| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అని వితర్కించి రుక్మిణీదేవి నుపలక్షించి యిట్లనియె. | 1774 |
| శా. |
తోడంబుట్టిన వానిభంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె గ్గాడం జూడకు మమ్మ! పూర్వభవకర్మాధీనమై ప్రాణులన్ గీడున్ మేలును జెందు; లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ తోడంబుట్టువు కర్మశేషపరిభూతుం డయ్యె నేఁ డియ్యెడన్. |
1775 |
| క. |
చంపెడి దోషము గలిగినఁ, జంపఁ జనదు బంధుజనులఁ జను విడువంగాఁ జంపిన దోషము సిద్ధము, చంపను మఱి యేల మున్న చచ్చినవానిన్. |
1776 |
| ఆ. |
బ్రహ్మచేత భూమిపతుల కీ ధర్మంబు, కల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి తోడిచూలు నైనఁ దోడఁబుట్టినవాఁడు, చంపుచుండుఁ గ్రూరచరితుఁ డగుచు. |
1777 |
| క. |
భూమికి ధనధాన్యములకు, భామలకును మానములకుఁ బ్రాభవమునకుం గామించి మీఁదు గానరు, శ్రీమదమున మానధనులు చెనకుదు రొరులన్. |
1778 |
| వ. | వినుము. దైవమాయం జేసి దేహాభిమానులైన మానవులకున్ బగవాఁడు, బంధుండు, నుదాసీనుండు నను మోహంబు సిద్ధంబై యుండు; జలాదులయందుఁ జంద్రసూర్యాదులును, ఘటాదులయందు గగనంబును బెక్కై కానంబడు భంగి, దేహధారుల కందఱికి నాత్మ యొక్కం డయ్యును బెక్కండ్రై తోఁచు; నాద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్యప్రాణగుణాత్మకంబై, యాత్మయందు నవిద్యచేతఁ గల్పితంబై, దేహిని సంసారంబునం ద్రిప్పు. సూర్యుండు తటస్థుండై యుండఁ బ్రకాశమానంబు లయిన దృష్టిరూపంబులుంబోలె నాత్మ తటస్థుండైయుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగు; నాత్మకు వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు; వృద్ధిక్షయంబులు చంద్రకళలకుం గాని చంద్రునికి లేని కైవడి, జన్మనాశంబులు దేహంబునకుఁ గాని, యాత్మకుఁ గలుగనేరవు. నిద్ర వోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు సేయించు తెఱంగున, నెఱుక లేనివాఁడు నిజము గాని యర్థమునందు ననుభవము నొందుచుండుఁ గావున. | 1779 |
| క. |
అజ్ఞానజ మగు శోకము, విజ్ఞాన విలోకనమున విడువుము నీకుం బ్రజ్ఞావతికిం దగునే, యజ్ఞానుల భంగి వగవ నంభోజముఖీ! |
1780 |
| వ. | ఇట్లు బలభద్రునిచేతఁ దెలుపంబడి, రుక్మిణీదేవిదుఃఖంబు మాని యుండె; నట రుక్మి యను వాఁడు ప్రాణావశిష్టుండై, విడువఁబడి తన విరూపభావంబునకు నెరియుచు, హరిం గెల్చికాని కుండిన పురంబుఁ జూడ నని ప్రతిజ్ఞ సేసి, తత్సమీపంబున నుండె నివ్విధంబున. | 1781 |
| క. |
రాజీవలోచనుఁడు హరి, రాజసమూహముల గెల్చి రాజస మొప్పన్ రాజిత యగు తన పురికిని, రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్. |
1782 |