పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము
క. ఆ వనజగర్భుపంపున, రైవతుఁ డను రాజు దెచ్చి రామున కిచ్చెన్‌
రేవతి యనియెడు కన్యను, భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియన్‌.
1680
వ. తదనంతరంబ. 1681
మ. ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్‌ గైకొన్న చందంబునన్‌
జగతీనాథులఁ జైద్యపక్షచరులన్‌ సాళ్వాదులం గెల్పి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్‌ రాజీవగంధిన్‌ రమా
భగవత్యంశభవన్‌ మహాగుణమణిన్‌ బాలామణిన్‌ రుక్మిణిన్‌.
1682
వ. అనిన రాజిట్లనియె. మున్ను రాక్షసవివాహంబున స్వయంవరంబునకు వచ్చి హరి రుక్మిణిం గొనిపోయె నని పలికితివి. కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదుల జయించి తన పురంబునకుం జనియె; నదియునుం గాక. 1683
శా. కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్‌ ముక్త వై
కల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా
కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే! రుక్మిణీ
కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్‌.
1684
క. భూషణములు సెవులకు బుధ, తోషణము లనేకజన్మదురితౌఘవిని
శ్శోషణములు మంగళతర, ఘోషణములు గరుడగమనుగుణభాషణముల్‌.
1685
వ. అని రా జడిగిన శుకుం డిట్లనియె. 1686
చ. వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గల; డాతని కేవురు పుత్త్రు లగ్రజుం
డనయుఁడు రుక్మి నాఁ బరఁగు; నందఱకున్‌ గడగొట్టుచెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణి నాఁ బ్రసిద్ధయై.
1687
క. బాలేందురేఖ దోఁచిన, లాలిత యగు నపరదిక్కులాగున ధరణీ
పాలునిగేహము మెఱసెను, బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్‌.
1688
వ. మఱియు దినదినప్రవర్ధమానయై. 1689
సీ. పేర్వేర బొమ్మలపెండ్లిండ్లు సేయుచు నబలలతోడ వియ్యంబు లందు
గుజ్జెనగూళ్ళను గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి
రమణీయమందిరారామదేశంబులఁ బువ్వుఁదీఁగెలకును బ్రోదివెట్టు
సదమలమణిమయసౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు
 
తే. బాలికలతోడఁ జెలరేగి బంతులాడు, శారికాకీరపంక్తికిఁ జదువు సెప్పు
బర్హిసంఘంబులకు మురిపములు గఱపు, మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
1690
వ. అంత. 1691
సీ. దేవకీసుతుకోర్కి తీఁగెలు వీడంగ వెలఁదికి మైదీఁగె వీడఁ దొడఁగెఁ;
గమలనాభునిచిత్తకమలంబు వికసింపఁ గాంతి నింతికి ముఖకమల మొప్పె;
మధువిరోధికి లోన మదనాగ్ని పొడసూపఁ బొలఁతికి చనుదోయి పొడవు సూపె;
శౌరికి ధైర్యంబు సన్నమై డయ్యంగ జలజాక్షిమధ్యంబు సన్నమయ్యె;
 
ఆ. హరికిఁ బ్రేమబంధ మధికంబుగాఁ కేశ, బంధ మధిక మగుచు బాల కమరెఁ
బద్మనయనువలనఁ బ్రమదంబు నిండార, నెలఁత యౌవనంబు నిండి యుండె.
1692
వ. ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి తన యెలప్రాయంబున. 1693
క. తనతండ్రిగేహమునకుం, జనుదెంచుచు నున్న యతిథిజనులవలనఁ గృ
ష్ణునిరూపబలగుణాదులు, విని కృష్ణుఁడు దనకుఁ దగినఁ విభుఁ డని తలఁచెన్‌.
1694
క. ఆ లలనరూపు బుద్ధియు, శీలము లక్షణము గుణముఁ జింతించి తగన్‌
బాలారత్నముఁ దన కి, ల్లాలుగఁ జేకొందు ననుచు హరియుం దలఁచెన్‌.
1695
వ. అంత. 1696
ఉ. బంధువు లెల్లఁ గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషీ
సింధువులై విచారములు సేయఁగ వారల నడ్డుపెట్టి దు
స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాలవిరోధముఁ జేసి మత్త పు
ష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచుఁ దలంచె నంధుఁడై.
1697
ఉ. అన్నతలంపు దా నెఱిఁగి య న్నవనీరజగంధి లోన నా
పన్నత నొంది, యాప్తుఁడగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి గర్వ సం
ఛన్నుఁడు రుక్మి నేఁడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్న వాఁ
డెన్ని విధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే!
1698
క. అయ్యా! కొడుకు విచారము, లయ్యయు వారింపఁ జాలఁ డటు గాకుండన్‌
నెయ్య మెఱిఁగించి చీరుము, చయ్యన నిజసేవకానుసారిన్‌ శౌరిన్‌.
1699
వ. అని కొన్ని రహస్యవచనంబులు సెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకానగరంబునకుం జని, ప్రతీహారుల వలనఁ దనరాక యెఱింగించి య న్నగధరుం డున్ననగరుఁ బ్రవేశించి,యందుఁ గనకాసనాసీనుండై యున్నపురుషోత్తముం గాంచి ‘పెండ్లికొడుకవు గ’ మ్మని దీవించిన ముసిముసినగవులు నగుచు బ్రహ్మణ్యదేవుండైనహరి తనగద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ నియోగించి, తనకు దేవతలు సేయుచందంబునం బూజలు సేసి, సరసపదార్థసంపన్నంబైన యన్నంబు పెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం జేరి లోకరక్షణప్రశస్తంబయిన హస్తంబున నతనియడుగులు పుడుకుచు మెల్లన నతని కిట్లనియె. 1700
సీ. జగతీసురేశ్వర! సంతోషచిత్తుండ వై యున్న నీధర్మ మతిసులభము
వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు
తనధర్మమున నుండుఁ దరలఁ డా ధర్మంబు గోరిక లతనికిఁ గురియుచుండు
సంతోషి గాఁ డేని శక్రుఁ డైన నశించు నిర్ధనుం డైనను నింద్రుఁ బోలు
 
ఆ. సంతసించెనేని, సర్వభూతసుహృత్త, ములకుఁ బ్రాప్తలాభ ముదిత మాన
సులకు శాంతులకును సుజనులకును గర్వ, హీనులకును వినతు లే నొనర్తు.
1701
ఉ. ఎవ్వని దేశమం దునికి; యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ;
కెవ్వని రాజ్యమందుఁ బ్రజలెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియుం
‘డివ్వనరాశి దుర్గమున కె ట్లరుదెంచితి వయ్య! నీవు? లే
నవ్వులు గావు; నీ తలఁపునం గల మే లొనరింతు ధీమణీ!
1702
వ. అని యిట్లు లీలాగృహీతశరీరుండైన యప్పరమేశ్వరుం డడిగిన ధరణీసురవరుం డతనికి సవినయంబుగ నిట్లనియె. దేవా! విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజు గలం; డా రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి గల; ద య్యిందువదన నీకుఁ గైంకర్యంబు సేయంగోరి వివాహమంగళ ప్రశస్తంబయిన యొక్కసందేశంబు విన్నవింపు మని పుత్తెంచె నవధరింపుము. 1703
సీ. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ లేప్రొద్దుఁ జేసిన భువనోన్నతత్వంబు బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు
 
తే. నట్టి నీ యందు నాచిత్త మనవరతము, నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
1704
శా. ధన్యున్‌ లోకమనోఽభిరాముఁ గులవిద్యారూపతారుణ్య సౌ
జన్యశ్రీబలదానశౌర్యకరుణాసంశోభితున్‌ నిన్ను నే
కన్యల్‌ గోరరు? కోరదే మును రమాకాంతాలలామంబు రా
జన్యానేకపసింహ! నావలననే జన్మించెనే మోహముల్‌?
1705
ఉ. శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరుచందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయినియైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్న వాఁ
డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైనభవత్ప్రతాపమున్‌.
1706
మ. వ్రతముల్‌ దేవగురుద్విజన్మబుధసేవల్‌ దానధర్మాదులున్‌
గతజన్మంబుల నీశ్వరున్‌ హరి జగత్కల్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్‌ వసుదేవనందనుఁడు నా చిత్తేశుఁ డౌఁగాక ని
ర్జితులై పోదురుగాక సంగరములోఁ జేదీశముఖ్యాధముల్‌.
1707
ఉ. అంకిలి సెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాలజరాసుతులన్‌ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్‌ భవదీయశౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొని పొమ్ము వచ్చెదన్‌.
1708
సీ. లోపలి సౌధంబులోన వర్తింపంగఁ దేవచ్చునే నిన్నుఁ దెత్తునేనిఁ
గావలివారలఁ గల బంధువులఁ జంపి కాని తేరా దని కమలనయన!
భావించితేని నుపాయంబు సెప్పెద నాలింపు కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతు
 
తే. నెలమి మావారు పంపుదు రేను నట్లు, పురము వెలువడి యేతెంచి భూతనాథు
సతికి మ్రొక్కంగ నీవు నా సమయమందు, వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
1709
మ. ఘను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్‌ వాంఛింతు రే నట్టి నీ
యనుకంపన్‌ విలసింపనేని వ్రతచర్యన్‌ నూఱుజన్మంబులన్‌
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్‌ విడిచెదన్‌ నిక్కంబు ప్రాణేశ్వరా!
1710
సీ. ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబులకలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని తనులతవలనిసౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని చక్షురింద్రియములసత్త్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల?
 
ఆ. నీరజాతనయన! నీ వనమాలికా, గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని, జన్మ మేల? యెన్ని జన్మములకు?
1711
వ. అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూపసౌందర్యాదివిశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి ‘కర్తవ్యం బెద్ది సేయ నవధరింపు’ మని సవర్ణనంబుగా మఱియు నిట్లనియె. 1712
సీ. పల్లవవైభవాస్పదములు పదములు గనకరంభాతిరస్కారు లూరు;
లరుణప్రభామనోహరములు గరములు గంబు సౌందర్యమంగళము గళము
మహితభావాభావమధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి
పరిహసితార్ధేందుపటలంబు నిటలంబు జితమత్తమధుకరశ్రేణి వేణి
 
ఆ. భావజాశుగములప్రాపులు చూపు లు, కుసుమశరునివింటికొమలు బొమలు
చిత్తతోషణములు చెలువభాషణములు, జలజనయనముఖము చంద్రసఖము.
1713
ఉ. ఆ యెలనాఁగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు; మా యుపా
ధ్యాయులయాన పెండ్లి యగుఁ; దప్పదు; జాడ్యము లేల? నీవు నీ
తోయమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము; శత్రులన్‌ నుఱుముసేయుము; సేయుము శోభనం బిలన్‌.
1714
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )