| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
అని చెప్పి, భీష్ముఁ డమ్మనుజేంద్రుతోఁ ‘బర | మశ్రేష్ఠమైన ధర్మంబుఁ దెలియ విను’ మని పల్కి యిట్లను; మద్రనాథుండు | సత్యవతీ పుత్రచరణములకు నెఱఁగి కేలు మొగిడ్చి, యెద్దాని నెఱుఁగుట | యెఱుకల కెల్లను నెక్కుడని, స భక్తిక సమ్మతిఁ బ్రార్థించి యడిగిన; | నమ్మహాముని దయ నతనిఁ జూచి |
|
| తే. |
విష్ణు నెఱుఁగు టధిక విమలబోధము, యజ్ఞ | మూర్తి, యజ్ఞకర్తృమూర్తి, యజ్ఞ కలనమూర్తి, యజ్ఞ ఫలమూర్తి, విష్ణుఁ; డ | తండు కృష్ణుఁ డమలతరచరిత్ర!’ |
163 |
| వ. | అని పల్కి యమ్మహాత్ముండు వెండియు శల్యున కిట్లనుఁ ‘గృష్ణుండు వినుచుండఁ గొందఱు బ్రాహ్మణు లతని నుపలక్షించి, నాతో నిబ్బాలుండు యాదవుండైన వసుదేవునకుఁ గంసానుజయైన దేవకియందు జన్మించిన వాఁ; డితని నీవు క్రతుపురుషుండని కొనియాడుటకుఁ గతం బేమి? యని యడిగిన నన్నారాయణుండు నగుచు నన్నుఁ గన్గొని ‘వీరలప్రశ్నంబునకు నుత్తరంబు దగనిత్తుగాక’ యనిన నద్దేవునికిం బ్రణమిల్లి యే నిట్లంటి. | 164 |
| వ. |
‘వేదమయుఁడు, వేదవేద్యుండు, వేదార్థ | విత్తమప్రియుండు, విష్ణుఁ డీతఁ డిట్టిఁ డగుట, యాత్మ నెఱుఁగుట యుత్తమ | బ్రాహ్మణత్వసిద్ధి భవ్యులార!’ |
165 |
| వ. | అనిన విని వారలు దద్భావనం గృతకృత్యులై ‘రని చెప్పిన మద్రవిభుండు మానసంబు మాలిన్యరహితంబును బ్రసాద సహితంబును నయి చరితార్థుండయ్యెఁ; బాండవాగ్రజా! నీకు నీయర్థంబు విజ్ఞాతం బగుట యెఱుంగుదు, నైననుం బ్రజ్ఞావిశుద్ధి కరణం బాచరించితి’ నని చెప్పుటయు నతం డత్యంత సంతుష్ఠాంత రంగుండై ‘గరుత్మంతుండు మహానుభావుం డని విందు, నవ్విహగవిభుని వృత్తాంతంబు తెఱం గెఱుంగ వినవలతు వివరింపవే’, యనుటయు నతం డచ్యుతునాలోకించి, ‘యాసుపర్ణుండు నీవ కా వినియుండుదుం జెప్పెద’ ననవుడు నప్పుండరీకాక్షుండు వికచవదనుండై ‘యట్లచేయు; మిక్కురుపతి కోర్కి దీర్చుట కర్తవ్యం’ బని పల్కిన, నా దేవవ్రతుండు భూవల్లభున కిట్లనియె. | 166 |