| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అని యిట్లు పలికి, బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూపసౌందర్యాది విశేషంబులును విని, యవధరించి, నిజకరంబున నతని కరంబుఁబట్టి నగుచు న య్యాదవేంద్రుం డిట్లనియె. | 1715 |
| ఉ. |
కన్నియమీఁద నాతలఁపు గాఢము; కూరుకు రాదు రేయి నా కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నే మున్నె యెఱుంగుదున్; బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి ద్వన్నుత! మాను ద్రచ్చి నవవహ్నిశిఖన్ వడిఁ దెచ్చు కైవడిన్. |
1716 |
| క. |
వచ్చెద విదర్భభూమికిఁ; జొచ్చెద భీష్మకునిపురము; సురుచిరలీలన్ దెచ్చెద బాలన్; వ్రేల్మిడి, వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్. |
1717 |
| వ. | అని పలికి, రుక్మిణీదేవిపెండ్లినక్షత్రంబు దెలిసి, తన పంపున రథసారథియైన దారుకుండు శైబ్య సుగ్రీవ మేఘపుష్పవలాహకంబులను తురగంబులం గట్టి, రథ మాయత్తంబు చేసి తెచ్చిన, నమోఘ మనోరథుండైన హరి తానును, బ్రాహ్మణుండును రథారోహణంబు సేసి, యేకరాత్రంబున నానర్తకదేశంబులు గడచి, విదర్భదేశంబునకుం జనియె; నందుఁ గుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై, కూఁతు శిశుపాలున కిత్తు నని తలంచి, శోభనోద్యోగంబు సేయించె; నప్పుడు. | 1718 |
| సీ. |
రచ్చలు క్రంతలు రాజమార్గంబులు విపణిదేశంబులు విశదములుగఁ జేసిరి; చందనసిక్తతోయంబులు గలయంగఁ జల్లిరి; కలువడములు రమణీయవివిధతోరణములు గట్టిరి సకలగృహంబులఁ జక్క సేసి; కర్పూరకుంకుమాగరుధూపములు వెట్టి రతివలుఁ బురుషులు నన్నియెడల |
|
| ఆ. |
వివిధవస్త్రములను వివిధమాల్యాభర, ణానులేపనముల నమరియుండి రఖిలవాద్యములు మహాప్రీతి మ్రోయించి, రుత్సవమున నగర మొప్పి యుండె. |
1719 |
| వ. | అంత నా భీష్మకుండు విహితప్రకారంబునం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు వెట్టించి, మంగళాశీర్వచనంబులు సదివించి, రుక్మిణీదేవి నభిషిక్తం జేసి, వస్త్రయుగళభూషితం గావించి, రత్నభూషణంబు లిడం జేసె; ఋగ్యజుస్సామాథర్వణమంత్రంబుల మంగళాచరణంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి; పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదితన్యాయంబున హోమంబుఁ గావించె; మఱియు నా రాజుదంపతుల మేలుకొఱకుఁ దిలధేనుకలధౌతకనకచేలాదిదానంబులు ధరణీదేవతల కొసంగె నయ్యవసరంబున. | 1720 |
| మ. |
భటసంఘంబులతో రథావళులతో భద్రేభయూథంబుతోఁ బటువేగాన్వితఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితోఁ గటుసంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్ విశం కట వృత్తిం జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ గర్వించి య వ్వీటికిన్. |
1721 |
| ఉ. |
బంధులఁ గూడి కృష్ణబలభద్రులు వచ్చినఁ బాఱఁ దోలి ని ర్మంథరవృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద మంచు నుల్లస త్సింధుర వీరరథ్యరథసేనలతోఁ జనుదెంచి రా జరా సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వవిదూరకపౌండ్రకాదులున్. |
1722 |
| వ. | మఱియు నానాదేశంబుల రాజు లనేకు లేతెంచి; రందు శిశుపాలు నెదుర్కొని పూజించి, భీష్మకుం డొక్క నివేశంబున నతని విడియించె; నంత నా వృత్తాంతంబు విని. | 1723 |
| చ. |
హరి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్యహితానుసారులై నరపతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం గర మగుఁ; దోడు గావలయుఁ గంసవిరోధికి నంచు వేగఁ దా నరిగె హలాయుధుండు గమలాక్షునిజాడ ననేకసేనతోన్. |
1724 |
| క. |
ఆ లోపల నేకతమున, నాలోలవిశాలనయన యగు రుక్మిణి త న్నా లోకలోచనుఁడు హరి, యాలోకము చేసి కదియఁ డని శంకితయై. |
1725 |
| శా. |
లగ్నం బెల్లి; వివాహముం గదిసె; నేలా రాఁడు గోవిందు? డు ద్విగ్నం బయ్యెడి మానసంబు; వినెనో వృత్తాంతమున్; బ్రాహ్మణుం డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో భగ్నంబై చనునో విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో? |
1726 |
| మ. |
ఘనుఁ డా భూసురుఁ డేఁగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం డనుకూలింపఁ దలంచునో తలఁపఁడో? యార్యామహాదేవియున్ నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో? |
1727 |
| వ. | అని వితర్కించుచు. | 1728 |
| ఉ. |
పోఁ డను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్ రాఁ డను; నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుఁడున్ లేఁ డను; రుక్మికిం దగవు లే దిటఁ జైద్యున కిత్తు నంచు ను న్నాఁ డను; గౌరి కీశ్వరికి నావలనం గృప లేదు నేఁ డనున్. |
1729 |
| ఉ. |
చెప్పదు తల్లికిం దలఁపుఁజిక్కు; దిశల్ దరహాసచంద్రికం గప్పదు; వక్త్రతామరసగంధసమాగతభృంగసంఘమున్ రొప్పదు; నిద్రఁ గైకొన దురోజపరస్పరసక్తహారముల్ విప్పదు; కృష్ణమార్గగతవీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్. |
1730 |
| చ. |
తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; కొప్పుఁ జక్కగా ముడువదు; నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన; దన్న మేమియుం గుడువదు; నీరముం గొనదు; కూరిమి కీరముఁ జేరి పద్యమున్ నొడువదు; వల్లకీగుణవినోదము సేయదు; డాయ దన్యులన్. |
1731 |
| సీ. |
మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ జలముల నాడదు జలజగంధి ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి పువ్వులు దుఱుమదు పువ్వుఁబోణి వనకేళిఁ గోరదు వనజాతలోచన హంసంబుఁ బెంపదు హంసగమన లతలఁ బోషింపదు లతికాలలితదేహ తొడవులు దొడవదు తొడవు తొడవు |
|
| ఆ. |
తిలక మిడదు నుదుటఁ దిలకినీతిలకంబు, కమలగృహముఁ జొరదు కమలహస్త గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన, మాలి రాఁడు తగవుమాలి యనుచు. |
1732 |
| వ. | మఱియును. | 1733 |
| మ. |
మలఁగున్ మెల్లని గాలికిం; బటురటన్మత్తద్విరేఫాళికిం దలఁగుం; గోయిలమ్రోఁతకై యలఁగు; నుద్యత్కీరసంభాషలం గలఁగున్; వెన్నెలవేడిమి న్నలఁగు; మాకందాంకురచ్ఛాయకుం దొలఁగుం గొమ్మ మనోభవానలశిఖాదోదూయమానాంగియై. |
1734 |
| వ. | ఇట్లు హరిరాక కెదురు సూచుచు సకలప్రయోజనంబులందును విరక్తయై మనోజానలంబునం బొగిలెడి మగువకు శుభంబుఁ జెప్పుచందంబున వామలోచనభుజంబు లదరె నంతఁ గృష్ణునియోగంబున వేగంబున బ్రాహ్మణుండు సనుదెంచిన, నతనిముఖలక్షణం బుపలక్షించి యా కలకంఠి మహోత్కంఠతోడ నకుంఠితయై మొగంబునం జిఱునగవు నిగుడ నెదురు సని నిలువంబడిన బ్రాహ్మణుం డిట్లనియె. | 1735 |
| ఉ. |
మెచ్చె భవద్గుణోన్నతి; కమేయధనావళు లిచ్చె నాకుఁ; దా వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై వచ్చిన నైన రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేఁడు ఫలించెఁ గన్యకా! |
1736 |
| వ. | అనిన వైదర్భి యిట్లనియె. | 1737 |