| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | విశ్వామిత్రుం డెట్లు వొందె? నత్తెఱం గెఱింగింపవే!’ యని యడిగిన నన్నరదేవునకు దేవవ్రతుం డిట్లనియె. | 103 |
| సీ. |
‘జాహ్నవీదేవికి జనకుఁడై వెలసిన | జహ్నుని కులమున సంభవించె గాధినాఁ బ్రకట భూకాంతుఁ ; డాతనిపుత్రి | యగు సత్యవతిఁ దన కాలి గాఁగ నిమ్మని యర్థించె నమ్మహీశ్వరు ఋచీ | కుం డనుముని; భృగుకులవరేణ్యుఁ డతని కీ నొల్ల కప్పతి దనకూఁతున | కుంకువగాఁ, జెప్పెనొక్క కర్ణ |
|
| తే. |
మసితమై తెలుపారెడు హరులు వేయి | మానియై భార్గవుఁడు దేరఁబూని వరుణుఁ గానఁ జని యవ్విధము ఘోటకముల వేఁడె | నాతఁ డిచ్చుట కొడఁబడి యతనితోడ. |
104 |
| క. |
‘నీ వలసినప్పు డట్టి హ | యావలి ప్రభవించు నెచటనైన’ ననవుడున్ దీవించి యరిగి యమ్ముని | దేవతటిని యుత్తరంపుఁ దీరమునఁ దగన్. |
105 |
| వ. | నియతుండై తలఁచిన తత్‌క్షణంబ గాధి చెప్పిన చందంబగు గుఱ్ఱంబులు వేయునుం బుడమిఁ బొలిచి నిలిచె; దానం గన్యాకుబ్జంబున కనతిదూరం బగు తత్ప్రదేశం బశ్వతీర్థం బనం బరఁగె; నమ్ముని కుమారుం డత్తురం గంబుల నిచ్చిన, నచ్చెరువును సంతోషంబును శాపభయంబును హృదయంబున ముప్పిరిగొనం దనపుత్రికి నుంకువగా నియ్యకొని. | 106 |
| తే. |
గాధి యమ్మునిపుత్త్రు శీఘ్రమునఁ బెండ్లి | సేసె; నిట్లు, వరించి ఋచీకుఁ డధిక సమ్మదమున గృహస్థ ధర్మమ్ము నడపు | చుండి, సంతాన కాంక్ష, నయ్యువిదతోడ. |
107 |
| వ. | ‘నీకుం బుత్రోత్పత్తి గావింపం జాలు చరువు సంపాదించెద ననియెఁ; దొల్లి దానితల్లి దనయల్లుని మహానుభావం బెఱుంగుటంజేసి, యా సత్యవతితో ‘నాకుం దనయుండు గలుగ, దయసేయునట్లుగాఁ బుణ్యకర్తయగు నీభర్తం బ్రార్థింపు’ మనినయది గావున నమ్మాట యమ్ముద్దియ యతనికిం జెప్పిన నప్పరమధర్మపరుండు. | 108 |
| తే. |
రెండు చరువు లొనర్చి, యొక్కండు బ్రాహ్మ | ణత్వ మత్యుజ్జ్వలముగ నొనర్ప, నొకటి రాజభావంబు నధిక తీవ్రముగఁ జేయఁ | జాలునట్లుగ నిజతపశ్శక్తిఁ జేసె. |
109 |
| వ. | ఇట్లు గావించి, యా రెంటిని సత్యవతికిం జూపి, తత్ప్రభావంబు వేఱువేఱ యుపన్యసించి, క్షాత్రంబైన చరువు మీతల్లి కిచ్చి, బ్రాహ్మం బయిన దాని నీవు పుచ్చికొనుము. ఋతుకాలంబున నీతల్లి యశ్వత్థంబును, నీ వుదుంబరంబును నాలింగనంబు సేసి భక్తితో మీమీ చరువు లుపయోగించునది’ యని నియోగించె; వారి యుపయోగంబు సమయంబున విధివశంబునంజేసి. | 110 |
| క. |
చరువులు, నమ్ముని చెప్పిన | తరువులు, వీడ్వడియె సుతకుఁ దల్లికి; నట్ల య్యిరువురు నుపయోగింపఁగఁ | గరువులు దత్తత్ప్రకార కలితము లయ్యెన్. |
111 |
| వ. | దివ్యబోధ మహనీయుండు గావున. | 112 |
| ఆ. |
చ్యవననందనుండు సత్యవతీ గర్భ | భంగి సూచి, ‘యకట! బ్రాహ్మణుండు గాఁడు, తరుణి! నీదు కడుపులోపలి బిడ్డ | క్రూరుఁడైన రాచకొడుకు గాని.’ |
113 |
| వ. | అని పలికి, చరుతరువ్యత్యాసంబున నట్లగుట దేటపడం జెప్పిన, నబ్బోటి యత్యంత విషాదవేదనాదూయమాన మానసయై. | 114 |
| క. |
‘నీకుం బుట్టెడు కొడుకు వి | వేకనిధీ! బ్రాహ్మణత్వ విరహితుఁ డైనన్ లోకము మెచ్చునె? యట్టులు | గాకుండఁగఁ జేయు తపము గౌరవ మొప్పన్. |
115 |
| తే. |
నాకు నివ్వర మి ‘మ్మని నమ్ర యగుడు, | ‘వీడు బ్రాహ్మణుఁ డగుఁ గాక, వీని కొడుకు నందు రాజత్వ సంపద యతిశయిల్లు’ | ననియెఁ గరుణార్ధ్రచిత్తుఁడై యత్తపస్వి. |
116 |
| వ. | అ ట్లమ్ముని యావహించుట కతంబున సత్యవతీ పుత్త్ర పౌత్త్రులైన జమదగ్ని పరశురాములు గ్రమంబున బ్రహ్మక్షత్త్ర తేజోవిరాజితు లయిరి; గాధి భార్యకు జనియించి విశ్వామిత్రుండు. | 117 |
| క. |
నరనాథుండై యుండియుఁ, | జరు తరు గుణ సంక్రమమున సద్బ్రాహ్మణతా స్ఫురణంబు వడసెఁ, దపమును | గరమధికం బతనియందుఁ గలిగెఁ గుమారా!’. |
118 |