| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
అని యూఁది చెప్పి, యొకనాఁ | డనఘ! యతం డిధ్మములకు నటవీస్థలికిం జనినయెడ నతిథి యొక్కఁడు | సనుదెంచిన నాసనాది సంభావనలన్. |
069 |
| క. |
అతివినయంబున సమ్మా |నితుఁ జేయఁగ నా లతాంగి నెమ్మోమునఁ జూ పతఁడు నిలిపి, కామాతుర | మతి నైతిం ; బ్రియ మొనర్పు మానిని! నాకున్. |
070 |
| వ. | ‘గృహస్థధర్మ ప్రకారంబు నీయెఱుంగనియదియే! యని’ పలికిన, నప్పరమపతివ్రత, వేఱొండు దెఱంగుల నభ్యర్థనీయంబు లయిన వస్తువుల నుపన్యసించిన, నతం డవి యెవ్వియు’ నొల్ల ననుటయు. | 071 |
| క. |
సతి దనపతి వచనంబులు| మతిఁ జొనుపుం దెంపు మాను, మాన వెఱచు, న య్యతిథి పనుపు సేయక త్రో | చు తలంపలవఱుచుఁ, జేయఁ జూచుం, దలరున్. |
072 |
| తే. |
ఇట్టు లురియాడు చిత్తంబు నెట్టకేని | నాథు చెప్పిన ధర్మంబునకుఁ జొరంగ నూలుకొల్పి, నిర్ణయమునఁ గీలుకొన్న | లజ్జవ్రేఁగునఁబోలె వ్రాలంగ మోము. |
073 |
| క. |
తెఱవ యొడఁబాటు మాటం | బఱివోయిన గొంకుతోడ బ్రాహ్మణుఁ గొని, క న్మఱుఁ గగునెడకు నరిగె; న | త్తఱి వచ్చె సుదర్శనుండు ధరణీనాథా! |
074 |
| ఆ. |
వచ్చి, పర్ణశాలవాకిట నిల్చి, య | త్తన్విఁ బిల్చె; నతిథి దాని నల్ల నూరకుండు మనియె; నువిదయు భూసుర | శాపభీతి నెలుఁగు సూపకుండె. |
075 |
| సీ. |
పేర్కొని, పలుమాఱుఁ బలిచి, యో! యనుట లే | కున్న నయ్యింటిలోఁ గన్ను వఱపి, వల్లభఁ గానక, వహ్నితనూజుండు | దలఁకొంది ప్రేముడి పలుకు వలుక, నతని నుద్దేశించి యతిథి ‘నాకాతిథ్య | మొనరించుచున్నది వనిత, నీవు గృహధర్మవిధుఁడవు; కినియకుమయ్య మ’ | మ్మనుడు, నప్పరమపుణ్యాత్మకుండు |
|
| తే. |
‘నీదుకతమున నేను సమ్మోదమగ్న | మానసుఁడ నైతి, నతిథులు మహితపూజ నములు గాంచిన గృహములు విమల తరము | లండ్రు బుధు లింత యెఱుఁగుదు; నట్ల నడతు’. |
076 |
| వ. | అని పలికి వెండియు. | 077 |
| ఉ. |
‘నావచనంబునట్టుల మనంబును; దీనికి సాక్షు లుర్వియుం, బావకుఁడున్, జలంబును, నభంబును, వాయువుఁ, జంద్ర సూర్యులున్’ నావుడు మ్రోసె నాకసమునన్ విశదంబుగ దివ్యవాణి ‘సం భావితుఁ డీతఁ; డీ విభుని పల్కు నిజం’ బని కౌరవేశ్వరా! |
078 |
| ఆ. |
అప్పు డతిథి ప్రీతి నతని సన్నిధి కేఁగు | దెంచి, దుర్నిరీక్ష్యతేజ మడర, తనదుమూర్తి యధికతర సమున్నతిఁ బొలు | పెసఁగ నిల్చి, యతని కిట్టు లనియె. |
079 |
| సీ. |
‘ధర్మదేవత నేను; దగ నీదుచిత్తంబు | నారయ వచ్చితి ననఘ! నీవు నిశ్చలవ్రతుఁడవు, నీప్రతిజ్ఞకు హాని గలిగినఁ | దెగఁజూడఁ దలఁచి, తిరుగు వెనువెంట మృత్యువు, విను జయించితి దానిఁ | గామరోషాదివికారసహిత ముగ నంతరంగంబు మున్ను గెల్చితి, భవ | త్సతియుఁ బవిత్ర, యస్ఖలితచరిత. |
|
| తే. |
యొడలితోడ నీకు నూర్ధ్వ లోకమునకు | నరుగవచ్చు నెప్పుడరుగు తలఁపు దోఁచె నప్పు డిదియుఁ దోడిదయై ప్రీతి | నరుగుదెంచు’ ననియెఁ గురువరేణ్య! |
080 |
| వ. | అని వెండియు. | 081 |
| చ. |
నరవర! పొల్చు నోఘవతి నా నదియై, జనపావనాకృతిం బరమతపంబులోని, సగపాలను నియ్యమ యున్న సామునన్ వెరవునఁ దొంటిమై నిలిచి నీకుఁ దగం బరిచర్య సేయు; ని చ్చరితము మీకు నిర్మలయశంబు నొనర్చుట కే నొనర్చితిన్’. |
082 |
| వ. | అని చెప్పి ధర్ముండు ధవళహయసహస్రంబుపూనిన మాననీయ రథంబునం జనియె నోఘవతి యద్దేవుని చెప్పినట్ల వర్తిల్లె; సుదర్శనుండును బరమసంతోష భరితుండయ్యెఁ; బాండవాగ్రజా! నీ మనంబున నెక్కొలుపు మిక్కథయభిప్రాయంబు. | 083 |
| ఆ. |
అతిథిపూజఁ గడచినట్టి ధర్మువు గృహ | స్థులకు నొండు లేమిఁ దెలుపుచున్న యది; సమస్త కిల్బిషాపహ మీ యితి | హాస; మిచ్చు నెల్లయభిమతములు’. |
084 |
| క. |
అనినఁ బితామహుతో న | జ్జనపతి ‘బ్రాహ్మణ్య మవులజాతులు మూఁటన్ జనియించినవానికి దొర | కొనునొకొ? యతివిమలకర్మ గుణయోగమునన్’. |
085 |
| వ. | అని యడిగిన నతం డతని కిట్లనియె. | 086 |
| తే. |
‘బ్రాహ్మణత్వంబు గడుదుర్లభం; బనేక | జన్మములఁ బొంది తిరుగంగ సంభవించి నపుడు గనునది; యున్నతమైన యప్ప | దంబు విను మెఱిఁగించెద దాని తెఱఁగు. |
087 |