పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
భీష్ముండు ధర్మరాజునకు దైవపౌరుషంబులతెఱం గెఱింగించుట (సం. 13-6-1)
క. క్షేత్రంబు పురుష కారము | ధాత్రీశ్వర! బీజ మరయ దైవము! రెండున్‌
సూత్రపడఁ గూడె నేనిం | బాత్రం బగుఁ, గర్మకరుఁడు ఫలమున కెందున్‌.
134
క. విను, పురుషుఁడు గావింపని | పనులకు దైవ మది యెట్లు ఫల మొనరించున్‌?
జనములు గార్యము నడపఁగ | ననుకూలత నిచ్చుఁ గాక యయ్యైఫలముల్‌.
135
తే. పౌరుషమ్ము,. దైవంబు తోడ్పాటు లేక | ఫలముఁ బొందంగనేరదు పార్థివేంద్ర!
విత్తు సహకారి గాకున్న రిత్తనేల | వంధ్య మగుఁ గాక, తా ఫలవంత మగునె?
136
తే. మేలు రెండు లోకంబుల మేల తెచ్చు; | గీడు సేసినఁ దప్పదు కీడ యగుట
కాన పురుషవర్తనమున కానుకూల్య | శీల మగు దైవ మది ఫలసిద్ధిఁ జేయు.
137
క. అనలం బించుక యైనఁ బ | వనుచే వెలుఁగొందు మాడ్కి వర్ధనముం బొం
దును సత్కర్మాచరణం | బున దైవము నానుకూల్యము గురుప్రవరా!
138
క. నేయి పొలు పఱిన దీవియ | మాయుకరణిఁ, గర్మశుద్ధి మలిఁగిన హీన
త్వాయత్తంబై తానును | మాయును దైవానుకూల్య మహిమ మహీశా!
139
తే. పరశురాముఁడు, భృగుఁడును, బలియు, లోను | గాఁగ మహనీయ పురుషులు గర్మసూక్ష్మ
భంగిఁ గలుషితదైవప్రభావితాత్ము | లైరి; కర్మంబు దైవంబు నలఁతు లెట్లు.
140
క. విను, పౌరుషమును, దైవము | నన రెండును గార్యఫలము నందింపఁగ నె
ట్టనఁ గారణములు గావున | జననాయక! సదృశములు విచారింపంగన్‌’
141
వ. అనిన విని ధర్మ తనయుండు ‘సత్కర్మంబుల నయ్యెడు ఫలంబులు వినవలతు’ ననుటయు నక్కురుసత్తమునకు నక్కురు పితామహుం డిట్లనియె. 142
సీ. ‘అధ్వపరిశ్రాంతుఁ డగు వింతవానికి | నన్నం బిడిన ఫల మట్టి దిట్టి
దనఁ బెద్ద యగ్ని సమారాధనమునకుఁ | బౌరుష శ్రేష్ఠత భవ్యదాన
ములకుఁ, దత్తద్వస్తువులమహామహిమలు | మౌనంబునకుఁ బరిజ్ఞానశక్తి
యతుల తపంబున కధికభోగము లహిం | సకు రూప, బల, చిదైశ్వర్య, సిద్ధి
 
తే. బ్రహ్మచర్యమునకుఁ బరమాయు వుపవాస | ములకుఁ జిత్తశుద్ధి ఫలజలంబు
లాహరించి యునికి కాధిరాజ్యము, పత్త్ర | భక్షతకు, దివంబు ఫలము లధిప!
143
క. శ్రుతిపఠనమునకు, నర్థ | ప్రతి బోధంబునకు, వరుస ఫలములు సౌఖ్య
స్థితియును, సుగతియు; సత్య | వ్రతమునకు ఫలంబు ముక్తి వసుధాధీశా!
144
క. ద్రుమముల దళకుసుమఫలో | ద్గమములక్రియఁ గర్మముల నొదవుఁ దత్ఫలముల్‌
దమ తమ తఱిఁ గర్తకు భో | గ్యములై నియతిని శుభాశుభాకారములన్‌’.
145
వ. అని చెప్పి. 146
చ. వినుము, జరానుబంధమున వెండ్రుకతండముఁ, బండ్లు, వీనులుం
గనుఁగవయున్‌, జరం బొరయుఁ గాని యొకప్పుడు దృష్ణ జీర్ణగా;
దనయముఁ బేర్చి, ప్రాణముల నన్పక పోవనిరోగ మల్పబు
ద్ధినరులు ద్రోవ లే రది, మదిం జొరనీరు సుఖార్థులై బుధుల్‌.
147
క. పాపంబుఁ బుణ్యమును దృ | ష్ణా పరులకు దుఃఖసౌఖ్య సంపాదులగున్‌
భూపాల! వితృష్ణులు, ని | ర్లేపు లగుట వారిఁ బొందలే వా ఫలముల్‌.
148
వ. అని పల్కినం, బాండునందను లందఱుం ప్రభూత హర్షోత్కర్షంబు నొందిరి; గంగానందనుండు ధర్మనందను నుద్దేశించి, యీ యర్థజాతంబు మునిప్రణీతంబయి యధిగతం బైనది, నీకు నుపదేశించితి ‘నీవింక నేమి వినవల’ తనవుడు, నా భూవల్లభుండు ‘నిజాశ్రయంబున కాస్పదం బయిన పురుషునెడ భక్తజనంబు చరితం బెట్టిది గావలయు?’ నని యడిగిన నతం డతని కిట్లనియె. 149
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )