పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
కశ్యపుఁడు గరుడునకు గజకచ్ఛపంబుల తెఱం గెఱింగించుట (సం. 13-25-1 (కుంభ))
సీ. ‘ప్రాక్పయోనిధి పొంతఁ బర్వతం బొక్కటి | ఘన శృంగ కబళితాకాశ మగుచు,
నురగనామంబున నొప్పు, నచ్చేరువ | వసియించు నొక మహావారణంబు,
దానితటంబునఁ దామరకొల నబ్ధి | ననుకరించుచు మధురాచ్ఛవారి
సంపద సొంపారు సమదలీలల నగ్గ | జం బా నగంబుపై సంచరింప
 
తే. మిఱ్ఱుఁ బల్లంబు గట్టును మెట్టు నొక్క | మట్టమైయది నునుపారు మహిత మైన
యక్కొలన నీరు ద్రావఁగా ననుదినంబు | నరుగు నయ్యిభవల్లభుఁ డనఘచరిత!
220
ఉ. అందొక కచ్ఛపప్రవరుఁ, డత్యధికంబగు కాయమున్‌, బలం
బుం దనరన్‌ వసించు, జలముం గొను వాంఛ, గజంబు వోయినం
జెందఁగనీక, సంగరముఁ జేయుఁ బెనంగుచు నీరుద్రావు, గౌ
రుం దెగియుండు నిట్ల పగ రోష మెలర్పఁగ నాఁడు నాఁటికిన్‌.
221
క. విను, మధు కైటభు లనియెడు | దనుజేంద్రులు కచ్ఛపంబు దంతియు నై పు
ట్టినవారు దమ్మెఱుంగమిఁ | బెనఁగుదు రొండొరులతోడ భీకరభంగిన్‌.
222
క. ఒంటిమెయి నుండఁగా ము | క్కంటికి నా కచ్ఛపంబు గౌరుం బట్టం
గంట యరిది, యొకపఱి నా | రెంటిం బొదువంగవలయు రే వెర వారన్‌.
223
వ. అనవుడు వైనతేయుండు. 224
ఆ. ‘ఒకటి గొలనిలోన నుండు నొక్కటి గొండ | మీఁద సంచరించు, మీరు రెంటి
నడఁగ నొక్కమాట యడరి పట్టుట కృత్య | మనియెదరు, వశంబె? యట్ల చేయ?’
225
వ. అనిన ‘నది యట్టిద, ఉపాయంబు సెప్పెద; నాకర్ణింపు’ మని యమ్మునివరుండు. 226
చ. ‘కరిపతి నీరు ద్రావుటకుఁ గాఁ జనుదెంచినఁ గూర్మరాజు సం
గర మొనరించుచుండి తమకంబున నీళ్ళులఁ బాసి వీఁకమై
దరి నడరంగఁ బట్టునది, తత్సమయంబున రెంటిఁ గూడ నీ
వెరవున నూఁది చిత్తమున వేగిరపా టెటు లేక పొంచుమీ’!
227
వ. అని యుపదేశించిన వీడ్కొనుటకు వినతుం డయిన తనయు నత్యాదరంబునం గనుంగొని యత్తపోధన సత్తముండు ‘నీవు గజకచ్ఛపంబుల నాహారంబుగాఁ గొనిన నీకుం ద్రిదశాహారంబు తేర దొరకొనుటకు సందేహంబు లేదను పల్కు వల్కి పరమాశీర్వాదంబు లిచ్చిన. 228
మ. విని యుత్సాహము గందళింపఁగ వియద్వీథీగతుం డై, విమా
న నికాయంబులు దూలఁ బక్షతివితానస్ఫార దీప్తి వ్రజం
బినరశ్మి ప్రకరంబుఁ గీడ్పఱుపఁ బక్షీంద్రుండు చంచద్గతిం
జనియెం దానురగాభిధాన మగు నా శైలంబు పెందిప్పకున్‌.
229
క. చని, యల్పశరీరుండై, తను నెఱుఁగక యుండ, మెలఁగి దానోగ్ర గజేం
ద్రునిఁ గాంచి నీరి కది పో | యిన యప్పుడు వెనుకఁ జనియె నెలమి దలిర్పన్‌.
230
ఉ. దంతి సనంగ, భూరిమదధారల గాలి యెఱింగి, కూర్మ మ
త్యంత సముద్ధతిం గొలని కడ్డపడన్‌ వెసవచ్చె; వచ్చినన్‌,
దంతియు నీరువట్టున నుదగ్రపుఁ గోపము సందడింప, దు
ర్దాంతసముద్యమం బెసఁగ దాని పయిన్‌ గవిసెన్‌ మహోగ్రమై.
231
చ. కవిసి, ఖరంబులైన మునికాళ్ళను వ్రేయఁగ, సాము నీరిలో
ను వెడలకుండి కూర్మ మతను స్థిర తీవ్రనఖంబులం బదా
గ్ర విదళనంబు సేయఁగఁ గరంబున మోఁదఁగ వారణంబు దం
తివిహతి నొంపఁ గచ్ఛపము, దారుణ మయ్యె రణంబు భూవరా!
232
ఉ. ఇమ్మెయిఁ బోరి పోరి, మది నేపును గోపము నగ్గలింపఁ, గూ
ర్మమ్ము గడంగి, నీ ర్వెడలి మత్తకరిన్‌ వడి నాక్రమింపఁగా,
గ్రమ్మన రెంటినిం బొదివి, కచ్ఛపమున్‌ వలకాల వామపా
దమ్మున వారణంబును ముదమ్మునఁ బట్టి తగిల్చె గోళ్ళులన్‌.
233
వ. ఇట్టు వినతపట్టి పట్టిన నవి దమయంగంబులు పొరలం బడ నడిచిపడుటయు నతండు. 234
మ. పెలుచన్‌ గోళుల నొత్తి, యగ్గజముఁ దాఁబేలున్‌ వసం బేది మూ
ర్ఛల నొందన్‌ వెస నెత్తి, మేఘయుగళీసక్తోల్లసద్గైరికా
చలవైహాయసకేళియో యన నభస్సంచారియై, యుబ్బు న
గ్గలికన్‌ దవ్వుగఁ బాఱి, యొక్క ఘనవృక్షం బయ్యెడం దోఁచినన్‌.
235
ఆ. దానిమీఁద నుండి, వాని రెంటిని భుజిం | పంగ మదిఁ దలంచి, పంచయోజ
నముల నిడువు గల్గు రమణీయశాఖపై | గరుడుఁ డెలమి నెఱఁగెఁ గురువరేణ్య!
236
క. ఎఱఁగిన, యప్పెను వ్రేఁగున | విఱుగుటయును, శాఖ చూచి విహగేంద్రుఁడు గొం
దఱు మునుల నందు గన్గొని | వెఱపున నాత్మీయ చిత్తవృత్తి గలంగన్‌.
237
తే. అవనిఁ బడనీక, శాఖఁ జంచువునఁ బట్టి | పట్టి వారల సుస్థితుల్‌ పల్లటిలక
యుండ, వెరవున ధరియించి, యొయ్య నెగయఁ | జూచి యవ్వాలఖిల్యులు చోద్య మంది.
238
వ. వైనతేయుం డగుట మనంబుల ననుసంధించి కరుణించి. 239
క. ‘ఈతఁడు దక్కఁగ, నొరులకు | నీతెఱఁగు బలంబు, వెరవు నేల కలుగు? నం
చాతరుశాఖ విడిచి చని | రాతని దీవించి యోగ్య మయ్యెడు నెడకున్‌.
240
వ. చనినన్‌ గరుత్మంతుండు సంతోషించెఁ; దదనంతరంబ. 241
ఆ. ‘విపులశాఖ నిచట విడిచిన నిచ్చటి | జంతుకులము లెల్లఁ జచ్చు; నింక
నేమి సేయువాఁడ? నే’ నను నెవ్వగ | పుట్టె నవ్విహంగపుంగవునకు.
242
వ. అట్టి యెడ. 243
తే. ‘నిందితాచార యుతము, కులింద దేశ | మంబుధి ప్రాంత; మీశాఖ యందు విడువు,
మమరవరుల పం పిది, విహగాధినాథ!’ యను నెలుంగు నభంబునం దావహిల్లె.
244
క. విని, సత్వరముగ నటఁ గొని | చని, యద్దేశమునఁ గల్గు జనములు మృతిఁ బొం
ద, నతం డా చక్కటి నా | ఘనశాఖయు నెమ్మనంబు కలఁకయు విడిచెన్‌.
245
వ. విడిచి భరితలీలంబుగా నొక్క శైలంబు విశాల తటంబునకుం బోయి. 246
క. కరికచ్ఛపముల పెన్నె | త్తురుఁ, గండలుఁ, గ్రొవ్వు, మెదడుఁ, దుష్టిగఁ బక్షీ
శ్వరుఁ డాని, యధికబలబం | ధురుఁడై యమృతమున కేఁగె దుర్దాంతగతిన్‌.
247
వ. ఇవ్విధంబున. 248
క. చని, దానిచుట్టు మండెడు | ననలంబును జూచి, తన్మహత్తర జిహ్వల్‌
దనికిన నెఱకలు గమరునొ | యను తలఁపున బ్రహ్మఁ గాన నరిగె రయమునన్‌.
249
వ. అరిగి తచ్చరణ పద్మంబులకుం బ్రణతుఁడై కేలు మొగిచి. 250
చ. ‘వినతకు దాస్య మొందె నొకవెంటఁ, దదీయ నిరాసహేతువై
యనఘవిచార! నాకు నమృతాహరణంబు విధేయ మయ్యె; న
ప్పనిమెయి నగ్నిచేత నగుఁబా టగు నన్వెఱతో భవద్దయా
వననిధి నాశ్రయించుటకు వచ్చితి; నార్తశరణ్య! కావవే!’
251
వ. అనుటయు. 252
చ. అతనికి వత్సలుం డగుట నంబుజగర్భుఁడు ‘వెన్న పై పయిన్‌
వితతము గాఁగ జిహ్వలకు వ్రేఁగగునట్లుగఁ జాల వైచినం,
బతగవరేణ్యఁ! మ్రక్కఁబడుఁ బావకుఁ; డయ్యెడఁ జొచ్చి నీదువాం
ఛితము ఫలింప సత్వరతఁ జేకొను మయ్యమృతంబు’ నావుడున్‌.
253
ఆ. ఆత్మఁ బొంగి, మ్రొక్కి యతఁ డాలమందలు | పరపులైన యెడల కరిగి యరిగి
కొండ యంత వెన్నఁ గూర్చి, వేగము కొని | పోయి, యమ్మహాగ్నిఁ బొదువవైచి.
254
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )