| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘అనఘ! భంగాస్వనుం డనురాజు పుత్రార్థి | యై వజ్రి కప్రియం బగుమఖంబు సేసి, పుత్రుల సవిశేషుల నూర్వురఁ | గని, సంతసంబునఁ గ్రాలుచుండు; నాతఁడు వేటకై యరిగినచో వజ్రి | దిగ్‌భ్రాంతి పుట్టించి తేరకాఁడు సనునట్లు సేయ నజ్జనపతి యెక్కిన | తురగంబుతో నొంటి దూరమైన |
|
| ఆ. |
కాన కేఁగి, తృష్ణ గదిరిన, నలుగడ | నరసి, యొక్క పద్మసరసి గాంచి వెన్ను మునుఁగ హయము నన్నీరఁ దిగిచి, తాఁ | దనివు సొంపు మిగుల మునిఁగి లేచి. |
287 |
| క. |
భూనాథుఁడు తృష్ణ సెడం | బానక్రియ యాచరించి, భామినియై తన్ దాన కనుంగొని, విస్మయ | మూనెడుమదితోడ సరసి నొయ్యన వెడలెన్. |
288 |
| సీ. |
వెడలి, చింతించి, యీ యొడలితో నే భంగిఁ | దురగంబు నెక్కుదుఁ? బురజనంబు లేను బోయినఁ జూచి యే మని తలఁతురో? | పొలఁతు లేమను వారొ? పుత్రు లేమి గాఁగ నూహింతురో ? కానన యుండంగ | వచ్చునే? పోవంగ వలయు నెట్లు? నని విచారించి, పోయిన నెల్లవారును | నాశ్చర్య మందుచు నంత నంతఁ |
|
| ఆ. |
గనుఁగొనంగ, మంత్రిగణము రావించి దిగ్ | భ్రాంతిఁ దాను బోయి పద్మసరసి యందు మునిఁగి వనిత యగుట యెఱింగించి | రాజ్యమునఁ దనూజరాజి నిలిపి. |
289 |
| ఉ. |
కానకు నేఁగి తాపసులఁ గాంచి, తపం బొనరింప, నం దొకం డా నలినాక్షిఁ బొంది ప్రియుఁడై నడచెం, గ్రమవృత్తి నందనుల్ దానికిఁ బుట్టి రిద్ధబలదర్పులు నూర్వురు; వారిఁ గొంచు న మ్మానిని పూర్వ పుత్రక సమాజము పాలికిఁ బోయి, నెమ్మితోన్. |
290 |
| వ. | తనకు నొక్క తాపసుండు ప్రియుం డగుటయు, వానివలన నత్తనయశతంబు జనియించుటయు నెఱింగించి. | 291 |
| క. |
‘మగతనమునాఁడు మీరున్ | మగువతనము నపుడు వీరు నాయం దుదయం బగుటను దోడంబుట్టువు | లగుదురు; ధర వంచి కుడువుఁ డందఱు’ ననుడున్. |
292 |
| క. |
భ్రాతృస్నేహము గల్గి, య | రాతులు భయమందఁగా ధరారాజ్యము సం ప్రీతి ననుభవించిరి జను | లాతతహర్షమునఁ బొంద నందఱు నెమ్మిన్. |
293 |
| తే. |
దానిఁ గని, పాకశాసనుఁ ‘డేను వీని | కహితముగఁ జేయ నిది హితమై ఘటించె నధిక పుత్త్రసమృద్ధి రాజ్యాభివృద్ధి; నిమ్మహీపతి సమ్మదం బినుమడించె. |
294 |
| వ. | దీని విఘటింపం జేయుదు’ నని భూసురాకారుండై వచ్చి పూర్వులం గాంచి. | 295 |
| క. |
ఆ రాజకుమారుల మతి | నీరసము జనించునట్టు |‘లెక్కడి జనకుం? డేరికినేనియుఁ బుట్టిన | వారిం దోబుట్టువులుగ వల్వం జనునే?’ |
296 |
| వ. | అని మఱియు, ననేక ప్రకారంబులం జెప్పి, వార లెఱుంగకుండ నపరకుమారకుల కడకు నేఁగి యితకరి మాటలమొత్తంబుల వారలచిత్తంబులను గలంచె. | 297 |
| క. |
అనిమిషవరుఁ డివ్విధమున; | జనియింపఁగఁ జేసెఁ బగ; యసంగతు లై వా రును దెగి, యొండొరువులతో | ననిఁ బెట్టుగఁ జేసి చచ్చి రందఱు నధిపా! |
298 |
| ఉ. |
చచ్చిన నత్తపస్విసతి సన్నులు మోమును మోదికొంచుఁ బై వెచ్చని కన్ను నీ రడర, వీడిన వేనలితోడఁ బెల్చ వా పుచ్చి, తనూజులం బనువఁ బొంచి కనుంగొని పోయె విప్రుఁ డై యచ్చటికిన్ సురాధిపతి; యాతనిఁ జూచి లతాంగి వెక్కుచున్. |
299 |
| ఆ. |
కరుణ మొగమునందుఁ గనుఁగొని, తాను ము | న్నర్ధి వేఁట వోవు టాదిగాఁగ సకల సుతులు నాజిఁ జచ్చుట తుదియు గఁ | గలుగు వర్తనంబు దెలియఁ బలికె. |
300 |
| క. |
విని, యతఁ ‘డే నింద్రుఁడ, నా కనిష్ట మగు క్రతువుఁ జేసి; తది హేతువుగా నినుఁ బఱచితి నిత్తెఱఁగున’ | ననుటయు, సంభ్రమ సమేతమైన భయమునన్. |
301 |
| క. |
ఇలఁ జాఁగి మ్రొక్కి ‘యటు తన | యులకై సమ్మూఢబుద్ధి నొనరించితిఁ ద ప్పలఘు దయఁ జూడు; నీ కేఁ జలమునకుం బాత్రమే విశాలయశోర్థీ!’ |
302 |
| వ. | అని రామయై యున్న రాజన్యుండు, దైన్యంబు దోఁపం బలికిన, బలసూదనుండు ప్రసన్నుండై. | 303 |