| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అది యింద్రమతంగ సంవాదం బను నితిహాసం బాకర్ణించిన నెఱుంగ నగుం గావున నక్కథ యుపన్యసించెద; నొక్క విప్రుని కొడుకు మతంగుం డనువాఁడు యజ్ఞార్థంబైన పనికిం దండ్రిపనుపునం బోయి. | 088 |
| క. |
మదమునఁ బెలుచన యొకగా | డిద కొదమం గోల గొని యడిచె, నడిచిన నొ వ్వొదవి, తనతల్లిఁ జేరఁగ | నది సని, నన్నీతఁ డడిచె నని చెప్పుటయున్. |
089 |
| వ. | ఆ గార్దభి తన కొదమతో ‘వీఁడు చండాలుండు ప్రచండస్వభావుండు గాకుండునే?’ యనినం, బూర్వజన్మకర్మ విశేషంబునం దిర్యగ్జాతి భాషావిదుండగుట నవ్విప్రపుత్రుం డప్పల్కులు విని, ‘యిది దూషణ భాషణంబు గాదు; నిరూపణాలాపంబై యున్నది; యట్లు గావున మాలతనంబు గలుగనేర్చు’నని నిశ్చయించి యగ్గాడిద కడకుం బోయి. | 090 |
| క. |
తనకుం జండాలత వ | చ్చిన కారణ మడిగి, దానిచేతం గంద ర్పుని చెయిది మంగలికి నిజ | జననికిఁ బొందగుట విని విషాదముతోడన్. |
091 |
| వ. | తనపోయెడు పనికిం బోవక, మరలి సదనంబునకుం జని, జనకున కత్తెఱం గెల్ల నెఱింగించి, యతనితో ‘శూద్రబీజంబున బ్రాహ్మణియందు జన్మించినవాఁడు చండాలుం డగుటకు సందియం బేమి? గార్దభి శాపజాత గానోపు నది యున్నరూపపలికె; బ్రాహ్మణ్యంబు దపంబున సంపాదించెదం గాక’ యని పల్కి, వీడ్కొని వనంబునకుం బోయి. | 092 |
| క. |
పరమ తపమాచరింపఁగ | సురపతి వొడచూపి యడుగు సువ్రత! నీకున్ వర మిచ్చెద’ ననిన; ‘ధరా | మరత్వ మి’ మ్మనియె; నతఁడు మది ముద మొదవన్. |
093 |
| చ. |
అనవుడు ‘బ్రాహ్మణత్వము మహత్త్వ మెఱుంగవ? యన్యజాతి కం దునె యది? యొండు వేఁడు; మది దోఁచిన మే’ లనియెన్ బలారి; వాఁ ‘డనితరసాధ్య మైన తప మస్ఖలితంబుగఁ జేయుచుండెదం; జనుము మహాత్మ! నీ’ వనిన, సస్మితుఁడై యతఁ డేఁగె; నేఁగినన్. |
094 |
| వ. | మతంగుం డేకపాదంబున నూఱేండ్లు తపంబు సేసిన నింద్రుండు గ్రమ్మఱ వచ్చి. | 095 |
| తే. |
‘ఏను వలదని చెప్పిన మాన వెట్లు? | పరమదుర్లభ పద మాసపడి, కరంబు మేలితప మాచరించి చండాలు డిట్టి | దాన నశియించు; నిది నీకుఁ దగదు, విడువు. |
096 |
| వ. | విను మిత్తెఱంగుతపంబునకుఁ బదిమడుంగులు సేసి చండాలుండు శూద్రుండగు; నూఱుమడుంగు లనుష్ఠించి శూద్రుండు వైశ్యుండగు; వేయిమడుంగు లాచరించి వైశ్యుండు క్షత్రియుం డగు; నప్పుణ్యాచరణంబునకుఁ బదివేలు మడుంగులు నిర్వర్తించి క్షత్రియుండు దుర్బ్రాహ్మణుం డగు; నా నియమంబునకు లక్షమడుంగులు సల్పి శమదమ సత్యాహింసల సమాత్సర్యంబున నార్య బ్రాహ్మణహృదయంబులు సదయంబులు గావించి దుర్బ్రాహ్మణుండు సద్బ్రాహ్మణుం డగు; నిట్లు బ్రాహ్మణ్యం బలఁతులం బడయవచ్చునే; పడసియు, నది సెడకుండ నడప శక్యంబగునే? యనేక జన్మంబుల నొకప్పుడు బ్రాహ్మణజన్మంబు నొందియుం గొందఱు ధనవాంఛా విషయ లౌల్యాదులం దదాచారంబు దిగవిడిచి చెడుదు; రిట్టి మహాపదంబు గోరి నిన్ను నీవ యేల వినాశంబు నొందించుకొనియెద? వీ తపోనిష్ఠ సాలించి, తగునది యొక్క వరంబు వేడు’ మనియె, ననిన వాఁడూరకున్న, నాఖండలుం డరిగె; వెండియు. | 097 |
| క. |
అంగుష్ఠ మొకటి మోపి, మ | తంగుఁడు నూఱేండ్లు సేసెఁ దపము నియతిమై. నంగము తో లస్థులతో | సంగతముగఁ దోఁప, వెక్కసముగా నరముల్. |
098 |
| ఆ. |
ఇట్లు సేసి శక్తి యెల్లను గడచన్న | నతఁడు, నేల వ్రాలె; నతిరయమున వచ్చి, యమరఁ బట్టి వాసవుఁ ‘డక్కట! నీకుఁ జెప్పనయ్య! నెమ్మి నేను. |
099 |
| వ. | క్షత్రియాదులచేతనుం బట్టువడని బ్రాహ్మణశార్దూలంబుతోడి మేలంబు దక్కుము; నీకు నొక్కవరం బిచ్చెదం గైకొను’ మని పల్కుటయు, నతం డొడంబడినం బరమాదరంబున. | 100 |
| ఆ. |
చండదేవుఁ డనఁ బ్రశస్తి వహించి, సు | స్త్రీలు, పూజనంబు సేయఁ, గామ రూపధారివై, నిరూపింప విహగభా| వంబుగల్గి, ప్రమదవర్తి వగుము’. |
101 |
| క. |
అని వరమిచ్చి, మహేంద్రుఁడు | సనియె’ ననిన విని, యజాతశత్రుఁడు గాంగే యునితో ‘బ్రాహ్మణ్యము పెఱ | జనులకుఁ బొందంగ ని ట్ల శక్యం బేనిన్. |
102 |