| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | ఇట్లు మ్లేచ్ఛులం బొరిగొని మఱియు న మ్మథురానగరంబునం గల ధనంబు ద్వారకానగరంబునకుం బంచిన, మనుష్యులు గొనిపోవు నెడ. | 1668 |
| సీ. |
ఘోటకసంఘాతఖురసమున్నిర్గతధూళి జీమూతసందోహముగను మహనీయమదకలమాతంగకటదానధారలు కీలాలధారలుగను నిరుపమస్యందననేమినిర్ఘోషంబు దారుణగర్జితధ్వానముగను నిశితశస్త్రాస్త్రమానితదీర్ఘరోచులు లలితసౌదామనీలతికలుగను |
|
| తే. |
శత్రురాజప్రతాపాగ్ని శాంతముగను, వృష్టికాలము వచ్చు న వ్విధము దోఁప నేఁగుదెంచె జరాసంధుఁ డిరువదియును, మూఁడు నక్షౌహిణులు దన్ను మొనసి కొలువ. |
1669 |
| చ. |
ఇటు చనుదెంచియున్న మగధేశ్వరవాహినిఁ జూచి యుద్ధ సం ఘటనము మాని మానవులకైవడి భీరుల భంగి నోడి ముం దటి ధనమెల్ల డించి మృదుతామరసాభపదద్వయుల్ క్రియా పటువులు రామకేశవులు పాఱిరి ఘోరవనాంతరంబులన్. |
1670 |
| వ. | ఇట్లు పఱచుచున్న కృష్ణబలభద్రులం జూచి వారలప్రభావంబు లెఱుంగక పరిహసించి. | 1671 |
| ఉ. |
‘ఓ యదువీరులార! రభసోద్ధతిఁ బాఱకుఁ; డిట్లు పాఱినం బోయెడువాఁడఁ గాను; మిము భూమి నడంగిన మిన్ను బ్రాఁకినం దోయధిఁ జొచ్చినం దగిలి త్రుంచెద’నంచు సమస్తసేనతోఁ బాయక వచ్చె వెంటఁబడి బాహుబలాఢ్యుఁడు మాగధేశుఁడున్. |
1672 |
| వ. | మఱియుం బలాయమానులై బహుయోజనంబుల దూరంబు సని విశ్రాంతులై దమకు డాఁగ నెల వగు నని యింద్రుండు మిక్కిలి వర్షింపఁ బ్రవర్షణాఖ్యంబై పదునొకండుయోజనంబుల పొడవును నంతియ వెడలుపును గల గిరి యెక్కి రంత. | 1673 |
| శా. |
ఆ శైలేంద్రముఁ జుట్టిరా విడిసి రోషావిష్టుఁడై మాగధో ర్వీశుం డా వసుదేవనందనులఁ దా వీక్షింపఁగా లేక త న్నాశేచ్ఛన్ బిలసానుశృంగములఁ బూర్ణక్రోధుఁడై కాష్ఠముల్ రాసుల్ గా నిడి చిచ్చువెట్టఁ బనిచెన్ రౌద్రంబుతో భృత్యులన్. |
1674 |
| వ. | ఇట్లు జరాసంధపరిజనప్రదీపితంబైన మహానలంబు దరికొనియె నందు. | 1675 |
| క. |
పొగ లెగసెఁ బొగల తుదలను, మిగులుచు మిడుఁగుఱులు నిగిడె మిడుఁగుఱుగమి ము న్నుగ బ్రహ్మాండము నిండెను, భగ భగమని మంట లొదవె భయదము లగుచున్. |
1676 |
| వ. | మఱియు న మ్మహానలంబు బిలసానుశృంగవృక్షలతాకుంజపుంజంబుల దరికొని, శిఖలు కిసలయంబులుగ, విస్ఫులింగంబులు విరులుగ, సముద్ధూతధూమపటలంబులు బంధురస్కంధ శాఖావిసరంబులుగ, ననోకహంబుకైవడి నభ్రంకషంబై ప్రబ్బి కఠోరసమీరణసమున్నతమహోల్కాజాల తిరోహితవియచ్చ రవిమానంబును, వివిధవిధూమవిస్ఫులింగవిలోకనప్రభూతనూతనతారకాభ్రాంతి విభ్రాంతగగనచరంబును, సంతప్యమానసరోవరసలిలంబును, విశాలజ్వాలాజాలజాజ్వల్యమాన తక్కోలచందనాగరుకర్పూర ధూమవాసనావాసితగగనకుహరంబును, గరాళకీలాజాలదందహ్యమాన కీచకనికుంజపుంజసంజనితచిటపటారావపరిపూరితదిగంతరాళంబును, భయంకరబహుళతర శాఖాభిద్యమానపాషాణఘోషణపరిమూర్ఛితప్రాణిలోకంబును, సంతప్యమానశాఖిశాఖాంతరనిబిడనీడనిహిత శాబకవియోగదుఃఖడోలాయమానవిహంగకులంబును, మహాహేతిసందీప్యమానకటిసూత్రసంఘటిత మయూరపింఛకుచకలశయుగళభారాలసశబరకామినీసమాశ్రితనిర్ఝరంబును, దగ్ధానేకమృగ మిథునంబు నై యేర్చునెడ. | 1677 |
| క. |
ఇల నేకాదశయోజన, ముల పొడవగు శైలశిఖరముననుండి వడిన్ బలకృష్ణులు రిపుబలముల, వెలి కులికిరి కానఁబడక విలసితలీలన్. |
1678 |
| వ. | ఇట్లు శత్రువుల వంచించి యాదవేంద్రులు సముద్రపరిఖంబైన ద్వారకానగరంబునకుం జనిరి. జరాసంధుడు వారలు దగ్ధు లైరని తలంచుచు బలంబులుం దానును మగధదేశంబునకు మరలి చనియె; నంత. | 1679 |