పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
అగ్నిదేవుఁడు సుదర్శన యను కన్యకను వివాహంబు సేసికొనుట (సం. 13-2-12)
చ. ‘అనఘ! గృహస్థధర్మమునయందుఁ జరించి నరుండు మృత్యు సం
జనితభయంబు పాపికొనఁ జాలునొ చాలఁడొ?’ యన్న నా సరి
త్తనయుఁడు ‘దానికిం దగు విధంబు దిరం బగు నేనిఁ జాలు న
య్యను వొడగూడునట్టి యితిహాసము విన్ము నరేంద్ర! చెప్పెదన్‌.
043
మ. మనువంశంబునఁ బుట్టి, సర్వజనతామందారమై నేలయె
ల్లను బాలించి, జగత్త్రయీప్రణుతలీలం బొల్చె దుర్యోధనుం
డను రా జవ్విభు నొప్పు నర్మదకుఁ గామావేశముం జేసినన్‌
వనితారూపము దాల్చి పొందె నతనిన్‌ వైదగ్ధ్య హృద్యంబుగన్‌.
044
క. ఆ రమణికి నతనికిఁ గ | న్యారత్నం బుద్భవించె నమరపురంధ్రీ
శ్రీరామణీయకము ని | స్సారం బగునట్లు గాఁగ జగతీనాథా!
045
వ. విను! దానికిఁ బేరు సుద | ర్శన, యన్నరనాయకుండు సంప్రీతి మెయిం
బెనిచి, తన యగ్నిహోత్రం | బున పరిచర్యలకుఁ బనిచె బుజ్జవ మొప్పన్‌.
046
వ. పనిచిన నప్పొలంతి యప్పనులవెంట మెలంగుచుండె; నట్టియెడ. 047
సీ. అర్చించునప్పు డయ్యంగన కెంగేలి | జిగిసొంపు, చిత్తంబు దిగిచి కొనఁగ,
నరసి కన్గొనునప్పు డయ్యింతి కనుఁగవ | పొలపంబు రాగంబు వొదలఁజేయ,
నన్యులఁ బని పంచునప్పు డమ్ముద్దియ | పలుకుల తీపు గోర్కులఁ గెరల్ప
నల్లన యూఁదెడు నప్పు డక్కొమ్మ వా |తెఱతావి ధైర్యంబు ద్రిప్పుకొలుప.
 
తే. మరుఁడు దోడ్తోడఁ దేఁకువ మాలి కదిసి | తూపుగముల క్రొవ్వాఁడిమి సూప నంత
కంత కగ్గల మగు వలవంతఁ దూలి | పోయెఁ బావకుఁ; డేమి సెప్పుదు నరేంద్ర!
048
వ. ఇట్లు మదనాగ్ని నుదిలకొని యగ్నిదేవుం డక్కాంతతో నేకాంతంబున నిట్లనియె. 049
సీ. ‘చిగురుటాకుల గాసి సేయు నీ యడుగుల | చెలువంబు సూడ్కులఁ జేర్చికొనియె,
మారేడు పండుల గారాము సెఱుచు నీ | యెలచన్నుఁగవ వేడుకలఁ బొనర్చె
నునుఁదీవఁ జీరికిఁ గొనని నీ మైఁదీవ | మురిపంబు డెందంబు మరులుకొలిపె,
నెఱచందురుని సిగ్గువఱుపంగఁ జాలు నీ | నెమ్మోము దాలిమి వమ్ముసేసె.
 
తే. నాతి నీకునై పెక్కుబన్నములు వడితి | నంగజునిచేత; వల్లభ వగుము, నాకు’
నావుడును సిగ్గు గదిరి, యాననము వాంచి | యలఁతి యెలుఁగున నిట్లను నా లతాంగి.
050
క. ‘కులకన్యకలకు వేడుకఁ | దలవీడులఁ బరులతోడి తగుమాటలకుం
దలకొనఁ దగునే? గురుజన | ముల కా కత్తెఱఁగువారు పురుషార్థనిధీ!’
051
వ. అనిన విని హుతవహుం ‘డట్లకాక’ యనియె; నా సమయంబున. 052
ఉ. ఆ నరనాయకుం డొక మహాధ్వర మెంతయుఁ వేడ్కఁ జేయఁగాఁ
బూని, మహీసురావళికిఁ బూజ లొనర్పఁగఁ దాను బ్రాహ్మణుం
డై నయ మారఁగా ననలుఁ డాతని పాలికి వచ్చి ‘నాకు నీ
వే నృప! నీదుపుత్రిఁ గృప యేర్పడ దానము గాఁగ’ నావుడున్‌.
053
వ. అ వ్విభుండు. 054
తే. ‘అన్యవర్ణుండు, దీనుఁ డీయనకు నెట్లు | గూఁతు నీవచ్చు?’ నని మదిఁ గుత్స వుట్టి,
యీఁడ ప్రార్థన మఫల మై యేఁగి యజ్ఞ | సమయమున నగ్ని తనమూర్తి సంహరించె.
055
క. కని యజ్జనపతి ఋత్విజు | లును, దానును, వెఱఁగుపడి, ‘విలోపము వాటి
ల్లెనొకో! కర్మగతుల’ నని | మనమున నూహించి, భవ్యమంత్రముఖరులై.
056
వ. పావకునిం బ్రస్తుతించుచుండ నద్దేవుం డా భూదేవతలకు నల్లన తనతెఱం గెఱింగించిన. 057
తే. వార లానృపుతోఁ జెప్ప, గారవంబు | సంతసముఁ దలకొనఁగ నయ్యింతిఁ బెండ్లి
సేసె, విప్రకుమారుఁ డై చెన్ను మెఱసి | యగ్ని వరియించె నచ్చెరువంద జనులు.
058
వ. ఇట్లు సుదర్శనా వివాహోత్సవం బనుభవించి విభావసుండు విభాప్రభాసమానుం డగుచు హుతంబులు పరిగ్రహింప దుర్యోధను యాగంబును సుప్రయోగం బై చెల్లెఁ; బదంపడి. 059
క. అనలునకు సుదర్శనకును | జనియించె నుదాత్తగుణవిశాలుండు, సుద
ర్శననామధేయుఁ డానృపుఁ | డనూనధర్మమునఁ దాల్చె నవనీభరమున్‌.
060
వ. ఆ సమయంబున. 061
ఆ. అతని కోఘవంతుఁ డనువాఁడు జనియించె | నుదితయశుఁడు; వాని కోఘరథుఁడు,
నోఘవతియు ననఁగ నుదయించి; రయ్యోఘ | వతికి నా విభుండు వరుని నరసి.
062
వ. ఒరుల మెచ్చక. 063
క. ఆ లేమ సుదర్శనునకు | నాలింగా నిచ్చె, నద్దహననందనుఁడున్‌
లోలతఁ గైకొని, పరిణయ | కేలి నడపి, విమలబుద్ధిఁ గృతనిశ్చయుఁడై.
064
వ. ‘గృహస్థ ధర్మానుష్ఠానంబునన మృత్యువు జయింతు’ నని ప్రతిజ్ఞ చేసి యోఘవతియునుం దానును గురు క్షేత్రంబునకుం జని, యందు రమణీయ ప్రదేశంబున విశాలమగు పర్ణశాల కావించుకొనియుండె; నట్టియెడ న య్యెలనాగతో నతం డిట్లనియె. 065
తే. ‘అతిథిఁ బూజించువేడ్క, నాకగ్గలంబు | వెలఁది | నీవును, ననుకూలవృత్తిఁ దాల్చి
సొలయ కప్పని నడపఁగా వలయుఁబూని | యే నిచట నున్న యప్పుడు, లేనియపుడు.
066
క. అతిథిజనులు దమతమ వాం | ఛితము లనుభవించునట్లు సేయం గనినం
గృతకృత్యతఁ బొందరె? గృహ | పతియును గృహిణియును ధర్మభారమువలనన్‌.
067
క. అతిథి నినుఁగోరెనేనియు | మతిఁ గింకిరి పడక, యోలమాస గొనక, నీ
వతనికిఁ బ్రియంబు సల్పుము | సతికిం బతిపనుపు సేయఁ జను నెల్లదియున్‌.
068
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )