| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘కశ్యపు భార్యలు కద్రువ, వినత నాఁ | గల రాతపస్వి వారలకు వరము గరుణ నిచ్చెద నన్నఁ గద్రువ వేవుర, | వినత యిద్దఱ, వేఁడికొనిరి సుతుల; మునియు ‘నట్లగుఁగాక’ యనియెఁ; బదంపడి | యండముల్ వేయును, నండయుగము, వరుసన, యా కద్రువకు వినతకుఁ బుట్టె, | నవి కుండముల నిడి, యరసి యుండి |
|
| తే. |
రహి సహస్ర మేనూఱేండ్లు నంత నుదయ | మయ్యె, నవ్వేయి గ్రుడ్డుల నధికబలముఁ దేజమును గల్గి యా సర్పరాజి యొప్పు చుండె, నారెండు విరియక యుండె, మఱియు. |
167 |
| క. |
తన సవతి యైన కద్రువఁ | గని వగపును మత్సరంబుఁ గదిరెడు మదితో వినత గడున్ వేగిరపడి | యనీతి నొకయండ మవియ నడిచె నరేంద్రా! |
168 |
| వ. | అడిచిన నందు. | 169 |
| క. |
పులుఁగొక్కఁడు పూర్వాంగము | గలిగి జనించుటయు, వానిఁ గని, యానతి గ న్నుల నశ్రుకణంబులు పె | ల్లొలుకఁగ శోకమున మునుఁగు నుల్లముతోడన్. |
170 |
| వ. | నివ్వెఱపడి యుండ నయ్యండజంబు. | 171 |
| చ. |
‘ఇరువుర మేము పుట్టుదు మహీనపు మేనులతో, మహాబల స్ఫురణ వెలుంగ నప్పెనుపుఁ బొందఁగ నీ కవియించి తిట్లు మ త్సరమునఁ జాపలంబునను దత్ఫల మందుము, నీ సపత్నికిన్ వరవుడవై చరింపు మని, వారని నెవ్వగ శాప మిచ్చినన్. |
172 |
| క. |
వెలవెలఁ బాఱుచు, వడఁకుచు | నలుకుచుఁ, దనమోముఁ జూచు నయ్యంగన న ప్పులుఁగు కృపఁ జూచి, తల్లీ! వలవ దడల నిది విధాతృ వశమయి వచ్చెన్. |
173 |
| వ. | అని వెండియు. | 174 |
| శా. |
‘ఏనూఱేండ్లకుఁ బుట్టు నాయనుజుఁ; డిం కీయున్న యండంబు నె ట్లైనన్ ధైర్యము గల్గి కావుము ప్రయత్నాసక్తిమై వాఁడు ద ర్పానూనుండు బలాభిరాముఁడు మదీయస్ఫూర్తి మన్మూర్తి నీ కానందంబుగ నీఁగు దాస్యము త్రిలోకాశ్చర్య సంపాదియై. |
175 |
| వ. | అనియె; నిట్లు ప్రథమ పుత్రుండు వికలాంగుం డగుటకును, శాపప్రాప్తికిని, బరమనిర్వేదంబు నొంది, వినతయు నవ్విహంగంబు నిర్దేశించిన కాలంబు ప్రతీక్షించి, యయ్యండంబు రక్షించి కాచియుండం, దత్సమయ సమాగమంబున. | 176 |
| చ. |
ఘనతరకంధరుండు, దృఢకాయుఁడు, దీప్తముఖుండు, రక్తలో చనుఁడు, మహోత్తమాంగకుఁడు, చారుసుసంగత పక్షసారమం డనుఁడు, పరిస్ఫుర ద్ద్యుతి విడంబిత బాలదివాకరుండు, లో కనయన పర్వనిర్వహణకారి సుపర్ణుఁడు పుట్టె భూవరా! |
177 |
| క. |
ఆ సమయంబున నరుణో | ద్భాసిత గాత్రుండు, తొలుతపట్టి యరుణుఁ డు ల్లాసి యగుచు రవి పరిచ | ర్యాసుఖ మెదఁ గోరి చనియె నంబరవీథిన్. |
178 |
| మ. |
జననిం బాసి జనించునప్డ తనయిచ్చం బక్షినాథుండునుం జని, పద్మోద్భవకల్పితంబు లగు భోజ్యంబుల్ శరీరంబు వ ర్ధన మొందింపఁగ సిద్ధసాధ్యగణముల్ దన్ ముద్దు సేయంగఁ గ్రీ డన లోలత్వమునం జరించుఁ బరితుష్టస్వాంతుఁడై యెల్లెడన్. |
179 |
| వ. | అక్కాలంబున వినోదంబునకై యరిగి యొక్క యెడ. | 180 |
| సీ. |
చంచులఁ జిగురాకుఁ జించియాడుచు నలి | నెలుఁగించు గండుఁగోయిలలసొంపు, నలరుఁ దేనియఁ గ్రోలి, యన్ను సోలంబుల | మురియు తేఁటుల నునుమ్రోఁత యింపుఁ, దమిఁ బండ్ల రసమాని తమలోనఁ జెలఁగుచుఁ | బలికెడు రాచిల్క పటురవంబు, గొలఁకుల కెలఁకులఁ గూడి క్రీడించుచుం | డెడు నంచతండంబు నడబెడంగుఁ, |
|
| తే. |
దరఁగఁ దేలుచుఁ, బూఁదీవఁ దగులఁ బడుచు | వచ్చు చిఱుగాలి సోఁకును, మెచ్చి మెచ్చి, తగిలి కొనియాడుచును, వినతయును గద్రు | వయును మున్నీటి చేరువ వనమునందు. |
181 |
| వ. | మెలఁగుచుండి రట్టియెడ. | 182 |
| చ. |
కరువునఁ బోసిరో! విధుని కాంతి, సుధాబ్ధి తరంగఁ దెచ్చి, గం డరు వొనరించిరో! హరుజటాస్థలికిం దొడ వైన యేటి పె న్నురువునఁ జేసిరో! యన మనోజ్ఞ సితచ్ఛవి నుల్లసిల్లు సుం దర తురగోత్తమంబు దవుదవ్వులఁ గాంచిరి చారులోచనల్. |
183 |
| వ. | నిజేచ్ఛమై వచ్చిన యుచ్చైశ్శ్రవంబు నాలోకించి. | 184 |
| క. |
వినత ‘హయ మింత యొప్పునె | యనూన ధవళప్రభాఢ్యమై’ యని పలుకన్ విని, కద్రువ ‘యపరాంగం | బున నీలిమ దోఁచె’ ననియె భూపవరేణ్యా! |
185 |
| చ. |
అనవుడు నమ్మృగాక్షి ‘యిటు లాడితి, నవ్వుల కాడితో? నిజం బునకునొ? నీదు చూపునకుఁ బోలిన భంగియొ? చెప్పు’ మన్న న వ్వనిత దరస్మితస్ఫురితవక్త్రముతో ‘నిది యేటి మాట? న ల్లనియెడ గానరాదె? తెరలం బలుకం బని యేమి? నావుడున్. |
186 |
| వ. | వినత తెలియం జూచి. | 187 |
| ఉ. |
కాదని పూని పల్కుటయుఁ గద్రువ ‘పన్నిద మేమి దీనికి? న్వా దిది యేల? రిత్త’ యనినన్ విని యాసతి ‘నిక్కమేని నీ వేది పణంబుగాఁ దలఁచి యేర్పడఁ జెప్పితి దాని కేను సం వాదము సేయుదాన గరువంబుగ నొక్కటి నిశ్చయింపుమా!’ |
188 |
| వ. | అనిన విని కద్రువ వినత వదనంబునఁ జూడ్కి నిలిపి. | 189 |
| తే. |
‘నీవు గెల్చిన దాస్యంబు నీకు నేను | జేయఁ గలదాన, నేను గెల్చినను నీవు నాకుఁ జేయంగఁ గలదాన; వీ కడింది | పన్నిదము సఱ’ మని తెగఁబాఱి పలికె. |
190 |
| క. |
ఆ పొలఁతి యట్లు పలికిన | శాపము ప్రేరేఁప నరుణ జననికి నుత్సా హోపేత మయ్యెఁ జిత్తం | బాపన్నిదమునకు; నేమి యనఁగల దధిపా! |
191 |
| వ. | ఇట్లు వినతయుం దెంపు సేసి యత్తెఱంగున కియ్యకొనియె; నయ్యిరువురుఁ బంచమహాభూతంబులు సాక్షులుగాఁ బల్కి పన్నిదంబు సఱచిరి; కద్రువ ‘పతిపరిచర్యకుం గాలమయ్యె; మఱివచ్చి యశ్వంబు నాలోకింత’ మని నెపంబిడి యప్పటికిం జూపుఁ దప్పించె; నవ్విధంబున మగిడి యరుగుదెంచిరి; తదనంతరంబ. | 192 |
| సీ. |
కుటిలంపుఁ దలఁపునఁ గొడుకుల రావించి | కద్రువ యిట్లనుఁ గన్నునీరు దొరఁగంగ వారలతో ‘నబ్ధి పొంతకు | వినతయు నేనును వేడ్క నరిగి యచ్చ తెల్పునఁ గడునభిరామ మగునొక్క | యశ్వంబు గాంచితి; మవ్వధూటి గేవలధవళంబు నా విని, యొడ్డార | మునకు నే నదె నల్లదనముఁ గంటె |
|
| తే. |
వెనుకదెస ‘నన్న వాదయ్యెఁ, గనలి పన్ని | దంబు సఱచితి; మోడిన దాస్యవృత్తి వచ్చు సవతికి; నే నెట్లు వరవుడంబు | సేయఁ దగు?; దోఁక నల్లగాఁ జేయరయ్య! |
193 |
| చ. |
అనవుడు వాసుకి ప్రభృతు లక్కట! ధర్మువు గాదు; నీవు సూ చినతెరు వట్టి గెల్పు శుభసిద్ధి యొనర్చునె? యట్లుగాక య వ్వనితయుఁ దల్లి గాదె? గరువంపుఁ దనంబునఁ జూడ మాకు ని ట్లనఁ దగునమ్మ? యెట్లయిన నయ్యెను; బాపము సేయవచ్చునే? |
194 |
| క. |
ఈ విధ మెమ్మెయి నైనం | గావింపఁగ వలయు ననుట గల్గినఁ బరదే శావాసుల మగుదుము; మము | నీ వింకం దగదు తల్లి! నిర్బంధింపన్. |
195 |
| క. |
అని రట్టియెడం గొందఱు | జననిఁ దొఱఁగి యెక్కడేనిఁ జని; రా భంగిం జనిన తనూజులఁ బేర్కొని | నెనరు విడిచి, యా నెలంత నిష్ఠురమతియై. |
196 |