పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
భీష్ముఁడు ధర్మజున కాశ్రయం బెప్పుడు నపరిత్యాజ్యం బని చెప్పుట (సం. 13-11-1 (కుంభ))
క. ‘విను, కాశీశ్వరుదేశం | బున నొక లుబ్ధకుఁడు వేఁట వోయిన చోటన్‌
ఘనతర విషదిగ్ధశరం | బున నేసిన మృగముఁ దప్పి భూజముఁ దాఁకెన్‌.
150
క. పూవులఁ గాయలఁ బెరిగిన | యా వృక్షము శుష్క మయ్యె; నవ్విధమున ధా
త్రీవర! తదీయ కోటర | మావాసము గాఁగ, నొక మహాశుక ముండున్‌.
151
క. అది తరువు విడిచిపోవక, | హృదయంబున భక్తి పేర్మి నెండను గాలిన్‌
బెదరక ధృతిమై నయ్యెడఁ | గదలకయుండె ననుజీవిగౌరవ మెసఁగన్‌.
152
ఉ. దాని యుదాత్త వృత్తము శతక్రతుఁ, డాత్మ నెఱింగి వచ్చి , ‘బెం
డైనది యిమ్మహీజము; మహాతరువుల్‌ ఫలవృద్ధి నొంది యి
క్కాన ననేకముల్‌ గలుగఁగా, నిటు లేటికి నిందు నిల్వ నో
మానితకీరమా!’ యనియె మానుష భంగికరూప మొప్పఁగన్‌.
153
వ. అనిన విని యా శుకంబు. 154
చ. ‘అనయము పండుచుండు నెడ నాశ్రయ మొప్పిన నిల్చి, యెండి పో
యినతఱిఁ బాసి పోక తగ వెట్లు? కృతఘ్నత గాదె యివ్విధం
బనిమిషనాథ!’ యన్న నతఁ డచ్చెరువంది ‘పురాకృతోప సం
జనిత విశేష మీ ఖగము జానుగ నన్ను నెఱింగె, దీనికిన్‌.
155
వ. మే లొనర్చెదం గాక! 156
క. ‘అని తలఁచి నీదు పలుకులు | విని మెచ్చితి; వరము గోరు విహగోత్తమ! నీ’
వనిన, శుకంబు మహీజం | బునకుం బే రెలమి వేఁడె భూపవరేణ్యా!
157
ఆ. అమరవల్లభుండు నమృతసేచనమునఁ | భూజమునకుఁ దొంటి పొల్పు కంటె
మిగుల నెలమి సేసె; మేలియాశ్రితు లిట్ల | మనుతు రధిపుఁ గురుకుమారవర్య!
158
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )