| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| మ. |
తను మున్నంగజకేళిఁ గోరిన లతాతన్విన్ రతిక్రీడలం దనుపం గోరి జనార్దనుం డరిగె రత్నస్వర్ణమాల్యాను లే పన భూషాంబరధూపదీపపరిదీప్తంబై మనోజప్రదీ పనమై యున్న తదీయగేహమునకుం బంచేషుపంచేషుఁడై. |
1486 |
| వ. | ఇ ట్లరిగి తద్గేహమధ్యంబున. | 1487 |
| ఆ. |
కాముశరమువోలెఁ గమలారి కళవోలెఁ, మెలఁగి యాడనేర్చు మెఱుపుఁ బోలె నిఖిలభువనమోహినీదేవతయుఁ బోలెఁ, జెలువు మెఱసియున్న చెలువఁ గనియె. |
1488 |
| మ. |
హరి యేతెంచిన లేచి సంభ్రమముతో నాళీసమూహంబుచే సిరి యొప్పన్ విహితోపచారములు తాఁ జేయించి సౌవర్ణ సుం దర తల్పస్థితుఁ జేసి, యుద్ధవుని నుద్యత్ప్రీతిఁ బూజించి భా సుర పీఠంబున నుండు మంచు మది నౌత్సుక్యంబు శోభిల్లఁగన్. |
1489 |
| క. |
ఆళీనివహనివేదిత, మాలా మృగనాభిపంకమణిమయభూషా చేలాలంకృత యగుచును, హేలావతి గోరె వనరుహేక్షణుఁ గవయన్. |
1490 |
| క. |
లీలావతీకృతోల్లస, దేలా కర్పూరమిళితహితమధురమహా హాలారసపానమద, శ్రీలాలిత యగుచు నబల చేరెం గృష్ణున్. |
1491 |
| మ. |
సరసాలోకనవృష్టి పైఁ గురియుచున్ సమ్యగ్వచోవైఖరిం గరఁగంజేసి సువర్ణకంకణసమగ్రం బైన సైరంధ్రి కేల్ కరపద్మంబునఁ బట్టి తల్పమున కాకర్షించి గంభీరతం బరిరంభాదుల నాన పుచ్చి మరుసంభావించుచున్ వేఁడుకన్. |
1492 |
| ఉ. |
జాతియుఁ గాలముం గళయు సత్త్వము దేశము భావచేష్టలున్ ధాతువుఁ బ్రాయముం గుణముఁ దద్దశయున్ హృదయంబుఁ జూడ్కియుం బ్రీతివిశేషముం దెలిసి పెక్కువిధంబులఁ దొయ్యలిన్ మనో జాత సుఖంబులం దనిపె శౌరి వధూహృదయాపహారియై. |
1493 |
| క. |
కరపద్మంబుల మాధవుఁ, గరమొప్పం గౌఁగిలించి కామానలముం గరభోరువు వర్జించెను, గర మరు దని తోడిశీతకరముఖు లలరన్. |
1494 |
| మ. |
సనకాదుల్ తలపోసి కానని విభున్ సర్వప్రభున్ దుర్లభున్ మును దా నిచ్చిన యంగరాగసుకృతామోదంబునం గూడియున్ ఘననిర్వాణవిభూతి యిమ్మనక యా కంజాక్షి ‘యేఁ బాయఁ జా ల ననుం గొన్నిదినంబు లంగభవలీలం దేల్పవే? నావుడున్. |
1495 |
| ఆ. |
వనిత గోరుకొనిన వర మిచ్చి శౌరి యా, యుద్ధవుండుఁ దాను నువిదయిల్లు వెడలె నపుడు తియ్యవిలుకాఁడు సురభితోఁ, దీఁగెయిల్లు వెడలుతెఱఁగు మెఱయ. |
1496 |
| క. |
ఏ వేదంబులుఁ గానని, దేవోత్తముఁ గాంచి ముక్తితెరు వడుగక రా జీవేక్షణ రతి యడిగెను, భావింపఁ దదీయకర్మఫల మెట్టిదియో! |
1497 |
| క. |
కారుణ్యంబునఁ గృష్ణుఁడు, తారుణ్యము మెఱసి మదనతంత్రంబుల లీ లారణ్యవీథి దేల్చెను, సైరంధ్రిన్ విభవవిజితశక్రపురంధ్రిన్. |
1498 |
| వ. | తదనంతరంబ కృష్ణుం డుద్ధవ రామ సహితుండై హస్తినాపురమునకు నక్రూరునిం బనుపం దలంచి తద్గృహంబునకుఁ జనిన నతండు వారలం గని లేచి రామకృష్ణులకు నమస్కరించి యుద్ధవుం గౌఁగిలించుకొని వారి నందఱను యథావిధిం బూజించి హరిపాదంబులు దన తొడలమీఁద నిడుకొని యిట్లనియె. | 1499 |
| క. |
అనుచరులుఁ దాను గంసుఁడు, సనియెన్ నీచేత జముని సదనంబునకున్ ఘనులార! మీ బలంబున నొనరఁగ యాదవులవంశ ముద్ధృత మయ్యెన్. |
1500 |
| వ. | మహాత్ములారా! విశ్వాదిపురుషులరు, విశ్వకారణులరు, విశ్వమయులరగు మీకుం గార్యకారణంబులు లే; వవధరింపుము. పరమేశ్వరా! నీవు రజోగుణంబున నఖిలంబు సృజియించి, కారణరూపంబునఁ దదనుప్రవిష్టుండవై శ్రుతదృష్టకార్యరూపప్రపంచాకారంబున దీపించుచుందువు. కార్యరూపచరాచర దేహంబులకుం గారణంబు లయిన భూప్రముఖంబు లనుగతంబులును, గార్యరూపదేహంబులు నయి ప్రకాశించుచందంబున నొక్కండవు, కారణరహితుండవు, నాత్మతంత్రుండవు నై యుండియు విశ్వాకారంబునం బెక్కగుదువు. సృష్టిస్థితిలయంబులం జేయుచుండియు విజ్ఞానమూర్తి వగుటం బరిభ్రాంతుండైన జీవునిభంగి గుణకర్మబద్ధుండవు కావు. కావున సిద్ధంబు తన్నిమిత్తంబున బంధహేతువును సిద్ధింపదు. | 1501 |
| సీ. |
పరఁగ జీవునికైన బంధమోక్షము లంట వంటునే పరతత్త్వమైన నిన్ను నంటునే యీశ! దేహాద్యుపాధులు ననిర్వచనీయములు గాన వరుస నీకు జన్మంబు జన్మసంశ్రయభేదములు లేవు కావున బంధమోక్షములు లేవు గణుతింప ని న్నులూఖలబద్ధుఁ డనుటయు నహిముక్తుఁ డనుటయు నస్మదీయ |
|
| ఆ. |
బాలబుద్ధిఁ గాదె? పాషండముఖర మా, ర్గములచేత నీ జగద్ధితార్థ మైన వేదమార్గ మడఁగిపో వచ్చిన, నవతరించి నిలుపు దంబుజాక్ష! |
1502 |
| క. |
ఆ నీవు ధరణిభారము, మానిచి రక్కసుల నెల్ల మర్దించుటకై యానకదుందుభి యింటను, మానుగ జన్మించితివి సమంచితకీర్తిన్. |
1503 |
| మ. |
త్రిజగత్పావనపాదతోయములచే దీపించి వేదామర ద్విజముఖ్యాకృతివైన నీవు కరుణన్ విచ్చేయుటం జేసి మా నిజగేహంబులు ధన్యతం దనరెఁబో ని న్నార్యు లర్చింపఁగా నజితత్వంబులు వారి కిత్తు వనుకంపాయత్తచిత్తుండవై. |
1504 |
| శా. |
ఏ పుణ్యాతిశయప్రభావముననో యీ జన్మమం దిక్కడన్ నీ పాదంబులఁ గంటి ని న్నెఱిఁగితిన్ నీవుం గృపాళుండవై నాపై నర్మిలిఁ జేసి మాన్పఁ గదవే నానాధనాగార కాం తా పుత్త్రాదులతోడిబంధనము భక్తవ్రాతచింతామణీ! |
1505 |
| వ. | అని పలికిన నగుచు నక్రూరునికి మాటలవలన సంసారసంబంధం బగు మోహంబును గీలుకొలుపుచు హరి యిట్లనియె. | 1506 |