| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| చ. |
అనవుడు భీష్ముఁ డిట్టు లను నాతనితో ‘నకటా! వధింపఁగా మనుజుఁడు గర్త గాఁడు, వినుమా! యితిహాస మొకండు సెప్పెదన్; మనుజవరేణ్య! గౌతమి యనంగ శమాన్విత యొక్క భూసురాం గన యురగంబుచే సుతుఁడు గాలవశత్వముఁ బొంది యుండఁగన్. |
005 |
| చ. |
వగచుచుఁ జూడ నయ్యురగవల్లభు రజ్జునఁ గట్టి తెచ్చి య మ్మగువకుఁ జూపి ‘దీనిఁ దల మ్రందఁగ మోఁదెదఁ గోల నొండె, రెం డుగ నెఱగత్తి వ్రేసెదఁ; గడుం జెడు గీపొడపాఁప పుర్వు, నే మిగతి వధింతు?’ నంచు నొక మేటి కిరాతుఁడు రోషదీప్తుఁడై. |
006 |
| క. |
ఉన్నఁ గని యప్పడఁతి ‘యో | యన్న! విడువు భుజగనాథు’ ననవుడు నతఁ ‘డీ పిన్నాతని ప్రాణంబులు | గొన్నది యిది, దీనియుసుఱు గొనియెద’ ననియెన్. |
007 |
| వ. | అనిన నక్కోమలి యక్కిరాతుం జూచి. | 008 |
| క. |
‘విధివశమున వచ్చిన కీ | డధములు గొనియాడి వెడఁగులై, విపులభవాం బుధి మునుఁగుదురు; మునుంగరు | సధర్ములగు నుత్తములు, ప్రశాంతిఁ జులుకనై. |
009 |
| వ. | అదియునుం గాక! | 010 |
| క. |
ఈ పాముఁ జంప బ్రదుకునె | నా పుత్రుఁడు? విడువు మర్జునక!’ నావుడు ‘వాఁ డీ పేద మాట లెల్లను | గోప వివశుఁడైన నాకుఁ గొలుపవు, ముగ్ధా!’ |
011 |
| ఉ. |
కావున నెట్లుఁ జంపుదున; కాని భుజంగముఁ బోవ నీను జూ నావుడు; నింతి యర్జునక నామము నీ కవదాత భంగికిం గావలదే? మహీసురులు గా దను చొప్పునఁ దత్సహాయులుం బోవరు గాదె! యేల నినుబోఁటికిఁ గ్రూరత నాదు సన్నిధిన్? |
012 |
| సీ. |
హింసకు నొడఁబడ నే నెట్లు? ‘ననవుడు, | ‘జనబాధకము లైన జంతువులను జంపినఁ బాపంబు సమకూర’ దని పల్కె | బోయ; ‘వట్టిన రిపుఁ బొరిగొనంగ వల’ దని చెప్పె నవ్వనిత; వాఁ డహిఁ దెగఁ | జూచి జనంబులఁ గాచు టుఱదె? వృత్రుఁ జంపఁడె దేవవిభుఁడు? యజ్ఞధ్వంస | నము సేయఁడే? ఫాలనయనుఁ డట్ల |
|
| తే. |
కావె? ధర్మువు హింసలు నీవు దీని | కియ్యకొను’ మని తఱిమె; నట్లెంత దఱిమి నను దయావతి యైన యన్నాతి పాప | మునకుఁ జొరదయ్యె; బోయ కిట్లనియెఁ బాము. |
013 |
| క. |
‘ఏ నేమి తప్పు సేసితిఁ? గానవు | నెఱి నీవు లెస్సగా, మృత్యుపరా ధీనత బాలునిఁ గఱచితిఁ | గాని, వినుము! లేవు రోషకామాదు లెదన్’. |
014 |
| వ. | అనుటయు నతండు | 015 |
| క. |
‘విను! మృత్యువునకుఁ దగు సా | ధనమ వగుటఁ జేసి నిన్ను దండింపంగాఁ జను’ ననవుడుఁ’ గుమ్మరికో | లను సారెం బోలితిం దలఁచి చూడు మెడన్. |
016 |
| వ. | ఈ క్రియ నావశం బగునే? యని పల్కినం బామున కర్జునకుం డిట్లనియె. | 017 |
| తే. |
‘ఏయువాఁ డుండ, న మ్మేమి సేయు | ననక, యోపి తత్ఖండనముసేఁత పాప మండ్రె? యెవ్వరేఁ బంపఁ; గఱతు గా కేమి? క్రూరు | నిన్ను గీటడఁగించిన నింద రాదు. |
018 |
| తే. |
అదియుఁ గాక, విశేషించి యరయ బుద్ధి | గలుగునట్టి సాధనములు గారె మీరు మృత్యువున? కట్లు గావున మెలఁగ మిడుక | నీక, పొరిగొనవలయు; మి మ్మెల్లభంగి.’ |
019 |
| వ. | అనిన విని బోయకు భుజంగం బిట్లనియె. | 020 |
| తే. |
‘బుద్ధి గల్గు సాధనముల పో హవిస్సు, లరసి వేల్తురు ఋత్విజు, లా ఫలంబు గాంచు నధ్వరకర్తయ | కాక వారి కేమి పని?’ యనఁగా మృత్యు వేఁగుదెంచె. |
021 |
| క. |
చనుదెంచి పామునకు ని | ట్లను ‘నిను నేఁ గోరి పనిచినట్టుల, నన్నున్ బనిచెం గాలుం; డీ చా | వున కీవును నేను హేతువులు గా మనఘా! |
022 |
| క. |
ఇన, శశి, పావక, భూమి, గ | గన, జల, పవనాది వస్తుగతు లెల్లను గా లుని యఱచేతి వనినఁ ద | క్కిన పని సెప్పంగ నేటికిని భుజగేంద్రా! |
023 |
| క. |
విను మిట్లగు టేర్పడ నెఱిఁ | గిన నాపై నిడుదు వెట్లు, కిల్బిషముం గా లుని చెయిది నన్ను దూఱిన | నిను దూఱుట’ యుఱదె నాదు నిర్మాణమునన్. |
024 |
| ఆ. |
అనిన భుజగ మిట్టులను ‘నీవలన నేను | గుణము సెప్ప, దోష గణన సేయ నన్నుఁ బనిచె నంటి, నామీఁది దోషంబుఁ | బాపి కొనుట నాకుఁ బాడి గాదె? |
025 |
| క. |
విను మటు కాలుని దెసనై | నను దోషము కలిమి లేమి, నా కాడంగాఁ బని యేమి? దోష గతిచిం | తన భాషణములకు నేను దగుదునె యనఘా!’ |
026 |
| వ. | అని పలికి పాము బోయమొగంబు సూచి. | 027 |
| క. |
‘వింటే, మృత్యువు మాటలు? గంటే నామీఁదఁ దప్పు గలిగించెద; వి ట్లంటం గట్టం దగునే’? యంటకు | నగి, బోయ యిట్టు లనియె, నరేంద్రా! |
028 |
| క. |
నీవును, మృత్యువుఁ బాప స | మావేశితమతుల రొఱగ నాడినయంతం బోవునె మీపై దోషము, లే | వెఱతునె యిట్టు లనిన యింతన మీకున్’. |
029 |
| వ. | అనిన మృత్యువునుం బామును. | 030 |
| క. |
‘ఘనుఁ డగు కాలుని వశమునఁ | జనియెడుమా, కరయ దోష సంగతి గలదే?’ యనునెడఁ గాలుం డచటికిఁ | జనుదెంచెం, బ్రీతి ధర్మ సంశయ ముడుపన్. |
031 |
| వ. | చనుదెంచి యర్జునకు నాలోకించి. | 032 |
| క. |
‘పామును, మృత్యువు, నేనును | గా మీదారకుని మృతికిఁ గారణ, మీతం డేమేఁ గర్మముఁ జేసెం దా | మృతిఁ బొందించె నదియ, తలకొని, యితనిన్. |
033 |
| క. |
విను కర్మం బొనరించును | జననము, మరణంబు, నదియ సౌఖ్యము, దుఃఖం బును గావించుం, దనచే | సిన దానిం బడకపోవ శివునకు వశమే?’ |
034 |
| వ. | అని చెప్పి. | 035 |
| క. |
‘కావున, నిందఱు, నుడుగుం డీ | వాదం’ బనుడు, బోయ కిట్లను, ధరణీ దేవాంగన దన యెఱుకయు | దేవాలాపములు నొక్క తెరువై యున్నన్. |
036 |
| ఆ. |
ఇట్టి వనటఁ బొందునట్టి పాపము సేసి | వనిత లిట్ల యగుదు రనఘ! యివ్వి ధంబు మరణ మొందఁ దగు కిల్బిషంబున | బాలు రిట్ల పోదు రేల కలఁగ.’ |
037 |
| వ. | అని వెండియు. | 038 |
| క. |
‘సకల జనంబులుఁ గర్మము | నకు ననుగుణమైన తెరువునం బోదురు దీ నికి రోష విషాదము లే | టికి విడువుము పాము, సంఘటింపుము శమమున్. |
039 |
| క. |
అన విని తెలిసి విడిచె, న | ర్జునకుఁడు భుజగము, నపాస్తరోషుం డగుచుం జని రెలమిఁ బొంది, కాలుం | డును, మృత్యువుఁ గావునను విడువు మీ వడలున్. |
040 |
| తే. |
కారు దుర్యోధనుఁడు నీవుఁ గారణములు | బాంధవుల రణ మరణ సంప్రాప్తి కనఘ! వారు, దమతమ కర్మముల్ కారణములు | గాఁగ నిట్లయి; రేల శోకంబు నీకు ? |
041 |
| వ. | గౌతమీ, లుబ్ధక, భుజంగ, మృత్యు, కాల, సంవాదం బను నియ్యితిహాసంబు తాత్పర్యంబు మనంబునం బట్టుకొలిపి, యా పుట్టిన కలంకం దొలంగ జడిసి శమంబున సుఖివి గ’ మ్మనం, గౌంతేయాగ్రజుండు సంతసిల్లి శాంతనవునితో ని ట్లనియె. | 042 |