| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ఏకాదశస్కంధము |
| వ. | మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుం గని శుకయోగీంద్రుం ‘డయ్యా! జన్మకర్మవ్యాధి విమోచనంబునకుఁ గారణంబగు దివ్యౌషధంబు గావున శ్రీమన్నారాయణకథామృతంబుఁ గ్రోలు’ మని యిట్లనియె. | 2 |
| మ. |
బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహాబలోపేతుఁడై కలనన్ రాక్షసవీరవర్యుల వడిన్ ఖండించి, భూభార ము జ్జ్వలమై యుండఁగ ద్యూతకేళికతనం జావంగఁ గౌరవ్య స ద్బలముం బాండవసైన్యము న్నడఁచె భూభాగంబు గంపింపఁగన్. |
3 |
| వ. | అంత. | 4 |
| క. |
మునివరులు సంతసిల్లిరి, యనయము నందాదులకును హర్షం బయ్యెం; దన నిజభక్తులు యాదవ, ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్. |
5 |
| మ. |
విదితుండై సకలామరుల్ గొలువ నుర్వీభారమున్ మాన్పి, దు ర్మద సంయుక్త వసుంధరాధిపతులన్ మర్దించి, కంసాదులం దుదిముట్టన్ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్రమై. |
6 |
| సీ. |
ఈ రీతి శ్రీకృష్ణుఁడేపారఁబూతనా శకట తృణావర్త సాల్వ వత్స చాణూర ముష్టిక ధేను ప్రలంబక దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన నతఁడు భూపాలనం బమరఁ జూచి |
|
| తే. |
భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి, యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు వీరిఁ బరిమార్ప నేఁదక్క వేఱొకండు, దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు. |
7 |
| వ. | అని వితర్కించి జగదీశ్వరుం ‘డత్యున్నతవేణుకావనంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించుచందంబున యదుబలంబుల కన్యోన్యవైరానుబంధంబులు గల్పించి హతం బొన ర్చెద’ నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె. | 8 |
| క. |
‘హరిపాదకమల సేవా, పరులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప స్ఫురణంబు సంభవించెనొ, యరయఁగ సంయమివరేణ్య! యానతి యీవే ! |
9 |
| క. |
అనిన జనపాలునకు ని, ట్లని సంయమికులవరేణ్యుఁ డతిమోదముతో విను మని చెప్పఁగఁ దొడఁగెను, ఘనతరగంభీరవాక్ప్రకాశస్ఫురణన్. |
10 |