పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
లక్ష్మీనివాసస్థానములు (సం. 13-11-1)
క. నారాయణాంకతలమున | శ్రీ రాజిల్లంగఁ జూచి, చిత్తం బతి వి
స్మేరం బై రుక్మిణి వి | స్తారరుచిరనయన యగుచు, సంభావనతోన్‌.
283
వ. ‘నీ వెట్టి పురుషులయందు, నెబ్భంగి భామలపాల వసియింతు?’ వనిన నా దేవి మకరధ్వజమాతకుం జెప్పిన వాక్యంబుల యర్థంబు లుపన్యసించెద; దాన నీ యడిగినయది తేటపడు; నాకర్ణింపుము. 284
సీ. ‘నిత్యసత్యులు, శౌచనిరతులు, గురుభక్తు, | ల ప్రమత్తులు, దక్షు లమలమతులు,
సత్కర్మపరులు, విజ్ఞానముఁ దపము దా | నము బ్రహ్మచర్యంబు శమముఁ గల్గు
వారలు, ప్రీతి నా వసియించు నిక్కలు | క్రూరు, నాస్తికుఁ, గృతఘ్నునిఁ, గుబుద్ధి
వర్జింతు; నెంగిలి వర్జించి, యిలువాడి | ఘటశుద్ధి గలిగిన కాంతలందు
 
తే. నిల్తు ; వల్లభ ప్రతికూల, నిష్ఠురాత్మ | నన్యమందిరగామిని, నధికనిద్ర
యైన మానినిఁ దొఱఁగుదు ; నబ్జినీ త | టాక తరుషండ పుష్ప వాటముల నిలుతు’.
285
వ. అని చెప్పెఁ దత్ప్రకారంబులు బుద్ధిగతంబులు సేసికొమ్మనినం, గురుపతి ‘పురుషుల పురంధ్రులసంగతి యందు సంస్పర్శ సుఖంబు నతిశయం బెవ్వరికిం గలుగు?’ నని యడిగిన వియత్తటినీ తనూజుం ‘డివ్విషయంబున కొక్క యితిహాసంబు గలదు; విను’ మని యిట్లనియె. 286
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )