| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ఏకాదశస్కంధము |
| క. |
వినుము నృపాలక! సెప్పెద, ఘనమై విలసిల్లు పూర్వకథ గల దదియున్ మును ద్వారక కేతెంచియు, నొనరఁగ నారదుఁడు గృష్ణు నొయ్యనఁ గాంచెన్. |
29 |
| వ. | అట్లు దేవముని కృష్ణసందర్శనార్థం బరుగుదెంచి తద్గృహాభ్యంతరమున కరిగిన, వసుదేవుం డ మ్మునీంద్రుని నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, కనకాసనాసీనుం గావించి, యుచితకథావినోదంబులం బ్రొద్దు పుచ్చుచు నిట్లనియె; ‘ఏ నరుండు నారాయణచరణసరసీరుహభజనపరాయణత్వంబు నిరంతరంబు నొందం; డట్టివానికి మృత్యువు సన్నిహితంబై యుండు; నీ దర్శనంబునం గృతార్థుండ నైతి; నచ్యుతానంత గోవింద నామస్మరణైకాగ్ర చిత్తులైన మీవంటి పుణ్యపురుషుల సమాగమంబున లోకులు సుఖాశ్రయులయి యుండుదురు; దేవతాభజనంబు సేయువారిని గీర్వాణులు ననుగ్రహింతు; రట్లు సజ్జనులును దీనవత్సలులు నగువారలు పూజనాది క్రియలచే నా దేవతలను భక్తి సేయుదురు; కావున శ్రీ మహాభాగవతకథాసమూహంబులఁ గల ధర్మంబు లడిగెద; నే యే ధర్మంబులు శ్రవణసుఖంబులుగా వినిన దండధరకింకరతాడనంబులం బడక, ముకుందచరణారవింద వందనాభిలాషులయి పరమపదప్రాప్తు లగుదు; రా ధర్మంబు లానతిమ్ము;తొల్లి గోవిందునిం బుత్రుఁగాఁ గోరి ముక్తిమార్గం బెఱుంగలేక దేవతామాయం జేసి చిక్కి చిత్తవ్యసనాంధకారంబగు సంసారంబునం దగులువడి యున్నవాఁడ; హరికథామృతంబు వెల్లిగొల్పు; మట్లయిన సుఖంబు గలుగు ననిన వసుదేవ కృతప్రశ్నుండైన నారదుండు వాసుదేవకథాప్రసంగసల్లాపహర్షసమేతుండై సంతసం బంద నిట్లనియె. | 30 |
| క. |
నను నీవు సేయు ప్రశ్నము, జనసన్నుత! వేదశాస్త్రసారాంశంబై ఘనమగు హరిగుణకథనము, విను మని, వినిపింపఁ దొడఁగె వేడ్క దలిర్పన్. |
31 |
| క. |
అతిపాపకర్ము లైనను, సతతము నారాయణాఖ్యశబ్దము మదిలో వితతంబుగఁ బఠియించిన, చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే? |
32 |
| వ. | అట్లు గావునఁ బరమేశ్వరభక్తి జనకంబై కైవల్యపద ప్రాప్తికరంబయి యొప్పుచున్న విదేహర్షభ సంవాదంబు నాఁ బరఁగు నొక్క పురాతనపుణ్యకథావిశేషం బెఱింగించెద, సావధాన మనస్కుండవై యాకర్ణింపు’ మని యిట్లనియె. | 33 |
| తే. |
‘వినుము స్వాయంభువుండను మనువునకును, రమణ నుదయించెనఁట ప్రియవ్రతుఁ డనంగఁ దనయు; డాతని కాగ్నీధ్రుఁ డనఁగ సుతుఁడు, జాతుఁ డయ్యెను భువనవిఖ్యాతుఁ డగుచు. |
34 |
| వ. | ఆ యాగ్నీధ్రునకు నాభి యను ప్రాజ్ఞుండగు తనూభవుం డుదయించి బలిచక్రవర్తితో మైత్రింజేసి ధారుణీభారంబు పూని యాజ్ఞాపరిపాలనంబున నహితరాజన్యరాజ్యంబులు స్వవశంబులు గావించుకొని యుండె; నంతట నాభికి సత్పుత్రుం డయిన ఋషభుండు పుట్టె; నతండు హరిదాసుండై సుతశతకంబుఁ బడసె; నందగ్రజుం డయిన భరతుం డను మహానుభావుండు నారాయణపరాయణుండై యిహలోక సుఖంబులం బరిహరించి, ఘోరతపం బాచరించి జన్మత్రితయంబున నిర్వాణసుఖపారవశ్యంబున సకలబంధ విముక్తుండై వాసుదేవపదంబు నొందె; నాతనిపేర నతం డేలిన భూఖండంబు భారతవర్షం బను వ్యవహారంబున నెగడి జగంబులఁ బ్రసిద్ధం బయ్యె; మఱియు నందుఁ దొమ్మండ్రు కుమారులు బలపరాక్రమ ప్రభావరూపసంపన్నులయి నవఖండంబులకు నధిష్ఠాత లైరి; వెండియు వారలలో నెనుబదియొక్కండ్రు కుమారులు నిత్యకర్మానుష్ఠానపరతంత్రులై విప్రత్వం బంగీకరించి; రందుఁ గొందఱు శేషించినవారలు కవిహర్యంతరిక్ష ప్రబుద్ధపిప్పలాయ నావిర్హోత్ర ద్రమిళ చమస కరభాజను లనం బరఁగు తొమ్మం డ్రూర్ధ్వరేతస్కు లయి బ్రహ్మవిద్యావిశారదు లగుచు, జగత్త్రయంబును బరమాత్మస్వరూపంబుగాఁ దెలియుచు ముక్తులై యవ్యాహతగమనులగుచు, సురసిద్ధసాధ్యయక్షగంధర్వ కిన్నరకింపురుష నాగలోకంబులందు స్వేచ్ఛా విహారంబు సేయుచు నొక్కనాఁడు. | 35 |
| క. |
జగదేకనాథుగుణములు, మిగులఁగ సంస్మరణతోడ మీఱినభక్తిం బగలును రాత్రియు సంధ్యలుఁ, దగిలి జితేంద్రియులు నైన తపసులు ధాత్రిన్. |
36 |
| క. |
ఊహింపఁ బుణ్యుఁడైన వి, దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో గేహము వెడలి యెదుర్కొని, మోహవివర్జితులఁ బుణ్యమునిసంఘములన్. |
37 |
| తే. |
అర్ఘ్యపాద్యాదివిధులను నర్థితోడఁ, బూజ గావించి వారలఁ బొలుపు మిగుల నుచితపీఠంబులందును నునిచి యెలమి, నవమునిశ్రేష్ఠులను భూమినాయకుండు. |
38 |
| క. |
వారల కిట్లను ‘మీరలు, గారవమున విష్ణుమూర్తిఁ గైకొనిన మహా భూరితపోధనవర్యులు, సారవిహీనంబు లైన సంసారములన్. |
39 |
| క. |
ఏ రీతిఁ గడప నేర్తురు?, క్రూరులు బహుదుఃఖరోగకుత్సిత బుద్ధుల్ నీరసులు నరులు గావున, నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే? |
40 |
| వ. | మఱియు సకలజంతుసంతానంబుకంటె మానుషాకారంబు నొందుట దుర్లభం; బంతకంటె నారాయణ చరణయుగళస్మరణపరాయణు లగుట దుష్కరంబు; గావున నాత్యంతికంబగు క్షేమం బడుగవలసెఁ; బరమేశ్వరుండు ప్రపత్తినిష్ఠులకు సారూప్యం బెట్లొసంగు నత్తెఱం గానతిం’ డనిన విని విదేహభూపాలునకు హరికథామృతపానాతిపరవశులైన మునిసమాజంబునందుఁ గవి యను మహానుభావుం డిట్లని చెప్పం దొడంగె; ‘నరిషడ్వర్గంబునందు నేషణత్రయంబుచేతం దగులువడి మాత్సర్యయుక్తచిత్తుండగునట్టివాని కెవ్విధంబున నచ్యుతపాదారవిందభజనంబు సంభవించు? విశ్వంబును నాత్మయు వేఱుగా భావించువానికి భీరుత్వం బెట్లులే? దవిద్యాంధకారమగ్నులకు హరిచింతనం బెట్లు సిద్ధించు? నట్టి నరుండు తొంటికళేబరంబు విడిచి పరతత్త్వం బెబ్భంగిం జేరు? ముకుళీకృతనేత్రుండయిననరుండు మార్గభ్రమణంబునఁదొట్రుపాటు వడి చను చందంబున విజ్ఞానవిమలహృదయభక్తిభావనావశంబు లేకున్నఁబరమపదంబు వీరి కెవ్విధంబునం గలుగు? నని యడిగితివి; గావునఁజెప్పెద; సావధానుండవై యాకర్ణింపుము. | 41 |
| క. |
కరణత్రయంబుచేతను, నరుఁ డే కర్మంబు సేయు నయ్యైవేళన్ హరి కర్పణ మని పలుకుట, పరువడి సుజ్ఞాన మండ్రు పరమమునీంద్రుల్. |
42 |
| వ. | జ్ఞానాజ్ఞానంబులందు సంకలితుండైన స్మృతివిపర్యయంబు నొందు; నట్లు గావున గురుదేవతాత్మకుం డయి, బుద్ధిమంతుండైన మర్త్యుండు శ్రీ వల్లభు నుత్తమోత్తమునిఁగాఁ జిత్తంబునఁ జేర్చి సేవింపవలయు; స్వప్నమనోరథేచ్ఛాద్యవస్థలయందు సర్వసంకల్పనాశం బగుటంజేసి, వానిఁ గుదియం బట్టి నిరంతర హరిధ్యానపరుండైన వానికిఁ గైవల్యంబు సులభముగఁ గరతలామలకంబై యుండు. | 43 |
| సీ. |
సంతతంబును గృష్ణసంకీర్తనంబులు వీనుల కింపుగ వినఁగవలయు హర్షంబుతోడుత హరినామకథనంబు పాటలనాఁటలఁ బరఁగవలయు నారాయణునిదివ్యనామాక్షరంబులు హృద్వీథి సతతంబు నెన్న వలయుఁ గంజాక్షులీలలు కాంతారముల నైన భక్తియుక్తంబుగాఁ బాడ వలయు |
|
| తే. |
వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని, నొడువుచును లోకబాహ్యత నొందవలయు నింతయును విష్ణుమయ మని యెఱుఁగ వలయు, భేద మొనరింప వలవదు మేదినీశ! |
44 |
| వ. | అనిన విదేహభూపాలుండు ‘భాగవతధర్మం బెద్ది? యే ప్రకారంబునం బ్రవర్తించు? వారల చిహ్నంబు లెవ్వి? యంతయు నెఱింగింప మీర యర్హులరు’ అనిన నందులో హరి యను మహాత్ముం డిట్లనియె. | 45 |
| తే. |
సర్వభూతమయుండైన సరసిజాక్షుఁ డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు శంఖచక్రధరుం డంచుఁ జనెడువాఁడు, భక్తిభావాభిరతుఁడు నో భాగవతుఁడు. |
46 |
| క. |
‘వర్ణాశ్రమధర్మంబుల, నిర్ణయకర్మములఁ జెడక నిఖిలజగత్సం పూర్ణుఁడు హరి’ యను నాతఁడె, వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా! |
47 |
| వ. | ఇట్లు సర్వసంగపరిత్యక్తుండై నిఖిలాంతరాత్ముండై పరమేశ్వరు డరుణగభస్తికిరణసహస్రంబుల లోకత్రయంబుం బావనంబు సేయుచందంబునం దన చరణారవిందరజఃపుంజంబుచేతం బవిత్రంబు సేయుచు, సురాసుర జేగీయమాన సేవ్యంబైన జనార్దన పాదారవిందంబులకు వందనాభిలాషుఁడై భక్తియు లవమాత్రంబునుం జలింపనీక సుధాకరోదయంబున దివాకరజనితతాపనివారణం బయిన భంగి నారాయణాంఘ్రినఖమణిచంద్రికానిరస్తహృదయతాపుండై యాత్మీయభక్తిరశనానుబంధ బంధురంబైన వాసుదేవ చరణసరోరుహధ్యానానందపరవశుం డగు నతండు భాగవతప్రధానుం’ డని యెఱింగించిన విని విదేహుం డిట్లనియె. | 48 |
| క. |
గజరాజవరదుగుణములు, త్రిజగత్పావనము లగుటఁ దేటపడంగా సుజనమనోరంజకముగ, విజితేంద్రియ! వినఁగ నాకు వేడుక పుట్టెన్. |
49 |
| వ. | అనిన విని యంతరిక్షుం డను ఋషిశ్రేష్ఠుం డిట్లనియె. | 50 |
| క. |
పరమబ్రహ్మ మనంగాఁ, బరతత్త్వ మనంగఁ బరమపద మనఁగను నీ శ్వరుఁడనఁ గృష్ణుఁడన జగ, ద్భరితుఁడు నారాయణుండు దా వెలుఁగొందున్. |
51 |
| వ. | అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మంబునందుఁ దనకు విపర్యయంబుగా జననం బయిన జ్ఞానంబె విష్ణుమాయ యనంబడుఁ; బరమేశ్వరుఁ డట్టి మాయచేత జగంబు నిర్మించి నిశ్చింతుండై యుండు; నింద్రియార్థ భ్రమణంబు సేసెడు దుర్మతులకు సుషుప్త్యాద్యవస్థలు వరుసన కలుగుటంజేసి పరమేశ్వరునిం బొందరామియను నాలుగవ యవస్థయుఁ గలుగు; స్వప్నంబునందు గ్రాహ్యగ్రాహక గ్రహణంబులను త్రివిధభేదంబు గలిగియుండు, నీ చందంబున నవిద్యాంధకార సంవృతం బై మూఁడువిధంబులఁబర్యవసించు మనోరథంబు స్వప్నావస్థయం దణంగిన క్రియఁ ద్రివిధం బగు మాయయు నాత్మయందు లీనంబగుఁ; బరమేశ్వరుండు మొదలం బృథివ్యాది మహాభూతమయం బయిన సృష్టిని గలుగఁజేసి, యందుఁబంచభూతాత్మకం బయిన యాత్మ కేకాదశేంద్రియం బులచేత భేదంబు పుట్టించుచు, గుణంబులచేత గుణంబు లంగీకరించుచు, నాత్మయందుఁ బ్రద్యోతిత గుణంబులవలన గుణానుభవంబుఁజేయుచు నున్నవాఁడై, సృష్టి నాత్మీయంబుగాభావించు; దేహి కర్మమూలంబున నైమిత్తిక కర్మంబుల నాచరించుచుఁ దత్ఫలం బంగీకరించి దుఃఖైకవశుండై వర్తించుఁ; బెక్కు దుఃఖంబులం బడిన యా దేహి కర్మఫలప్రాప్తుం డగుచు భూత సంప్లవపర్యంతంబు పరవశుండై జన్మమరణంబులం బొరలుచుండు; నంత్యకాలం బాసన్నం బయిన ద్రవ్యగుణస్వరూపం బగు జగంబు ననాదినిధనం బగు కాలంబు ప్రకృతిం బొందించు; నటమీఁద శతవర్షంబులు వర్షంబు లేమిచేత నత్యుగ్రలోక లోచనుతేజంబున సకలలోకంబులు దహింపఁబడు; నంత నధోలోకంబుననుండి సంకర్షణముఖజనితానలం బూర్ధ్వ శిఖాజాలంబుల వాయుసహాయంబై దిక్కులయం దెల్లఁబ్రవర్తించు; నటమీఁద సంవర్తక వలాహక గణంబులు నూఱుహాయనంబులు సలిలధారాపాతంబుగా వర్షంబు గురియు; నందు విరాడ్రూపంబు లీనం బగు; నంత నీశ్వరుం డింధనాగ్నిచందంబున నవ్యక్తంబుఁ బ్రవేశించు; తదనంతరంబ ధరణీ మండలంబు వాయుహృతగంధంబై కబంధరూపంబుఁ దాల్చు; నా జలంబు హృతరసంబై తేజోరూపంబు నొందు; నా తేజంబు తమోనిరస్తంబై వాయువం దడంగు; నా గంధవహుండు స్పర్శవిరహితుండయి యాకాశంబునందు సంక్రమించు; నా విష్ణుపదంబును విగత శబ్దగుణంబు గలదియై యాత్మయం దడంగు; నింద్రియంబులును మనంబును బుద్ధియు వికారంబులతోడ నహంకారంబుఁ బ్రవేశించు; నా యహంకారంబును స్వగుణయుక్తంబై పరమాత్మునిం జేరు; నిట్లు త్రివర్ణాత్మకయై సర్గస్థితిలయకారిణి యగు మాయ యిట్టిది యని తత్స్వరూపమాహాత్మ్యంబులు వివరించిన నరపాలుం డిట్లనియె. | 52 |
| ఉ. |
‘జ్ఞానవిహీనులైన నరసంఘముఁ గానఁగరాని మాయఁ దా లోన నడంచి యెట్లు హరిలోకముఁ జెందుదు రంతయుం దగన్ భూనుత! సత్యవాక్యగుణభూషణ! యిక్కథ వేడ్కతోడుతన్ బూనికఁ జెప్పు మన్నను బ్రబుద్ధుఁడు నిట్లను గారవంబునన్. |
53 |
| వ. | సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షీణంబు నొంద, దేహకళత్రమిత్ర భ్రాతృమమత్వ పాశబద్ధులై విడివడు నుపాయంబు గానక సంసారాంధకారమగ్ను లయి గతాగతకాలంబుల నెఱుంగక దివాంధంబులగు జంతుజాలంబులభంగి జన్మజరారోగ విపత్తి మరణంబు లందియు, శరీరంబ మే లనుచుఁ బ్రమోద మోహమదిరాపానమత్తులై విషయాసక్తతం జిక్కి తమ్ముఁ దా రెఱుంగక యుండి విరక్తిమార్గంబు దెలియక వర్తించు మూఢులగు జనంబుల పొంతలఁ బోవక కేవలనారాయణభక్తిభావంబు గల సద్గురుం బ్రతిదినంబును భజియించి; సాత్త్వికంబు, భూతదయయును, హరికథామృతపానంబును, బ్రహ్మచర్య వ్రతంబును, విషయంబుల మనంబు సేరకుండుటయు, సాధుసంగంబును, సజ్జనమైత్రియు, వినయ సంపత్తియు, శుచిత్వంబును, తపంబును, క్షమయు, మౌనవ్రతంబును, వేదశాస్త్రాధ్యయన తదర్థానుష్ఠానం బులును, నహింసయు, సుఖదుఃఖాదిద్వంద్వసహిష్ణుతయు, నీశ్వరుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షుత్వంబును, జనసంగవర్జనంబును, వల్కలాదిధారణంబును, యదృచ్ఛాలాభసంతుష్టియు, వేదాంతశాస్త్రార్థజిజ్ఞాసయును, దేవతాంతరనిందావర్జనంబును, గరణత్రయశిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాదిగుణవిశిష్టత్వంబును, గృహారామక్షేత్రకళత్రపుత్త్ర విత్తాదుల హరి కర్పణంబు సేయుటయు, నితర దర్శనవర్జనంబు సేయుటయును భాగవతోత్తమధర్మంబు లని చెప్పి యిట్లనియె. | 54 |
| క. |
‘హరిదాసుల మిత్రత్వము, మురరిపుకథ లెన్నికొనుచు మోదముతోడన్ భరితాశ్రుపులకితుండై, పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!’ |
55 |
| వ. | అనిన రాజేంద్రుండు వారల కిట్లనియె. ‘భాగవతులారా! సకలలోకనాయకుం డగు నారాయణుం డనంబరఁగిన పరమాత్ముని ప్రభావంబు వినవలతు; నానతిం డనినఁ బిప్పలాయనుం డిట్లనియె. | 56 |
| సీ. |
నరవర! విను జగన్నాథునిచారిత్ర మెఱిఁగింతు నీమది కింపు మిగుల లసదుద్భవస్థితిలయకారణం బయి దేహేంద్రియాదులఁ దిరము గాఁగఁ జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు జ్వాలల ననలుండుఁ జనని పగిది నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు పొరయక సుషిరంబుఁ బొందు సత్య |
|
| తే. |
మనఁగ సత్త్వరజస్తమోమయగుణంబు, మహదహంకారరూపమై మహిమ వెలయు చేతనత్వంబు గలదేని జీవ మందు, రిదియ సదసత్స్వరూపమై యెన్నఁబడును. |
57 |
| వ. | దీనికిం బెక్కైనది పరమాత్మగా నెఱింగి కమలసంభవాదులు నుతియింతు; రిట్టి పరమాత్మ స్థావర జంగమంబుల నధిష్ఠించి వృద్ధిక్షయంబులం బొందక నిమిత్తమాత్రంబునం దరులతాదులందు జీవంబు లేక తదంతరస్థుండై వర్తించు; నంత సర్వేంద్రియావృతం బైన యాకారంబు నష్టంబైన మనంబునుం బాసి శ్రుతివిరహితుండై తిరుగుచుండు; నిర్మలజ్ఞానదృష్టి గలవానికి భానుప్రభాజాలంబు దోఁచిన క్రియను, సుజ్ఞానవంతుండు హరిభక్తిచేత గుణకర్మార్థంబులైన చిత్తదోషంబులు భంజించి భగవత్సదనంబు సేరు’ ననిన విని రా జిట్లనియె. | 58 |
| క. |
‘పురుషుం డేయే కర్మము, పరువడిఁ గావించి పుణ్యపరుఁడై మనుఁ? దా దురితములుఁ దొరఁగి మురరిపు, చరణయుగం బెట్లు సేరు? సన్మునివర్యా!’ |
59 |
| వ. | అనిన విని యం దావిర్హోత్రుం డి ట్లనియెఁ; ‘గర్మాకర్మ వికర్మ ప్రతిపాదకంబు లగు శ్రుతివాదంబు లలౌకికవర్ణితంబు; లట్టి యామ్నాయంబులు సర్వేశ్వరస్వరూపంబులు గాన విద్వాంసులు నెఱుంగ లే; రవి కర్మాచారంబు లనంబడు; మోక్షంబుకొఱకు నారాయణభజనంబు పరమపావనంబు; వేదోక్తంబుల నాచరింపక ఫలంబులకు వాంఛ సేయువార లనేక జన్మాంతరంబులం బడయుదురు; మోక్షంబు నపేక్షించువాఁడు విధిచోదిత మార్గంబున హరిం బూజింపవలయు; నట్టి పూజాప్రకారం బెట్లనినఁ, బవిత్రగాత్రుం డయి జనార్దనుసన్నిధిం బూతచిత్తుండై, షోడశోపచారంబులఁ జక్రధరు నారాధించి, గంధపుష్పధూపదీప నైవేద్యంబులు సమర్పించి, సాష్టాంగదండప్రణామంబు లాచరించి, భక్తిభావనావిశేషుండగు నతండు హరిం జేరు’ నని చెప్పిన విని విదేహుం డిట్లనియె; ‘నీశ్వరుం డే యే కర్మంబుల నాచరించె, నంతయు నెఱింగింపు’ మనినఁ ద్రమిళుం డిట్లనియె. | 60 |
| క. |
తారల నెన్నఁగ వచ్చును; భూరేణుల లెక్కవెట్టఁబోలును ధాత్రిన్; నారాయణగుణకథనము, లారయ వర్ణింపలేరు హరబ్రహ్మాదుల్. |
61 |
| వ. | అట్లు గావున నాత్మసృష్టంబైన పంచభూతనికరంబును పురం బొనరించి, యందు నిజాంశంబునం బ్రవేశించి, సగుణనిష్ఠుండై నారాయణాభిధానంబు గల ఋషీశ్వరుండగు పరమేశ్వరుండు వెలుఁగొందె; నతని దశేంద్రియంబులచేఁ బాలితంబులైన దేహంబులు ధరించి, జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు గలుగుటం జేసి గుణనిష్ఠుండయి రజస్సత్త్వతమోగుణంబుల బ్రహ్మవిష్ణురుద్రమూర్తు లనంబరఁగి, త్రిగుణాత్మకుం డనంబడు నారాయణాఖ్యునిచరిత్రం బెఱింగించెద; నాకర్ణింపుము. | 62 |
| క. |
ధర్ముండు దక్షపుత్త్రిక, నిర్మలమతిఁ బెండ్లియాడి నెఱిఁ బుత్త్రుని స త్కర్ముని నారాయణ ఋషి, నర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమమందున్. |
63 |
| తే. |
అట్టి నారాయణాహ్వయుండైన మౌని, బదరికాశ్రమమందు నపారనిష్ఠఁ దపముఁగావింప బలభేది దలఁకి మదిని, మీనకేతను దివిజకామినులఁ బనిచె. |
64 |
| వ. | వారు నారాయణాశ్రమంబునకు నతని తపోవిఘ్నంబు సేయ వచ్చు నప్పు డవ్వనంబు సాల రసాల బిల్వ కదళీ ఖర్జూర జంబు జంబీర చందన పున్నాగ మందారాది వివిధ వృక్ష నిబిడంబును, పుష్పఫల భరిత శాఖావనమ్ర తరులతా బృందంబును, మాధవీ కుంజమంజరీ పుంజ మకరంద పానమత్త మధుకర నికర ఝంకారరవ ముఖరిత హరిదంతరంబును, గనక కమల కహ్లార విలసత్సరో విహరమాణ చక్రవాక బక క్రౌంచ మరాళదంపతి మండల మండితంబును, మృణాళ భోజనాసక్త సారసచయ చంచూపుట విపాటిత కమలముకుళ కేసర విసర వితత ప్రశస్త సరోవరంబునునై వెలయు నవ్వనంబున నిందువదన లందంద మందగమనంబులం జెందు ఘర్మజలబిందుబృందంబులు నఖాంతంబుల నోసరింపుచు డాయం జను నప్పుడు. | 65 |
| చ. |
మదనునిబాణజాలముల మగ్నతఁ బొందక ధైర్యవంతుఁడై ముదితలవాఁడిచూపులకు మోహము నొందక నిశ్చలాత్ముఁడై హృదయమునందు నచ్యుతు రమేశు ననంతు జగన్నివాసునిన్ వదలక భక్తి నిల్పుకొని వారికి నిట్లనె మౌని పెంపునన్. |
66 |
| క. |
‘జంభారిపంపునను మీ, రంభోరుహవదనలార! యరుదెంచితి; రా శుంభ ద్విహారవాంఛా, రంభంబునఁ దిరుగుఁ’ డనిన లజ్జించి వెసన్. |
67 |
| సీ. |
‘దేవమునీంద్ర! నీ దివ్యచారిత్రంబు నెఱిఁగి సన్నుతిసేయ నెవ్వఁ డోపుఁ? బుత్త్ర మిత్ర కళత్ర భోగాదులను మాని తపము గావించు సద్ధర్ములకును విఘ్నముల్ సెందునే? విశ్వేశుఁ గొల్చిన యతనికి నంతరాయంబు గలదె? కామంబుఁ గ్రోధంబుఁగల తపస్వితపంబు పల్వలోదకములభంగిఁగాదె? |
|
| తే. |
నిన్ను వర్ణింప నలవియే? నిర్మలాత్మ!, రమణ లోఁగొను మా యపరాధ’ మనుచు సన్నుతించిన నతఁడు ప్రసన్నుఁ డగుచుఁ, దనదు సామర్థ్య మెఱిఁగింపఁ దలఁచి యపుడు. |
68 |
| వ. | అ మ్మునీశ్వరుండు పరమాశ్చర్యనిధానంబుగా నిజతనూరుహంబులవలనం ద్రికోటికన్యకా నివహంబుల నుద్భవింపం జేసిన, గంధర్వవిబుధకామినీసముదయంబులు పరమాద్భుతభయంబులు మనంబులం బొడమ సన్నుతించి, య వ్విలాసినీసమూహంబులో నూర్వశి యను దానిం గొని చని, పాకశాసను సభాసదనంబునం బెట్టి తద్వృత్తాంతం బంతయు విన్నవించిన నాశ్చర్యయుక్తహృదయుం డయి సునాసీరుం డూరకుండె; నట్టి నారాయణ మునీశ్వరుచరిత్రంబు వినువారలు పరమ కల్యాణగుణవంతు లగుదు రని చెప్పిన. | 69 |
| తే. |
ఋషభునకు నాత్మయోగ మీ రీతిఁ జెప్పె; నచ్యుతుఁడు భూమిభారము నడఁప నంత సొరిది నవతారములు దాల్చి సొంపు మీఱ, రాత్రిచరులను జంపె నీరసముతోడ. |
70 |
| వ. | అట్టి పరమేశ్వరుని లీలాగృహీతంబు లగు మత్స్యకూర్మవరాహ నారసింహ వామన రామ రఘురామ రామ బుద్ధ కల్క్యాద్యవతారంబు లనేకంబులు గలవు; వాని నెఱిఁగి నుతియింప శేష భాషాపతుల కైన నలవి గాదు; మఱియును. | 71 |
| సర్వలఘుసీసము. |
నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ గగనచరనదిజనిత! నిగమవినుత! జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర పరిమళిత నిజహృదయ! ధరణిభరణ! ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ కటిఘటిత రుచిరతర కనకవసన! భుజగరిపువరగమన! రజతగిరిపతివినుత! సతతజపరత! నియమసరణి చరిత! |
|
| తే. |
తిమికమఠకిటినృహరిముదితబలి నిహి, త పద పరశుధర దశవదన విదళన! మురదమన కలికలుష సముదపహరణ!, కరివరద! మునినరసుర గరుడవినుత! |
72 |
| వ. | ఇ వ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసంబు లనంతంబులు గలవు; మనోవాక్కాయ కర్మంబుల హరిపూజనంబు సేయక, విపరీతగతులం దిరుగుచుండు జడుల కెవ్విధంబు గతి గలుగు? ననిన నప్పు డప్పుడమిఱేఁ డప్పరమపురుషుం జూచి యట్టి జడులు ముక్తి నొందు నుపాయం బెట్టు లంతయు నెఱింగింపుఁ’ డనినఁ జమసుం డిట్లనియె. | 73 |
| సీ. |
హరిముఖ బాహూరు వరపదాబ్జములందు వరుసఁ జతుర్వర్ణ వర్గసమితి జనియించె; నందులో సతులును శూద్రులు హరిఁదలంతురు; కలిహాయనముల వేదశాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మ కర్తలై విప్రులు గర్వ మెసఁగి హరిభక్తిపరులను హాస్యంబు సేయుచు నిరయంబు నొందుట నిజము గాదె? |
|
| తే. |
మృదుల పక్వాన్న భోజనములను మాని, జీవహింసకుఁ జనువానిఁ జెందు నఘము; హరి నుతింపక స్త్రీలోలుఁ డైనవాఁడు, నరకవాసుండు నగుచుండు ననవరతము. |
74 |
| వ. | అట్లు గావున గృహ క్షేత్ర పుత్త్ర కళత్ర ధన ధాన్యాదులందు మోహితుం డయి ‘ముక్తిమార్గంబు లప్రత్యక్షంబు’ లని నిందించువాఁడును, హరిభక్తివిరహితుండును, దుర్గతిం గూలుదు రని మునివరుం డానతిచ్చిన విదేహుం డిట్లనియె. | 75 |
| ఆ. |
ఏ యుగంబునందు నే రీతి వర్తించు?, నెట్టి రూపువాఁడు? నె వ్విధమున మును నుతింపఁబడెను మునిదేవగణముచే, విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు?” |
76 |
| వ. | అనిన విని యందుఁ గరభాజనుం డిట్లనియె; ‘ననేకావతారంబులు నానారూపంబులును బహువిధ వర్ణంబులునుం గలిగి, రాక్షసులను సంహరించి, దుష్టజన నిగ్రహంబును శిష్టజన పరిపాలనంబును జేయుచుఁగృతయుగంబున శుక్లవర్ణుండై చతుర్బాహుండై జటావల్కల కృష్ణాజినోత్తరీయ జపమాలికా దండ కమండలు ధరుండయి హరి నిర్మలతపోధ్యానానుష్ఠానగరిష్ఠులైన పురుష శ్రేష్ఠులచేత హంసుండు సువర్ణుండు వైకుంఠుండు ధర్ముం డమలుండు యోగేశ్వరుం డీశ్వరుండు పురుషుం డవ్యక్తుండు పరమాత్ముం డను దివ్యనామంబులం బ్రసిద్ధి వహించి గణుతింపంబడుఁ; ద్రేతాయుగంబున రక్తవర్ణుండయి బాహుచతుష్క మేఖలాత్రయ విశిష్టుండయి హిరణ్యకేశుండును, వేదత్రయస్వరూపుండును, స్రుక్ స్రువాద్యుపలక్షణ శోభితుండు నయి విష్ణుయజ్ఞ పృశ్నిగర్భ సర్వదేవోరుక్రమ వృషాకపి జయంతోరుగాయాఖ్యల బ్రహ్మవాదులచేత నుతియింపంబడు; ద్వాపరంబున శ్యామల దేహుండును పీతాంబరధరుండును బాహుద్వయోపశోభితుండును దివ్యాయుధధరుండును శ్రీవత్సకౌస్తుభ వనమాలికావిరాజమానుండును మహారాజోపలక్షణుండునై జనార్దన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ నారాయణ విశ్వరూప సర్వభూతాత్మకాది నామంబుల వెలసి, మూర్ధాభిషిక్తులచేత సన్నుతింపంబడు. కలియుగంబునఁ గృష్ణవర్ణుండును గృష్ణనామకుండునునై భక్త సంరక్షణార్థంబు పుండరీకాక్షుండు యజ్ఞ సంకీర్తనంబులచేతం బ్రస్తుతింపంబడు; హరి రామ నారాయణ నృసింహ కంసారి నలినోదరాది బహువిధనామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతియింపుదురు; మఱియును. | 77 |
| తే. |
ద్రవిడదేశంబునందులఁ దామ్రపర్ణి, సహ్యజాకృతమాలాది సకలనదుల కెవ్వఁ డేనియు భక్తితో నేఁగి యచటఁ, బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు. |
78 |
| వ. | ఇ వ్విధంబునఁ బ్రశంసింపఁదగిన కావేర్యాదిమహానదీ పావనజలస్నానపానదానంబులను, విష్ణుధ్యానకథాసుధారసానుభవంబుల నిరూఢులగు భాగవతోత్తములు గలిగి రేనిం జెడని పదంబునుం బొందుదు రని ఋషభకుమారుల భగవత్ప్రతిబింబంబు లయిన పరమపురుషులుం బోలె విదేహజనపాలునకు నిశ్శ్రేయః పదప్రాప్తికరంబులైన భగవద్భక్తిధర్మంబు లుపదేశించి యంతర్ధానంబు నొందిరి; మిథిలేశ్వరుండును జ్ఞానయోగం బంగీకరించి నిర్వాణపదంబు నొందె; నీ యుపాఖ్యానంబు వ్రాసినఁ బఠించిన వినిన నాయు రారోగ్యైశ్వర్యములు గలిగి పుత్త్ర పౌత్త్రవంతులై సకలకలికల్మషరహితులై విష్ణులోక నివాసు లగుదు’రని నారదుండు వసుదేవునకుం జెప్పి మఱియును. | 79 |
| సీ. |
‘కమలాక్షపదభక్తికథనముల్ వసుదేవ! విని యఘంబులఁ బాసి వెలసి తీవు భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి కైవల్యలక్ష్మియుఁ గలుగు మీఁద నారాయణుండు నీ నందనుం డను మోహ మెడలించి విష్ణుగా నెఱిఁగి కొలువు మతఁడు నీ తనయుఁడై యవతరించుటఁజేసి సిద్ధించె దేహసంశుద్ధి నీకు |
|
| తే. |
సరససల్లాప సౌహార్ద్ర సౌష్ఠవమునఁ, బావనం బైతి శిశుపాల పౌండ్ర నరక ముర జరాసంధ యవనులు ముదముతోడ, వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యు. |
80 |
| క. |
దుష్టజననిగ్రహంబును, శిష్టప్రతిపాలనంబు సేయన్ హరి దా సృష్టి నవతార మొందెను, స్రష్టృముఖానేక దివిజసంఘము వొగడన్. |
81 |
| వ. | అట్లు గావున లోకరక్షణార్థంబు గృష్ణుం డవతారంబు నొందె’ నని హరిభక్తిపరంబు లగు నుపాఖ్యానం బులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులు గృష్ణుని పరమాత్మునిగా విచారించి’రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు మునీంద్రా! యదువుల నేప్రకారంబున హరి హరియించె? సపరివారులగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకా నగర ప్రవేశం బెట్లు సేసిరి? యే మయ్యె? మఱియుఁ బరమేశ్వరకథామృతంబు వీనులలరం జవిగొనియు నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరిచారిత్రం బేరీతిఁ జాగెఁ దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు మనిన శుకుం డిట్లనియె. | 82 |