పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
విభునకుం బాటింపవలయువారిని భీష్ముఁడు ధర్మజునకుఁ జెప్పుట (సం. 13-8-1)
వ. అనిన నతం‘డెవ్వరిఁ బాటించుట విభులకు వలయు’నని యడిగిన నా భూపతికి భీష్ముం డిట్లనియె. 159
సీ. ‘జననాథ! విను, తప స్స్వాధ్యాయముఖ కర్మ | కరణత నుభయలోకముల వశగ
తములఁ జేయఁగఁ జాలు ధాత్రీసురులు మన్న | నకుఁ బాత్రములు; పతి నాతి కెట్లు
రాజునకును నట్లు బ్రాహ్మణుఁ డొడయుండు | బ్రాహ్మణుం డను మాట పావనంబు,
హర్షించి శుభముల నలిగి యాపదల నిం | ద్రునికైనఁ జేయు విప్రుండు నృపతి
 
తే. గొడుకుఁ బోలె నరయ, గురుఁ బోలెఁ గొలువంగ | నగ్నిఁ బోలె నిష్ఠ నర్చితుఁడుగఁ
జేయవలయు విప్రుఁ జెప్పెద, వేదసం | వాద; మేకబుద్ధి నాదరింపు.
160
వ. వేదంబులు దమలోన గోష్ఠి సేయుచున్న సమయంబున. 161
సీ. బ్రాహ్మణజాతికిఁ బరిభవం బొనరింప | మున్ను చేసిన పుణ్యములు నశించు,
జపహోమముఖ కర్మసంచయంబున కధి | కతరంబు విప్రముఖమున నిడుట.
భూసురార్చన మొక మాసంబు సలిపినఁ | బాపంబులెల్లను బాసిపోవు,
నగ్రవర్ణులఁ గాంచి యాదరింపక యుండు | కంటెను, గీడొండు గలుగ దరయ,
 
తే. నని క్రమంబున ఋగ్వేదమును యజుస్సు | సామము నధర్వణమ్మును, సారభూత
భవ్య సంభాషణముసేఁత దివ్యమునుల | వలన విందుము, కౌరవకులపవిత్ర!’
162
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )