| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
హిమగిరిమీఁద ననేకద్విజులు దప | మాచరింపంగ నయ్యాశ్రమమున కొక్కశూద్రుండు ధర్మోపేతుఁ డేతెంచి | యమ్మునులకు గురుఁ డగు మునీంద్రుఁ గని, ‘కృప నుపదేశ మొనరింపవే తపో | వృత్తికై నా’ కని వేఁడుటయును, ‘జనదు వైదికము శూద్రున కుపదేశింప; | నీవు శుశ్రూషమై నిలువు’ మనియె, |
|
| తే. |
ననుడు, వాఁడు శుశ్రూషకుఁడై వసించె | గుడిసె యొకదెసఁ గావించుకొని ముదమున నతిథి సురపితృపూజ లత్యధిక భక్తి | తోడఁ జేయుచు నొక్కింత కీడు లేక. |
276 |
| క. |
నియతియు, వినయముఁ జూచిన | దయ పుట్టెడునట్లు గాఁగ, ధర్మనిరూఢ క్రియ లొనరింపఁగ, మునిపతి | ప్రియమునఁ గనుఁగొనుటకై యరిగె నచ్చటికిన్. |
277 |
| ఆ. |
అరిగి యతనిచేయు నయ్యనుష్ఠానంబు | లోనఁ గానివాని మానఁ జెప్పి, ‘యనఘ! యిట్లు సేయు’ మని యుపదేశింపఁ | గరుణపేర్మిఁ బుణ్యకర్మగతులు. |
278 |
| క. |
ఆతఁడు దానికి నతిసం | ప్రీతాత్ముం డగుచు నడపి పిదపం గాలం బై తెగి, యొకనృపునకు సం | జాతుం డయ్యెను సమస్త సద్గుణములతోన్. |
279 |
| క. |
మునిపతియుం దఱితోడన, | తనువు విడిచి యరిగి, యతని తండ్రి యగుడు, వి ప్రునకుం బుట్టెన్, వేదా | ద్యనుపమ విద్యలకు నెల్ల నావాసం బై. |
280 |
| చ. |
పదపడి యక్కుమారకుఁడు పట్టముగట్టి, పురోహితత్వమున్ విదిత విభూతితో నొసఁగె విప్రుని పుత్త్రున; కవ్విభుండు న వ్వొదవెడు మోముతో నతనినోరలు వాఱఁగ జూచు; నాతఁ డె య్యది గత మొక్కొ నవ్వునకు నంచు మదిం దలపోయు భూవరా! |
281 |
| వ. | ఒక్కనాఁడవసరంబు గాంచి, యప్పురోహితుం డా భూవరునితో ‘దేవా! నన్నుం గనినప్పుడు నవ్వుదు; నావలన నేమి కీడు గలద యెఱింగింపవే! యిదియ నాకు వరం’ బని వేఁడిన, నజ్జనపతి దనకు జాతి స్మరత్వంబు గలుగుటం జేసి, పూర్వజన్మంబు దెలిపి యక్కాలంబునం దన యనుష్ఠానంబున నేమేని విహితంబు లుపదేశించుట దేటవడం బలికి, శూద్రవిషయోపదేశంబునం బరమగతి దప్పి యిప్పాట రాజసేవాత్మకంబైన పౌరోహిత్యంబు నడపుటకై నీకుం బుట్టవలసె; నేను బుట్టువెఱింగి పుట్టినవాఁడ నగుటం జేసి యెఱింగి నవ్వుదు; నవ్వునకుఁ గతంబింతియ కాని, నీ వొండుకల్మషంబు గల వాఁడవే? మహాధర్మపరుండవు గురుండ; వాదుష్కర్మంబునకుం బ్రాయశ్చిత్తంబు సేసికొ’ మ్మని యనేక గోవులం గనకరాశులను నొసంగిన, నా భూసురోత్తముండు పురాతన జననకృతం బగు సుకృతంబునం జిత్తంబు నిర్మలంబై యుండుకతంబున నారాజు సెప్పినంత వట్టునుం గలవోలెఁ దనకుఁ దోఁచినం దోషితుండై దానంబులం దీర్థస్నానంబుల మఱియు జపహోమాదిపుణ్య విధానంబులం బాపంబులు వాపికొని, యీ పుట్టువును నీఁగికొని, సంయమి సంతానజాతుండై యెప్పటి యాశ్రమంబునం దపం బాచరించి మహాపదంబు నొందెఁ గావున బ్రాహ్మణ క్షత్రియవైశ్యులకుం దక్కఁ దక్కటివారికి నుపదేశించి బ్రాహ్మణుండు కల్మషభాజనంబగు బ్రాహ్మణాదులకుం బరీక్షాపూర్వకంబుగా నుపదేశింప వలయు నని చెప్పిన నప్పుడమిఱేఁడు, ‘లక్ష్మియెట్టి జనంబులయందు వసియించు?’ నని యడిగిన నాదేవవ్రతుం డతని కిట్లనియె. | 282 |