పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
రుక్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట
మ. జలజాతేక్షణుఁ దోడితెచ్చితివి నా సందేశమున్‌ జెప్పి; నన్‌
నిలువం బెట్టితి; నీ కృపన్‌ బ్రదికితిన్‌; నీయంత పుణ్యాత్మకుల్‌
గలరే? దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం
జలిఁ గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!
1738
వ. అని నమస్కరించె; నంత రామకృష్ణులు తమకూఁతువివాహంబునకు వచ్చుట విని, తూర్యఘోషంబు లతో నెదుర్కొని, విధ్యుక్తప్రకారంబునం బూజించి మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధుజనసేనాసమేతులైనవారలకుం దూర్ణంబున సకల సంపత్పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి విడియించె; నిట్లు కూడినరాజుల కెల్లను వయోవీర్య బలవిత్తంబు లెట్లట్ల కోరినపదార్థంబు లెల్ల నిప్పించి పూజించె; నంత విదర్భపురంబుప్రజలు హరిరాక విని వచ్చి చూచి, నేత్రాంజలులం దదీయవదనకమలమధుపానంబు సేయుచు. 1739
మ. తగు నీచక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం
దగు నీచక్రికి; నింతమంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా! దర్పాహతారాతియై
మగఁడౌ గావుతఁ జక్రి యీ రమణికిన్‌ మా పుణ్యమూలంబునన్‌.
1740
వ. అని పలికి రా సమయంబున. 1741
సీ. సన్నద్ధులై బహుశస్త్రసమేతులై బలసి చుట్టును వీరభటులు గొలువ
ముందట నుపహారములు గానుకలుఁ గొంచు వర్గంబులై వారవనిత లేఁగఁ
బుష్పగంధాంబరభూషణకలితలై పాడుచు భూసురభార్య లరుగఁ
బణవమర్దలశంఖపటహకాహళవేణుభేరీధ్వనుల మిన్ను పిక్కటిలఁగఁ
 
ఆ. దగిలి సఖులు గొలువఁ దల్లులు బాంధవ, సతులుఁ దోడ రాఁగ సవినయముగ
నగరు వెడలి నడచె నగజాతకును మ్రొక్క, బాల చికురపిహితఫాల యగుచు.
1742
వ. మఱియు సూతమాగధవందిగాయకపాఠకజను లంతంత నభినందించుచుం జనుదేర మందగమనంబున, ముకుందచరణారవిందంబులు డెందంబునం దలంచుచు నిందుధరసుందరీ మందిరంబు సేరి సలిలధారాధౌతకరచరణారవిందయై వార్చి శుచియై, గౌరీసమీపంబునకుం జనియె; నంత ముత్తైదువలగు భూసురోత్తముల భార్యలు భవసహితయైన భవానికి మజ్జనంబు గావించి గంధాక్షతంబు లిడి, వస్త్రమాల్యభూషణాదుల నలంకరించి, ధూపదీపంబు లొసంగి, నానావిధోపహారంబులు సమర్పించి, కానుక లిచ్చి, దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మ్రొక్కించి రప్పుడు. 1743
ఉ. నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్‌
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం బతి సేయు మమ్మ నిన్‌
నమ్మినవారి కెన్నఁడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ!
1744
వ. అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణాపూపంబులును, దాంబూల కంఠసూత్రంబులును, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలం బూజించిన. 1745
ఆ. వార లుత్సహించి వలనొప్ప దీవించి, సేస లిడిరి యువతిశిరమునందు;
సేస లెల్లఁ దాల్చి శివవల్లభకు మ్రొక్కి, మౌననియతి మాని మగువ వెడలె.
1746
వ. ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగుతెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించుమృగంబు చందంబునఁ, గమలభవ నర్తకుం డెత్తిన జవనిక మఱుఁగు దెరలి పొడసూపిన మోహినీదేవతకైవడి, దేవదానవసంఘాతకరతలసవ్యాపసవ్యసమాకృష్యమాణపన్నగేంద్రపాశపరివలయిత పర్యాయపరిభ్రాంతమందరాచలమంథానమథ్యమానఘూర్ణిత ఘుమఘుమాయిత మహార్ణవమధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీవైభవంబున, బహువిధప్రభాభాసమానయై, యిందుధర సుందరీమందిరంబు వెడలి మానసకాసారహేమకమలకాననవిహరమాణమత్తమరాళంబు భంగి, మందగమనంబునఁ గనకకలశయుగళసంకాశకర్కశపయోధరభారపరికంప్యమానమధ్యయై, రత్నముద్రికాలంకృతం బైన కెంగేల నొక్క సఖీలలామంబు కైదండ గొని, రత్ననివహసముదంచితకాంచనకర్ణపత్త్రమయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప, నరవిందపరిమళకుతూహలావతీర్ణ మత్తమధుకరంబుల మాడ్కి నరాళంబులైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాసరోచులు దిశలందు బాలచంద్రికాసౌందర్యంబు నావహింప, నధరబింబఫలారుణ మరీచిమాలికలు రదనకుందకుట్మలంబుల కనురాగంబు సంపాదింప, మనోజాతకేతనసన్నిభంబైన పయ్యెదకొంగు దూఁగ, సువర్ణమేఖలాఘటిత మణికిరణపటలంబు లకాలశక్రచాపజనకంబులై మెఱయఁ, జెఱకువిలుతుం డొఱవెఱికి వాఁడి యిడి జళిపించిన ధగద్ధగాయమానంబు లగు బాణంబుల పగిది, సురుచిరవిలోకననికరంబులు రాజవీరులహృదయంబులు భేదింప, శింజానమంజుమంజీర నినదంబులు చెవుల పండువులు సేయఁ, బాదసంచారంబున హరిరాక కెదురుచూచుచు, వీరమోహినియై చనుదెంచుసమయంబున. 1747
మ. అలినీలాలకఁ బూర్ణచంద్రముఖి నేణాక్షిం బ్రవాళాధరం
గలకంఠిన్‌ నవపల్లవాంఘ్రియుగళన్‌ గంధేభకుంభస్తనిం
బులినశ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాతహస్తన్‌ మహో
త్పలగంధిన్‌ మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ములై రందఱున్‌.
1748
వ. మఱియు న య్యింతి దరహాసలజ్జావలోకనంబులం జిత్తంబు లేమఱి ధైర్యంబు దిగనాడి, గాంభీర్యంబులు విడిచి, గౌరవంబులు మఱచి, చేష్టలు మాని, యెఱుక లుడిగి, యాయుధంబులు దిగవైచి గజతురగరథా రోహణంబులు సేయనేరక, రాజులెల్ల నేలకు వ్రాలి; రా యేణీలోచన తన వామకరనఖంబుల నలకంబులు దలఁగం ద్రోయుచు నుత్తరీయంబు సక్కనొత్తుచుఁ గడగంటిచూపులం గ్రమంబున నా రాజలోకంబు నాలోకింపుచు. 1749
మ. కనియెన్‌ రుక్మిణి చంద్రమండలముఖుం గంఠీరవేంద్రావ ల
గ్ను నవాంభోజదళాక్షుఁ జారుతరవక్షున్‌ మేఘసంకాశ దే
హు నగారాతిగజేంద్రహస్తనిభబాహుం జక్రిఁ బీతాంబరున్‌
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు విజయోత్కంఠున్‌ జగన్మోహనున్‌.
1750
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )