| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అనిన విని, ధర్మజుండు ‘వీతహవ్యుం డనురాజు బ్రాహ్మణత్వంబుఁ బడసె నని విందు; నత్తెఱం గెఱింగింపు’ మనవుడు నతనికి శంతనునందనుం డిట్లనియె; ‘మనుసంభవుఁడైన శర్యాతి యన్వయంబున హైహయుండను నొక్క జనపతి జనియించి వత్సదేశాధీశుండై పొలిచె, నాతనికి వీతహవ్య నామంబునుం గలిగియుండుఁ; దదీయభార్యలు పదుండ్రు; వారలు వీరులుం బ్రబలులు నగు పుత్త్రుల నూర్వురఁ గాంచి; రమ్మహారథులు విక్రమ కుతూహలంబున. | 119 |
| సీ. |
హర్యశ్వుఁ గాశీశు నాజికిఁ బిలిపించి, | యొక్క యుమ్మడి లావు నుక్కు మెఱయఁ బొదివి చంపిరి, వానిపుత్త్రుండు పట్టంబు | గట్టె, సుదేవుండు గ్రమ్మఱంగ నురవడి నరిగి, యద్ధరణీశు ననిఁ దెగఁ | జూచి, రాహైహయసుతులు గడిమి, నాతని నందనుఁ డగు దివోదాసుండు | రాజైన నమ్మహీరమణుమీఁద |
|
| తే. |
నడచి, వారు ఘనరణం బొనరించి సై | న్యంబుఁ ద్రుంచి,రోడి యతఁడు వాఱి, ప్రకటసంయమిని భరద్వాజ మునిఁ గని | యధికభక్తి నతని నాశ్రయించి. |
120 |
| క. |
తనకులము వీతహవ్యుని | తనయులచేఁ ద్రుంపఁబడుట దగ నెఱిఁగింపన్ విని, యతఁ ‘డోడకు, నీ కొక | తనయునిఁ గల్పింతు రిపువిదారణ నిపుణున్’. |
121 |
| వ. | అని పుత్రకామేష్టి సేసినం బ్రభవించిన పుత్త్రుం డప్పుడ పదుమూఁడేండ్ల ప్రాయంబువాఁడయ్యెఁ బ్రతర్దన నామధేయుం డక్కుమారుం డమ్మహాత్ముని యనుగ్రహంబున వేదంబులు ధనుర్వేదంబును వేగంబ యధిగమించి. | 122 |
| చ. |
మునికృప నావహింపఁగ సముజ్జ్వల తేజముఁ బొంది ప్రీతిమై జనకుఁడు యౌవరాజ్యపద సంగతుఁ జేసినఁ బేర్చి యవ్విభుం డనుమతి సేయ నెత్తి చని, యాజిముఖంబున వీతహవ్య నం దనతతి నెల్ల గీటడఁచె దర్ప మెలర్పఁగ నశ్రమంబునన్. |
123 |
| క. |
తనయులఁ దెగటార్చి వడిం | దనమీఁదం గవిసినం బ్రతర్దను శౌర్యం బున కలికి వీతహవ్యుం | డనయము వెసఁ బాఱె భృగువునాశ్రమమునకున్. |
124 |
| ఆ. |
పాఱి, భీతి దోఁపఁబల్క, నమ్ముని తన | దైన శిష్య సమితి లోన నునిచె నతనిఁ, గాశిరాజసుతుఁడును, వెనువెంటఁ | దగిలి యచటి కరిగి, తగువిధమున. |
125 |
| క. |
మునిపతికిని వినయము సే | సిన నిట రాకకుఁ గతంబు సెప్పు మనియె న జ్జనవంద్యుఁ డక్కుమారుం | ‘డనఘా! మధ్యస్థవృత్తివై వినవలయున్’. |
126 |
| వ. | అని పలికి, తమకులంబు వీతహవ్యుని కొడుకులచేత నశించిన విధంబును, దాను వారల నందఱ మ్రందించుట యును, వీతహవ్యుం డాహవంబునం దనకు నోడి పాఱుటయును జెప్పి, ‘మునీంద్రా! యారా జిటవచ్చె; నాతనిం బొలియించుటకై వచ్చితి’ ననిన నత్తపోధనసత్తముండు. | 127 |
| క. |
‘విను మిచ్చట నృపకుల సం | జనితుఁడు, లేఁ; డింతయుం బ్రశస్త మహీదే వ నికాయమ; కనుఁగొను’మని | తన శిష్య ప్రతతిఁ జూపె దయ చిగురొత్తన్. |
128 |
| వ. | చూపినం జూచి. | 129 |
| ఆ. |
అతఁడు నగుచు, భృగుని యడుగుల కెఱఁగి, మ | హాత్మ! దీన నేఁ గృతార్థవృత్తి నైతిఁ బగతు నిట్లు జాతికిం బెడఁ బాపి | గాసి గాఁగఁ జేయఁగంటిఁ గాన. |
130 |
| క. |
కలుగునె యమోఘ మగు నీ | పలుకున, కనృతత్వ? మేను బనివినియెద, న న్నలఘు కృపఁ జూడు మని తగఁ | బలికిన, ముని ప్రీతి నానృపతి వీడ్కొలిపెన్. |
131 |
| ఆ. |
వీతహవ్యుఁడును మహాతపస్సందీప్తుఁ | డైన యమ్మునీంద్రు నప్రతర్క్య భంగి భాషణముల బ్రాహ్మణుఁ డై గృత్స | మద సమాఖ్యుఁ గాంచె మహితసుతుని. |
132 |
| వ. | తత్పుత్త్రపౌత్త్ర క్రమంబున సుతేజసుండును, వర్చసుండును, నిహవ్యుండును, వితత్యుండును, సత్యుండును, సంతుండును, శ్రవసుండును, దమసుండును, బ్రకాశుండును, వాగీంద్రుండును, బ్రమతియును, రురుండును, సముదుండును, శునకుండును, శౌనకుండును నన మహాద్విజులు జన్మించి; రిట్లు విద్యా మౌక్తిక శ్రేణి వంశంబగు మునివంశంబునకు మూలం బయి యవ్వీతహవ్యుండు భవ్యకీర్తి వడసెఁ; బాండవాగ్రజా! యింక నెయ్యది యడిగెద వడుగు’ మనుటయు, నతండు ‘దైవంబును, బౌరుషంబును నను రెంటియందు నెయ్యది యధికంబు సెప్పు’ మనిన నప్పురుషవరుండు ‘దొల్లి’ యిట్లు వసిష్ఠుండు బ్రహ్మ నడిగిన నమ్మహాత్ముం డుపదేశించిన వాక్యంబుల యర్థంబు లుపన్యసించెద నాకర్ణింపు’ మని యిట్లనియె. | 133 |