| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| మ. |
కరిసంఘంబులు లేవు; రావు తురగౌఘంబుల్; రథవ్రాతముల్ పరిసర్పింపవు; రారు శూరులు; ధనుర్బాణాసిముఖ్యాయుధో త్కరముం బట్టఁడు; శక్రచాపయుతమేఘస్ఫూర్తితో మాలికా ధరుఁ డొక్కం డదె నిర్గమించె నగరద్వారంబునం గంటిరే? |
1616 |
| శా. |
ఎన్నే నయ్యె దినంబు లీ నగరిపై నేతెంచి పోరాటకున్ ము న్నెవ్వండును రాఁడు వీఁడొకఁడు నిర్ముక్తాయుధుం డేగు దెం చె న్న న్నోర్వఁగనో ప్రియోక్తులకునో శ్రీఁ గోరియో చూడుఁ డం చు న్నాత్మీయజనంబుతోడ యవనేశుం డిట్లు తర్కింపఁగన్. |
1617 |
| క. |
విభులగు బ్రహ్మప్రముఖుల, కభిముఖుఁడై నడవకుండునట్టి గుణాఢ్యుం డిభరాజగమన మొప్పఁగ, నభిముఖుఁడై నడచెఁ గాలయవనున కధిపా! |
1618 |
| వ. | ఆ సమయంబున న య్యాదవేంద్రు నేర్పడం జూచి. | 1619 |
| మ. |
‘వనజాతాక్షుఁడు సింహమధ్యుఁడు రమావక్షుండు శ్రీవత్సలాం ఛనుఁ డంభోధరదేహుఁ డిందుముఖుఁ డంచద్దీర్ఘబాహుండు స ద్వనమాలాంగదహారకంకణసముద్యత్కుండలుం డీతఁ డా ముని సూచించిన వీరుఁడౌ’ ననుచు న మ్మూఢుండు గాఢోద్ధతిన్. |
1620 |
| సీ. |
చటులవాలాభీలసైంహికేయునిభంగి లాలితేతరజటాలతిక దూలఁ బ్రళయావసరబృహద్భానుహేతిద్యుతిఁ బరుషారుణశ్మశ్రుపటలి వ్రేలఁ గాదంబినీఛన్నకాంచనగిరిభాతిఁ గవచసంవృతదీర్ఘకాయ మమర వల్మీకసుప్తదుర్వారాహికైవడిఁ గోశంబులో వాలు కొమరు మిగుల |
|
| ఆ. |
నార్చి పేర్చి మించి యశ్వంబు గదలించి, గమలసంభవాదిఘనులకైనఁ బట్టరాని ప్రోడఁ బట్టెద నని జగ, దవనుఁ బట్టఁ గదిసె యవనుఁ డధిప! |
1621 |
| క. |
ఇటు దన్నుఁ బట్టవచ్చినఁ, బటుతరజవరేఖ మెఱసి పట్టువడక ది క్తటము లదర హరి వాఱెం, జటులగతిన్, వాఁడు దోడఁ జనుదేరంగన్. |
1622 |
| వ. | అప్పుడు కాలయవనుం డిట్లనియె. | 1623 |
| మ. |
యదువంశోత్తమ! పోకు పోకు రణ మీ నర్హంబు; గంసాదులన్ గదనక్షోణి జయించి తీ వని సమిత్కామంబునన్ వచ్చితిన్; విదితఖ్యాతులు వీటిఁ బోవ నరికిన్ వెన్నిచ్చి యి బ్భంగి నే గుదురే రాజులు? రాజమాత్రుఁడవె? వైగుణ్యంబు వచ్చుం జుమీ! |
1624 |
| మ. |
బలిమిన్ మాధవ! నేఁడు నిన్ను భువనప్రఖ్యాతిగాఁ బట్టుదున్ జలముల్ సొచ్చిన, భూమిక్రిందఁ జనినన్, శైలంబుపై నెక్కినన్ బలిదండన్ విలసించినన్ వికృతరూపంబుం బ్రవేశించినన్ జలధిన్ దాఁటిన నగ్రజన్మహలికాశ్వాటాకృతుల్ దాల్చినన్. |
1625 |
| వ. | అదియునుం గాక. | 1626 |
| మ. |
శరముల్ దూఱవు; మద్ధనుర్గుణలతాశబ్దంబు లేతేర వా హరిరింఖోద్ధతధూళి గప్ప; దకటా! హాస్యుండవై పాఱె; దు ర్వరపై నే క్రియఁ బోరితో కదిసి మున్ వాతాశితోఁ గేశితోఁ గరితో మల్లురతో జరాతనయుతోఁ గంసావనీనాథుతోన్. |
1627 |
| వ. | అని పలుకుచుఁ గాలయవనుండు వెంట నరుగుదేర సరకుసేయక మందహాసంబు ముఖారవిందం బునకు సౌందర్యంబు నొసంగ ‘వేగిరపడకు; రమ్ము ర’ మ్మనుచు హరియును. | 1628 |
| సీ. |
‘అదె యిదె లోఁబడె’ నని పట్టవచ్చినఁ గుప్పించి లంఘించుఁ గొంతతడవు పట్టరా; దీతని పరు వగ్గలం’ బని భావింపఁగా సమీపమున నిలుచు నడరి పార్శ్వంబుల కడ్డంబు వచ్చినఁ గేడించి యిట్టట్టు గికురువెట్టు వల్మీకతరుసరోవరము లడ్డంబైన సవ్యాపసవ్యసంచరతఁ జూపుఁ |
|
| తే. |
బల్లముల డాఁగు దిబ్బల బయలుపడును, నీడలకుఁ బోవు నిఱుముల నిగిడి తాఱు నన్నుఁ బట్టిన నీవు మానవుఁడ’ వనుచు, యవనుఁ డెగువంగ బహుజగదవనుఁ డపుడు! |
1629 |
| వ. | మఱియును. | 1630 |
| సీ. |
సకలభూతవ్రాతసంవాసుఁ డయ్యును వనములు నగములు వరుస దాఁటు లోకోన్నతుండును లోకచక్షుఁడు నయ్యు మాటిమాటికి నిక్కి మగిడి చూచుఁ బక్షవిపక్షసంబంధశూన్యుం డయ్యుఁ, దను విపక్షుఁడు వెంటఁ దగుల నిగుడు విజయాపజయభావవిరహితుం డయ్యుఁ దా నపజయంబును జెందినట్లు తోఁచు |
|
| ఆ. |
నభయభయవిహీనుఁ డయ్యు భీతునిమాడ్కిఁ, గానఁబడును సర్వకాలరూపుఁ డయ్యుఁ గాలచకితుఁడైన కైవడి వన, మాలి పఱచు వెఱపుమాలి యధిప! |
1631 |
| వ. | ఇ వ్విధంబున. | 1632 |
| క. |
దారితశాత్రవభవను న, పారమహావేగవిజితపవనున్ యవనున్ దూరము గొని చని కృష్ణుఁడు, ఘోరంబగు నొక్క శైలగుహ వడిఁ జొచ్చెన్. |
1633 |
| క. |
అదె లోఁబడె నిదె లోఁబడె, నదె యిదె పట్టెద నటంచు నాశావశుఁడై యదుసింహునిపదపద్ధతి, వదలక గిరిగహ్వరంబు వాఁడుం జొచ్చెన్. |
1634 |
| వ. | ఇట్లు సొచ్చి మూఢహృదయంబునుం బోలెఁ దమఃపూర్ణంబయిన గుహాంతరాళంబున దీర్ఘతల్ప నిద్రితుండై గుఱకపెట్టుచున్న ఒక మహాపురుషునిం గని శ్రీహరిగాఁ దలంచి. | 1635 |
| ఉ. |
ఆలము సేయలేక పురుషాధమ! దుర్లభకంటకద్రుమా భీలమహాశిలాసహితభీకరకుంజరఖడ్గసింహ శా ర్దూలతరక్షుసంకలితదుర్గపథంబునఁ బాఱుతెంచి యీ శైలగుహన్ సనిద్రుక్రియఁ జాఁగి నటించినఁ బోవనిత్తునే? |
1636 |
| క. |
ఎక్కడ నెవ్వారలకును, జిక్క వనుచు నారదుండు సెప్పెను నాకుం జిక్కితి వెక్కడఁ బోయెదు?, నిక్కముగా నిద్రపుత్తు ని న్నీకొండన్. |
1637 |
| ఆ. |
అనుచు యవనుఁ డట్టహాసంబు గావించి, చటులకఠినకులిశసదృశమైన పాదమెత్తి తన్నెఁ బాఱి తద్దేహంబు, నగగుహం బ్రతిస్వనంబు నిగుడ. |
1638 |
| ఉ. |
తన్నిన లేచి నీల్గి కనుఁదమ్ములు మెల్లన విచ్చి లోపలన్ సన్నపుఁ గిన్క వర్ధిల దిశల్ గని దృష్టిసమిద్ధవిగ్రహో త్పన్నమహాగ్నికీలముల భస్మముసేసె నతండు సాయక చ్ఛిన్నవిరోధికంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్. |
1639 |
| వ. | ఇట్లేకక్షణమాత్రంబున యవనుండు ‘నీఱయ్యె’ ననిన విని రా జిట్లనియె. | 1640 |