పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
కాల యవనుండు శ్రీకృష్ణుని మీఁద దండెత్తి మథురాపురమును ముట్టడి వేయుట
వ. ఇట్లు పురంబు ప్రవేశించి యుద్ధప్రకారం బెల్ల నుగ్రసేనున కెఱింగించి కృష్ణుం డిచ్ఛావిహారంబుల నుండె; మఱియు నెక్కువమత్సరంబున నమ్మాగధుండు మహీమండలంబునం గల దుష్టమహీపతుల నెల్లం గూడికొని సప్తదశవారంబులు సప్తదశాక్షౌహిణీబలసమేతుండై మథురానగరంబుపై విడిసి, మాధవభుజా ప్రకారరక్షితు లగు యాదవులతోడ నాలంబు సేసి, నిర్మూలితబలుండై పోయి క్రమ్మఱ నష్టాదశయుద్ధంబునకు వచ్చునెడం గలహవిద్యావిశారదుం డగు నారదుండు కాలయవను కడకుం జని యిట్లనియె. 1581
మ. యవనా! నీవు సమస్తభూపతుల బాహాఖర్వగర్వోన్నతిం
బవనుం డభ్రములన్‌ హరించుపగిదిన్‌ భంజించియు న్నేల యా
దవులన్‌ గెల్వవు? వారలన్‌ మఱచియో? దర్పంబు లేకుండియో?
యవివేకస్థితి నొందియో? వెఱచియో? హైన్యంబునుం జెందియో?
1582
క. యాదవులలోన నొక్కఁడు, మేదినిపై సత్త్వరేఖ మెఱసి జరాసం
ధాదులఁ దూలన్‌ దోలెన్‌, దాదృశుఁ డిల లేఁడు విననె తత్కర్మంబుల్‌.
1583
వ. అనిన విని, కాలయవనుం డిట్లనియె. 1584
శా. ఏమీ! నారద! నీవు చెప్పిననరుం డే రూపువాఁ? డెంతవాఁ?
డే మేరన్‌ విహరించు? నెవ్వఁడు సఖుం? డెందుండు? నేపాటి దో
స్సామర్థ్యంబునఁ గయ్యముల్‌ సలుపు? నస్మద్బాహుశౌర్యంబు సం
గ్రామక్షోణి భరించి నిల్వఁగలఁడే? గర్వాఢ్యుఁడే? చెప్పుమా!
1585
వ. అనిన విని, దేవముని యిట్లనియె. 1586
సీ. నీలజీమూతసన్నిభశరీరమువాఁడు తామరసాభనేత్రములవాఁడు
పూర్ణేందుబింబంబుఁ బోలెడి మోమువాఁ డున్నతదీర్ఘబాహువులవాఁడు
శ్రీవత్సలాంఛనాంచితమహోరమువాఁడు కౌస్తుభమణిపదకంబువాఁడు
శ్రీకర పీతకౌశేయచేలమువాఁడు మకరకుండలదీప్తి మలయువాఁడు
 
తే. రాజ! యింతంతవాఁ డనరానివాఁడు, మెఱసి దిక్కుల నెల్లను మెఱయువాఁడు
తెలిసి యే వేళ లందై నఁ దిరుగువాఁడు, పట్టనేర్చినఁ గాని లోఁబడనివాఁడు.
1587
వ. అని మఱియు నతనిలక్షణంబులు చెప్పిన విని, సరకుసేయక యవనుం డిట్లనియె. 1588
ఉ. యాదవుఁ డెంతవాఁడు ప్రళయాంతకుఁ డైన నెదిర్చె నేనియున్‌
గాదనఁ బోర మత్కలహకర్కశబాహుధనుర్విముక్త నా
నా దృఢహేమపుంఖకఠినజ్వలదస్త్రపరంపరాసము
త్పాదితవహ్నికీలముల భస్మముఁ జేసెదఁ దాపసోత్తమా!
1589
వ. అని పలికి కాలయవనుండు మూఁడుకోట్లమ్లేచ్ఛవీరులం గూడుకొని, శీఘ్రగమనంబున దాడివెడలి, మథురాపురంబుమీఁద విడిసినం జూచి, బలభద్రసహితుం డయి కృష్ణుం డిట్లని వితర్కించె. 1590
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )