| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| ఆ. |
‘ఎవ్వఁ డాతఁ? డితని కెవ్వండు దండ్రి ఘో, రాద్రిగుహకు నేటి కతఁడు వచ్చి నిద్రవోయె? యవను నిటు గాల్ప నెట్లోపెఁ?, దెలియఁ బలుకు నాకు ధీవరేణ్య!’ |
1641 |
| వ. | అనినం బరీక్షిన్నరేంద్రునకు నతికుతూహలంబుతో శుకయోగివర్యుం డిట్లనియె; నిక్ష్వాకుకుల సంభవుండు మాంధాతకొడుకు ముచుకుందుం డను రాజు రాక్షసభీతులైన వేల్పులం బెద్దకాలంబుసంరక్షించిన మెచ్చి, వా రమరలోకరక్షకుండైన యా రాజకుమారునికడం జేరి వరంబు వేఁడు మనిన వారలం గనుంగొని, మోక్షపదం బడిగిన వార లతని కిట్లనిరి. | 1642 |
| మ. |
జగతి న్నిర్గతకంటకం బయిన రాజ్యంబున్ విసర్జించి శూ ర గణాగ్రేసర! పెద్దకాలము మమున్ రక్షించితీ; లోన నీ మగువల్ మిత్రులు బంధులున్ సుతులు సంబంధుల్ భువిన్ లేరు, కా ల గతిం జెందిరి; కాల మెవ్వరికి దుర్లంఘ్యంబు దా నారయన్. |
1643 |
| క. |
కాలము ప్రబలులకును బలి, కాలాత్ముం డీశ్వరుం డగణ్యుఁడు జనులం గాలవశులుగాఁ జేయును, గాలము గడవంగలేరు ఘను లెవ్వారున్. |
1644 |
| క. |
వర మిచ్చెద మర్థింపుము, ధరణీశ్వర! మోక్షపదవి దక్కను మే మె వ్వరమును విభులము గా మీ, శ్వరుఁడగు హరి దక్క మోక్షసంగతిఁ జేయన్. |
1645 |
| వ. | అని పలికిన దేవతలకు నమస్కరించి, ముచుకుందుండు నిద్రం గోరి దేవదత్తనిద్రావశుండై పర్వతగుహాంతరాళంబున శయనించి యుండె; యవనుండు నీఱైన పిమ్మట, హరి ముచుకుందునిముందట నిల్చిన. | 1646 |
| సీ. |
వనరుహలోచను వైజయంతీదామశోభితు రాకేందుసుందరాస్యు మకరకుండలకాంతిమహితగండస్థలుఁ గౌస్తుభాలంకృతు ఘనశరీరు శ్రీవత్సలాంఛనాంచితవక్షు మృగరాజమధ్యుఁ జతుర్బాహు మందహాసు గాంచనసన్నిభకౌశేయవాసు గాంభీర్యసౌందర్యశోభితుఁ బ్రసన్ను |
|
| ఆ. |
న మ్మహాత్ముఁ జూచి యాశ్చర్యమును బొంది, తన్మనోజ్ఞదీప్తి దనకుఁ జూడ నలవిగాక చకితుఁడై యెట్టకేలకుఁ, బలికెఁ బ్రీతి నవనిపాలకుండు. |
1647 |
| మ. |
శశివో? యింద్రుఁడవో? విభావసుఁడవో?చండప్రభారాశివో? శశిచూడామణివో? పితామహుఁడవో? చక్రాంకహస్తుండవో? దిశలున్ భూమియు మిన్ను నిండె నిదె నీతేజంబుఁ జూడంగ దు ర్వశమై; యెవ్వఁడ? వేల వచ్చి తిచటన్ వర్తించె దేకాకివై? |
1648 |
| క. |
ఈ యడవి విషమకంటక, భూయిష్ఠము ఘోరసత్త్వపుంజాలభ్యం బో యయ్య? యెట్లు వచ్చితి?, నీ యడుగులు కమలపత్త్రనిభములు సూడన్. |
1649 |
| వ. | మహాత్మా! యేను నీకు శుశ్రూషణంబు సేయం గోరెద; నీ జన్మగోత్రంబు లే నెఱుంగ నర్హుండనేని నెఱింగింపుము; నే నిక్ష్వాకువంశసంభవుండ; మాంధాతృనందనుండ; ముచుకుందుం డనువాఁడ; దేవహితార్థంబు చిరకాలజాగరశ్రాంతుండ నయి నిద్ర నొంది యింద్రియసంచారంబులు మఱచి. | 1650 |
| శా. |
ఏ నిద్రించుచు నుండ నొక్క మనుజుం డేతెంచి దుష్కర్ముఁడై తా నీఱై చెడె నాత్మకిల్బిషమునన్ దర్పోగ్రుఁడై; యంతటన్ శ్రీనాథాకృతివైన నిన్నుఁ గని వీక్షింప న్నశక్తుండనై దీనత్వంబును జెందితిన్; ననుఁ గృపాదృష్టిన్ విలోకింపవే. |
1651 |
| వ. | అనిన విని మేఘగంభీరభాషణంబుల హరి యిట్లనియె. | 1652 |
| సీ. |
భూరజంబులనైన భూనాథ! యెన్నంగఁ జనుఁగాని; నా గుణజన్మకర్మ నామంబు లెల్ల నెన్నంగ నెవ్వరుఁ జాల రది యేల? నాకును నలవిగాదు నేలకు వ్రేఁగైన నిఖిలరాక్షసులను నిర్జించి ధర్మంబు నిలువఁబెట్ట బ్రహ్మచే మున్ను నేఁ బ్రార్థింపఁబడి వసుదేవునింటను వాసుదేవుఁ డనఁగఁ |
|
| ఆ. |
గరుణ నవతరించి కంసాఖ్యతో నున్న, కాలనేమిఁ జంపి ఖలుల మఱియుఁ ద్రుంచుచున్నవాఁడఁ దొడరి నీ చూడ్కి నీ, ఱైనవాఁడు కాలయవనుఁ డనఘ! |
1653 |
| వ. | వినుము; తొల్లియు నీవు నన్ను సేవించినకతంబున ని న్ననుగ్రహింప నీ శైలగుహకు నేతెంచితి; నభీష్టంబు లయిన వరంబు లడుగు మిచ్చెద. మద్భక్తులగుజనులు క్రమ్మఱ శోకంబున కర్హులు గా రనిన హరికి ముచుకుందుండు నమస్కరించి, నారాయణదేవుం డగుట యెఱింగి, యిరువదియెనిమిదవ మహాయుగంబునందు నారాయణుం డవతరించు నని మున్ను గర్గుండు చెప్పుటఁ దలంచి. | 1654 |