| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| సీ. |
యవనుండు పురమెల్ల నావరించెను నేఁటి యెల్లింటిలోపల నీ నడుమను మాగధుండును వచ్చి మనమీఁద విడియును యవనమాగధులు మహాప్రబలులు పురి రెండువంకలఁ బోరుదు రట్టిచో నోపినభంగి నొక్కొక్కచోట మనము యుద్ధము సేయ మఱియొక్కఁ డెడసొచ్చి బంధుల నందఱఁ బట్టి చంపు |
|
| తే. |
నొండెఁ గొనిపోయి చెఱఁబెట్టు నుగ్రకర్ముఁ, డైన మాగధుఁ; డదిగాన నరివరులకు విడియఁ బోరాడఁగా రాని విషమభూమి, నొక్కదుర్గంబు సేసి యం దునుపవలయు. |
1591 |
| వ. | అని వితర్కించి సముద్రు నడిగి సముద్రమధ్యంబునఁ బండ్రెండుయోజనంబుల నిడుపు, నంతియ వెడల్పుం గల దుర్గమప్రదేశంబు సంపాదించి, తన్మధ్యంబునం గృష్ణుండు సర్వాశ్చర్యకరంబుగ నొక్క నగరంబు నిర్మింపు మని విశ్వకర్మం బంచిన. | 1592 |
| ఆ. |
వరుణపురముకంటె వాసవుపురికంటె, ధనదువీటికంటె దండధరుని నగరికంటె బ్రహ్మనగరంబుకంటెఁ బ్ర, స్ఫుటముగాఁగ నొక్కపురముఁ జేసె. |
1593 |
| వ. | అందు. | 1594 |
| క. |
ఆకసముతోడిచూ లనఁ, బ్రాకారము పొడవు గలదు పాతాళమహా లోకముకంటెను లోఁతెం, తో కల దా పరిఖ యెఱుఁగ దొరక దొకరికిన్. |
1595 |
| క. |
కోటయు మిన్నును దమలోఁ, బాటికి జగడింప నడ్డపడి నిల్చిన వా చాటులరుచిఁ దారకములు, కూటువలై కోటతుదలఁ గొమరారుఁ బురిన్. |
1596 |
| శా. |
సాధుద్వారకవాటకుడ్యవలభిస్తంభార్గళాగేహళీ వీథీవేదిగవాక్షచత్వరసభావేశ్మప్రఘాణప్రపా సౌధాట్టాలక సాల హర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్యస్థితి నొప్పుఁ గాంచనమణి స్నిగ్ధంబులై య ప్పురిన్. |
1597 |
| క. |
కూడి గ్రహంబులు దిరుగఁగ, మేడలతుది నిలువులందు మెలఁగెడిబాలల్ క్రీడింపరు పురుషులతో, వ్రీడం దద్వేళలందు విను మా వీటన్. |
1598 |
| ఉ. |
ఆయతవజ్రనీలమణిహాటకనిర్మిత హర్మ్యసౌధ వా తాయనరంధ్రనిర్యదసితాభమహాగరుధూపధూమముల్ తోయదపంక్తులో యనుచుఁ దుంగమహీరుహరమ్యశాఖలం జేయుచు నుండుఁ దాండవవిశేషము లప్పురిఁ గేకిసంఘముల్. |
1599 |
| ఆ. |
సరస నడచుచుండి సౌధాగ్రహేమ కుం, భములలోన నినుఁడు ప్రతిఫలింప నేర్పరింపలేక యినులు పెక్కం డ్రంచుఁ, బ్రజలు సూచి చోద్యపడుదు రందు. |
1600 |
| ఉ. |
శ్రీరమణీయగంధములఁ జెన్ను వహించుఁ బురీవనంబులం గోరక జాలకస్తబకకుట్మలపుష్పమరందపూర వి స్ఫారలతాప్రకాండవిటపచ్ఛదపల్లవవల్లరీశిఫా సారపరాగమూల ఫలసంభృతవృక్షలతావిశేషముల్. |
1601 |
| క. |
శ్రీకరములు జనహృదయ వ, శీకరములు మందపవనశీర్ణమహాంభ శ్శీకరములు హంసవిహం, గాకరములు నగరికువలయాబ్జాకరముల్. |
1602 |
| క. |
నవకుసుమామోదభరా, జవనము రతిఖిన్నదేహజస్వేదాంభో లవనము సమధిగతవనము, పవనము విహరించుఁ బౌరభవనములందున్. |
1603 |
| క. |
బ్రహ్మత్వము లఘువగు నని, బ్రహ్మయు బిరుదులకు వచ్చి పట్టఁడుగా కా బ్రహ్మాదికళలఁ దత్పురి, బ్రహ్మజనుల్ బ్రహ్మఁ జిక్కుపఱుపరె చర్చన్. |
1604 |
| క. |
నగరీభూసురకృత లస, దగణితమఖధూమపిహితమై కాక మహా గగనము నీలం బగునే?, మిగులఁగ బెడఁగగునె గ్రహసమృద్ధం బయ్యున్. |
1605 |
| క. |
తిరుగరు పలు కర్థులకును, సురుఁగరు ధన మిత్తు రితరసుదతీమణులన్ మరగరు రణమునఁ బిఱిఁదికి, నరుగరు రాజన్యతనయు లా నగరమునన్. |
1606 |
| క. |
రత్నాకరమై జలనిధి, రత్నము లీ నేర దేటి రత్నాకరమో? రత్నములఁ గొనుదు రిత్తురు, రత్నాకరజయులు వైశ్యరత్నములు పురిన్. |
1607 |
| క. |
తుంగంబులు కరహతగిరి, శృంగంబులు దానజలవశీకృతభృంగీ భృంగంబులు పటుశైల స, మాంగంబులు నగరి మత్తమాతంగంబుల్. |
1608 |
| క. |
ప్రియములు జితపవన మనో, రయములు కృతజయము లధికరమణీయ గుణా న్వయములు సవినయములు ని, ర్భయములు హతరిపు చయములు పట్టణహయముల్. |
1609 |
| క. |
పులుల పగిదిఁ గంఠీరవ, ముల క్రియ శరభముల మాడ్కి ముదిత మదేభం బుల తెఱఁగున నానావిధ, కలహమహోద్భటులు భటులు గల రా వీటన్. |
1610 |
| క. |
ఆ వీట నుండువారికి, భావింపఁగ లేవు క్షుత్పిపాసాదులు త ద్గోవింద కృపావశమున, దేవప్రతిమాను లగుచు దీపింతు రిలన్. |
1611 |
| సీ. |
ఆసక్తి కృష్ణముఖావలోకనమంద హరిపాదసేవనమంద చింత వెఱపు నారాయణవిముఖకార్యములంద పారవశ్యము విష్ణుభక్తియంద బాష్పనిర్గతి చక్రిపద్యసంస్తుతులంద పక్షపాతము శార్‌ఙ్గిభక్తులంద లేమి గోవిందాన్యలీలాచరణమంద శ్రమము గోవిందపూజనములంద |
|
| తే. |
బంధ మచ్యుతేతరదుష్టపథములంద, జ్వరము మాధవవిరహితక్షణములంద మచ్చరము లీశకైంకర్యమతములంద, నరవరోత్తమ! వినుము తన్నాగరులకు. |
1612 |
| వ. | మఱియు న ప్పురవరంబున హరికిం బారిజాతమహీజంబును సుధర్మ యనియెడి దేవసభయును దేవేంద్రుం డిచ్చె. కర్ణైకదేశంబుల నలుపు గలిగి మనోజవంబులును, శుక్లవర్ణంబులు నైన తురంగంబుల వరుణుం డొసంగె. మత్స్య కూర్మ పద్మ మహాపద్మ శంఖ ముకుంద కచ్ఛప నీలంబులను నెనిమిది నిధులఁ గుబేరుండు సమర్పించె. నిజాధికారసిద్ధికొఱకుఁ దక్కిన లోకపాలకులును దొల్లి తమకు భగవత్కరుణా కటాక్షవీక్షణంబుల సంభవించిన సర్వసంపదల మరల నతిభక్తితో సమర్పించి రివ్విధంబున. | 1613 |
| క. |
దర్పించి చేసి పురము స, మర్పించెను విశ్వకర్మ మంగళగుణ సం తర్పితగహ్వరికిన్ గురు, దర్పితదుఃఖప్రవాహతరికిన్ హరికిన్. |
1614 |
| వ. | ఇట్లు విశ్వకర్మనిర్మితంబైన ద్వారకానగరంబునకు నిజయోగప్రభావంబున మథురాపురజనుల నందఱఁ జేర్చి, బలభద్రున కెఱింగించి తదనుమతంబున నందనవనమునిర్గమించు పూర్వదిగ్గజంబు పెంపున, మేరుగిరిగహ్వరంబువెలువడు కంఠీరవంబుతెఱంగున, హరిహయదిగంతరాళంబున నుదయించు నంధకారపరిపంథికైవడి మథురానగరంబు వెలువడి నిరాయుధుండై యెదురు వచ్చుచున్న హరిం గని. | 1615 |