| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| వ. | అంత న య్యాదవేంద్రునినగరంబు సమారబ్ధవివాహకృత్యంబును, బ్రవర్తమానగీతవాద్యనృత్యంబును, బ్రతిగృహాలంకృతవిలసితాశేషనరనారీవర్గంబును, బరిణయమహోత్సవసమాహూయమానమహీపాలగజఘటా గండమండలదానసలిలధారాసిక్తమార్గంబును, బ్రతిద్వారమంగళాచారసంఘటితక్రముకకదళికాకర్పూర కుంకుమాగరుధూపదీపపరిపూర్ణకుంభంబును, విభూషితసకలగృహవేదికాకవాటదేహళీస్తంభంబును, విచిత్రకుసుమాంబరరత్నతోరణవిరాజితంబును, సముద్ధూతకేతనవిభ్రాజితంబును నై యుండె; న య్యవసరంబున. | 1783 |
| శా. |
ధ్రువకీర్తిన్ హరి పెండ్లి యాడె నిజచేతోహారిణిన్ మాన వై భవగాంభీర్యవిహారిణిన్ నిఖిలసంపత్కారిణిన్ సాధు బాం ధవ సత్కారిణిఁ బుణ్యచారిణిఁ మహాదారిద్ర్యసంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్. |
1784 |
| క. |
సతులుం దారును బౌరులు, హితమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో న్నతవర్ధిష్ణులకును మా, నితరోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకున్. |
1785 |
| క. |
హరి పెండ్లికిఁ గైకేయక, కురు సృంజయ యదు విదర్భ కుంతినరేంద్రుల్ వరమానందముఁ బొందిరి, ధరణీశులలోన గాఢతాత్పర్యములన్. |
1786 |
| క. |
హరి యీ తెఱఁగున రుక్మిణి, నరుదుగఁ గొనితెచ్చి పెండ్లి యాడుట విని దు ష్కరకృత్య మనుచు వెఱఁగం, దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్. |
1787 |
| ఆ. |
అనఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణతోడఁ, గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి పట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి, ప్రీతు లగుచు ముక్తభీతు లగుచు. |
1788 |
| వ. | అని చెప్పి. | 1789 |
| క. |
కువలయరక్షాతత్పర, కువలయదళనీలవర్ణకోమలదేహా! కువలయనాథశిరోమణి!, కువలయజనవినుతవిమలగుణసంఘాతా! |
1790 |
| మాలిని. |
సరసిజనిభహస్తా! సర్వలోకప్రశస్తా! నిరుపమశుభమూర్తీ! నిర్మలారూఢకీర్తీ! పరహృదయవిదారీ! భక్తలోకోపకారీ! గురుబుధజనపోషీ! ఘోరదైతేయశోషీ! |
1791 |
| గద్య. | ఇది శ్రీపరమేశ్వరకరుణాకలితకవితావిచిత్రకేసనమంత్రిపుత్త్రసహజపాండిత్యపోతనామాత్య ప్రణీతంబయిన శ్రీమహాభాగవతంబను మహాపురాణమునందు దేవకీదేవివివాహంబును, గగనవాణీశ్రవణంబును, కంసోద్రేకంబును, వసుదేవ ప్రార్థనంబును, యోగమాయాప్రభావంబును, బలభద్రుని జన్మంబును, బ్రహ్మాదిసురస్తోత్రంబును, కృష్ణావతారంబును, ఘోషప్రవేశంబును, యోగనిద్రాచరితంబును, నందపుత్త్రోత్సవంబును, పూతనాసంహారంబును, శకట భంజనంబును, తృణావర్తుమరణంబును, గర్గాగమనంబును, నారాయణాదినామనిర్దేశంబును, బాలక్రీడయును, మృద్భక్షణంబును, వాసుదేవవదనగహ్వరవిలోక్యమానాఖిలలోకాలోకనంబును, నవనీతచౌర్యంబును, యశోదారోషంబును, ఉలూఖలబంధనంబును, అర్జునతరుయుగళనిపాతనంబును, నలకూబరమణిగ్రీవులశాపమోక్షణంబును, బృందావనగమనంబును, వత్సపాలనంబును, వత్సాసురవధయును, బకదనుజవిదారణంబును, అఘాసురమరణంబును, వత్సాపహరణంబును, నూతనవత్సబాలకకల్పనంబును, బ్రహ్మవినుతియును, గోపాలనంబును, గార్దభాసురదమనంబును, కాళియఫణి మర్దనంబును, గరుడకాళియనాగవిరోధకథనంబును, ప్రలంబాసురహింసనంబును, దవానల పానంబును, వర్షర్తువర్ణనంబును, శరత్కాలలక్షణంబును, వేణువిలాసంబును, హేమంతసమయ సమాగమంబును, గోపకన్యాచరితహవిష్యవ్రతంబును, కాత్యాయనీసేవనంబును, వల్లనీ వస్త్రావహరణంబును, విప్రవనితాదత్తాన్నభోజనంబును, ఇంద్రయాగనివారణంబును, నందముకుంద సంవాదంబును, పర్వతభంజనంబును, పాషాణసలిలవర్షంబును, గోవర్ధనోద్ధరణంబును, వరుణకింకరుండు నందునిం గొనిపోయినహరి దెచ్చుటయు, వేణుపూరణంబును, గోపికాజనఘోషనిర్గమంబును, యమునాతీరవనవిహరణంబును, కృష్ణాంతర్థానంబును, ఘోషకామినీగణపరిదేవనంబును, గోపికాన్వేషణంబును, గోపికాగీతలును, హరిప్రసన్నతయును, రాసక్రీడనంబును, జలకేళియును, సర్పరూపకుం డయిన సుదర్శనవిద్యాధరుండు హరిచరణతాడనంబున నిజరూపంబు వడయుటయును, శంఖచూడుండనుగుహ్యకుని వధించుటయును, వృషభాసురవిదళనంబును, నారదోపదేశంబున హరిజన్మకథ నెఱిఁగి కంసుండు దేవకీవసుదేవుల బద్ధులం జేయుటయును, ఘోటకాసురుం డయిన కేశి యను దనుజుని వధించుటయును, నారదస్తుతియును, వ్యోమదానవమరణంబును, అక్రూరాగమనంబును, అక్రూరరామకృష్ణులసల్లాపంబును, ఘోషనిర్గమంబును, యమునాజలాంతరాళంబున నక్రూరుండు హరివిశ్వరూపమును గాంచుటయును, అక్రూరస్తవంబును, మథురానగరప్రవేశంబును, రజకవధయును, వాయకమాలికులచే సమ్మానమొందుటయును, కుబ్జాప్రసాదకరణంబును, ధనుర్భంగంబును, కంసుదుస్స్వప్నంబును, కువలయాపీడపీడనంబును, రంగస్థలప్రవేశంబును, చాణూరముష్టికుల వధయును, కంసవధయును, వసుదేవదేవకీబంధమోక్షణంబును, ఉగ్రసేనురాజ్యస్థాపనంబును, రామకృష్ణులు సాందీపనివలన విద్య లభ్యసించుటయును, సంయమనీనగరగమనంబును, గురుపుత్త్రదానంబును, ఉద్ధవునిఘోషయాత్రయును, భ్రమరగీతలును, కుబ్జావాసగమనంబును, కరినగరంబునకు నక్రూరుండు సని కుంతీదేవి నూరార్చుటయు, కంసభార్యలగు నస్తి ప్రాస్తులు జరాసంధునకుఁ గంసుమరణం బెఱింగించుటయును, జరాసంధుని దండయాత్రయును, మథురానగరనిరోధనంబును, యుద్ధంబున జరాసంధుండు సప్తదశవారంబులు పలాయితుం డగుటయు, నారదప్రేరితుండై కాలయవనుండు మథురపై దాడి వెడలుటయును, ద్వారకానగరనిర్మాణంబును, మథురాపురనివాసులం దనయోగబలంబున హరి ద్వారకానగరంబునకుఁ దెచ్చుటయు, కాలయవనుండు హరివెంటం జని గిరిగుహయందు నిద్రితుండైన ముచుకుందునికోపదృష్టివలన నీఱగుటయును, ముచుకుందుండు హరిని సంస్తుతి చేసి తపంబునకుం జనుటయును, జరాసంధుఁడు గ్రమ్మఱ రామకృష్ణులపై నేతెంచుటయును, ప్రవర్షణపర్వతారోహణంబును, గిరిదహనంబును, గిరి డిగ్గ నుఱికి రామకృష్ణులు ద్వారకకుం జనుటయు, రుక్మిణీజన్మంబును, రుక్మిణీ సందేశంబును, వాసుదేవాగమనంబును, రుక్మిణీగ్రహణంబును, రాజలోకపలాయనంబును, రుక్మి యనువాని భంగంబును, రుక్మిణీకల్యాణంబును ననుకథలు గల దశమస్కంధంబునందుఁ బూర్వభాగంబు సంపూర్ణము. | 1792 |