పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీకృష్ణుఁ డక్రూరుని హస్తినాపురంబునకుఁ బంపుట
క. బంధుండవు సద్యోహిత, సంధుండవు వావిఁ జూడ జనకుఁడవు కృపా
సింధుండ వెల్లగుణముల, నంధుండవు గావు ప్రోవ నర్హుఁడ వెందున్‌.
1507
చ. కొలుతురు మర్త్యు లిష్టములు గోరి శిలామయదేవసంఘమున్‌
జలమయతీర్థసంఘమును సంతతము న్న టు వారు గొల్వఁగా
వల దనరాదు గాక భగవత్పదభక్తులరైన మీ క్రియన్‌
సొలయక దేవతీర్థములు చూచిన యంతనె కోర్కు లిచ్చునే?
1508
వ. మహాత్మా! పరమభాగవతుండవైన నీవు మా కభీష్టంబుల నొనరింప నర్హుండవు; వినుము. పాండురాజు పరలోకగతుం డైనఁ గుంతీసహితు లయిన పాండవులు ధృతరాష్ట్రుశాసనంబున నేతెంచి కరిపురంబున నున్నవారఁట. నిజపుత్త్రమోహితుం డగు న య్యంధనృపతి వారియందు సమత్వంబునం జరింపం డటు గావున. 1509
క. వారలు బంధులు గావున, వారలకును మే లొనర్చి వా రలరంగా
వారింపవలయు దుస్స్థితి, వారిజరిపువంశ! పొమ్ము వారిం జూడన్‌.
1510
వ. అని పలికి సంకర్షణోద్ధవసహితుండై హరి నిజగృహంబునకుం జనుటయు నక్రూరుండు కౌరవరాజధాని యగు కరిపురి కరిగి యందు ధృతరాష్ట్ర భీష్మ విదుర బాహ్లిక భారద్వాజ గౌతమ దుర్యోధన కర్ణాశ్వత్థామాదులం గుంతీసహితులైన పాండవులం దక్కిన బంధువులనుం గని యథోచితసత్కారంబుల నొంది తత్తద్వర్తనంబు లెఱిఁగికొనుచుఁ గొన్నిదినంబు లుండ నొక్కనాఁడు విదురుండు విన నేకతంబున నక్రూరునికిఁ గుంతి యిట్లనియె. 1511
శా. అన్నా! తల్లులు దండ్రులున్‌ భగినులు న్నల్లుండ్రు మద్భ్రాతలున్‌
నిన్నుం బొమ్మనువేళ నే మనిరి? మా నెవ్వల్‌ విచారింతురే?
యున్నారా సుఖయుక్తులై? మృగి వృకవ్యూహంబులో నున్న రే
ఖ న్నే నిక్కడ నున్నదానఁ గుమనఃకౌరవ్యమధ్యంబునన్‌.
1512
మ. కఱపించెన్‌ ఫణికోటిచే లతికలం గట్టించి గంగానదిన్‌
నెఱిఁ ద్రోపించె విషాన్వితాన్న మొసఁగెన్‌ నిద్రారతిం జెంది యే
మఱి యుండం బొడిపించె నాయుధములన్‌ మత్పుత్త్రులం దేమియుం
గొఱ గాఁ డీ ధృతరాష్ట్రసూనుఁడు మహాక్రూరుండు గార్యంబులన్‌.
1513
మ. బలుఁడుం గృష్ణుఁడు నెన్నడైనఁ దమలో భాషించి మేనత్త బి
డ్డలకున్‌ మేలు దలంతురే? వగపులన్‌ డయ్యంగఁ బాలై రయో!
జలజాతాక్షుఁడు భక్తవత్సలుఁ డిలాచక్రంబు భాగించి యి
మ్ముల నిప్పించునె నాకుమారకులకున్‌ ముఖ్యప్రకారంబులన్‌.
1514
వ. అని పలికి, కృష్ణునిఁ జిత్తంబున నిల్పి నమస్కరించి సంకీర్తనంబు చేసి, ‘సర్వాత్మక! సర్వపాలక! పుండరీకాక్ష! శరణాగతనైన నన్ను రక్షింపు మని’ వగచుచున్న కుంతికి నక్రూరుండు విదురసమేతుండై ప్రియవచనంబుల దుఃఖోపశమనంబు సేసి వీడ్కొని బంధుమిత్రమధ్యంబున సుఖోపవిష్టుండై యున్న ధృతరాష్ట్రున కిట్లనియె. 1515
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )