| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| చ. |
ఎఱుఁగుదు మేము నిన్ను వనజేక్షణ మిత్రుఁడ వీవు; కూరిమిన్ మెఱయుచుఁ దల్లిదండ్రులకు మే లెఱిఁగింపఁ బ్రియుండు పంపఁగా వఱలెడు భక్తి వచ్చితివి; వారల నైన మనంబులోపలన్ మఱవఁడు శౌరి మేలు; మఱి మాన్యులు రాజున కెవ్వ రిచ్చటన్. |
1452 |
| క. |
మునివరు లైనను బంధుల, ఘనసఖ్యము విడువలేరు గాక విడువరే సనిమిత్తసఖ్య మాఁకటి, పని దీఱిన నళులు విరులఁ బాయునొ లేదో? |
1453 |
| చ. |
అని యిటు గోపికల్ పలుక నం దొక గోపిక కృష్ణపాద చిం తనమునఁ జొక్కి చేరువను దైవవశంబునఁ గాంచె నుజ్జ్వల త్సునిశితసద్వివేకముఁ బ్రసూనమరందమదాతిరేకమున్ ఘనమృదునాదసంచలితకాముకలోకముఁ జంచరీకమున్. |
1454 |
| వ. | కని హరి తన్నుం బ్రార్థింపఁ బుత్తెంచినదూత యని కల్పించుకొని, యుద్ధవునికి నన్యాపదేశంబై యెఱుకపడ న య్యళికిం దొయ్యలి యిట్లనియె. | 1455 |
| మ. |
భ్రమరా! దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర ప్రమదాళీకుచకుంకుమాంకితలసత్ప్రాణేశదామప్రసూ న మరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁ గా క మము న్నేపుచుఁ బౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్. |
1456 |
| మ. |
ఒకపువ్వందలి తేనె ద్రావి మధుపా! యుత్సాహివై నీవు వే ఱొకటిం బొందెడు భంగి మ మ్మధరపీయూషంబునం దేల్చి మా యకలంకోజ్జ్వల యౌవనంబుఁ గొని యన్యాసక్తుఁ డయ్యెన్ విభుం; డకటా! యాతని కెట్లు దక్కె సిరి? మిథ్యాకీర్తి నమ్మెం జుమీ! |
1457 |
| శా. |
భృంగా! కృష్ణుఁడు మంచివాఁ డనుచు సంప్రీతిం బ్రశంసించె; దీ సంగీతంబున నేము సొక్కుదుమె? తచ్చారిత్రముల్ వింతలే? యంగీకారము గావు మాకుఁ; బురకాంతాగ్రప్రదేశంబులన్ సంగీతం బొనరింపు వా రిడుదు రోజ న్నీకు నిష్టార్థముల్. |
1458 |
| మ. |
సమదాళీశ్వర! చూడు ముజ్జ్వలితహాస భ్రూవిజృంభంబులన్ రమణీయుండగు శౌరిచేఁ గరఁగరే రామల్ త్రిలోకంబులం? బ్రమదారత్నము లక్ష్మి యాతనిపదాబ్జాతంబు సేవించు; ని క్కము మే మెవ్వర మా కృపాజలధికిం గారుణ్యముం జేయఁగన్. |
1459 |
| శా. |
రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్ చాలున్; మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్త్రాదులన్ లీలం బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ మ్మేలా వాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే? |
1460 |
| శా. |
వాలిం జంపెను వేఁటకాని పగిదిన్ వంచించి; దైత్యానుజన్ లోలం బట్టి విరూపఁ జేసెను; బలిన్ లోభంబుతోఁ గట్టి యీ త్రైలోక్యంబు మొఱంగి పుచ్చుకొనియెన్; ధర్మజ్ఞుఁడే మాధవుం? డేలా షట్పద! యెగ్గు మావలన నీ కెగ్గింపఁగా నేటికిన్? |
1461 |
| ఉ. |
పన్నుగ మింటిపై కెగసి పాఱు విహంగములైన వీనులం ద న్నొకమాటు విన్న గృహదారసుతాదులఁ బాపి విత్త సం పన్నత డించి సంసరణపద్ధతిఁ బాపెడువాఁడు నిత్య కాం క్ష న్నెఱి నున్న మాబ్రదుకు సైఁచునె యేల మధువ్రతోత్తమా! |
1462 |
| మ. |
కమనీయం బగు వేఁటకానిపలు కాకర్ణించి నిక్కంబుగాఁ దమ చిత్తంబులఁ జేర్చి చేరి హరిణుల్ తద్బాణనిర్భిన్నలై యమితోగ్రవ్యథనొందుభంగి హరిమాయాలాపముల్ నమ్మి దుః ఖములం జెందితి మంగజాస్త్ర జనితోగ్రశ్రాంతి నిందిందిరా! |
1463 |
| ఉ. |
బంధుల బిడ్డలన్ మగల భ్రాతలఁ దల్లులఁ దండ్రులన్ మనో జాంధతఁ జేసి డించి శరణందిన మమ్ము వియోగదుర్దశా సింధువులోనఁ ద్రోచి యిటు చేరక పోవుట పాడి గాదు; పు ష్పంధయ! మీ యధీశునకుఁ బాదములంఁ బడి యొత్తి చెప్పవే! |
1464 |
| సీ. |
కాంచనరత్నసంఘటితసౌధంబులే మా కుటీరంబులు మాధవునకు వివిధనరేంద్రసేవితరాజధానియే మా పల్లె యదువంశ మండనునకు? సురభి పాదప లతాశోభితారామమే మా యరణ్యము సింహమధ్యమునకుఁ గమనీయ లక్షణ గజతురంగంబులే మా ధేనువులు కంసమర్దనునకు? |
|
| తే. |
రూప విభ్రమ నైపుణ రూఢలైన, మగువలమె మేము మన్మథమన్మథునకు? నేల చింతించు మముఁ గృష్ణుఁ డేల తలఁచుఁ?, బృథివి నధిపులు నూతనప్రియులు గారె! |
1465 |
| వ. | అని మఱియు నిట్లనేక విధంబులఁ గృష్ణసందర్శన లాలస లయి పలుకుచున్న గోపికల వచనంబులు విని యుద్ధవుండు మధురాలాపంబుల నూరార్చుచు నిట్లనియె. | 1466 |
| మ. |
జపదానవ్రతహోమసంయమతపస్స్వాధ్యాయముఖ్యంబులన్ నిపుణుల్ గోరియు నే విభున్ మనముల న్నిల్పంగలే రట్టి స ద్విపులాకారునిపై మహామహిముపై విశ్వేశుపై మీ కజ స్ర పటుధ్యానము లిట్లు నిల్చునె? భవచ్చారిత్రముల్ చిత్రముల్. |
1467 |
| క. |
నను మీ కడకుం గృష్ణుఁడు, పని పంపెడు వేళఁ బిలిచి పలికినపలుకుల్ వినుఁ; డన్నియు వివరించెద, వనజేక్షణలార! మీరు వగవకుఁ డింకన్. |
1468 |
| వ. | అని హరివచనంబులుగా నిట్లనియె. | 1469 |
| సీ. |
ఎల్లకార్యములకు నేను బ్రధానకారణము గావున మీరు రమణులార! కలుగదు మద్వియోగము చరాచరరూపములలో మహాభూతములు వసించు కరణి నుండుదు సర్వగతుఁడనై నే మనః ప్రాణబుద్ధి గుణేంద్రియాశ్రయుండ నాత్మయం దాత్మచే నాత్మఁ బుట్టింతు రక్షింతును ద్రుంతు హృషీకభూత |
|
| తే. |
గుణగణాకార మాత్మలోఁ గొమరు మిగులు, నిబిడమాయానుభవమున నిత్యశుద్ధ మాత్మ విజ్ఞానమయమునై యమరు గుణముఁ, బ్రకృతికార్యమనోవృత్తిఁ బట్టి పొందు. |
1470 |
| చ. |
కలఁ గని లేచి మున్ను గలఁ గన్న సమస్తవిధంబుఁ గల్లఁగాఁ దలఁచిన భంగి మానసపదార్థముచే నిఖిలేంద్రియార్థముల్ బలమునఁ గట్టి తద్‌జ్ఞుఁడు ప్రపంచము లేదనుఁ దన్మనంబుఁ దా రలయక కట్టుడున్ బుధుల కవ్వల నొండొకభేద మున్నదే? |
1471 |
| ఆ. |
సాంఖ్యయోగనిగమసత్యతపోదమ, ములు మనోనిరోధములు గడపలఁ గాఁగ నుండు జలధికడపలగాఁ గల, నదులభంగి నళిననయనలార! |
1472 |
| మ. |
చెలువల్ దవ్వుల నున్న వల్లభులపైఁ జిత్తంబులం గూర్తు రు త్కలికం జేరువవారికంటె నదియుం గాకెప్పుడున్ నన్ను మీ రలు చింతించుచు నుండఁ గోరి యిటు దూరస్థత్వముం బొందితిన్ దలఁకం బోలదు నన్నుఁ గూడెదరు నిత్యధ్యానపారీణలై. |
1473 |
| వ. | అని మీకుం జెప్పుమని కృష్ణుండు సెప్పె ననవుడు నుద్ధవునికిం గోపికలు సంతసించి యిట్లనిరి. | 1474 |
| ఉ. |
ఇమ్ముల నున్నవాఁడె హరి? యిక్కడి కెన్నఁడు వచ్చు? వచ్చి మా యుమ్మలికంబు వాపునె? ప్రియుం డిట వచ్చెద నన్న సైఁతురే య మ్మథురాపురీరమణు లడ్డము వత్తురుగాక చెల్లరే! మమ్ము విధాత నిర్దయుఁడు మన్మథవేదనపాలు సేసెనే! |
1475 |
| చ. |
మఱచునొకో మదిం దలఁచి మాధవుఁ డా యమునాతటంబునం దఱచుగ దివ్యసౌరభలతాగృహసీమల నేము డాఁగఁగా మఱువులనుండి నీడలకు మ మ్మెలయించి కలంచి దేహముల్ మఱచినఁ దేర్చి నూల్కొలిపి మన్మథలీలలఁ దేల్చు చందముల్. |
1476 |
| శా. |
నీతో నర్మగృహంబులం బలుకునే నే మెల్ల వంశోల్లస ద్గీతభ్రాంతలమై కళిందతనయాతీరంబునం జేరినం జేతోజాతసుఖంబులం దనిపి మా చిత్తస్థితుల్ చూడ లీ లా తంత్రజ్ఞత డాఁగి మెల్లన మదాలాపంబు లాలించుటల్. |
1477 |
| క. |
ముచ్చట వేళలఁ జెప్పునె, యచ్చుగ మును నేము నోము నప్పుడు జలముల్ సొచ్చిన మా చేలంబులు, మ్రుచ్చిలి యిచ్చినవిధంబు మూలం బెల్లన్. |
1478 |
| శా. |
ఏకాంతంబున నీదుపై నొరగి తా నేమేని భాషించుచో మా కాంతుండు వచించునే రవిసుతామధ్యప్రదేశంబునన్ రాకాచంద్రమయూఖముల్ మెఱయఁగా రాసంబు మాతోడ నం గీకారం బొనరించి బంధనియతిం గ్రీడించు విన్నాణముల్. |
1479 |
| సీ. |
తనుఁబాసి యొక్కింత తడవైన నిటమీఁద నేలపై మేనులు నిలువ మనుము నేలపై మేనులు నిలువక యట మున్న ధైర్యంబు లొక్కటఁ దలఁగు ననుము ధైర్యంబు లొక్కటఁ దలఁగిన పిమ్మటఁ జిత్తంబు లిక్కడఁ జిక్క వనుము చిత్తంబు లిక్కడఁ జిక్కక వచ్చినఁ బ్రాణంబు లుండక పాయు ననుము |
|
| తే. |
ప్రాణములు వోవ మఱి వచ్చి ప్రాణవిభుఁడు, ప్రాణిరక్షకుఁ డగు తన్నుఁ బ్రాణు లెల్లఁ జేరి దూఱంగ మఱి యేమి సేయువాఁడు, వేగ విన్నప మొనరింపవే మహాత్మ! |
1480 |
| క. |
తగులరె మగలను మగువలు?, దగులదె తను మున్ను కమల, తగవు విడిచియుం దగిలిన మగువల విడుచుట, దగదని తనుఁ దగవు వలుకఁ దగుదువు హరికిన్. |
1481 |
| సీ. |
విభుఁడు మా వ్రేపల్లె వీథుల నేతేరఁ జూతుమే యొకనాఁడు చూడ్కు లలరఁ బ్రభుఁడు మాతో నర్మభాషలు భాషింప విందుమే యొకనాఁడు వీను లలరఁ దనువులు పులకింప దయితుండు డాసినఁ గలుగునే యొకనాఁడు కౌఁగిలింపఁ? బ్రాణేశ! మమ్మేల పాసితి వని దూఱ దొరకునే యొకనాఁడు తొట్రుపడఁగ? |
|
| తే. |
వచ్చునే హరి మే మున్నవనముఁ జూడఁ?, దలఁచునే భర్త మాతోడితగులు తెఱఁగుఁ? దెచ్చునే విధి మన్నాథుఁ దిట్టువడక, యెఱుఁగఁ బలుకు మహాత్మ! నీ కెఱుఁగ వచ్చు. |
1482 |
| వ. | అని ‘దుఃఖార్ణవమగ్నంబైన గోకులంబు నుద్ధరింపుము రమానాథ’ యని గోపికలు వగచి తదనంతరంబ మఱియు నుద్ధవ నిగదితం బయిన కృష్ణసందేశంబులవలన విరహవేదనలు విడిచి యుద్ధవునిం బూజించి; రిట్లు కృష్ణలీలావర్ణనలు సేయుచు వ్రేపల్లె నుద్ధవుండు గొన్నినెల లుండి నందాదుల వీడ్కొని మరలి రథారూఢుండై చని చని. | 1483 |
| క. |
సారమతిఁ బ్రణుతి సేయుచు, నారయ నుద్ధవుఁడు గాంచె నఘసంహారిన్ హారిన్ మథురానగర వి, హారిన్ రిపుజనమదాపహారిన్ శౌరిన్. |
1484 |
| వ. | కని యథోచితంబుగా భాషించుచుఁ దనచేత నందాదులు పుత్తెంచినకానుకలు బలకృష్ణులకు నుగ్రసేనునికి వేఱు వేఱ యిచ్చెనని చెప్పి శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. | 1485 |