పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
గరుత్మంతుండు మునులకు విష్ణుదేవుని మహిమాతిశయంబు సెప్పుట (సం. 13-40-1 (కుంభ))
సీ. హిమగిరిమీఁద ననేక మునీంద్రులు | సిద్ధులుఁ గూడి గోష్ఠీసుఖంబు
ననుభవింపఁగ లీల నచటికి వచ్చి సు | పర్ణుండు వారికిఁ బ్రణతుఁ డగుడు,
వా రభినందించి గారవమున సుఖా | సీనుఁ గావించి, యర్చించి, ప్రీతి
నతనితో సల్లాపమాచరించుచు నుండి | ‘యొక్కటి యడిగెన ముజ్జ్వలాత్మ!’
 
తే. యనిన నాతండు ‘ధన్యుండ నైతి; మీర | లెద్ది యడిగెద? రేను నా యెఱిఁగినంత,
యతులమతులార ! చెప్పెద’ ననుడు, వార | లెలమి నవ్విహగేంద్రున కిట్టు లనిరి.
346
క. ‘ప్రియభక్తుండవు, భక్త | ప్రియుఁడును విష్ణుండు, నీవు ప్రియుఁడై భక్తుం
డయి వర్తిం తా విభుకడ | దయఁ దెలియఁగఁ జెప్పవే యతని తెఱఁ గెల్లన్‌’.
347
వ. అని యడిగిన నతండు వారల కిట్లనియె. 348
క. స్థూలప్రకారమున నీ | త్రైలోక్యము గావఁబూని, దయ చిగురొత్తన్‌
లీలఁ బ్రవర్తింపఁగ మన | మాలోకింతు మది గనుట యనవచ్చునొకో!
349
ఉ. ఏనును, మీరు, నేల మఱి యెవ్వరు? దక్షులు, విష్ణుచందముం
బూని యెఱుంగ, నవ్విభుఁడు భూరి దయారతి నాకు నేర్పడం
దాను మహాద్భుతంపుఁ జరితంబులు సూపుచు భాషణామృతం
బానఁగఁ జేసె నా చెవుల; నవ్విధముం దెలియంగఁ జెప్పెదన్‌.
350
సీ. అమరేంద్రు నిర్జించి యమృతంబు గొనిపోవు | నప్పుడు వీతెంచె నాకసమున
‘మెచ్చితి విహగేంద్ర! యిచ్చెద వరము నీ’ | కనుమాట యది విని, హర్షమెసఁగ
‘నెవ్వరో! యెఱుఁగ ని న్నెఱిఁగించి మఱి వర | మి’ మ్మంటి, దానికి నెలమి నగుచుఁ
‘గాలంబుతోఁ గూడఁగా నెఱింగెదవు, వా | హనమవు గమ్ము నా’ కనుచుఁ బురుషుఁ
 
తే. డొక్కఁ, డుజ్జ్వల తేజోమయుండు తోఁచి | ‘జరయు మరణంబు లేక యసురుల సురల
నోర్వఁ జాలిన బలముతో నుల్లసిల్లు’ | మనివరం బిచ్చె; నిచ్చిన నధికభక్తి.
351
వ. ఏను దండప్రణామం బాచరించి. 352
క. ‘నీ వాహన మయ్యెద, రథ | మీ వెక్కినఁ గేతువై వహింతుఁ బెనుపు, నా
కీ వరము నిచ్చి మనుపుము’ | నావుడు ‘నవుఁ గాక!’ యని మనఃప్రియ మెసఁగన్‌.
353
వ. పలికి యంతర్హితుం డయ్యె; నంత సంతసంబు నచ్చెరువు బెరయు మనంబుతో మదీయ జనకుపాలికిం జని, యీ వృత్తాంతం బెఱింగించిన, నతండు వికసిల్లుచు నా వదనంబు వీక్షించి ‘ధన్యుండ వైతి; వమ్మహాత్ముండు నారాయణుండు; నీ వలని యనుగ్రహంబున సల్లాపసౌఖ్యంబుఁ బ్రసాదించెఁ; దపంబున నేక యోగసమాధి నవలంబించి యేను దన్నెఱుంగుటం గోరి యారాధించిన నాకు నీల, శ్వేత, పీతారుణ పింగళంబును బహూదర పాదపాణి శిరో నేత్రంబును నైన దివ్యగాత్రంబు సూపి, ‘సంగంబు గల యంతరంగంబున న న్నెఱుంగ వచ్చునే; నిస్సంగుండవై యెఱింగెదవు గాక!’ యనియె; నట్టి యవ్విశ్వరూపునకు శాశ్వతపరిచర్య సేయంగల వాఁడ వగుటం గృతార్థతం బొందితి; బదరికాశ్రమంబున కరిగి యచ్చట సకల లోకసేవ్యుం డగు నా భవ్యమూర్తి సేవింపు’ మని యానతిచ్చిన, నయ్యెడకు ముదంబునం బొదలుచుం బోయి. 354
సీ. అచట నారాయణు, నచ్యుతుహరిఁ బుండ | రీకాక్షుఁ, గోవిందు, లోకజనకుఁ
గని, భక్తిఁ బ్రణమిల్లి వినుతిసేయంగఁ, బీ | తాంబర కలితమై యష్టభుజము
శంఖ చక్రగదా సిశార్‌ఙ్గ ధరంబును | నైనరూపము దాల్చి యవ్విభుండు
సిఱునవ్వుతోడ ‘వచ్చితి మేలు సేసితి | ర’ మ్మంచుఁ దా నుత్తరంపుఁ దూర్పు
 
తే. దెసకు నల్లన పోవఁ బెంపెసఁగఁ గడఁగి | పాఱ వలయు; నా కెమ్మెయి బహుసహస్ర
యోజనంబులునని వితతోజ్జ్వలాగ్ని | యద్భుతముగ ననింధన మై వెలుంగ.
355
వ. కని, యప్పావకుం బావకద్యుతి యగు నమ్మహాయోగి ప్రవేశించి, యందు శివాసహితుం డై శివుండు దపంబుసేయఁ దదీయ సంవిత్సౌఖ్యం బనుభవించి, యయ్యనలంబు గడచి యరుగుచుండ, నేనును బథిశ్రమాభిభూతుండ నగుచు విడువక వెనుకఁ బోవు చుండితి; నిట్లు మఱియునుం బెద్దయు దవ్వు సని యద్దేవుండు భాస్కరకిరణంబులకుం బ్రవేశంబు లేని మహాతమంబు సొచ్చె; నచ్చటం జూడ్కిసెడి మూఢత్వంబు నొంది. 356
క. ఆ దేవుఁ జిత్తమున నిడి | ‘యాదిపురుష! కరుణ నన్ను నరయు; మెచటికో
యేది గతియొ నా?’ కనఁగా | ‘నీ దెస ర’ మ్మనుచుఁ దీపుటెలుఁగుం జూపెన్‌.
357
క. మది ఖేదము, మై దప్పియుఁ | గదిరిన నే శరణు వేఁడఁగా దమ మెల్లం
దుది వోయి లేక తక్కెను | హృదయానందకర మైన యెడయై యుండెన్‌.
358
తే. పట్టపగలింటి సూర్యుని పగిది నతఁడు | దోఁచెఁ సూర్యేందు తారక ద్యుతుల కచటు
గోచరము గాదు; దేవతాకోటి యాది | యైన జంతువులకు నగమ్యస్థలంబు.
359
క. దుందుభి నిస్వనములు, నా | నందనమృదుమధుర గీతనాదములుఁ జెవిం
బొందె మకరందబిందు | స్యంది కమల సుభగ నదులు నచ్చటఁ దోఁచెన్‌.
360
క. సురలకు నిమ్మెయిఁ దేజ | స్స్ఫురణము లేదన్న యట్టిపొలుపున వెలుఁగన్‌
నరులం గొందఱఁ గాంచితి | దరుణులనుం గంటి నద్భుతతమాకృతులన్‌.
361
తే. వారు పూజ లొనర్పంగ గారవంపుఁ | జూడ్కి నద్దేవుఁ డందఱఁ జూచు చరిగె;
మఱియు నట తత్ప్రదేశంబు మహితవహ్ని | మయతఁ జేసి భయంకర మయి వెలింగె.
362
వ. అచ్చట నే నతనిం గానక. 363
క. భ్రమ గొని యద్దేవునిఁ జి | త్తమునం దిడి ‘శరణు శరణు, దయఁ గావుము’ న
న్న మితైశ్వర్య ! యనుడు శీ | తమధుర లలితాక్షరముగఁ దా నిట్లనియెన్‌.
364
క. ‘నిను నే మఱతునె? నీదగు | జనకునిచే నన్ను విని సుసంగతమతివై
చనుదెంచు టే నెఱుంగనె? వినతాసుత! యిందు రమ్ము, విడువుము భయమున్‌.
365
వ. నన్నుం గానమికిం గలంక వలవదు. 366
క. మమకారాహంకారము | ల మతిం జొరనీక, నిశ్చలంబగు చూడ్కిన్‌
సమవేతరూపు నన్నున్‌ | శమభరితాత్మకులు గండ్రు సారవిచారా!
367
తే. నీవు నామీఁది వేడుక నెఱయ నిష్ఠ | తోడఁ దలఁచుట మామక స్థూలరూప
దర్శి వై యుండు; దని నన్ను దయదలిర్ప | గారవించిన ననలంబు క్రందు వాసె.
368
వ. ఇవ్విధంబున సుఖిం జేసి ననుం గొలిపించుకొని మఱియు దవ్వుసని యాకాశంబున కెగసిన నేనుం దోన తగిలిపోవ నంతర్ధానంబు సేసె; నిట రమ్మను నెలుంగ యాధారంబుగా నా చక్కటికిం బోయి. 369
క. కమనీయహంస కుల సం | గమశోభిత మైన యొక్క కమలాకరముం
బ్రమదమున దాన నవగా | హము సేయుచునున్న తన్ను నచటం గంటిన్‌.
370
క. నా దిక్కు కనుంగొని, తా | నాదరమునఁ బిల్చె; నేను నచటికిఁ జని యం
దాదేవునిఁ గానమికి వి | షాదం బందుమదితోడఁ జంచల దృష్టిన్‌.
371
చ. కలయఁగఁ జూడ నద్భుతము గాఁగ ననేక శతాగ్నిహోత్రముల్‌
వెలుఁగుట గానవచ్చె, బహువేదరవంబులు వింటిఁ, దత్ప్రవ
క్తలఁ బొడగాన, నట్టియెడ దారుణరూప సుపర్ణ సంఘముల్‌
బలువిడి నాపయిం; గవిసె; భ్రాంతుఁడ నైతి భయంబు పెంపునన్‌.
372
ఆ. అట్లు భయముఁ బొంది, ‘యచ్యుత! శివ! సహ! స్రాక్ష! వేదమయ!, యనాదినిధన!
త్రిభువనైకనాథ! త్రినయన! గోవింద! పద్మనాభ! హర! కృపావిధేయ!
373
క. అని మఱియుఁ, బెక్కు పేళ్ళన్‌, | వినుతించుచు, శరణు వేఁడి వినత శిరస్కుం
డును, ముకుళీకృత హస్తుం | డును నై యే నుండ దేవుఁడు ప్రసాదమునన్‌.
374
క. తనుఁ జూపి, ‘యోడ కోడకు | వినతాసుత!’ యనియె నపుడు వినుఁడే మొదలం
గనిన బదరికాశ్రమ మ | య్యె నచటు విష్ణుని ప్రభావ మేమనవచ్చున్‌!
375
ఉ. అ ప్పరమేశ్వరుండు లలితాష్టభుజం బగు రూపుఁ దాల్చి, తా
నెప్పటియట్ల నిల్చెఁ; గని యేను మనంబున నద్భుతంబుతో
ముప్పిరి యైన కౌతుకము మోదము నెక్కొన, నాకు సత్కృపం
జెప్పెడుఁ, గాక యెట్లు నని చేరితి నంజలి మౌళిఁ జేర్చుచున్‌.
376
వ. చేరి వినయావనతుండ నయి ‘దేవా! యేను భవత్పాద భక్తుండనేని నీ దయకు భాజనంబనేని నాకు వినందగునేని దురధిగమసారంబైన భవదీయప్రకారం బిట్టిదని యెఱుంగు నట్లుగాఁ జెప్పవే’ యనిన నా సర్వలోక శరణ్యుండు గారుణ్యామృత మయం బైన చూడ్కి నామీఁద నొలయ నిట్లనియె. 377
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )