పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మరాజునకు దానపాత్రభూతుల తెఱం గెఱింగించుట (సం. 13-23-1)
క. ‘విను, సద్ద్విజుండు, నిజవ | ర్తనమునఁ జరియించుచున్న దానార్హత్వం
బున వెలుఁగు, లింగియైనను | మనుజేంద్ర! యలింగవృత్తి మహితుం డేనిన్‌’.
032
వ. అనుటయుఁ బాండవాగ్రజుండు. 033
తే. శ్రద్ధ సాలంగఁ గల్గిన జనము లిచ్చు | భూరిదానముల్‌ దురితంబుఁ బొంద నేర
వేయెడల నని తలఁచెద నేను బుద్ధి | ననుడు నాతని కతఁ డిట్టు లను నృపాల!
034
క. ‘నరవర! దుర్దాంతు లయినఁ | బరిపూతులు శ్రద్ధ గల్గు భవ్యులుఁ దా రా
దర మొప్ప నిచ్చు దానము | దురితహరమ కాక, కీడు దొడరునె యెందున్‌?’
035
సీ. అనుడు ధర్మాత్మజుఁ డతనితో ‘దైవ కా | ర్యము నప్డ, విప్రుని నతిపరీక్షి
తునిఁ జేయ వలయునే? యనఘ! పైతృకము వి | ధంబున నన్న నాతండు, నీవు
దలఁచిన యట్టిద తగవు?’ నావుడు నా నృ | పాలుం ‘డపూర్వ సంబంధి సూరి
యాజి తపోనిత్యులందు సత్పాత్రము | లెవ్వార?’ లనుటయు ‘నింతవట్టు
 
తే. వారు సత్పాత్రముల, వంశవర్య ధర్మ | భాషణమ కాని తత్క్రియాపరత లేని
యట్టివానికి నరుఁడు హేమాదు లిచ్చి | పొరయుఁ బదియేండ్లు నరకానుభూతి’ ననియె.
036
వ. అని భీష్ముఁడు వెండియు. 037
క. ‘ధరణియుఁ, గాశ్యప, వైశ్వా | నర, మార్కండేయు లోలిన జగద్ధిత వా
క్పరులై రొక్కెడ; వారొక | మరి గోష్ఠీనిరతి నుండి మనుజాధీశా!
038
వ. అవ్వాక్యంబు లాకర్ణింపుము. 039
క. ‘ఘనతర మగు హ్రీ గౌరవ | మున మునిఁగినఁ బాప మఖిలమును, రూపు సెడుం
బెనుపున యగ్గలికఁ బొగడు | గనిన పయోరాశిఁ బడ్డ గడ్డయుఁ బోలెన్‌.
040
తే. సత్కులంబునఁ బుట్టుట, సకలవేద | ములుఁ బురాణంబులును, శాస్త్రములును జదువు
టయును సద్గతిఁ జేయఁ బ్రౌఢములు గావు | శీలసామగ్రి లేని దుశ్చేష్టితునకు.
041
ఆ. పలు సదువులు సదివి, పండిత మానియై, | తనదు విద్య నొరుల ఘనయశంబుఁ
దూలపుచ్చునట్టి దుష్టాత్మకుని బ్రహ్మ | హత్య వొందు; సందియంబు లేదు.
042
తే. వాజిమేధముల్‌ వే యొక్క వలనఁ బెట్టి, | యలఘు సత్యంబు దక్కటివలనియందు
నిల్పి, తులఁ దూపఁగా, సత్యనిష్ఠ లోని | యర్ధమున కెత్తు వచ్చె నయ్యధ్వరములు.’
043
వ. అని యిట్లు వర్తిల్లు నాలుగు వాక్యంబులుం జెప్పి. 044
తే. ‘బ్రహ్మచర్యంబు కంటెను, బరము మద్య | మాంసములు రెండు నుడుగుట మనుజనాథ!
లోకయాత్ర వాటించు చలోలుపతయు | శమముఁ గల్గి వర్తించుట శౌచవిధము’.
045
వ. అనిన విని, యజాతశత్రుండు ‘ధర్మంబు నర్థంబును గామంబును నాచరించు కాలంబు లెఱింగింపవే’ యనుటయు నాపగేయుం డతని కిట్లనియె. 046
తే. ‘రేపకడయును, బగలును, మాపు, వరుస | నర్థ ధర్మ కామంబుల నాచరింప
వలయు; వానియం దాసక్తి వలదు; సక్తుఁ | డయ్యె నేనియు మేలు ధర్మాభినిరతి’.
047
వ. అని మఱియును 048
క. ‘విను, గురుపూజన విప్రా | ర్చనము లధిక పుణ్యములు, ధరావల్లభ! వి
ప్రుని నిందించుటయును, న | గ్నిని వేదము విడుచుటయును గిల్బషతమముల్‌’.
049
సీ. అనుటయు, ధర్మనందనుఁడు ‘దానంబుల | కెవ్వరు పాత్రంబు లేర్పరింపు’
మనిన ‘సద్ధర్ములు, నక్రోధనులు, సత్య | రతులు, దాంతులును, ధీరత్వ యుతులు,
నిజకర్మ నిరతులు, విజితేంద్రియులు సర్వ | భూతహితులు, నలుబ్ధులును, శుచులు
దానపాత్రములు, వేదంబు సాంగంబుగాఁ | జదివి షట్కర్మ నిష్ఠలఁ దొడంగి
 
తే. తత్త్వవిదులైన బ్రాహ్మణోత్తముల కీగి | విను సహస్రగుణంబగు, విశ్రుత శ్రు
తంబుఁ బ్రజ్ఞయు, శీలవృత్తములుఁ గలుగు | వారి కిచ్చుట వంశవిస్తారకంబు’.
050
వ. అని నిర్దేశించి భీష్ముండు వెండియు. 051
ఆ. ‘యోగ్యుఁడైన విప్రుఁ డొకరుండు సంతృప్తిఁ | బొంద నధిక తృప్తిఁ బొందు దేవ
వితతి, ముని సమూహ పితృ సమాజములు; న | ట్లగుట వెదకి తెచ్చు నది విశిష్టు’.
052
వ. అనిన విని కౌంతేయాగ్రజుం డతనితో ‘దేవ పితృ మనుష్య పూజల కాలంబు లెఱింగింపవే’ యనుటయు నతండు. 053
క. ‘నృపవర! పూర్వాహ్ణంబును, | నపరాహ్ణము దేవ పితృ సమారాధన వి
ధ్యుపదిష్ట కాలములు; మ | ధ్యపు సమయము మానుషార్చనార్హం బరయన్‌.’
054
వ. అని చెప్పి మఱియు నిట్లనియె. 055
సీ. ‘నరనాథ! కాలహీనంబును, నశుచిసం | స్పృష్టంబుఁ, బరిభుక్తశేషమును, న
మంత్రకంబును, వీతతంత్రంబుఁ, గీటకే | శ ప్రదుష్టంబు, రాక్షసులు గొండ్రు;
మానవీయ ద్రవ్యమేనియు సురపితృ | క్రియల దురాత్మకు లయినవారు
గుడిచిన నట్ల యక్కుడుపులఁ జొనుపక | మత్తుని,జడుని, నున్మత్ముఁ బతితుఁ
 
తే. గ్లీబుఁ గుష్ఠి, దేవలకుఁ, జికిత్సకునిని; వీతనియము, నపస్మారి, శ్విత్రి రాజ
యక్ష్మయుతుని, నర్తకుని, గాయకుని, సోమ | విక్రయుని, వేదవిక్రయు విడువ వలయు.
056
ఆ. వడ్డి కిచ్చి కుడుచువాఁడు, ననగ్నియుఁ | బ్రాణి విక్రయమున బ్రదుకు నతఁడు,
దైవ పిత్ర్యములకుఁ దగరు, సంధ్యోపాస | నములు లేనివారు నరవరేణ్య!’
057
వ. అనిన విని ధర్మనందనుండు శంతను నందనునితో ‘దైవపిత్ర్యంబు లగు దానంబులకు నుత్తమపాత్రంబు లెవ్వ రెఱింగింపవే? యని యడుగుటయు నతం డతని కిట్లనియె. 058
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )