పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
సనత్సుజాతుండు నారదున కుపదేశించిన తత్త్వప్రకారము (సం. 13-38-1 (కుంభ))
క. దశకల్ప సహస్రంబులు | నిశ, యింతియ దివస, మిది సునిద్రారతికిన్‌.
విశదప్రబోధమునకున్‌ | వశగతకాలములు విష్ణునకు విమలమతీ!
319
క. అవ్యక్తం బనఁగాఁ దన | దివ్యాత్మన కలిగియుండు ధీసారనిధీ!
భవ్యాత్ము లభేదస్థితి | సవ్యాహతదృష్టిఁ గాంతు రయ్యమళమ్మున్‌.
320
వ. అప్పరమేశ్వరుండు. 321
క. రే నిద్రించు, ప్రభాతం | బైనన్‌ మేల్కని సృజించు నంబువులఁ దగం
దా నం దిడుఁ దనవీర్యము | దాన మహాండ మగు హేమతాస్ఫురితంబై.
322
వ. తదనంతరంబ. 323
తే. బ్రహ్మఁ గల్పించి, దానికిఁ బతిగఁ జేయు, | నమ్మహాత్ముఁ డహంకార మావహించి,
మనసుఁ బదియింద్రియములు, బుద్ధిని ఘటించి | చదలు మొదలగు భూత పంచకముఁ జేయు.
324
వ. అ య్యాకాశ పవనాగ్ని జలభూము లగుభూతంబు లేనింటికి గుణంబులుగా శబ్దస్పర్శరూపరసగంధంబు లావహించుం; గ్రమంబున దేవముని దానవ గంధర్వ కిన్నర నరజాతి జంతు జాలంబులం గల్పించు నన్నియు నహంకార వ్యాప్తంబు లయి యవ్యక్త సాగరంబున మగ్నోన్మగ్నంబు లగుచుండు. 325
క. విభుఁ డావిష్ణుం డేతత్‌ | ప్రభవస్థితి విలయముల, శుభము నశుభంబుం
బ్రభువై తగఁ గాంచి, నడపి | విభవోజ్జ్వలకేలి సల్పు, వినుము, మహాత్మా!
326
తే. అంబరాదిభూతములు శబ్దాది గుణము | లింద్రియంబు, లహంకార, మిద్ధతేజ!
మనము, బుద్ధి, యవ్యక్తంబు, మహితవేద | వేద్యతత్త్వంబు లీ చతుర్వింశతియును.
327
వ. అధ్యాత్మాదులు సెప్పెద నాకర్ణింపుము. 328
సీ. శ్రోత్ర మధ్యాత్మంబు సూవె, శబ్దం బధి | భూతంబు దిక్కులు పురుషముఖ్య!
యధిదైవముల్‌, చర్మ మధ్యాత్మమందలి | సంస్పర్శ మధిభూతసంజ్ఞకంబు,
దానికి నధిదైవతంబు మరుత్తు, నే | త్రంబు దా నధ్యాత్మకంబు, రూప
మధిభూత, మాదిత్యుఁ డధిదైవతము, జిహ్వ | యధ్యాత్మకము, రస మారయంగ
 
తే. దాని యధిభూత ముదకము, దదధిదైవ | తంబు ఘ్రాణ మధ్యాత్మంబు దలఁప గంధ
మనఘ! యధిభూత మగుఁ దదీయాధిదైవ | తంబు, మేదిని యండ్రు విద్వజ్జనమ్ము.
329
వ. ఇది బుద్ధీంద్రియ ప్రపంచంబు. 330
సీ. పాద, పాయూ పస్థ, పాణి, వాగ్వర్గంబు | గర్మేంద్రియము లివి నిర్మలాత్మ !
యధ్యాత్మములు, వాని కగు నధిభూతముల్‌ | గంతవ్యమును విసర్గంబు నోలి
నానందమును విను మనఘ! కర్తవ్య వ | క్తవ్యంబు లన, నధిదైవతములు
వాసుమిత్త్ర ప్రజాపతి శక్రవహ్నులు | మఱి యహంకారంబు మనసు బుద్ధి
 
తే. పూజితాధ్యాత్మకము, లధిభూతవృత్తి | వెలయు, నభిమానమంతవ్యములును, నిశ్చ
యంబు నధిదైవములు, మేధ యమృతకరుఁడు’ | బ్రహ్మ మిది వేదవాక్య నిర్ణయవిధంబు.
331
క. ఇవి యెల్ల విష్ణునం దు | ద్భవము లయముఁ బొందుచుండు; బహువీచిక ల
ర్ణవమునఁ బొడమి యడఁగుమా | డ్కి విశేషము గల్గ దతనికిన్‌ విభుఁ డగుటన్‌.
332
క. విను మవ్యక్తం బనఁగాఁ | జను, మూలప్రకృతి పురుష చైతన్యము నె
క్కొనినం జేతన యగుచు భు | వనతంత్రం బెల్ల నడపు వైభవ మెసఁగన్‌.
333
ఆ. అట్లు లోకకర్త యగు నంబుజాక్షుండు | పట్టుఁ గొమ్మ, భావభవహరుండు
హరుని యనుమతమున నఖిలాబ్జజాండంబు | లట్లు పుట్టఁజేసి, యడఁచుచుండు’.
334
వ. ఇట్లు సెప్పి సనత్సుజాతుండు నారదుం జరితార్థుం జేసె నని చెప్పి భీష్ముండు భీమాగ్రజుతో వెండియు. 335
ఉ. ‘ఇంతకు మూలమై, యిరువదేనవ తత్త్వ మనంగ, వేద వే
దాంత పురాణవేద్యుఁ డగు నప్పురుషుండు వెలుంగు, వాఁడ కా
లాంతకుఁడైన యచ్యుతుఁ డనంతుఁడు, యోగిజనాంతరంగ వి
శ్రాంతుఁడు, విష్ణుఁ డద్వయుఁ, డసంగుఁడు గౌరవవంశదీపకా!’
336
వ. అనిన విని యజాతశత్రుండు సరిత్పుత్రునితో ‘నియతు లయి యగ్నులు దమయంద సమాహితంబులు సేసికొని మహితాత్ములు నిజాత్మల నప్పరమాత్ము నెట్టివానింగా, భావింతు రెఱింగింపవే’ యనుటయు నతనికి భీష్ముం డిట్లనియె. 337
క. అమృతోత్పత్తి సమయమున | నమరులకును, దానవులకు నని వాటిలె; నం
దమరులు దప్పిం జేడ్పడి | కమలభవుని నాశ్రయింపఁగా నియతిమెయిన్‌.
338
వ. అతండు నారాయణు నాత్మయందు నిలిపి. 339
తే. ‘భక్తవత్సల! పరమాత్మ! పద్మనేత్ర! సర్వభూతమహేశ | ఋక్సామ యజురు
పాస్య! సాధుసంరక్షణ పరవిహార! సురలు రిపులచే నలఁగిరి, శరణ మగుము’.
340
వ. అని సంస్తుతిపూర్వకంబుగాఁ బ్రార్థించె; నట్టియెడ. 341
క. జలదస్వనసన్నిభమై | యెలుఁ గొక్కటి సదలఁ జెలఁగె; ‘నే నిదె మిమ్మున్‌
గెలిపింపఁగ వచ్చితి; నను | విలసద్వర్ణములు, గాఢ విశదంబులుగాన్‌.
342
వ. తదనంతరంబ యకుంఠిత విక్రముం డగు వైకుంఠుండు 343
క. గరుడారోహణలీలా | సరభసుఁడై, చక్రగదలు శార్‌ఙ్గముఁ, జంచ
త్కరముల వెలుంగ నడరి య | సురగణములఁ ద్రుంచె సురలు చోద్యంబందన్‌.
344
వ. ఇట్లు నిర్జించి తత్‌క్షణంబ యతం డంతర్ధానంబు నొందిన సంతసంబును, నచ్చెరువును బెనంగొను డెందంబుతో బృందారక బృందంబు ‘లిమ్మహాత్ముం డెవ్వం? డేమి భంగివాఁ డెఱింగింపవే?’ యని యడిగిన నజుం ‘డితండు విష్ణుండు; వైకుంఠాభిధానం బగు మూర్తి విశేషంబున విహరించె; విష్ణుని విధం బిట్టిదని యెఱుంగను; నెఱింగింపను శక్యం బగునే?’ యయిన నొక్క తెఱంగునం దెలిపెడునట్టి యితిహాసంబు గలదు; వినుం ‘డని పలికి వినిపించె’ ధర్మనందనా! యా నిర్మలవాక్యంబు లుపన్యసించెద; దాన నీయడిగిన యర్థంబు దేటవడు; నాకర్ణింపుము. 345
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )