పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
జరాసంధుఁడు మథురాపట్టణముమీఁద దండెత్తివచ్చి కృష్ణునితో యుద్ధము చేయుట
శా. వాండ్రున్‌ వీండ్రును రాజులే యనుచు గర్వప్రౌఢితో యాదవుల్‌
వేండ్రంబైన బలంబుతో మథురకున్‌ వే వచ్చి నిష్కారణం
బాండ్రున్‌ బిడ్డలు బంధులున్‌ వగవఁ గంసాదిక్షమానాథులన్‌
దండ్రీ! చంపిరి కృష్ణుచేత నిటు వైధవ్యంబు వచ్చెన్‌ జుమీ!
1524
వ. అనిన విని, ప్రళయకాలానలంబు తెఱంగున మండిపడి శోకరోషంబులు బంధురంబులుగా జరాసంధుం డిట్లనియె. 1525
శా. ఏమీ! కంసునిఁ గృష్ణుఁడే రణములో హింసించె నోచెల్ల! నా
సామర్థ్యంబుఁ దలంపఁ డించుకయు మచ్చండప్రతాపానలో
ద్దామార్చుల్‌ వడి నేఁడు గాల్చు యదుసంతానాటవీవాటికన్‌
భూమిం గ్రుంగిన నింగిఁ బ్రాఁకిన మహాంభోరాశిలోఁ జొచ్చినన్‌.
1526
క. యాదవవిరహిత యగుఁ బో, మేదిని నాచేత నేఁడు మీఁదు మిగిలి సం
పాదితబలులై హరి రు, ద్రాదులు నింద్రాదు లెవ్వ రడ్డం బైనన్‌.
1527
వ. అని పలికి, సమరసన్నాహసంకులచిత్తంబునఁ గోపంబు దీపింప సంగరభేరి వేయించి కదలి. 1528
క. దక్షుండై యిరువది మూఁ, డక్షౌహిణులైన బలము లనుగతములుగా
నా క్షణమ జరాసంధుఁడు, ప్రక్షోభముతోడ మథురపైఁ జనియె నృపా!
1529
క. గంధేభ తురగ రథ భట, బంధుర చరణోత్థితోగ్ర పాంసుపటల యో
గాంధీభూతములై దివి,మంథరగతి నడచె నపుడు మార్తాండహరుల్‌.
1530
వ. ఇట్లు చని నిరంతర కిసలయ పత్ర కోరక కుసుమ ఫలభార వినమిత వృక్షవిలసిత మహోద్యానంబును, ఉద్యానవనభాగ వలమాన జలోన్నయన దారుయంత్రలతానిబద్ధ కలశ విముక్త సలిలధారాశీకర పరంపరా సంపాదిత వర్షాకాలంబును, కాలకింకర సదృశ వీరభట రథతురగ సామజానీక సంకులంబును,గులాచార ధర్మప్రవీరపౌరజనభాసురంబును, సురాభేద్యమానమహోన్నతాట్టాలకయంత్రభయంకర ప్రాకారచక్రంబును, జక్ర సారస హంసాది కలకలరవ కలితసరోవరంబును, సరోవరసంఫుల్లహల్లక కమలపరిమళమిళిత పవన విరాజితంబును, జితానేకమండలేశ్వరభూషణమణిగణరజోనివారితమదగజేంద్రదానజలప్రభూతపంకంబును, బంకరహిత యాదవేంద్రదత్త సువర్ణాచల కల్పతరు కామధేను సమ్మర్దిత విద్వజ్జన నికేతనంబును,గేతన సన్నిబద్ధ చామరమయూర చాప శింజినీనినద పరిపూరితాభ్రంబును, నభ్రంలిహమహాప్రాసాదసౌధగవాక్షరంధ్ర నిర్గతఘనసారధూపధూమపటలవిలోకనసంజనిత జలధరభ్రాంతి విభ్రాంత శిఖండితాండవ రుచిరంబును, జిరతరానేక దేవాలయ జోఘుష్యమాణ తూర్యనినద పరిభావిత పారావారకల్లోల ఘోషంబును, ఘోషకామినీ ప్రాణవల్లభ బాహుదండ పరిరక్షితంబునునై, పరులకు నలక్షితంబైన మథురానగరంబు చేరి, వేలాలంఘనంబు చేసి, వెల్లివిరిసిన మహార్ణవంబు తెఱంగున పట్టణంబునకు ముట్టణంబు చేసి, చుట్టును విడిసిన జరాసంధుని బలౌఘంబు గని, వేళావిదుండగు హరి తన మనంబున. 1531
మ. ఐదు న్నాలుగు నాఱు రెండు నిరు మూఁడక్షౌహిణుల్‌ సుట్టి సం
ఛాదించెన్‌ బురమెల్ల, మాగథు నెడన్‌ సామంబు దానంబు సం
భేదంబున్‌ బనిలేదు దండవిధి శోభిల్లం బ్రయోగించి యీ
భూదేవీ తనుభార మెల్ల నుడుపన్‌బోలున్‌ జయోద్భాసినై.
1532
క. ఏ నవతరించు టెల్లను, మానుగఁ జతురంతధరణి మండలభరమున్‌
మానుపుకొఱకుం గాదే, పూనెద నిది మొదలు దగిలి భూభర మణఁపన్‌.
1533
ఆ. మగధనాథుఁ బోర మడియింపఁ బోలదు, మడియకున్న వీఁడు మరలి మరలి
బలము గూర్చికొంచుఁ బఱతెంచుఁ బఱతేరఁ, ద్రుంపవచ్చు నేల దొసఁగు దొఱఁగ.
1534
వ. అని యిట్లు చింతించుచున్న సమయంబున నభోభాగంబుననుండి మహాప్రభాసమేతంబులును, సపరిచ్ఛదసూతంబులును, ననేక బాణ బాణాసన చక్రాది వివిధాయుధోపేతంబులు నైన రథంబులు రెండు మనోరథంబులు పల్లవింప దైవయోగంబునం జేరవచ్చినం జూచి హరి సంకర్షణున కిట్లనియె. 1535
శా. కంటే రామ! రథంబు లాయుధములున్‌ గాఢప్రకాశంబులై
మింటన్‌ వచ్చెను; వీనిఁ గైకొని సురల్‌ మెచ్చన్‌ నృపశ్రేణులన్‌
బంటింపం బనిలేదు చంపుము; ధరాభారంబు వారింపు; మీ
వెంటన్‌ నీ యవతారమున్‌ సఫలమౌ; వేవేగ లె మ్మాజికిన్‌.
1536
వ. అని పలికి. 1537
క. ఖరులై దృఢకవచ ధను, శ్శరులై యధిగత రథానుచరులై మదవత్‌
కరులై ఘనహరులై బల, హరు లయ్యెడ నాజి కేగి రరిభీకరులై.
1538
వ. ఇట్లు సమరసన్నాహంబునం బురంబు వెడలి. 1539
ఉ. అన్యులు దల్లడిల్ల దనుజాంతకుఁ డొత్తె గభీరఘోష కా
ఠిన్య మహాప్రభావ వికటీకృత పద్మభవాండ జంతు చై
తన్యము ధన్యమున్‌ దివిజ తాపస మాన్యముఁ బ్రీత భక్త రా
జన్యము భీతదుశ్చరితశాత్రవసైన్యముఁ బాంచజన్యమున్‌.
1540
క. సింధురభంజనపూరిత, బంధురతరశంఖనినదభారమున జరా
సంధునికిని గల సైన్యము, లంధములై సంచరించె నాహవభూమిన్‌.
1541
వ. అ య్యవసరంబున మాగధుండు మాధవున కిట్లనియె. 1542
సీ. అదలించి రొప్పంగ నాలమందలు గావు గంధగజేంద్రసంఘములు గాని
పరికించి వినఁగ నంభారవంబులు గావు వాజీంద్రహేషారవములు గాని
పదహతిఁ గూల్పంగఁ బ్రాఁతబండ్లును గావు నగసమానస్యందనములు గాని
ప్రియము లాడంగ నాభీరలోకము గాదు కాలాభవైరివర్గంబు గాని
 
తే. యార్ప వనవహ్ని గాదు బాణాగ్ని గాని, మురియ బృందావనము గాదు మొనలు గాని
యమున గాదు నటింప ఘోరాజిగాని, పోరు నీకేల గోపాల! పొమ్ము పొమ్ము.
1543
మ. తరుణిం జంపుటయో బకుం గెడపుటో ధాత్రీజముల్‌ గూల్చుటో
ఖరముం ద్రుంచుటయో ఫణిం బఱపుటో గాలిన్‌ నిరోధించుటో
గిరి హస్తంబునఁ దాల్చుటో లయమహాగ్నిస్ఫారదుర్వార దు
ర్భరబాణాహతి నెట్లు నిల్చెదవు సప్రాణుండవై గోపకా!
1544
వ. అదియునుం గాక. 1545
సీ. గోపికావల్లకీఘోషణంబులు గావు శింజినీరవములు చెవుడుపఱచు
వల్లవీకరముక్తవారిధారలు గావు శరవృష్టిధారలు చక్కుసేయు
ఘోషాంగనాపాంగకుటిలాహతులు గావు నిశితాసినిహతులు నిగ్రహించు
నాభీరకామినీహస్తాబ్జములు గావు ముష్టిఘాతంబులు మురువు డించు;
 
తే. నల్ల వ్రేపల్లె గాదు ఘోరావనీశ, మకరసంఘాతసంపూర్ణమగధరాజ
వాహినీసాగరం బిది వనజనేత్ర!, నెఱసి నిను దీవికైవడి నేఁడు ముంచు.
1546
వ. అనిన శ్రీహరి యిట్లనియె. 1547
ఉ. పంతము లేల? తొల్లి జనపాలురఁ బోరుల గెల్చినాఁడ వం
డ్రంతియ చాలదే? బిరుదు లాడుట బంటుతనంబుత్రోవయే?
యింతటఁ దీఱెనే? మగధ! యేటికిఁ బ్రేలెదు? నీవ యేల క
ల్పాంతమహోగ్రపావకునినైన హరింతు వరింతు సంపదన్‌.
1548
క. గోపాలుఁడ వని పలికితి, భూపాలక! దీన నేమి? పోరాడంగా
గోపాలమహీపాల, వ్యాపారాంతరము దెలియవచ్చుం బిదపన్‌.
1549
వ. అనిన రోషబంధురుండై జరాసంధుం డిట్లనియె. 1550
ఉ. బాలుఁడ వీవు కృష్ణ! బలభద్రునిఁ బంపు రణంబు సేయ; గో
పాలకబాలుతోడ జనపాలశిఖామణియైన మాగధుం
డాలము సేసె నంచు జను లాడెడిమాటకు సిగ్గు పుట్టెడిం
జాలుఁ దొలంగు దివ్యశరజాలుర మమ్ము జయింప వచ్చునే?
1551
వ. అనిన నగి నగధరుం డిట్లనియె. 1552
క. పొగడుకొనుదురే శూరులు?, మగఁటిమిఁ జూపుదురు గాక! మాగధ! నీకున్‌
మగతనము గలిగెనేనిం, దగు మెఱయ వికత్థనములు దగ వీ పోరన్‌.
1553
వ. అని రోషించి. 1554
చ. పవనుఁడు మేఘరేణువుల భానుకృశానులఁ గప్పు కైవడిన్‌
వివిధబలౌఘముం బనిచి వేగమ మాగధుఁ డావరించె భూ
మ్యవనచరిష్ణులం గువిమతావనినాథనిరాకరిష్ణులన్‌
దివిషదలంకరిష్ణుల నతిస్థిరజిష్ణుల రామకృష్ణులన్‌.
1555
మ. హయహేషల్‌ గజబృంహితంబులు రథాంగారావముల్‌ శింజినీ
చయటంకారములున్‌ వివర్ధితగదాచక్రాస్త్రనాదంబులున్‌
జయశబ్దంబులు భేరిభాంకృతులు నిస్సాణాదిఘోషంబులున్‌
భయదప్రక్రియ నొక్కవీఁక నెగసెస్‌ బ్రహ్మాండభేదంబుగన్‌.
1556
వ. మఱియు నయ్యెడ మాగధ మాధవ వాహినులు రెండు నొండొంటిం దాఁకి రౌద్రంబున సంవర్త సమయసముద్రంబులభంగి నింగికిం బొంగి చెలంగి చలంబునం దలపడి పోరునెడ మసరు కవిసి మహారణ్యంబులు వెలువడి మార్కొనుమదగజంబులమాడ్కిని, మహోత్కంఠంబులగు కంఠీరవంబుల తెఱంగున, దుర్లభంబులగు శరభంబులచాడ్పునం, బ్రచండంబులగు గండభేరుండంబులగమనికం, దమతమ మొనలకుం దలకడచి వీరరసంబులు వివిధరూపంబులైనవిధంబునం బదుగురు, నూర్వురు, వేవురు గములై కులకుధర గుహాంతరంబులు నిండ సింహనాదంబు లొనర్చుచు, నార్చుచు, నట్టహాసంబులు సేయుచు, నరివీరుల రోయుచుఁ, బటహ కాహళ భేరీ శంఖ శబ్దంబులకు నుబ్బుచు, గర్వంబునం బ్రబ్బుచు, గదల వ్రేయుచుఁ, గాండంబుల నేయుచు, ముద్గరంబుల నొత్తుచు, ముసలంబుల మొత్తుచు, గుంతంబులం గ్రుచ్చి యెత్తుచుఁ, గరవాలంబులం ద్రెంచుచుఁ, జక్రంబులం ద్రుంచుచు, శస్త్రంబులం దఱుఁగుచుఁ, జిత్రంబుగఁ దిరుగుచుఁ, బరిఘంబులఁ ద్రిప్పికొట్టుచు, బ్రాసంబులం బెట్టుచు, శూలంబులఁ జిమ్ముచు, సురియలం గ్రుమ్ముచు, బహుభంగులఁ బరాక్రమించు వీరభటులును, నిబిడ నీరంధ్ర నేమినిర్ఘోషంబుల నాకాశంబు నిరవకాశంబుగ ననర్గళచక్రమార్గంబులం బడు పదాతులు చదియ నరదంబులు దోలి, వివిధాయుధప్రయోగంబుల వైరుల వ్రచ్చి, చిందఱవందఱలాడు రథికులును, రథికశరపరంపరలఁ గంపింపక మహామోఘమేఘధారలకుం జలింపని ధరణీధరంబులచాడ్పున రథంబులకుం గవిసి, కల్పాంతకాల దండిదండ ప్రచండంబులగు శుండాదండంబులు సాఁచి పూఁచి కడనొగ లొడిసి తిగిచి కుదిచి విఱిచి, కూబరములు నుఱుములుగఁ జిఱజిఱఁ ద్రిప్పివైచియు, భటులం జటులగతి బంతులక్రియ నెగురవైచి దంతంబుల గ్రుచ్చియు, ఘోటకంబుల వ్రచ్చియు విచ్చలవిడిం దిరుగుకరులును, వజ్రి వజ్రధారలకుం దప్పి కకుప్పులకు నెగయు ఱెక్కలు గల గిరుల సిరులం బక్కెరలతోడ హేషారవభీషణంబులై మనోజవంబులగు తురంగంబులం బఱపి తురంగ పద పాంసుపటల ప్రభూత బహుళాంధకారంబులు గరకలిత కఠోరఖడ్గమరీచిజాలంబుల నివారించుచు నానాప్రకారంబులం బ్రతివ్యూహంబులం జించి చెండాడు రాహుత్తులుం గలిగి సంగ్రామంబు భీమం బయ్యె నందు. 1557
క. చెడురథములుఁ దెగుహరులును, బడుకరులును మడియుభటులుఁ బఱచురుధిరమున్‌
మడియుతల లొఱగుతనువులుఁ, బొడియగుతొడవులును మధురిపునిదెసఁ గలిగెన్‌.
1558
క. భీతంబై హతసుభట, వ్రాతంబై భగ్నతురగవారణరథ సం
ఘాతంబై విజయశ్రీ, వీతంబై యదుబలంబు విఱిగె నరేంద్రా!
1559
శా. ‘యోధాగ్రేసరుఁ డీ హలాయుధుఁడు లోకోత్కృష్టబాహాబల
శ్రీధౌరేయుఁడు కృష్ణుఁ డిట్టి ఘనులం జిత్రంబు;నేఁ డిట్లు సం
రోధించెన్‌; బలముం దెరల్చె; మగధేంద్రుం’ డంచు నీక్షించుచున్‌
సౌధాగ్రంబులఁ బౌరకాంతలు మహాసంతప్తలై రెంతయున్‌.
1560
వ. ఇట్లు తన మొనలు విఱిగి పాఱినం గనుంగొని, సమరసంరంభంబున హరి విశ్వంభరాభరణవేదండ తుండాభంబులగు బాహుదండంబులు వెంచి, విజృంభించి, బ్రహ్మాండకుహర కుంభపరిస్ఫోటనం బగు పాంచజన్యనినదంబు నిబిడనిర్ఘాతశబ్దంబుగా, నుదంచితపింఛదామంబు సంక్రందనచాపంబుగాఁ, బ్రశస్తహస్త లాఘవంబున శరాకర్షణసంధానమోక్షణంబు లేర్పడక, నిర్వక్రచక్రాకారంబుతోడ మార్తాండమండల ప్రభా ప్రచండంబగు శార్‌ఙ్గకోదండంబు క్రొమ్మెఱుంగులుగా, దిగ్గజేంద్ర కర్ణభీషణంబులగు గుణఘోషణంబులు ఘుమఘుమారావదుస్సహంబు లయిన గర్జనంబులుగా, రథతురంగమరింఖాసముద్ధూతపరాగపటల పరంపరాసంపాదితపుంజీభూతంబగు పెంజీఁకటి యిరులుగా, నసమసమర సన్నాహ చాతురీ విశేషంబులకుం జొక్కి, నిక్కి కరంబు లెత్తి నర్తనంబులం బ్రవర్తించు నారదహస్తవిన్యాసంబులు లీలాతాండవ మండితమహోత్కంఠంబు లగు నీలకంఠంబులుగా, సుందరస్యందననేమినిర్ఘోషభీతులయి కుంభికుంభములపై వ్రాలు వీరులు మత్తమయూరకేకారవచకితులై యువతీకుచకుంభంబులమీఁద వ్రాలెడు కాముకులుగా, నానానరేంద్రరక్తపిపాసాపరవశంబులై వాచఱచుచున్న భూతవ్రాతంబులు వర్షవర్షేతి నిస్వనంబు లొసంగు చాతకంబులుగా, నభంగసంగరప్రేరకుండగు హలాయుధుండు వృష్టికారణంబగు మందసమీరణం బుగా, ననల్పకల్పాంతకాల నీలవలాహకంబు భాతిం బరగు మేనిచాయతోడం దోయజనాభుం డరాతిచతురంగ దేహక్షేత్రంబులం బుంఖానుపుంఖంబులుగ నసంఖ్యాతబహువిధదివ్యబాణవర్షంబు గురియునెడ శస్త్రాస్త్రపరంపరాసంఘట్టన జనితంబులగు మిడుఁగుఱులు వర్షాకాలవిహితవిద్యోతమాన ఖద్యోతంబులుగ, విశిఖవికీర్ణవీరకోటీరఘటితపద్మరాగశకలంబు లింద్రగోపంబులును, మహితమార్గణ విదళితమత్తమాతంగ కుంభమౌక్తికంబులు వడగండ్లుగఁ, జటులార్ధచంద్రశరచ్ఛిన్నచరణంబు లయి ‘కృష్ణ! కృష్ణ! నిలు నిలు’ మని పలుకుచుం గూలెడు మేనులు కృషీవలకరపరశుధారావిదళితమూల విశాలసాలంబులుగ, భాసురభల్ల భగ్నంబు లయిన వదనగహ్వరంబుల వలన డుల్లెడు దంతపుంజంబులు మాలతీకుసుమమంజరులుగ, నవ్యనారాచభిన్నదేహంబు లయి దిగ్గనఁ గ్రొగ్గండ్లవలన వెడలు రక్తస్యంద సందోహంబులతో సంచరింపక ప్రాణంబులు విడుచు శుండాలంబులు సెలయేఱులతోడి కొండలుగఁ, గఠోరకాండఖండితంబు లయిన భజాదండంబులతోడఁ గలసి పడిన వజ్రమయకంఠికాభరణంబులు భోగిభోగసమేతకేతకీకుసుమంబులుగఁ, బ్రళయార్ణవకల్లోలశబ్దసన్నిభంబు లయిన భేరీరవంబులు భీకరభేకీనికరారవంబులుగ, దారుణేషువిలూన వాహవారణమనుజమస్తిష్కంబు రొంపిగ, సొంపు మెఱయ నాభీలకీలాలప్రవాహంబులు ప్రవహించె; నందు భుజములు భుజంగంబులుగఁ గపాలంబులు కమఠంబులుగ, శిరోజంబులు శైవాలంబులుగఁ, గరంబులు మీనంబులుగ, హయంబులు నక్రంబులుగ, గజంబులు దీవులుగ, ధవళచ్ఛత్రంబులు నురువులుగఁ, జామరంబులు గలహంసంబులుగ, భూషణరత్నరేణురాసులు పులినంబులుగ నొప్పె; నప్పుడు. 1561
లయవిభాతి. హసిత హరినీలనిభ వసనము విశాలకటి నసమనయనాద్రి పరిలసిత మగు మేఘో
ల్లసనము వహింపఁ గరకిసలయము హేమమణివిసరవలయద్యుతులు దెసల తుదలందున్‌
బసలు గురియంగ సరభసమున బలుండు దరహసితము ముఖాబ్జమున నెసఁగ ఘనకాలా
యస మయ మహోగ్రతరముసలము వడిన్‌ విసరి కసిమసఁగి శత్రువుల నసువులకుఁ బాపెన్‌.
1562
లయవిభాతి. ప్రలయసమయాంతకుని చెలువునఁ గటాక్షముల నలఘుచటులాగ్నికణములు సెదరఁ గోలా
హలముగ సువర్ణమణివలయ నిచయోజ్జ్వలిత హలము వడిఁ జాచి శిరములు నురములు న్ని
ర్దలితములుగన్‌ శకలములుగ నొనరింపఁ గని బెలుకుఱి జరాసుతునిబలము రణవీథిన్‌
జలితదనుజావలికి బలికి భయభీతసురఫలికిఁ ద్రిజగచ్ఛలికి హలికిఁ దల డించెన్‌.
1563
శా. రోషోద్రేకకళాభయంకరమహారూపంబుతో నొక్కచే
నీషాదండము సాఁచి లాంగలము భూమీశోత్తమగ్రీవలన్‌
భూషల్‌ రాలఁ దగిల్చి రాఁ దిగిచి సంపూర్ణోద్ధతిన్‌ రోఁకటన్‌
వేషంబుల్‌ సెడ మొత్తె రాముఁడు రణోర్విన్‌ నెత్తురుల్‌ జొత్తిలన్‌.
1564
క. హలిహలహృతకరికుంభస్థలముక్తాఫలము లోలిఁ దనరెఁ గృషిక లాం
గల మార్గకీర్ణబీజా, వలి కైవడి నద్భుతాహవక్షేత్రమునన్‌.
1565
క. తఱిమి హలి హలము విసరుచు, నెఱిఁ గదిసిన బెగడి విమత నికరము లెడలై
వెఱఁగుపడు నొదుఁగు నడఁగును, మఱుపడుఁ జెడు మడియుఁ బొరలు మరలుం దెరలున్‌.
1566
క. హరి తిగ్మగోశతంబుల, హరిదంతర మెల్లఁ గప్పు నాకృతిఁ గడిమిన్‌
హరితిగ్మగోశతంబుల, హరిదంతర మెల్లఁ గప్పె నతిభీకరుఁడై.
1567
సీ. పదుగు రేగురు దీర్ఘబాణముల్‌ గాఁడిన గుదులు గ్రుచ్చినభంగిఁ గూలువారు
దలలు ద్రెవ్విన మున్ను దారు వీక్షించినవారల నొప్పించి వ్రాలువారు
పదములు దెగిపడ్డ బాహులఁ బోరి నిర్మూలితబాహులై మ్రొగ్గువారు
క్షతముల రుధిరంబు జల్లింప నిర్ఝరయుతశైలములభంగి నుండువారు
 
ఆ. భ్రాతృ పుత్త్ర మిత్ర బంధువుల్‌ వీఁగిన, నడ్డ మరుగుదెంచి యణఁగువారు
వాహనములు దెగిన వడి నన్యవాహనా, ధిష్ఠు లగుచు నెదిరి త్రెళ్ళువారు.
1568
వ. మఱియును. 1569
శా. ఈ కాయంబులఁ బాసినంతటనె మా కెగ్గేమి? జేతృత్వమున్‌
నీకుం జెల్లదు కృష్ణ! నిర్జరులమై నిన్నోర్తు మామీఁదటన్‌
వైకుంఠంబున నంచుఁ బల్కుక్రియ దుర్వారాస్త్రభిన్నాంగులై
యాకంపింపక కొంద ఱాడుదురు గర్వాలాపముల్‌ కృష్ణునిన్‌.
1570
వ. ఇ వ్విధంబున. 1571
క. జగదీశ! యేమి సెప్పుదు?, నగణితలయవార్ధిభయదమై మూఁగిన య
మ్మగధేశుబలము నెల్లను, దెగఁ జూచిరి హరియు హలియుఁ దీవ్రక్రీడన్‌.
1572
క. భువనభవస్థితివిలయము, లవలీలం జేయుహరికి నరినాశన మెం
త విషయమైన మనుజుఁడై, భవ మొందుటఁ జేసి పొగడఁబడియెం గృతులన్‌.
1573
వ. ఆ సమయంబున. 1574
శా. అంహఃకర్ములు తల్లడిల్ల భయదాహంకారుఁడై సీరి దో
రంహం బొప్ప హలాహతిన్‌ రథధనూరథ్యంబులం గూల్చి త
త్సంహారస్పృహఁ జొచ్చి పట్టెను జరాసంధున్‌ మదాంధున్‌ మహా
సింహంబుం బ్రతిసింహముఖ్యము బలశ్రీఁ బట్టు నేర్పేర్పడన్‌.
1575
వ. ఇట్లు పట్టుకొని. 1576
ఉ. కుంఠితులై పరుల్‌ బెగడ ఘోరబలుండు బలుండు వాని సో
ల్లుంఠము లాడుచున్‌ దిగిచి లోకభయంకరమైనముష్టిచేఁ
గంఠగతాసుఁ జేసి తమకంబున మొత్తఁగ భూభరక్షయో
త్కంఠుఁడు చక్రి మీఁ దెఱిఁగి కార్యము గల్దని మాన్పి యిట్లనున్‌.
1577
శా. దుఃఖింపం బనిలేదు; పొమ్ము; బలసందోహంబులం దెమ్ము; చే
తఃఖేదం బెడలంగ రమ్ము; రిపులం దండింపు; కాదేని భూ
స్వఃఖేలజ్జన మెల్ల మెచ్చ నృప! నీ శౌర్యోన్నతుల్‌ సూపి మే
దఃఖండంబులు భూతముల్‌ దినఁ దనుత్యాగంబు సేయం దగున్‌.
1578
వ. అని నగుచు విడిపించిన, చిడిముడికి నగ్గలం బయిన సిగ్గున మ్రగ్గి నెమ్మొగంబు సూపక, కోప కపట భావంబులు మనంబునం బెనంగొనఁ దపంబు చేసియైన వీరలం జయించెద నని, పలాయితులైన రాజులం గూడుకొనుచు జరాసంధుఁడు విఱిగి చనియె; సురలు గుసుమవర్షంబులు గురియ హలియు హరియును మథురానగరజనవందిమాగధజేగీయమానులై వీణావేణుమృదంగశంఖదుందుభినినదంబు లాకర్ణించుచు, మృగమదజలసిక్తవిమలవీథికాశతంబును, వివిధవిచిత్రకేతనాద్యలంకృతంబును, సువర్ణమణిమయజయస్తంభ నిబద్ధతోరణసంయుతంబును, వేదనాదనినాదితంబును, సంతుష్టజన సంకులగోపురంబును నైన పురంబును బ్రవేశించి రందు. 1579
ఉ. వెల్లువలైన వైరినృపవీరుల నెల్ల జయించి వీటికిన్‌
బల్లిదులైన కృష్ణబలభద్రులు వచ్చుచు నున్నవారు రం;
డుల్లములారఁ జూత మని యున్నతసౌధము లెక్కి వారిపైఁ
బల్లవపుష్పలాజములు పౌరపురంధ్రులు సల్లి రెల్లెడన్‌.
1580
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )