| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
సీతయ్యె ననుచు, నల్లన | యాతని శయనమున కరిగి, యతఁ డెడ యీఁగా, నా తల్పంబున నొక దెసఁ | బ్రీతహృదయయై శయించెఁ బృథ్వీనాథా! |
013 |
| క. |
పదపడి నయమున మెయిమెయిఁ | గదియించి లతాంగి చిక్కఁ గౌఁగిటఁ జేర్పం, గదలని చిత్తము గలిగియు, | మద మేమియు లేక, యతఁడు మ్రానై యుండెన్. |
014 |
| ఆ. |
అట్టు లున్నఁ జూచి యత్తన్వి ‘మగవారు | భోగపరులు, తాల్మి పొలఁతులందుఁ గలుగు; నవ్విధంబు గాక యేఁ గోరంగ | ననుభవింప కునికి యగునె నీకు? |
015 |
| క. |
సంపదయు దివ్యభోగము | లింపారఁ బరిగ్రహింపుఁ; డే మీ ధనమై పం పొనరించెద? ననుఁ గా | రింపక, కైకొని వరింపరే? యిచ్చోటన్. |
016 |
| సీ. |
అనిన నష్టావక్రుఁ ‘డతిదూష్యమగు పర | దారాభిగమనంబు దగదు; శూద్ర సతి యైన నధిక దోషంబు, బ్రాహ్మణపత్ని | యగునేనిఁ బాతక మప్రమేయ; మదియును గాక, నే నస్ఖలిత బ్రహ్మ | చర్యంబునం దుండి భార్యఁ గోరి యున్నాఁడ ‘ననుడు; ‘నీ యొప్పునం దగిలితి | వనితలు గామార్తి వశతఁ బొంది |
|
| తే. |
వంశహాని దలంపరు, వరుస కలుక; | రాత్మజులఁ జూడ; రగ్రజు ననుజుఁ గొనరు పురుష శతకంబు సంగమంబునను దృప్తి | సనరు; దీని విచారింపు మనియె’ నువిద. |
017 |
| వ. | అనిన నమ్మునివరుండు. | 018 |
| క. |
‘ఇది యేటి కార్యముగ నా | మది కెక్కఁగఁ జెప్పె? దిట్టి మాటలుఁ గలవే? మదవృత్తి మాను; మేఁ బో | యెద’ నావుడు నమ్మృగాక్షి యెలన వ్వొలయన్. |
019 |
| తే. |
‘కార్య మగుటయు నరిగెదు గాక పిదప, నిల్వు మంతకు’ ననుటయు ‘నీవు నన్నుఁ గదియ కుండెద వేని నిల్చెద; సధర్మ | వృత్తి వగు’ మని వారించె నత్తపస్వి. |
020 |
| వ. | ఇట్లు వారించి యిది శాపంబున ముదురుదనంబు నొందిన బృందారక సుందరి గావలయు; నట్లయ్యెం గాకుండె, దీని తెఱంగు నా కెఱుంగన్ జాలిం బడనేల?’ యని యాత్మ నూహించి యూరకుండె; నంతఁ బ్రభాతం బైనం ‘గాలోచిత కృత్యంబులు దీర్పు’ మని పలికి యప్పొలంతి యుత్తమ స్నానీయ ద్రవ్యంబులు దెచ్చి, యమ్ముని యనుజ్ఞ వడసి మృదుకరతలంబుల మేను దొడసి కృతస్నానుం జేసి, యతండు సంధ్యావందనాగ్ని కార్యంబు లాచరించిన, నమృతోపమానంబులగు నన్నపానంబుల నతనిం దృప్తునిం గావించి, యుచిత సంభాషణబులం బ్రొద్దు పుచ్చి నిశాసమయం బగుటయు శయనంబునకుఁ బిలిచిన నా సుశ్లోకుండు రాకున్న ‘నేనుం గన్యక; నస్ఖలిత బ్రహ్మచర్యంబునన చూవె పరిణత వయస్క నైతి; స్వతంత్ర నై యుండుదుం; బాణిగ్రహణ మహోత్సవం బనుభవింపు’ మని పలికిన నమ్మహాత్ముం డిట్లనియె. | 021 |
| తే. |
‘బాల్యమునఁ దండ్రి, యౌవనప్రాప్తి మగఁడు, | వార్ధకంబునఁ దనయుఁడు, వామనయన నరసి నడపన కా కెందు నంగనలకు | వలసినట్టులు సేయఁగా వచ్చు నెట్లు? |
022 |
| వ. | ‘కావున నీవు ని న్నిచ్చినం బరిగ్రహించుట పాడిగా’ దను సమయంబునం జూడఁ జూడ నచ్చేడియ సుభగ యౌవన సుందరాంగియు మనోహర విలాస భంగియు నయ్యె; నైనను దానియందుఁ దగులని చిత్తంబుతో నత్తపోధన కుమారుండు. | 023 |
| క. |
‘ఈ యనృత వర్తనము లే | లా? యున్న నిజంబు నీ తలంపును నిన్నుం దోయజలోచన! చెప్పుము; | పోయెదఁ బనులు గల; వనిచి పుచ్చుము నన్నున్. |
024 |
| సీ. |
అనవుడుఁ బ్రీతయై ‘యనఘ! ని న్నారయు | తలఁపునఁ జూవె వదాన్యుఁ డిందుఁ బుత్తెంచె; నేను నీ యుత్తరదిశఁ జుమ్ము; | నీ నిష్ఠ గాంచితి; దీన నతఁడు నిను మెచ్చు; నాదెస మనమునఁ బ్రియమొందు; | మరుగుము సుప్రభా పరిణయమున’ కనిన నద్దేవికి వినతుఁడై, వీడ్కొని | యరిగి, యమ్మునిపతి, యాత్మఁ గనియుఁ |
|
| తే. |
దన్ను నడుగంగ సకలవృత్తంబుఁ జెప్పి | యతని పుత్త్రికఁ బెండ్లియై యతుల ధర్మ భోగ గౌరవకీర్తులఁ బొంది జగతి | నతిశయిల్లె నష్టావక్రుఁ డధిపముఖ్య!’ |
025 |
| వ. | అని యష్టావక్రదిశా సంవాదంబు సెప్పిన విని యప్పాండవాగ్రజుండు ‘మునులవలన శూద్రజాతి భామలయందుఁ బ్రభవించిన వారికి బ్రహ్మర్షిత్వంబు గల్గుట యది యెట్లొకో’! యని వితర్కింతు; నత్తెఱంగు నాకెఱింగింపవే!’ యని యనిమిషనదీనందను నడుగుటయు, నక్కురుపతికిఁ గురుపితామహుం డిట్లనియె. | 026 |
| సీ. |
నాలుగు జాతుల నాతులు, విప్రున | కాండ్రుగాఁ గైకొన నగు; నృపునకుఁ దనకులంబున నట తక్కువ కులములు | రెంటను బరిణయశ్రీ వహింపఁ జను; వైశ్యునకు నాత్మజాతి, శూద్రాన్వ యం | బునఁ బెండ్లి గాఁ దగు భూపవర్య! శూద్రున కర్హంబు శూద్రకన్యకఁ బెండ్లి | యగుటయు; నిది వివాహ ప్రకార |
|
| ఆ. |
కథిత ధర్మ; మిట్టిగతిఁ దప్పి ప్రతిలోమ | సరణి యైనఁ, గల్గు సంకరంబు; తల్లి యెట్టి కులము దాని కులంబ యౌ | సన్నుతానులోమ సంభవునకు. |
027 |
| వ. | ఇది సకలజన సామాన్యంబైన తెఱంగు; విశేషించి ముని సత్తముల యుత్తమ తపోజ్ఞాన విద్యాప్రభావంబులం జేసి తదీయబీజ సంజాతులు యోని యెద్దియైనను బ్రాహ్మణుల యగుదురు; మహా క్షత్రియులు ననులోమవృత్తి నాత్మ ప్రభావంబులం జేసి నిజబీజ సంజనితులకుఁ దమకులంబ కలిగింపం జాలుదురు; నీవు వియోని జాతులని శంకించి యడిగితివి; వారల యేల? పశు యోని జాతులు నయోనిజాతులును లోనుగా సద్ద్విజులును రాజవరులు నగుట గన్నదిగాదె! కావున మునివరుల నృపవరుల వలనం గలిగిన జన్మంబులెల్లను; బీజ ప్రధానంబులై యతిశయిల్లు; వినుము వసిష్ఠుండు, ఋశ్యశృంగుం, డగస్త్యుండు, సత్యవత్యుద్భవుం డగు కృష్ణద్వైపాయనుండు, మందపాలనందనులు, మఱియు ద్రోణ కృపాదులుం, బ్రభవించిన భంగులు విందుమకాదె! వార లెట్టెట్టి వారయి రెఱుంగవె? యివ్విషయంబున మనువాక్యంబు గల దాకర్ణింపుము. | 028 |
| క. |
మునిజనుల, నదుల, సిద్ధుల | జననంబులు బుద్ధి వృత్తిఁ జర్చింపఁగ నె వ్వనికిన్ వశంబు గా; వవి | తనతన యైనట్ల యై యుదాత్తతఁ బొందున్.’ |
029 |
| వ. | అనిన విని యుధిష్ఠిరుండు. | 030 |
| ఆ. |
‘అనఘ! దానపాత్ర మగుట విప్రుఁడు లింగి | యైననో యలింగుఁ డై చరించు టనొ యెఱుంగఁ జెప్పు’ మనవుడు గాంగేయుఁ | డిట్టు లనియె నమ్మహీశ్వరునకు. |
031 |