| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| చ. |
‘అమృతకరాన్వయంబున మహాముని వేడ్క నరుండు పాండుభూ రమణుని దేవి గొంతి యుదరంబునఁ బుట్టి, ధనంజయాది నా మముల వెలుంగు దత్సుతుని మన్మఁడు సంభృతధర్మమైన పే ర్మి మెఱయ నేల యేలు; జనమేజయనాముఁ డరాత్యజయ్యుఁడై. |
197 |
| ఉ. |
ఆతఁడు సర్పయాగమను నధ్వరముం గుపితాత్ముఁడై పితృ ప్రీతిగఁ జేయుఁ; దద్దహనభీకర భూరి శిఖా ప్రవేశసం జాతదురంతతాపమునఁ జావఁగలా’ రని శాప మిచ్చెఁ; ద త్పాతన వృత్తికిన్ వెఱచి తక్కటి నాగము లా భుజంగితోన్. |
198 |
| తే. |
నల్లగాఁ జేయువార, మే మెల్లభంగి | నాతురంగమపతివాల| మని, రయమునఁ బోయి, వాలధి రోమముల్ వొదివి, నీల - రోమసంచయమైరి కురుక్షితీశ! |
199 |
| క. |
కద్రువ, గన్గొని సంతో | షద్రుతమతి యగుచుఁ బిలిచి సవతికిఁ జూపెన్ భద్రాత్మక యవ్వినతయు | దద్ద్రోహం బెఱుఁగలేమి దైన్యము నొందెన్. |
200 |
| క. |
నగుచుం గద్రువ ‘వరవుడ | వగుము విచారంబు విడిచి’ యనుడు, వినత ‘య ట్లగుఁగా’ కని, లజ్జయుఁ బెను | వగయుఁ దొలఁగఁ ద్రోచి, చేసె వరవుడము దగన్. |
201 |
| వ. | ఇట్లు కపట జయంబునఁ గద్రువ సత్యవినయాది గుణవతి యయిన వినతం దనకు దాసి చేసికొని, పరిహీణంబు లయిన, పరిచారికాకృత్యంబుల నిత్యంబు నలంచుచుండెం; బదంపడి యప్పరమసాధ్వి దన యగ్రతనయుం డాదేశించిన తెఱం గూహించి, రెండవ యండంబున జనియించిన తనూజుం దలంచుచు నాసపాటు గదిరిన హృదయంబుతో దాస్యం బనాలస్యంబున నడపుచుండ. | 202 |
| ఉ. |
యౌవనదర్ప మంది, జవ మంతకు నంతకు నగ్గలింప, మై లా వధికంబు గాఁగ, నుపలాలన సేయఁగఁ బద్మసంభవుం డా విహగోత్తముండు హృదయంబున గర్వ మెలర్ప నుద్ధతుం డై విహరింపఁ జూచి యొక యప్పుడు, నారదుఁ డల్లఁ జేరినన్. |
203 |
| వ. | అతఁడు భక్తిం బ్రణమిల్లి నిల్చిన నప్పక్షిపుంగవునకు నమ్మునిపుంగవుం డిట్లనియె. | 204 |
| తే. |
‘దాసియై సవతాలికిఁ దల్లి పనులు | సేసి నలఁగంగ, నద్దెసఁ జింత వంత లేక నీ విట్లు దిరుగుట లెస్స యగునె? | యద్భుతోజ్జ్వలతేజ! కశ్యపతనూజ!’ |
205 |
| చ. |
అనుడు, విహంగనాథుఁడు ‘మదంబకు దాస్యము రాకకుం గతం బనఘవిచార!యెద్ది? తెలియన్ వినిపింపవె!’ యన్నఁ జెప్పె న మ్మునివరుఁ డున్నరూపు, హయముం గను టాదిగఁ గల్గు కశ్యపాం గనల చరిత్ర మాతని కఖండ పరిస్ఫుట భాషణంబులన్. |
206 |
| చ. |
చెప్పినఁ, గోపమున్ వగపుఁ జిత్తమునం గదురంగ ‘మేలు మే లప్ప హితంబు సేసెఁ, జెలియల్ మనుచున్నది, పెంపుతోడ’ నం చప్పుడ వాయువేగమున నయ్యెడకుం జని, మాట యెద్దియుం జెప్పక తల్లికిం బ్రణతి సేసె విషాద భరార్తమూర్తియై. |
207 |
| వ. | కద్రువపాలికిం బోయి. | 208 |
| చ. |
పరమ వినీతిమై నెఱఁగి, బాంధవ మారఁగ నల్ల నిట్లనున్ గరుడుఁడు దారితారి వగఁ గందుచు ‘నీ చెలియల్ చరించు ని వ్వరవుడపుం జరిత్రమున వచ్చునె నీ కొక పేర్మి? యీసతిం గరుణ యెలర్పఁగా విడువ గౌరవ సంపదఁ జేయు నెంతయున్. |
209 |
| చ. |
నీకును నేను బుత్రుఁడన; నెమ్మిఁ దగన్ ననుఁ జూచియైనఁ ద ల్లీ! కృపసేఁత పెద్దయును లెస్స; యధర్మము ధర్మమ న్వగల్ నా కవి యేల? దాస్యకృతి నా జనయిత్రికి నివ్విధంబునన్ రాకయు దైవకృత్యమ మనంబునఁ బొంగుదు విడ్పుగల్గినన్. |
210 |
| వ. | అనిన విని మొగంబు ముఱకటించు కొనుచుఁ గద్రువ గరుత్మంతున కిట్లనియె. | 211 |
| మ. |
‘బలవంతుండవు, నేర్పు చందములఁ జెప్పంజాలి యీరిత్త ప ల్కులఁ దేర్పం బనిలేదు; తల్లికి మదిం గూర్తేని వే పోయి లో కులు నిన్నుం బ్రణుతింపఁ దె మ్మమృతమున్; ఘోరంపు దాస్యంబు నేఁ దొలఁగం బెట్టెద మీ కనంతమగు సంతోషంబు సంధిల్లఁగన్. |
212 |
| చ. |
అన విని, దాని కియ్యకొని, యప్డు సుపర్ణుఁడు పోయి, కశ్యపుం గని, తన భాషణంబులును, గద్రువ పల్కులుఁ జెప్పి, ‘తెచ్చువాఁ డ నమృత మెట్లు నే నని యొడంబడి వచ్చితి’ నన్న నాతఁ డ త్తనయునిఁ జూచి యుల్లము ముదంబును నచ్చెరుపాటు వొందఁగన్. |
213 |
| క. |
‘అమృతంబు దుర్లభం, బ | య్యమరుల కేనియు నతిప్రయత్నంబున గు ప్తము సేసి యుండు వాసవుఁ | డమలచరిత! నీకు నగునె యట్టిది తేరన్’ |
214 |
| వ. | వినుము. | 215 |
| చ. |
ఉదకము రక్షకం బగుచునుండఁగ, నుజ్జ్వలవహ్నియందునుం బొదువఁ, గృపాణశక్తి ముఖ భూరితరాయుధహస్తులై బలో న్మదులు, మహోగ్రకోపులు, ఘనస్థిరకాయు లనేకరాక్షసుల్ వొదిగొని కావ నిన్పవలలో నమృతంబు సురక్షితస్థితిన్. |
216 |
| క. |
ఉండు నన విని, విహంగ వి | భుం డల్లన నగుచు, ‘నీవు పుత్రస్నేహా ఢ్యుండవయి పలికితే; బలి | యుండ, నుపాయజ్ఞుఁడను, మహోజ్జ్వలతేజా! |
217 |
| మ. |
అనుమానం బది యేల? తెత్తు నమృతం ‘బన్నం గడుం బొంగి, యా తనిఁ దాఁ గౌఁగిటఁ జేర్చి కశ్యపుఁడు, పుత్రా! నిశ్చయం బట్లయే ని, నిభంబుం గమఠంబునుం గలవు; వానిం దిన్న లావెక్కు; నా ఘనజంతు ద్వితయంబు నీకు నెరగాఁ గల్పించితిం బోవనా!’ |
218 |
| వ. | అనుటయు సంతోషించి గరుత్మంతుం ‘డా గజకచ్ఛపంబు లెచ్చట నుండు? నెబ్భంగివి? యని యడిగిన నమ్మునీంద్రుం డవ్విహగేంద్రున కిట్లనియె. | 219 |