| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘ఇచ్చెదఁ గొందఱ; నెత్తఱిఁ గాంచిన | తనయుల నొసఁగుదు’ ననిన నతఁడు ‘కాంతనై యుండి యేఁ గనిన వారల నిమ్ము | దేవ!’ నావుడుఁ దొల్లి నీవు గన్న ప్రజల నే లడుగవు? నిజము సెప్పుము నాకు’ | ననియెఁ బురందరుం డవ్విభుండు వెడసిగ్గుపాటుతోఁ ‘పడఁతుల కర్మిలి | బిడ్డలదెసఁ గడుఁ బెద్ద’ యనిన |
|
| తే. |
‘సత్యవాది వైతి సకలతనూజులు | బ్రదికి నెగడువారు భామినీత్వ దైన్య ముడిపి పురుషతయు నిత్తు నీ’ కని | పాకశాసనుండు వల్కె నధిప! |
304 |
| క. |
విని, యజ్జగతీనాథుఁడు | ‘దనయుల నందఱను నీదుదయఁ బడసితి; నే వనిత నయి యిట్ల యుండెద | ననఘా యివ్వరము నొసఁగు’ మని పల్కుటయున్. |
305 |
| వ. | విస్మితుండై యింద్రుండు ‘దీనికిం గతం బేమి? యని యడిగిన నా భంగాస్వనుం డిట్లనియె. | 306 |
| క. |
‘సురతంబునఁ గడు నెక్కుడు | పురుషులకంటెను సుఖంబు పొలఁతులకు, సురే శ్వర! యట్లగుటను నాకీ | వెరవున రమియించి నిలువ వేడుక గలిగెన్.’ |
307 |
| ఆ. |
అనిన, నట్టులేని నౌఁ గాక, యిమ్మెయి | విపుల సౌఖ్య మొంది, విహరణంబు సలిపి నిలువు’ మనుచు, శక్రుండు సనియె భం | గాస్వనుండుఁ బ్రీతి నట్ల యుండె’. |
308 |
| వ. | అని చెప్పి భీష్ముండు ‘పాండవాగ్రజా! దీన నీయడిగిన యర్థంబు దెలిసికొ’ మ్మనిన, నమ్మనుజపతి ‘బహువిధము లగు ధర్మంబులు భవత్ప్రసాదంబున వినుచున్నవాఁడ; నవియెల్లను జన్మ మరణాది దుఃఖంబులం బాపంజాలునే? యనేక జననీ జనకులకుం బుట్టుచు సంసార చక్రంబునం దిరుగంజాల; గర్భవాసంబన నరకంబన భేదంబు గలదె? సచరాచరంబైన యిజ్జగం బస్థిరం; బట్లుంగాక దీని విషాన్నంబు చందముగాఁ గనియెద; భవమోక్షణం బగు వైష్ణవధర్మం బుపదేశింపవే! యది యీ యుగంబునం దిరోహితం బగుట కృష్ణద్వైపాయనుండు సెప్పె; మీ యనుగ్రహంబుల నెఱింగెద; భవదీయ చరణంబులు శరణంబులుగాఁ బ్రసన్నుండ నైతి’ నని ప్రార్థించిన నమ్మహాత్ముండు ‘పగతురం దెగటార్చి పేర్చి పూజ్యంబగు సామ్రాజ్యంబు గైకొని, తదీయంబు లగు సుఖంబు లనుభవించుచుండుట గీడుగాఁ జూడఁ గురుకుల చూడా మణియగు నీకుం జనుఁగాక, యౌవనస్థు లగు రాజ్య పదస్థుల తలంపుల చొప్పె యిది? మిథిలాపతియగు జనకుండుం బోలెం బలికెద’ వని యుపలాలించి యమ్మహీపాలున కిట్లనియె. | 309 |
| క. |
‘పురుషాతిగ యై తోఁచును, | నిరూపణము సేయ నూఁది నిర్దేశింపన్ వెరవుపడక, శాశ్వతసుఖ | భరితత, నిర్వాణ మనఁగఁబడుఁ బ్రకృతి నృపా! |
310 |
| క. |
ప్రకృతులు పె; క్కన్నింటికి | నకృతి యనం జనిన యదియ యాద్య; మహీపా లక! పురుషరూపిణియు నై | వికృతిం బొరయదు వివేకవిజ్ఞాత యగున్. |
311 |
| క. |
విను, సంసార పథమునకు | ననురూపతఁదోఁచుచుండఁ, నన్యప్రకృతుల్ దనతోఁపు భవనిరాసం | బునకుం గారణము, గామమునఁ బిహిత మగున్. |
312 |
| క. |
కావునఁ గామక్రోధము | లావిర్ఖూతములు గానియట్లుగఁ దత్స త్త్వావేశంబునఁ దనుపుము | భావం; బివ్విధము విష్ణుపరతఁ గుమారా! |
313 |
| క. |
నృప! వైష్ణవధర్మము నీ | కుపదేశించితిఁ; బ్రసాదయుతుఁడ వగుచు సా రపుఁ దెరు వగు నిది గనికొని, | యపగత సంసార భయుఁడ వై నడపు తగన్. |
314 |
| వ. | అనిన సంప్రీతుండై ధర్మజుండు భీష్మునితోఁ ‘దత్త్వంబులు నధ్యాత్మంబులు, నధిభూతంబులు, నధి దైవంబులు, ననుసర్వంబునకుం గర్తయు, భర్తయు, హర్తయు నగుచు సకల భూతంబులుం దనుపజీవింపం బెంపారు వాని నెఱింగింపవే!’ యని ధర్మజుం డడుగుటయు నతనికి నమ్మహితాత్ముం డిట్లనియె. | 315 |
| క. |
‘సనకుఁడు, సనందనుండును, | సనత్కుమారుఁడు, సనత్సుజాతుఁడు, నలువుర్ తనయుల్ బ్రహ్మకుఁ, బంచము | డును షష్ఠుండును వసిష్ఠుఁడును, శంకరుఁడున్. |
316 |
| ఆ. |
అనఘ! విను మరీచి యనఁగ, భృగుం డన, | నంగిరసుఁ డనఁగ, ననంతరంబ యత్రి యనఁ, బులస్త్యుఁ డన, బులహుం డనఁ, | గ్రతు వనంగఁ, బుట్టు సుతచయంబు. |
317 |
| వ. | ఆ సనత్సుజాతుం డంగుష్ఠ ప్రమాణమూర్తియుం, బ్రజ్వల దనలస్ఫూర్తియునయి లోకంబుల నెందునుం జరియించుచు నొక్కనాఁడు మేరు శిఖరంబున నారదుండు సన్నిహితుం డగుటయుఁ దదీయసల్లాపసౌఖ్యం భనుభవించుచున్న యెడ నిట్లపోలె నడిగిన నారదునకు నమ్మహాయోగీశ్వరుండు సెప్పిన వాక్యంబు లితిహాసరూపంబునం జెల్లునవి యుపన్యసించెద; నవి భవత్ప్రశ్నంబున కుత్తరంబగు; నాకర్ణింపుము. | 318 |