| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; అట్లు నారాయణ స్వరూప నిరూపణ ప్రకారంబు విని యజాతశత్రుండు సంజాతప్రీతుండై, పితామహుతోఁ ‘గన్యాదానంబునకు వరుం డెట్టివాఁడు గావలయు?’ ననుటయు’ నక్కురువంశవరుం ‘డీవిషయంబున నొక్క యితిహాసంబు గలదు విను’ మని యమ్మానవపతి యాననం బాలోకించి. | 002 |
| సీ. |
‘అనఘ! యష్టావక్రుఁడను బ్రహ్మచారి స | త్తముఁడు. వదాన్యుఁ డన్తాపసోత్త మునికూఁతు, సుప్రభ యను కన్యఁ బెండ్లిగాఁ | గోరి యాతని నడుగుటయు, నతఁడు ‘నీవు యోగ్యుండవు, నీ కిత్తు నా పుత్రి; | నంతకు నుత్తర మరిగి రమ్ము’ నావుడు, సంయమినందనుం ‘డెందుల | కరుగుదు? నే పని యాచరింతుఁ |
|
| ఆ. |
బనుపు ‘మనుడు వదాన్యుండు ‘ధనదుపురము | గడచి హిమగిరి కరుగుము; మృడుని గుఱిచి గిరిజ తప మొనరించె నగ్గిరితటమునఁ | దత్ప్రదేశంబు పుణ్యంబు దానియందు. |
003 |
| క. |
ఆడుచుఁ బాడుచు గణములు | గూడి చరింపంగ గిరిజకుం బ్రియముగఁ, దా వేడుక నమ్మృడుఁ డెప్పుడుఁ | గ్రీడించుచు నుండు మునులు గీర్తింపంగన్. |
004 |
| ఆ. |
అది పవిత్రదేశ ; మచ్చటు సూచుచుఁ | గడచి చనఁగ నీపకాననంబు కానవచ్చు నందు గట్టి ప్రాయమునది | పుణ్యమూర్తి యమలబుద్ధి యోర్తు. |
005 |
| క. |
వసియించు నమ్ముదితఁ బ్రియ | మసలారఁగఁ గాంచి వచ్చు నప్పుడ ప్రమదం బెసఁగంగఁ బెండ్లి సేసెద | నసదృశ రూప గుణవర్త నాన్వయ విద్యా!’ |
006 |
| సీ. |
అనిన నష్టావక్రుఁ ‘డట్ల కా’ కని చని, | బాహుదా తీరభూభాగవర్తి యై, రాత్రి గడపి, ధనాధీశు ప్రోలికి | నరుగఁగ నతఁ డమ్మహాత్మురాక విని, యెదురేతెంచి, వినయంబుతోడఁ దో | డ్కొనిపోయి, మహిత పూజన మొనర్చి యూర్వశి రంభ తిలోత్తమ మొదలగు | నప్సరోవనితల యాటపాట |
|
| తే. |
లాదిగాఁ గల, వివిధ వినోదకృతుల | ననుదినంబు నారాధింప, నందు నిల్చె నమ్మునీంద్రుండు, దగులు లే కభిమత ప్ర | వర్తనంబుల నొక్క సంవత్సరంబు. |
007 |
| వ. | పదంపడి ధనదుండు ‘నీ కేమి సేయవలయుం జేసెదం జెప్పు’ మనిన నతండును ‘సర్వంబును సంపన్నంబ, నీవు నిత్యసంపద నున్నతుండవై యుండు; మేనొక్క మునిపతి సెప్పిన పనికై పోయెద; నీతోడి వేడుక నిల్చితి; నింతియ కాని నా కభ్యర్థనీయం బొండు లే’ దని పల్కి యట వోయి. | 008 |
| సీ. |
హిమశైలతట మెక్కి, యీశ్వర క్రీడన | స్థలిఁ గాంచి మ్రొక్కి ప్రదక్షిణముగఁ జని, యట యరుగంగ మునివరు చెప్పిన | కడిమిలేమ్రాఁకుల యడవి దోఁచె; దానిఁ బ్రవేశింపఁగా, నందు మణిహేమ | మయ చిత్రరమ్య హర్మ్యము లనేక ములు గానవచ్చె; నుజ్జ్వల సమున్నతరమ్య | హర్మ్యంబు వానిలో నధిక విభవ |
|
| ఆ. |
సారమై యున్నఁ జూచితద్ద్వారభూమిఁ | జేరి, లోనికిఁ దనపేరు సెప్పి పుచ్చఁ గన్యకలు పఱతెంచిరి, కాంతిరూప | విలసనము లొప్పఁ గొందఱు, వినయ మెసఁగ. |
009 |
| వ. | పఱతెంచి పరమాదరంబునం దోడ్కొని పోవునప్పు, డప్పొలంతుల యొప్పు, సూడ్కులకుం జిత్తంబునకు వేడ్కలు సేయంజాలినను, లోలత్వ రాహిత్యంబున నత్యుదాత్తుం డగుచుం జని, యభ్యంతర మందిరంబున వివిధ రత్నరశ్మి విరాజితంబైన పర్యంకంబున నార్యమూర్తియు, ధవళవసనాంగరాగయు, రుచిరాభరణ భూషితయు, ప్రౌఢవయస్కయు, నగు నొక్క వనితం గని ‘మే లయ్యెడు’ మనుచు నిలిచిన, నయ్యిందువదన ‘యిందు రం’ డని పలుకుచుం బ్రత్యుత్థానంబు సేసి. | 010 |
| క. |
అమ్మునివరు నాపర్యం | కమ్ము పయిం బ్రీతి నునిచి, గారవమునఁ బా ద్యమ్మును నర్ఘ్యము శ్రుతివిహి | తమ్మైన విధమున నిచ్చి, తత్పార్శ్వమునన్. |
011 |
| వ. | తానును వేఱొక్క సెజ్జం గూర్చుండె; నమ్ముని గలయం గనుంగొని యక్కన్నియల విభ్రమ వికారంబులు దన లోచనంబులకు గోచరంబులగుటకు నొల్లక ‘యిమ్మదవతీ జనంబు లిచ్చట నేల?’ యనిన నక్కాంత యక్కన్యల నెల్లం బోవం బనిచి సముచిత సల్లాపంబులు సేయుచుండి, రాత్రి యగుటయు. | 012 |