పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము
విష్ణుదేవుఁడు గరుత్మంతున కుపదేశించిన యాత్మతత్త్వ ప్రకారము (సం. 13-43-1 (కుంభ))
సీ. ‘అనిమిష గంధర్వదనుజు లాదిగ నెవ్వ | రును విను, నాయున్న రూ పెఱుంగ;
రఖిలభూతములు నాయం దుద్భవించు, వ | ర్తించు, లయించు, వర్తింప నేను
వాని వశంబున వసియింతు సర్వంబు | నందును, నాతత్త్వ మధిగమింప
నగు నగ్ని యాత్మ సమాహితంబుగఁ జేయఁ | గామవర్జిత మహంకారవిముఖ
 
తే. మజడ, మపరిగ్రహం బహింసానుమోది | క్రోధరహితంబు నిర్మలబోధయుతము
నిత్యతృప్తంబు, శాంతంబు, సత్యభక్తి | యైన చిత్తంబు గల నియతాత్మకులకు.
378
వ. సాంఖ్యయోగయుక్తులు, బహిర్దర్శనులై నిశ్చయరహితు లైరేని నస్మదీయ తత్త్వంబు గాన నేర; రది మోహపంకమగ్ను లగువారికి నుపవాసంబుల నియమంబుల వ్రతంబుల నెఱుంగ శక్యంబుగా, దేకాంతిక ధ్యానపరుల కెఱుంగుట గలుగు; రజస్తమోదూషితంబు గాక కేవలసత్త్వాధిష్ఠితంబయిన జ్ఞానంబున న నన్నవలం బించునది, సూక్ష్మసరణి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ నామంబులం జతుర్విధంబుల విభక్తుండనై, ప్రాణులయం దాత్మ బుద్ధ్యహంకార మనోరూపవ్యాపకత్వంబు నొంది యుండుదు; నిట్టిది మదీయ స్థూల ప్రకారంబు; కశ్యపనందనా! నీవు మన్మనస్కుండవు, మద్భక్తుండవు మత్పరాయణుండవు నై మత్స్వరూపవేది వగు’ మనియె నని చెప్పి సుపర్ణుండు. 379
క. పురుషవరులార! యద్భుత | తర మగు హరి దివ్యచేష్టితము నాకుం ద
త్కరుణం దోఁచిన యట్టిది | పరిపాటిని మీకుఁ దేటపఱిచితి భక్తిన్‌!’
380
వ. అనిన విని యమ్ముని సిద్ధజనంబులు పరమాదరంబున నప్పక్షిదేవు దీవించి, యామంత్రణంబు సేసి, హర్షోత్కర్షంబునం జిత్తంబులు జొత్తిల్లఁ దమలోన. 381
సీ. ‘అక్కజం బగుచున్న యిక్కథ యితనిచే | విని కృతార్థుల మైతి’ మనిరి, మఱియుఁ
‘బుణ్య మాయుష్యంబు భూతిప్రదము; భక్తి | వినిన విప్రుఁడు వేదవిద్య పెంపు,
నృపవైశ్య శూద్రు లనుపమాన జయధన | సౌఖ్యంబులను గండ్రు; సర్వ జనుల
కిహపర సిద్ధుల కిది సాధనం బగు’ | నని పల్కి యాత్రేచ్ఛఁ జనిరి; దీని
 
ఆ. బ్రహ్మ సురలకుఁ జెప్పిన భంగి వసువు | లవనిసురు లయి వచ్చి మాయమ్మపాల
నున్న నా కర్థిఁ జెప్పి; రయ్యున్న రూపు | నీకు జెప్పితిఁ గురుకులనృపవరేణ్య!
382
వ. అని చెప్పి దేవవ్రతుండు వెండియు నిట్లనుఁ ‘బాండవాగ్రజా! వైకుంఠ సుపర్ణ సంవాదంబగు నీ యాఖ్యానంబునకు నభిప్రాయం బాకర్ణింపుము. 383
తే. వివిధ సంకల్ప యజ్ఞముల్‌ విడిచి యాత్మ | యందు నిష్ఠమై నగ్ని సమాహితముగఁ
జేసి నిస్స్పృహుఁడై విష్ణుఁ జిత్తవృత్తిఁ | జేర్చు వాఁ డవ్యయస్థితిఁ జేరనేర్చు.’
384
వ. అని యిట్లు భీష్ముండు విష్ణు స్వరూప జ్ఞానప్రకారం బితిహాస రూపంబున ధర్మజునకుం జెప్పెనని చెప్పిన ‘నప్పురుష వరుల యడుగుటలును, జెప్పుటలును లోకహితంబులై యింత యొప్పియుండునే! యటమీఁది సంభాషణ విశేషంబులు సెప్పు’ మని యడుగుటయు. 385
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )