| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | కని తదీయ రూపవయోలావణ్య వైభవగాంభీర్యచాతుర్యతేజోవిశేషంబులకు సంతసించి, మనోభవ శరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న వరారోహం జూచి, పరిపంథిరాజలోకంబు సూచుచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమిభాగంబు గొనిచను కంఠీరవంబు కైవడి నిఖిలభూపాలగణంబుల గణింపక తృణీకరించి రాజకన్యకం దెచ్చి హరి తనరథంబుమీఁద నిడికొని భూనభోంతరాళంబులు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ యాదవవాహినీ పరివృతుండై ద్వారకానగరమార్గంబు వట్టి చనియె; నంత జరాసంధవశులయినరాజులందరు హరిపరాక్రమంబు విని, సహింప నోపక. | 1751 |
| మ. |
ఘనసింహంబులకీర్తి నీచమృగముల్ గైకొన్నచందంబునన్ మనకీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్ సనుచున్నా రదె? శౌర్య మెన్నటికి? మీ శస్త్రాస్త్రముల్ గాల్పనే? తనుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్. |
1752 |
| వ. | అని యొండొరులం దెలుపుకొని, రోషంబులు హృదయంబుల నిలుపుకొని, సంరంభించి, తనుత్రాణంబుల వహించి, ధనురాదిసాధనంబులు ధరియించి, పంతంబు లాడి, తమ తమ చతురంగబలంబులం గూడికొని, జరాసంధాదులు యదువీరుల వెంటనంటి, తాఁకి నిలు నిలుండని ధిక్కరించి పలికి యుక్కు మిగిలి, మహీధరంబుల మీఁద సలిలధారలు గురియు ధారాధరంబులచందంబున బాణవర్షంబులు గురిసిన యాదవసేనలం గల దండనాయకులు కోదండంబు లెక్కిడి, గుణంబులు మ్రోయించి, నిలువంబడి రప్పుడు. | 1753 |
| క. |
అరిబలభటసాయకముల, హరిబలములు గప్పఁబడిన నడరెడు భీతిన్ హరిమధ్య సిగ్గుతోడను, హరివదనముఁ జూచెఁ జకితహరిణేక్షణయై. |
1754 |
| వ. | ఇట్లు చూచిన. | 1755 |
| క. |
చొచ్చెద రదె యదువీరులు, వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచున్ నొచ్చెదరును విచ్చెదరును, జచ్చెదరును నేఁడు చూడు జలజాతాక్షీ! |
1756 |
| వ. | అని రుక్మిణీదేవిని హరి యూఱడించె; నంత బలభద్రప్రముఖులైనయదువీరులు ప్రళయవేళల మిన్నునం బన్ని బలుపిడుగు లడరించు పెనుమొగిళులవడువున జరాసంధాదిపరిపంథిరాజచక్రంబుమీఁద నవక్రపరాక్రమంబున శిఖిశిఖాసంకాశనిశితశిలీముఖనారాచభల్ల ప్రముఖంబులైన బహువిధ బాణపరంపరలు గురియ, నదియును విదళితమత్తమాతంగంబును, విచ్ఛిన్నతురంగంబును, విభిన్న రథవరూథంబును, వినిహత పదాతియూథంబును, విఖండితవాహవారణరథారోహణమస్తకంబును, విశకలితవక్షోమధ్యకర్ణకంఠ కపోలహస్తంబును, వీకీర్ణ కేశజాలంబును, విపాటితచరణజానుజంఘంబును, విదళిత దంతసంఘంబును, విఘటిత వీరమంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విస్మృతవీరాలాపంబును, విదార్యమాణగదాకుంతతోమరపరశుపట్టిసప్రాసకరవాలశూలచక్రచాపంబును, వినిపాతిత కేతనచామరచ్ఛత్రంబును, విలూనతనుత్రాణంబును, వికీర్యమాణఘోటకసంఘరింఖాసముద్ధూత ధరణీపరాగంబును, వినష్టరథవేగంబును, వినివారితసూతమాగధవందివాదంబును, వికుంఠితహయహేషాపటహభాంకార, కరటిఘటాఘీంకార, రథనేమిఫటాత్కార, తురగనాభిఘంటా ఘణఘణాత్కార, వీరహుంకారభూషణఝణఝణాత్కార, నిస్సాణధణధణాత్కార, మణినూపురక్రేంకార, కింకిణీగణకిణాత్కార, శింజినీటంకార, భటపరస్పరధిక్కారనాదంబును, వినిర్భిద్యమాన రాజసమూహంబును, విద్యమానరక్తప్రవాహంబును, విశ్రూయమాణభూతబేతాళకలకలంబును, విజృంభమాణఫేరవకాకకంకాది సంకులంబును, బ్రచలితకబంధంబును, బ్రభూతపలలగంధంబును, ప్రదీపిత మేదోమాంసరుధిర ఖాదంబును, బ్రవర్తితడాకినీ ప్రమోదంబునునై యుండె; నప్పుడు. | 1757 |
| చ. |
మగిడి చలించి పాఱుచును మాగధముఖ్యులు గూడి యొక్కచో వగచుచు నాలిఁ గోల్పడినవానిక్రియన్ గడు వెచ్చనూర్చుచున్ మొగమున దప్పిదేరఁ దమ ముందటఁ బొక్కుచు నున్న చైద్యుతోఁ బగతురచేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్నవాఁడవే. |
1758 |
| వ. | అని మఱియును. | 1759 |
| ఆ. |
బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండిన, బ్రతుకు గలిగెనేని భార్య గలదు; బ్రతికి తీవు; భార్యపట్టు దైవ మెఱుంగు, వగవ వలదు చైద్య! వలదు వలదు. |
1760 |
| వ. | వినుము. దేహధారి స్వతంత్రుఁడు గాఁడు. జంత్రగానిచేతి జంత్రపుబొమ్మకైవడి నీశ్వరతంత్ర పరాధీనుండై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపు. తొల్లి నేను మథురాపురంబుమీఁదఁ బదియేడు మాఱులు పరాక్రమంబునన్ విడిసి, చక్రిచేత నిర్మూలితబలచక్రుండనై, కామపాలుచేతం బట్టువడి, యీ కృష్ణుండు కరుణతో విడిపించిన వచ్చి, క్రమ్మఱ నిరువదిమూఁ డక్షౌహిణులం గూడికొని, పదునెనిమిదవ మాఱు దాడిచేసి, శత్రువులం దోలి, విజయంబు చేకొంటిని. జయాపజయంబులందు హర్షశోకంబుల నెన్నండును జెంద; నేఁటిదినంబున నీ కృష్ణుని కెదిరి పోర మన రాజలోకంబు లెల్ల నుగ్రాక్షుం గూడుకొని, యెదిరి పోరిన నోడు. ఇంతియ కాక దైవయుక్తంబైన కాలంబునం జేసి, లోకంబులు పరిభ్రమించుచు నుండు; నదియునుం గాక. | 1761 |
| మ. |
తమకుం గాలము మంచిదైన మనలం ద్రైలోక్యవిఖ్యాత వి క్రములం గెల్చిరి యాదవుల్ హరిభుజాగర్వంబునన్ నేఁడు; కా లము మేలై చనుదెంచెనేని మనమున్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయింత మింతపనికై శంకింప నీ కేటికిన్. |
1762 |
| వ. | అని యిట్లు జరాసంధుండును, నతని యొద్దిరాజులును, శిశుపాలునిపరితాపంబు నివారించి, తమ తమభూములకుం జనిరి. శిశుపాలుండు ననుచరసేనాసమేతుం డయి తన నగరంబునకుం జనియె; నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షసవివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీబలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ, దన సారథితో నిట్లనియె. | 1763 |
| ఉ. |
బల్లిదు నన్ను భీష్మజనపాలకుమారునిఁ జిన్నఁ జేసి నా చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కని నిక్కపు బంటువోలె నీ గొల్లఁడు వోయెడిన్; రథముఁ గూడఁగఁ దోలుము; తేజితోల్లస ద్భల్లపరంపరన్ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్. |
1764 |
| వ. | అని యిట్లు రుక్మి హరికొలంది యెఱుంగక సారథి నదలించి రథముఁ గూడ దోలించి ‘గోపాలకా! వెన్నమ్రుచ్చ! నిమిషమాత్రంబు నిలు నిలు, మని తిరస్కరించి, బలువింట నారి సారించి మూఁడు వాఁడితూపుల హరి నొప్పించి యిట్లనియె. | 1765 |
| సీ. |
మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ? నేపాటి గలవాఁడ? వేది వంశ? మెందు జన్మించితి? వెక్కడఁ బెరిఁగితి? వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు? మానహీనుఁడ వీవు? మర్యాద లెఱుఁగవు; మాయఁ గైకొని కాని మలయ రావు; నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు; వసుధేశుఁడవు గావు వావి లేదు; |
|
| ఆ. |
కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు, విడువు; విడువ వేని విలయకాల శిఖిశిఖాసమానశితశిలీముఖముల, గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు. |
1766 |
| వ. | అని పలికిన నగధరుండు నగి, యొక్క బాణంబున వానికోదండంబు ఖండించి, యాఱు శరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల రథ్యంబులం గూల్చి, రెండమ్ముల సారథిం జంపి, మూఁడు వాఁడితూపులం గేతనంబు ద్రుంచి, మఱియు నొక్క విల్లందినం ద్రుంచి, వెండియు నొక్క ధనువు వట్టిన విదళించి, క్రమంబున పరిఘపట్టిసశూలచర్మాసిశక్తితోమరంబులు ధరియించినం దునుకలు సేసి, క్రమ్మఱ నాయుధంబు లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు గావించె. నంతటం దనివిసనక వాఁడు రథంబు డిగ్గి, ఖడ్గహస్తుండై, దవానలంబుపైఁ బడు మిడుతచందంబునం గదిసిన, ఖడ్గకవచంబులు చూర్ణంబులు సేసి, మెఱుంగులు చెదర నడిదంబు వెఱికి ఝళిపించి వానిశిరంబుఁ దెగవ్రేయుదు నని గమకించి, నడచుచున్న నడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరిచరణారవిందంబులు పట్టుకొని యిట్లనియె. | 1767 |
| మత్త. |
నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో సన్నుతామరకీర్తిశోభిత! సర్వలోకశరణ్య! మా యన్న యీతఁడు నేఁడు చేసె మహాపరాధము నీ యెడన్ నన్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిధీ! |
1768 |
| మత్త. |
కల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్ బ్రల్లదుం దెగఁ జూచితేనియు భాగ్యవంతుల మైతి మే మల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా తల్లిదండ్రులు పుత్త్రశోకముఁ దాల్చి చిక్కుదు రీశ్వరా! |
1769 |
| మ. |
అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో వినతశ్రాంతముఖంబుతో శ్రుతిచలద్వేణీకలాపంబుతోఁ గనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ క్కిన రుక్మిం దెగవ్రేయఁ బోక మగిడెన్ గృష్ణుండు రోచిష్ణుఁడై. |
1770 |
| వ. | ఇట్లు చంపక బావా! రమ్మని చిఱునగవు నగుచు, వానింబట్టి బంధించి గడ్డంబును మీసంబును దలయును నొకకత్తివాతి యమ్మున రేవులువాఱఁ గొఱిగి, విరూపిం జేసె; నంతట యదువీరులు పరసైన్యంబులం బాఱఁదోలి, తత్సమీపంబునకు వచ్చి; రప్పుడు హతప్రాయుండై కట్టువడి యున్న రుక్మిం జూచి కరుణచేసి, బలభద్రుండు బంధంబులు విడిచి హరిని డగ్గఱి యిట్లనియె. | 1771 |
| క. |
తల మనక భీష్మనందను, తలయును మూతియును గొఱుగఁ దగవే! బంధుం దలయును మూతియు గొఱుగుట, తల దఱుగుటకంటె దుచ్ఛతరము మహాత్మా! |
1772 |
| క. |
కొందఱు రిపు లని కీడును, గొందఱు హితు లంచు మేలు గూర్పవు; నిజ మీ వందఱియందును సముఁడవు, పొందఁగ నేలయ్య! విషమబుద్ధి ననంతా! |
1773 |