పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము
విశ్వామిత్ర వసిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబునకు వచ్చుట
వ. నిరుపమసుందరం బయిన శరీరంబు ధరియించి సమస్తకర్మతత్పరుండై పరమేశ్వరుండు యదువుల నడంగింపఁ దలఁచుసమయంబున జటావల్కలకమండలుధారులును, రుద్రాక్షభూతిభూషణముద్రా ముద్రితులును, గృష్ణాజినాంబరులును నగు విశ్వామిత్రాసిత దుర్వాసోభృగ్వంగిరఃకశ్యప వామదేవవాలఖిల్యాత్రి వసిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛావిహారంబున ద్వారకానగరంబున కరుదెంచి యందు. 11
సీ. ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ గర్ణకుండలయుగ్మఘనకపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ గలితనానారత్న ఘనకిరీటు
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు శ్రీకరపీతకౌశేయవాసు
రుక్మిణీనయనసరోజదివాకరు బ్రహ్మాదిసురసేవ్యపాదపద్ము
 
తే. దుష్టునిగ్రహ శిష్టసంతోషకరణుఁ, గోటిమన్మథలావణ్యకోమలాంగు
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ, గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.
12
క. వచ్చిన మునిసంఘములకు, విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌
మెచ్చగు కనకాసనముల, నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌.
13
క. జనములు నిను సేవింపని, దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
దనువులు నిలుకడ గావఁట, వనములలో నున్ననైన వనరుహనాభా!
14
క. తరణంబులు భవజలధికి, హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు, శరణంబులు, నీదు దివ్యచరణంబు లిలన్‌.
15
మత్త. ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై
పెక్కురూపులు దాల్తు నీ దగుపెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!
16
క. శ్రీనాయక! నీ నామము, నానాభవరోగకర్మనాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది, కానరు దుష్టాత్ము లకట కంజదళాక్షా!
17
వ. అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; ‘మదీయధ్యాననామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదికశరణంబులును, మంగళకరణంబులును నగు’ ననియును, ‘నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁజేయుదు’ ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ ‘మీర లిచ్చటికి వచ్చిన ప్రయోజనం బేమి?’ యనిన వారలు ‘భవదీయపాదారవింద సందర్శనార్థంబుకంటె మిక్కిలి విశేషం బొండెద్ది?’ యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్ర చకోరంబులం గ్రోలి యథేచ్ఛావిహారులై ద్వారకానగరంబున కనతిదూరంబున నుండు పిండారకంబను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత. 18
క. దర్పించి యాదవులు తమ, నేర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం
బేర్పడ శృంగారించియుఁ, గర్పూరసుగంధిపోల్కిఁ గావించి యొగిన్‌.
19
ఉ. మూఁకలు గూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం
బోకలఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం
‘బ్రాకటమైన యీ సుదతిభారపు గర్భమునందుఁ బుత్త్రుఁడో
యేకతమందు బాలికయొ యేర్పడఁ జెప్పుఁ’ డటన్న నుగ్రులై.
20
క. యదుడింభకులను గనుఁగొని, ‘మదయుతులై వచ్చి’ రనుచు మదిలో రోషం
బొదవఁ గనుఁగొనల నిప్పులు, సెదరఁగ ‘హాస్యంబు సనునె చేయఁగ’ ననుచున్‌.
21
క. ‘వాలాయము యదుకుల ని, ర్మూలకరం బైనయట్టి ముసలం బొక టీ
బాలిక కుదయించును బొం, డాలస్యము లే’ దటంచు నటఁ బల్కుటయున్‌.
22
వ. మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొని చని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పితమాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె. 23
క. ‘మది సెడి కన్నులు గానక, మదయుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
గదిసి కులక్షయకారణ, విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?
24
క. ధరణీసురశాపమునకు, హరిహరబ్రహ్మాదులైన నడ్డము గలరే?
నరు లనఁగ నెంతవారలు, గర మరుదుగఁ బూర్వజన్మకర్మముఁ ద్రోవన్‌?
25
వ. అది గావున యతినిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబు లే’ దని పరమేశ్వరుండు వారలం జూచి ‘సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధుకబంధంబులఁ గలిపి రండు; పొండ’ ని జగద్విభుండైన కృష్ణుం డాన తిచ్చిన, వారు నట్లచేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదర గతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె’ నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె. 26
క. చిత్తం బే క్రియ నిలుచుం?, జిత్తజగురుపాదపద్మసేవ సదా య
త్యుత్తమ మని వసుదేవుఁడు, చిత్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా!
27
వ. అని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె. 28
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - EkAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )