పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
గరుడుఁ డింద్రుని జయించి యమృతంబు దెచ్చి కద్రువకుఁ జూపుట (సం. 13-28-1(కుంభ))
శా. నీరుం బాయఁగఁ జల్లి, రాక్షసుల యున్మేషంబు మర్దించి, హృ
త్సారోదారుఁ డయోమయం బయిన యజ్జాలంబు వే వ్రచ్చి, దు
ర్వారస్వైరవిహార మొప్ప, నమృతగ్రాహం బొడం గూడుడుం
దారావీథిఁ జనం దొడంగె మగుడన్‌ దర్పం బెలర్పన్‌ వడిన్‌.
255
వ. అంతయు నెఱింగి. 256
మ. అమరేంద్రుండు సముద్ధతిన్‌ వెడలి దేవానీకముల్‌ దోడ్పడన్‌
సమరక్రీడకుఁ జొచ్చి పక్షిపతిచే సైన్యంబు లెల్లన్‌ విధూ
తము లైనం గనుఁగ్రేవఁ గెం పెసఁగ రౌద్రం బైన చిత్తంబుతో
డ మహోదగ్రతఁ బొల్చు వజ్రము నవష్టంభోగ్రుఁడై వైచినన్‌.
257
క. అది యొకఁడుఁ జేయఁ జాలక | విదళితశైల మగు తనదు విలసన మచటం
గుదియుటఁ దనకుం దెలిసిన | మద మఱి గిరిభేదికడకు మగుడం జనియెన్‌.
258
క. చేయునది లేక నిర్జర | నాయకుఁడును వెఱఁగుపాటునను మ్రాన్పడుచుం
బోయెం గ్రమ్మఱి ధరణీ | నాయక! నిజపట్టణంబునకు దీనగతిన్‌.
259
చ. అజుని యనుగ్రహంబునఁ విహంగమవల్లభుఁ డట్లు సాలన
క్కజ మగు శౌర్యసంపద ప్రకాశతఁ బొందఁగఁ గేలి సల్పి యిం
ద్ర జయమహోత్సవంబున నుదాత్తయశః పరిపూరితంబు లై
త్రిజగములున్‌ వెలుంగ నలిఁ దెచ్చె సుధారసపూర్ణభాండమున్‌.
260
తే. తెచ్చి డించి, కద్రువ ప్రీతిఁ దేలఁ జూపి | తల్లి చెఱవాపికొని పొంగి చెల్లునాగ
డమున మగుడ నయ్యమృతభాండంబు దాన | పుచ్చికొని యెడఁ గలుగంగఁ బోయి నిలిచి.
261
వ. తన్ను వెఱఁగుపడి చూచుచున్న కద్రువ నుద్దేశించి. 262
మ. ‘జననీ! నీ వమృతంబు తె’ మ్మనిన, యా సత్యోక్తి పాటించి యేఁ
జని నానావిధ కర్మకర్మఠుఁడ నై సాధించి, వే తెచ్చితిన్‌
విను, నా నీయొడఁబాటు సెల్లె జనులన్‌ విన్పించితిం దెల్లఁగా
వినతం దోడ్కొని పోయెదన్‌ మనమునన్‌ విభ్రాంతి లే కుండుమీ!’
263
మ. అని ధర్మస్థితి తోఁప మాట వెర వేపారం దగం బల్కి నే
ర్పునకున్‌ లోకము మెచ్చఁ గద్రువకుఁ బెంపుం గీర్తియున్‌ మాయ సొం
పునఁ దల్లిం దనయింటి కన్పి యమృతంబుం గ్రమ్మఱన్‌ గ్రక్కునం
గొని, పక్షీంద్రుఁడు వోయి యింద్రుఁ డెలమిం గూరంగ నిచ్చెం దగన్‌.
264
వ. ‘ఇవ్విధంబున నౌచిత్యంబు సంస్తుత్యంబుగా నమృతం బమృతాశన పతికి నొసంగి యెసకం బెసంగు తేజంబున విరాజితుం డయి యావృత్రవైరిని సూరెల నున్న సురలను మునులను గలయం గనుంగొని. 265
చ. ‘కొడుకులఁ బంచి తెల్పెసఁగు గుఱ్ఱము వాలమునందు నల్ల గ
ల్గెడు క్రియఁ దీర్చి, పన్నిదము గెల్చిన కద్రువ నేను మాటమై
నొడిచితిఁ దల్లి దాసి యగు టోర్వక, తండ్రి యనుజ్ఞ, మీ కెదు
ర్పడిన దురుద్ధతిన్‌ మఱచి బాంధవసత్కృతి నాదరింపుఁడీ!’
266
వ. అని వెండియు. 267
క. ‘వినుఁ! డట్టులు పాపము సే | సిన కద్రువ సుతులఁ బొదివి చెండుదు, మత్తుం
డనితాంతోగ్ర విహారం | బునఁ దండ్రియు మీరు ధర్మమును సాక్షులుగన్‌’.
268
వ. అని పలికిన నతని నందఱు నభినందించి; రమ్మునులును సురలునుం బురందరుని తోడ ‘నితనికి నొక్కవరం బొసంగ వలదే!’ యనిన, నతండు దలంచికొని దరహసితంబుతో వారల నాలోకించి ‘మనవరంబునకు నాసపడియెడు కొలంది వాఁడు గాఁ; డతండు సాక్షాద్విష్ణుండు కృష్ణుండనశూరుఁ డను యాదవ ధాత్రీశునకుఁ బౌత్రుండై లోకహితార్థంబుగాఁ జరియింపం గలవాఁడీమూర్తియు విడువండు; వివిధ వర్తనంబుల వినోదించుచుండు’ ననియెఁ; దదనంతరంబ సముచితప్రకారంబున నాజంభారిని వారలను దా నామంత్రితులం జేసి. 269
సీ. ‘అజుఁ డుపలాలింప నద్దేవు కావించు | వరభోజనంబులఁ బెరిఁగె నితఁడె!
ఘనకాయజవసత్త్వ గజకచ్ఛపముల నొ | క్కెత్తున లీలమై నెత్తె నితఁడె!
విపులభూరుహశాఖ విఱిగిన మునిహితా | ర్థంబుగాఁ జంచునఁ దాల్చె నితఁడె!
సురసేనతోఁ బురందరుని నిర్జించి యు | ద్దీప్తుఁడై యమృతంబుఁ దెచ్చె నితఁడె!
 
తే. తల్లిదాస్యంబు దనబాస దప్పకుండఁ | బాపి యాసుధ మరల నప్పాకశాస
నునకు దయ నిచ్చె నీతఁడె!’ యనుచు సిద్ధ | సాధ్యు లగ్గింప, గరుడుఁడు సనియె మగిడి’.
270
వ. అని చెప్పి భీష్ముండు. 271
క. ‘మానవలోక కలిత బహు | ళానందకరంబు, నిష్కలావ్యయసుఖ సో
పానము నగు సౌపర్ణా | ఖ్యానము విని పుణ్యతముఁడ వైతి నరేంద్రా!’
272
వ. అనినం బాండవాగ్రజుండు సంతసించి, ‘విప్రున కెద్దియేనియు నిచ్చువాఁడుగా నొడంబడి యీనివాఁ డేమి గతిం బోవం గలవాఁ? డని యడుగుటయు, నతం డతనితో నొక నిదర్శనంబున, నది యెఱింగించెద విను’ మని యిట్లనియె. 273
సీ. ఒక్క సృగాలంబు, నొక వానరంబును | బ్రీతిమైఁ గూడి వర్తించుచుండుఁ,
దొలుపుట్టువున మానవులును నెచ్చెలులు నై | యుండుట గూర్చు నొండొంటి; కొక్క
యెడ, నొకనాఁ డవ్వఱడుతోడ నాక్రోఁతి | ‘గటకటా! నీ కిట్లు గడును హేయ
మైన పీనుఁగునంజు డాహార మైనట్టి ’ భవము వాటిల్లు టేపాపముననొ?’
 
తే. యనిన జాతిస్మరణవంత మగుటఁ జేసి | యది విషాదముఁ బొంది ‘ధరామరునకు
నీ నొడంబడ్డ ధన మీన కాన యిట్టు | నీచతరజాతియందు జన్మింపవలసె.
274
వ. అని తెలిపె; నట్లగుటంజేసి ‘యాస గొల్పి, విప్రున కియ్యకున్కి యొప్ప’ దని చెప్పిన, నప్పాండవాగ్రజుం ‘డహీనగుణ వర్ణనీయుం డయిన హీనవర్ణునకు మంత్రతంత్రాదు లుపదేశించుట ధర్మవిరుద్ధం బయి యుండు నొకో?’ యని యడిగిన నయ్యనిమిష నదీనందనుం ‘డీప్రశ్నంబున కుత్తరం బగునది యొక యితిహాసము గల; దాకర్ణింపు’ మని యిట్లనియె. 275
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )