పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
అక్రూరుండు ధృతరాష్ట్రునితో హితోపదేశముగా సంభాషించుట
ఉ. నీ యనుజుండు పాండుధరణీవిభుఁ డీల్గిన నీవు భూమి ధ
ర్మాయతబుద్ధి నేలుచుఁ బ్రజావళిఁ గాచుచు గౌరవంబుతోఁ
బాయక లోకులందు సమభావన చేసితి వేనిఁ గీర్తియున్‌
శ్రేయము గల్గు; వే ఱొకటి చేసిన దుర్గతి గల్గు భూవరా!
1516
సీ. అవనీశ! పాండవులందు నీ నందనులందు సమానుండ వగుట బుద్ధి
యెవ్వనితో యోగ మిం దెవ్వనికి నిత్య మంగనాగారపుత్త్రాదికముల
వలన నయ్యెడి దేమి? వసుమతి నొకజంతు వుదయింప నొకజంతు వుక్కడంగు
నొకఁడు పుణ్యముఁ జెందు నొకఁడు పాపము నొందు మీనజీవనభూతమిళితజలము
 
ఆ. తత్తనూజు లెట్లు ద్రావుదు రట్లు మూ, ఢాత్మువిత్తమెల్ల నపహరింతు
రహితులైనకొడుకు లటమీఁద మనియైనఁ, జచ్చియైనఁ దండ్రిజాడఁ జనరు.
1517
క. కావున మూఢాత్ముఁడవై, నీ వార్జించిన ధనంబు నీ పుత్త్రులు దు
ర్భావులు పుచ్చుకొనంగా, భూవర! నిందితుఁడ వగుదు భూనాకములన్‌.
1518
శా. నిందం బొందకు మయ్య! యీ తనువు దా నిద్రాకళాదృష్టమౌ
సందోహంబు విధంబు నిల్వదు సుమీ! జాత్యంధతం బొందియున్‌
మందప్రజ్ఞత లేల చేసెదవు సమ్యగ్‌ జ్ఞానచక్షుండవై
సందేహింపక యిమ్ము పాండవులకున్‌ సర్వంసహాభాగమున్‌.
1519
వ. అనిన ధృతరాష్ట్రుం డిట్లనియె. 1520
సీ. నీమాట మంచిది నిశ్చయ; మగునైన నస్థిరంబయిన నాయంతరంగ
మందు నిల్వదు సుదామాచలస్ఫటికశిలాతలోద్యతతటిల్లతిక భంగి;
నమృతంబు నొందియు నానందితుఁడు గాని నరుమాడ్కి నేను నానంద మొంద;
నీశ్వరాజ్ఞావిధ మెవ్వఁడు దప్పింపనోపు విజ్ఞానియై యుండియైన
 
ఆ. విశ్వమెల్లఁ జేసి విభజించి గుణముల, నెవ్వఁ డనుసరించె నెవ్వఁ డవని
భారమెల్లఁ బాయఁ బ్రభవించె దేవకి, కెవ్వఁ డాత్మతంత్రుఁ డీశ్వరుండు.
1521
వ. అట్టి కృష్ణునకు నమస్కరించెద; ఆ నందనందనునిదివ్యచిత్తమునం గల తెఱంగునం బ్రతుకం గలవార మని వీడ్కొలిపిన, నక్రూరుం డతనితలం పెఱింగి యిట్లనియె. నీ తలంపు గనుంగొంటి. నీ కిష్టం బగునట్లు వర్తింపుమని పలికి, మరల మథురకుం జనుదెంచి, తదీయవృత్తాంతంబు రామకృష్ణుల కెఱింగించె. 1522
వ. అంతఁ గంసభార్య లగు నస్తియుం బ్రాస్తియు, విధవలయి, దుఃఖింపుచుం దమదండ్రి యయిన జరాసంధుని కడకుం జని. 1523
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )