| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| క. |
నీ మాయఁ జిక్కి పురుష, స్త్రీమూర్తికజనము నిన్ను సేవింపదు; వి త్తామయగృహగతమై సుఖ, తామసమై కామవంచితం బయి యీశా! |
1655 |
| ఉ. |
పూని యనేకజన్మములఁ బొంది తుదిం దన పుణ్యకర్మ సం తానముపేర్మిఁ గర్మవసుధాస్థలిఁ బుట్టి ప్రపూర్ణదేహుఁడై మానవుఁడై గృహేచ్ఛఁ బడు మందుఁ డజంబు తృణాభిలాషియై కానకపోయి నూతఁ బడు కైవడి నీ పదభక్తిహీనుఁడై. |
1656 |
| క. |
తరుణీపుత్త్రధనాదుల, మరగి మహారాజ్యవిభవమదమత్తుఁడనై నరతనులుబ్ధుఁడ నగు నా, కరయఁగ బహుకాల మీశ! యాఱడిఁబోయెన్. |
1657 |
| క. |
ఘటకుడ్యసన్నిభం బగు, చటులకళేబరముఁ జొచ్చి జనపతి నంచుం బటుచతురంగంబులతో, నిటు నటుఁ దిరుగుదును నిన్ను నెఱుఁగక యీశా! |
1658 |
| ఆ. |
వివిధకామభోగవిషయలాలసు మత్తు, నప్రమత్తవృత్తి నంతకుండ వైన నీవు వేళ యరసి త్రుంతువు సర్ప, మొదిఁగి మూషికంబు నొడియు నట్లు. |
1659 |
| క. |
నరవర సంజ్ఞితమై రథ, కరిసేవితమైన యొడలు కాలగతిన్ భీ కర మృగ భక్షితమై దు, స్తర విట్క్రిమి భస్మసంజ్ఞితం బగు నీశా! |
1660 |
| ఆ. |
సకలదిశలు గెలిచి సములు వర్ణింపంగఁ, జారుపీఠ మెక్కి సార్వభౌముఁ డైన సతులగృహములందుఁ గ్రీడాభోగ, వృత్తినుండు; నిన్ను వెదకలేఁడు. |
1661 |
| ఆ. |
మానసంబుఁ గట్టి మహితభోగంబులు, మాని యింద్రియముల మదము లడఁచి తపము సేసి యింద్రతయుఁ గోరుఁ గాని నీ, యమృతపదము గోరఁ డజ్ఞుఁ డీశ! |
1662 |
| సీ. |
సంసారియై యున్నజనునకు నీశ్వర! నీకృప యెప్పుడు నెఱయఁ గల్గు నప్పుడు బంధంబు లన్నియుఁ దెగిపోవు; బంధమోక్షంబైనఁ బ్రాప్త మగును సత్సంగమంబు; సత్సంగమంబున నీదు భక్తి సిద్ధించు;నీభక్తివలన సన్ముక్తి యగు; నాకు సత్సంగమునకంటె మును రాజ్యబంధనిర్మూలనంబు |
|
| తే. |
గలిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?, కృష్ణ! నీ సేవ గాని తక్కినవి వలదు ముక్తిసంధాయి వగు నిన్ను ముట్టఁ గొలిచి, యాత్మబంధంబు గోరునే యార్యుఁ డెందు? |
1663 |
| వ. | కావున రజస్సత్త్వతమోగుణంబులయనుబంధంబు లగు నైశ్వర్యశత్రుమరణధర్మాదివిశేషంబులు విడిచి, యీశ్వరుండును, విజ్ఞానఘనుండును, నిరంజనుండును, నిర్గుణుండును, నద్వయుండును నైన పరమపురుషుని నిన్నాశ్రయించెదఁ; జిరకాలంబు గర్మఫలంబులచేత నార్తుండనై క్రమ్మఱం దద్వాసనల సంతప్తుండనై తృష్ణం బాయక శత్రువులైన యింద్రియంబు లాఱింటిని గెలువలేని నాకు శాంతి యెక్కడిది? విపన్నుండ నైన నన్ను నిర్భయుం జేసి ‘రక్షింపు’ మనిన ముచుకుందునికి హరి యిట్లనియె. | 1664 |
| ఉ. |
మంచిది నీదు బుద్ధి నృపమండన! నీవు పరార్థ మెట్లు వ ర్తించిన నైనఁ గోరికల దిక్కునఁ జిక్కవు మేలు; నిర్మలో దంచితవృత్తి నన్ గొలుచు ధన్యు లబద్ధులు నెట్లు నీకు ని శ్చంచలభక్తి గల్గెడిని సర్వము నేలుము మాననేటికిన్. |
1665 |
| వ. | ‘నరేంద్రా! నీవు తొల్లి క్షత్త్రధర్మంబున నిలిచి, మృగయావినోదంబుల జంతువుల వధియించినాఁడవు; తపంబునఁ దత్కర్మవిముక్తుండవై తర్వాతిజన్మంబున సర్వభూతసఖిత్వంబు గలిగి, బ్రాహ్మణశ్రేష్ఠుండవై నన్నుం జేరెద’ వని వీడ్కొలిపిన హరికిం బ్రదక్షిణంబు వచ్చి నమస్కరించి గుహ వెడలి సూక్ష్మప్రమాణ దేహంబులతో నున్న మనుష్యపశువృక్షలతాదులం గని కలియుగంబు ప్రాప్తంబగు నని తలంచి, యుత్తరాభిముఖుండై తపోనిష్ఠుం డగుచు, సంశయంబులు విడిచి సంగంబులు పరిహరించి విష్ణునియందుఁజిత్తంబుఁ జేర్చి గంధమాదనంబు ప్రవేశించి, మఱియు నరనారాయణనివాసంబైన బదరికాశ్రమంబు చేరి, శాంతుండై హరి నారాధించుచుండె. నిట్లు ముచుకుందుని వీడ్కొని. | 1666 |
| శా. |
అచ్ఛిద్రప్రకటప్రతాపరవిచే నాశాంతరాళంబులం బ్రచ్ఛాదించుచుఁ గ్రమ్మఱన్ మథురకుం బద్మాక్షుఁ డేతెంచి వీ డాచ్ఛాదించి మహానిరోధముగఁ జక్రాకారమై యున్న యా మ్లేచ్ఛవ్రాతము నెల్లఁ ద్రుంచె రణభూమిం బెంపు సొంపారఁగన్. |
1667 |