పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ కృష్ణుఁడు గోపకాంతల చెంతకు నుద్ధవునిఁ బంపుట
శా. నాపైఁ జిత్తము లెప్పుడున్‌ నిలుపుచున్‌ నా రాకఁ గాంక్షించుచున్‌
నాపే రాత్మల నావహించుచు వగన్‌ నానాప్రకారంబులన్‌
గోపాలాంగన లెంత జాలిపడిరో? కోపించిరో? దూఱిరో?
వ్రేపల్లెన్‌ నిజనర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై.
1432
వ. అని చింతించి. 1433
క. సిద్ధవిచారు గభీరున్‌, వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్‌
బుద్ధినిధి నమరగురుసము, నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యన పలికెన్‌.
1434
శా. రమ్మా యుద్ధవ! గోపకామినులు నా రాకల్‌ నిరీక్షించుచున్‌
సమ్మోహంబున నన్నియున్‌ మఱచి యే చందంబునం గుందిరో
తమ్మున్‌ నమ్మినవారి డిగ్గ విడువన్‌ ధర్మంబు గాదండ్రు; వే
పొమ్మా! ప్రాణము లే క్రియన్‌ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్‌.
1435
క. లౌకిక మొల్లక న న్నా, లోకించు ప్రపన్నులకును లోఁబడి కరుణా
లోకనములఁ బోషింతును, నా కాశ్రితరక్షణములు నైసర్గికముల్‌.
1436
క. ‘సందేహము మానుం డర, విందాననలార! మిమ్ము విడువను వత్తున్‌
బృందావనమున’ కని హరి, సందేశము పంపె ననుము సంకేతములన్‌.
1437
వ. అని మందహాససుందరవదనారవిందుండై కరంబు కరంబున నవలంబించి, సరసవచనంబు లాడుచు వీడుకొలిపిన నుద్ధవుండును రథారూఢుండై సూర్యాస్తమయసమయంబునకు నందవ్రజంబుసేరి వనంబులనుండి వచ్చు గోవుల చరణరేణువులం బ్రచ్ఛన్నరథుండై చొచ్చి నందుమందిరంబు ప్రవేశించిన. 1438
శా. ఆ పుణ్యాత్మునిఁ గౌఁగిలించుకొని నందాభీరుఁ డానందియై
‘మా పాలింటికిఁ గృష్ణుఁ డీతఁ’ డనుచున్‌ మన్నించి పూజించి వాం
ఛా పూర్ణంబుగ మంజులాన్న మిడి మార్గాయాసముం బాపి స
ల్లాపోత్సాహముతోడ నిట్లనియె సంలక్షించి మోదంబునన్‌.
1439
క. నా మిత్రుఁడు వసుదేవుఁడు, సేమంబున నున్నవాఁడె? చెలువుగఁ బుత్త్రుల్‌
నేమంబున సేవింప మ, హామత్తుండైన కంసుఁ డడఁగిన పిదపన్‌.
1440
శా. అన్నా! భద్రమె? తల్లిదండ్రుల మమున్‌ హర్షించి చింతించునే?
తన్నుం బాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్‌ గోగణం
బు న్నిత్యంబుఁ దలంచునే? వననదీభూముల్‌ ప్రసంగించునే?
వెన్నుం డెన్నఁడు వచ్చునయ్య! యిట మావ్రేపల్లెకు న్నుద్ధవా!
1441
క. అంకిలి కలుగక మా కక, లంకేందుని పగిదిఁ గాంతిలసితంబగు త
త్పంకజనయనుని నెమ్మొగ, మింక విలోకింపఁ గలనె యీ జన్మమునన్‌?
1442
క. అని హరి ము న్నొనరించిన, పను లెల్లను జెప్పి చెప్పి బాష్పాకుల లో
చనుఁడై డగ్గుత్తికతో, వినయంబున నుండె గోపవీరుం డంతన్‌.
1443
క. పెనిమిటి బిడ్డనిగుణములు, వినుతింప యశోద ప్రేమవిహ్వలమతియై
చనుమొనలఁ బాలు గురియఁగ, గనుఁగొనలను జలము లొలుకఁగా బెగ్గిలియెన్‌.
1444
వ. ఇట్లు గోవిందసందర్శనాభావవిహ్వలులైన యశోదానందులకు నుద్ధవుం డిట్లనియె. 1445
క. జననీజనకుల మిమ్ముం, గనుఁగొన శీఘ్రంబె వచ్చుఁ గని భద్రంబుల్‌
వనజాక్షుం డొనరించును, మనమున వగవకుఁడు ధైర్యమండనులారా!
1446
మ. బలుఁడుం గృష్ణుఁడు మర్త్యులే? వసుమతీభారంబు వారింప వా
రల రూపంబులఁ బుట్టినాఁడు హరి నిర్వాణప్రభుం; డెవ్వఁ డు
జ్జ్వలుఁడై ప్రాణవియోగకాలమునఁ దత్సర్వేశుఁ జింతించు వాఁ
డలఘుశ్రేయముఁ బొందు బ్రహ్మమయుఁడై యర్కాభుఁడై నిత్యుఁడై.
1447
సీ. అట్టి నారాయణుం డఖిలాత్మభూతుండు కారణమానవాకారుఁ డైనఁ
జిత్తంబు లతనిపైఁ జేర్చి సేవించితి రతికృతార్థుల రైతి; రనవరతము
శోభిల్లు నింధనజ్యోతిచందంబున నఖిలభూతములందు నతఁ; డతనికి
జననీజనకదారసఖిపుత్త్రబాంధవశత్రు ప్రియాప్రియజనులు లేరు;
 
ఆ. జన్మకర్మములును జన్మంబులును లేవు;, శిష్టరక్షణంబు సేయుకొఱకు
గుణవిరహితుఁ డయ్యు గుణి యయి సర్వ ర, క్షణవినాశకేళి సలుపుచుండు.
1448
వ. అని మఱియుఁ బెక్కువిధంబుల హరిప్రభావము లుపన్యసించుచు నా రేయి గడపి మఱునాఁడు దధిమథనశబ్దంబు లాకర్ణించుచు లేచి కృతానుష్ఠానుండై యుద్ధవుం డొక్క రహస్యప్రదేశంబున నున్న సమయంబున. 1449
శా. ‘రాజీవాక్షుఁడు సుందరాస్యుఁడు మహోరస్కుండు పీతాంబరుం
డాజానుస్థితబాహుఁ డంబురుహమాలాలంకృతుం డుల్లస
ద్రాజ త్కుండలుఁ డొక్క వీరుఁ డిచటన్‌ రాజిల్లుచున్నాఁడు; మా
రాజీవాక్షునిభంగి’ నంచుఁ గని రా రాజాన్వయున్‌ గోపికల్‌.
1450
వ. కని లజ్జాసహితహాసవిలోకనంబులు ముఖంబులకుం జెలు వొసంగ నిట్లనిరి. 1451
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )