శుద్ధప్రక్రియం జెప్పె నా
భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్‌.
1410
క. అఱువది నాలుగు విద్యలు, నఱువది నాలుగు దినంబు లంతన వారల్‌
నెఱవాదులైన కతమున, నెఱి నొక్కొకనాఁటి వినికి నేర్చి రిలేశా!
1411
క. గురువులకు నెల్ల గురులై, గురులఘుభావములులేక కొమరారు జగ
ద్గురులు త్రిలోకహితార్థము, గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్‌.
1412
వ. ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి వారల మాహాత్మ్యంబునకు వెఱఁగుపడి సభార్యుండైన సాందీపని యిట్లనియె. 1413
శా. అంభోరాశిఁ బ్రభాసతీర్థమున ము న్నస్మత్తనూసంభవుం
డంభోగాహముసేయుచున్‌ మునిఁగి లేఁ డయ్యెం గృపాంభోనిధుల్‌
శుంభద్వీర్యులు మీరు మీ గురునికిం జోద్యంబుగా శిష్యతన్‌
గాంభీర్యంబునఁ బుత్త్రదక్షిణ యిడం గర్తవ్య మూహింపరే!
1414
క. శిష్యులు బలాఢ్యులైన వి, శేష్యస్థితి నొంది గురువు జీవించును; ని
ర్దూష్యగుణబలగరిష్ఠులు, శిష్యులరై గురునికోర్కి సేయం దగదే?
1415
వ. అనిన విని రామకృష్ణులు గుర్వర్థంబుగా దుర్వారరథారూఢులై రయంబునం జని రౌద్రంబున సముద్రంబుఁ జేరి యిట్లనిరి. 1416
క. సాగర! సుబుద్ధితోడను, మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ
వాగడ మగుదువు; దుస్సహ, వేగరణాభీలనిశితవిశిఖాగ్నులకున్‌.
1417
వ. అనిన వారలకు జలరాశి యిట్లనియె. 1418
ఉ. ‘వంచన యింత లేదు యదువల్లభులార! ప్రభాసతీర్థమం
దంచితమూర్తి విప్రసుతుఁ డార్యుఁడు తోయము లాడుచుండ ను
త్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతిం గొనిపోయెఁ బోవఁగాఁ
బంచజనుండు మ్రింగె నతిభాసురశీలుని విప్రబాలునిన్‌.
1419
వ. అని వాని వసియించు చో టెఱింగించిన. 1420
శా. శంఖారావముతోడఁ బంచజనుఁడున్‌ శంకించి చిత్తంబులో
సంఖిన్నుండుగ వార్ధిఁ జొచ్చి దహనజ్వాలాభహేమోజ్జ్వల
త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వానిజఠరంబున్‌ వ్రచ్చి గోవిందుఁ డ
ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై.
1421
క. దానవుని దేహజంబగు, మానితశంఖంబు గొనుచు మసలక బలుఁడుం
దో నేతేరఁగ రథియై, దానవరిపుఁ డరిగె దండధరపురికి నృపా!
1422
వ. చని సంయమనీనామనగరంబుఁ జేరి తద్ద్వారంబునఁ బ్రళయకాల మేఘగంభీరనినదభీషణం బగు శంఖంబు పూరించిన విని వెఱఁగుపడి. 1423
శా. అస్మద్బాహుబలంబుఁ గైకొనక శంఖారావమున్‌ మానసా
పస్మారంబుగ నెవ్వఁ డొక్కొ నగర ప్రాంతంబునం జేసె? మ
ద్విస్మేరావహరోషపావకునిచే విధ్వస్తుఁడై వాఁడు దా
భస్మంబై చెడు నంచు నంతకుఁడు కోపప్రజ్వలన్మూర్తియై.
1424
వ. వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లయిన విష్ణుమూర్తులని యెఱింగి; భక్తితోడం బూజ చేసి సర్వభూతమయుండగు కృష్ణునకు నమస్కరించి ‘యేమి సేయుదు నాన’తి మ్మనిన న మ్మహాత్ముం డిట్లనియె. 1425
క. ‘చెప్పెద మా గురునందనుఁ, దప్పు గలుగఁ జూచి నీవు దండనమునకున్‌
దెప్పించినాఁడ వాతని, నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!’
1426
క. అనిన విని ‘వీఁడె వీనిం, గొని పొం’డని భక్తితోడ గురునందను ని
చ్చినఁ గృష్ణుఁడు వీడ్కొనియెను, ఘనదుర్జనదమను మహిషగమనున్‌ శమనున్‌.
1427
వ. ఇట్లు జము నడిగి తెచ్చి రామకృష్ణులు సాందీపనికిం బుత్త్రుని సమర్పించి ‘యింక నేమి సేయవలయు? నానతిం’ డనిన నతం డిట్లనియె. 1428
క. ‘గురునకుఁ గోరిన దక్షిణఁ, గరుణన్‌ ము న్నెవ్వఁ డిచ్చె? ఘనులార! భవ
ద్గురునకుఁ గోరిన దక్షిణఁ, దిరముగ నిచ్చితిరి మీరు దీపితయశులై.
1429
క. కాలునివీటికిఁ జని మృత, బాలకుఁ దే నొరుల వశమె? భవదీయ కృపన్‌
మేలు దొరకొనియె మాకు; వి, శాల మగుంగాత మీ యశము లోకములన్‌.
1430
వ. మహాత్ములారా! ‘యేను గృతార్థుండ నైతి’ నని దీవించిన సాందీపని వీడ్కొని కృతకృత్యులై రామకృష్ణులు రథారోహణంబు చేసి, మథురకుం జనుదెంచి పాంచజన్యంబు పూరించినఁ గని నష్టధనంబులు గనినవారి భంగిం బ్రజలు ప్రమోదించి; రంత నొక్క నాఁ డేకాంతంబున. 1431
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )