| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘భోజనార్థులఁ దుష్టిఁ బొందించునతఁడును, | దెరువాటువలనఁ దస్కరులచేతఁ జే టొంది ధనము వాంఛించు నతండు, వ్ర | తంబున కుద్యాపనంబు సేయఁ దలఁచి యర్థించునతండును, గురుఁ దల్లి | దండ్రుల సంక్లిష్ట దారపుత్రు లను బ్రోవఁ బడునతండును, మహావ్యాధి ని | రాసంబు సేయంగ నాస చేయు |
|
| తే. |
నతఁడు, నిష్పాపుఁ డైన ధరామరుండు, | నెపుడు భిక్షయ బ్రదుకగునేని నట్టి యతఁడు, దైవపిత్ర్యములకు నతిశయంబు | గల్గు పాత్రంబు లగుదురు కౌరవేంద్ర!’ |
059 |
| వ. | అని చెప్పి మఱియు నిట్లనియె. | 060 |
| సీ. |
‘సత్రంబు, సాలయు, జలిపందిరియు, రచ్చ | కొట్టము వ్రచ్చుట, గురుజనముల నిందించు, టాగమనింద, దదీయ వి | క్రయవిధి, దద్విలేఖనము, గొండి యము, సంధిభేదన, మన్య కర్మోప జీ | వన, మకృతజ్ఞత, పారదార వృత్తి, మంత్ర సుశాస్త్ర విధ్వంసనము, మద | లోల, ననాథను, బాలవృద్ధఁ |
|
| తే. |
దాపసిని, భీతివంచనఁ దలరఁజేయు | టతిథి పుత్రభృత్యులకు నాహారకలన మాచరింపక కుడుచుట, యార్యకోటి | నిరయహేతువులుగఁ జెప్పు నృపవరేణ్య! |
061 |
| సీ. |
విషశస్త్ర కేశముల్ విక్రయించుట, శస్త్ర | ములచేఁత కన్యాజనులను విప్ర తతిని గోగణమును దఱిసిపోవుట, యుపా | ధ్యాయు సభక్తికుం డైన భృత్యు విడుపు మార్గముఁ గ్రంప నడిచి కొయ్యలు ప్రాఁతి | చెఱుచుట నరకంబు సేయు నండ్రు; నేరమి లేకయు నెపమిడి యర్థంబు | గొనురాజుఁ బ్రజరక్ష వినికి గలిగి |
|
| తే. |
యాచరింపని విభుఁడును, నప్పనంబు | పలుకుబడి దప్పి కొనియెడు పతియు, గోవు ముక్కు గుట్టెడివాఁడుఁ, దన్ముష్కఘాతి | యగునతండు నధోగతి కరుగువారు. |
062 |
| సీ. |
ధర్మంబు భయమున, దారిద్ర్య సంబాధ | మున రోగమునుఁ బాపములుఁ దొఱంగఁ జేఁతకునైనఁ జేసిన దేవకార్యార్థ | పశుహింసనంబును, బరమ తపము శుశ్రూషయును గల్గి శ్రుతము సంపాదించి | యప్రతిగ్రాహకుఁ డైన, మద్య మాంస పరస్త్రీ సమాగమ వైముఖ్య | మున నాశ్రమస్థులఁ దనకులంబు |
|
| తే. |
వారి భరియించినను, హేమవస్త్ర మంది | రాన్నపానంబు లొసఁగిన, నాశ్రయంబు దీనులకు నిచ్చినను, హింస మానినను, స | మంచిత స్వర్గలక్ష్మి సిద్ధించు నండ్రు. |
063 |
| సీ. |
రచ్చకొట్టంబు, నారామంబుఁ గూపంబుఁ | బ్రపయుఁ గావించుట, భయభరార్త కోటిఁ గాచుట, కన్య, గోవు, వాహనము, దా | సుని దాసి నిచ్చుట, దనకుఁ గీడు సేసిన సైఁచుట, చెలులఁ జుట్టంబులఁ | బ్రోచుట, పెక్కండ్ర పొంటెఁ గార్య మునఁ బరాక్రమమున ధనమునఁ దా నల | జడిపాటు, దుష్కర్మ సరణిఁ బొరయ |
|
| ఆ. |
కునికి, నాకలోకమునకు నిచ్చెన లగు | నెక్కులమునఁ బుట్టిరేని బహు సు తుండు, నతికృపాన్వితుఁడు, వేయు నెలలపై | బ్రతికినతఁడుఁ గండ్రు త్రిదశపదము’. |
064 |
| వ. | అని నిర్దేశించి. | 065 |
| ఆ. |
‘నరకవాసకారణము నెఱింగించితిఁ | బుణ్యలోక హేతు భూతములును దేట పడఁగఁ జెప్పితిని, గురుసంతతి | శ్రేష్ఠ ! యింక నేమి సెప్పవలయు? |
066 |
| వ. | అడుగు ‘మనినం, గౌంతేయపూర్వజుండు శాంతనవుతో ‘బ్రహ్మహత్యాసమంబు లని కొందఱు గొన్ని కర్మంబు లుగ్గడింతురు; హింస లేకయు నట్లయ్యెడు నవి యెయ్యవి? వాని నేర్పడ నెఱింగింపవే’ యనుటయు నతం డతని కిట్లనియె. | 067 |
| సీ. |
‘దివ్యబోధాఢ్యు, వేదవ్యాసమునినాథు | నడిగితి నొక్కనాఁ డధిక భక్తి నిట్లని; యా సంయమీంద్రుండు గృప నాకు | నెఱిఁగించె, ననఘ! నా యెఱిఁగినట్టి విధము లెఱింగింతు వినుము; విప్రునిఁ గృశు | నామంత్రితునిఁ జేసి యతఁడు, గుడువ వచ్చినఁ బెట్టమి, వరకులంబును, సార | విద్యయుఁ, గల, విప్రవృత్తి గొనుట |
|
| తే. |
నీరు ద్రావంగ గోవు లేతేర, విఘ్న | మాచరించుట, బధిర పంగ్వంధ ధనము లపహరించుట, వేదశాస్త్రాదినింద, | బ్రహ్మహత్య లెట్టట్టుల పౌరవేంద్ర! |
068 |
| తే. |
అలుకఁ బురి నూర వనమున నగ్ని యిడుట, | పాపశీలతమై బొంకి బ్రాహ్మణునకు నధికతర మగు శోకంబు నావహించు | టంచితాచార! బ్రహ్మహత్యా సమములు. |
069 |
| తే. |
రూప గుణ శీలముల ననురూపుఁ డైన | వరుని కీక కన్నియఁ దన వలసినట్లు తగని వానికి నిచ్చుట ధర్మదేవ | తాతనూభవ ! బ్రహ్మహత్యాసమంబు. |
070 |